Tags
BJP, Farmers agitations, Indian farmers historic win, Narendra Modi, Narendra Modi Failures, RSS
డాక్టర్ కొల్లా రాజమోహన్
ఉక్కు సంకల్పంతో 2020 నవంబర్ 26 నుండి చేస్తున్న రైతులు చేస్తున్న చారిత్రాత్మక పోరాటానికి విజయం లభించింది. పోరాడితే ఎంతటి ప్రభుత్వాలైనా దిగిరాక తప్పదని నిరూపించారు. పార్లమెంటులో మెజారిటీ ఉందన్న అహంకారానికి వ్యతిరేకంగా దఢసంకల్పం సాధించిన విజయం. విపరీతమైన వేగంతో నయా ఉదారవాదాన్ని పెంచి పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎదుర్కొన్న మొదటి ముఖ్యమైన ఎదురుదెబ్బ.మనం ఏమీచేయలేము, ప్రభుత్వం బలమైనది , మొండిగా వున్నది అంటూన్నవారి మాటలను వమ్ము చేశారు.ప్రజలలో ఉన్న నిరాశ,నిస్పహలను పఠాపంచలు చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయకతప్పలేదు.స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించవలసివచ్చింది. ఎట్టకేలకు 3 రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని కేబినెట్ ఆమోదించింది. ఉపఎన్నికలలో ప్రజలు చూపించిన శాంపిల్ దెబ్బకే పెట్రోల్, డీజిల్ రేట్‌ను కొద్దిగా తగ్గించారు.
అయితే ఇప్పటికి కూడా ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకోవటంలేదు. చట్టాలు మంచివే కానీ ప్రజలను ఒప్పించుటంలో వైఫల్యం చెందామంటున్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ల లో రాబోయే ఎన్నికల లో చావుదెబ్బ తినబోతున్నామనే సర్వేల సంకేతాలు భాజపా కు మింగుడు పడలేదు. ఉత్తర భారత దేశంలో తీవ్రంగా ప్రజావ్యతిరేకత రాజుకుంటుందని అర్ధమౌతున్నది. దేశ అధికార పీఠానికి ఉత్తర భారతదేశం కీలకం. అక్కడనే నిప్పు రాజుకుంది. ఎవరితోనైనా పెట్టుకో కానీ.. రైతు కూలీలతో పెట్టుకుంటే నీకు పుట్టగతులుండ వని భారత రైతులు చరిత్రను పునరావత్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయం వెనుక అపర చాణుక్య నీతే కారణం అని కొంతమంది సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఇది మాస్టర్ స్ట్రోక్ అనీ ఈ దెబ్బతో రైతు ఉద్యమం ఖాళీ అనీ డబ్బాకొట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్,పంజాబ్ ల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ ఎత్తుగడ గా తాత్కాలిక వెనుకడుగేనంటున్నారు. అవకాశవాదం తప్ప ఉద్యమ ప్రభావంకాదంటున్నారు.
చట్టాలరద్దునిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాలు
1) పెరుగుతున్న ఉద్యమ స్పూర్తి-తరుగుతున్న మత విద్వేషం. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ లో సెప్టెంబర్ 5 న, 10 లక్షల మంది ప్రజలతో భారీ సభ దిగ్విజయంగా జరిగింది.. మహాపంచాయత్ పేరున రైతులు, కార్మికులుఒకచోట గుమికూడి రైతువ్యతిరేక నల్లచట్టాలను రద్దుచేయాలని కోరటం నూతన సామాజికచైతన్యానికి దారితీసింది. ఇదే ముజఫర్ నగర్ లో 2013లో మతపరపమైన అల్లర్లను భాజపా రెచ్చగొట్టింది.మతవిద్వేషాలను పక్కనపెట్టి లౌకికఐక్యతను సాధించుతూరైతులు ఉద్యమంలోకి రావటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది.
2) సంవత్సరంపాటుసాగిన రైతుల పోరాటంలో 3సార్లు భారత్ బంద్ కు రైతుసంఘాలు పిలుపునిచ్చాయి.సెప్టెంబర్ 27న భారత్ బంద్ పిలుపు అపూర్వ విజయాన్ని సాధించింది. దేశం నలుమూలలనుండి లక్షలాదిమంది. రైతులు, కార్మికులు,యువకులు, విద్యార్ధులు, మహిళలు,వ్యాపారులు, ఉద్యోగులు వీధుల్లోకి రావటమే భాజపా కు ప్రమాదసంకేతాలనుఇచ్చింది.
3) లఖింపూర్ ఖేరీ లో భాజపా జరిపిన దారుణమారణకాండ దేశప్రజలనందరినీ కదిలించింది.కేంద్ర హౌంశాఖ సహాయమంత్రి అజయమిశ్రా ఆదేశాలనుఅనుసరించి గుమికూడిన ప్రజలపైకారును తోలి నలుగురు రైతులను, ఒక జర్నలిస్టును చంపిన ఘటన యావద్భారత ప్రజలందరికీ కోపంతెప్పించింది. భాజపా ను అప్రతిష్టపాలుచేసింది. అక్టోబర్ 15,దసరా రోజున దేశవ్యాపితంగా బీజేపీ అగ్రనేతల దిష్చిబొమ్మలను తగలెట్టారు. రైళ్ళను ఆపేసి ఆందోళనలను నిర్వహించారు.
4) దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ఆకలికేకల సూచికలు, అసమానతలు, అసంతప్తి, ఆర్ధిక సంక్షోభం, ఆందోళనలు భాజపా పతనానికి దారిచూపుతున్నాయి. మతవిద్వేష ప్రచారం ఒక్కటే ప్రభుత్వాన్ని రక్షించేటట్లు లేదు. పాకిస్ధాన్, చైనా వ్యతిరేక జాతీయఉన్మాదాన్ని రెచ్చగొట్టే అవకాశాలు ప్రస్తుతం లేవు.
5)రైతు ఉద్యమ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ, పాప్ స్టార్ రిహన్నా” మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోకూడదు” అంటూ ట్విట్టర్ లోనూ గూగుల్ లోనూ లేవనెత్తిన ప్రశ్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు తెచ్చింది.యువ పర్యావరణవేత్త గ్రేటా ధెన్ బర్గ్ రైతుఉద్యమానికిఎలామద్దతు తెలపాలో సలహఇస్తూ ”టూల్ కిట్” కార్యాచరణప్రణాలికను దిశా రవి షేర్ చేసింది.అందుకు ప్రతిఫలంగా నేరపూరితకుట్ర, శత్రుత్వాన్నిప్రోత్సహించారన్నఆరోపణలతోప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసింది. కెనడా ప్రధానితో సహా, అమెరికాలోని 80 సంఘాలు, లాయర్ మీనాహారిస్, అంతర్జాతీయ మీడియా,సెలిబ్రిటీలు, సౌహార్ధ్రతను వెలిబుచ్చారు. పెరుగుతున్న అంతీర్జాతీయ మద్దతు భారత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.
6) రాబోయే ఎన్నికలలో పరాజయం తప్పదని సర్వేలు సూచిస్తున్నాయి. మూడు చట్టాలపై వెనకడుగువేసి రాజకీయంగా భారతీయ జనతా పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతు కార్యకర్తలకు ప్రజాదరణ, విశ్వసనీయత పెరిగింది.
అంతా తమ ప్రయోజకత్వం అనే అంబానీ అదానీలకు మద్దతుగా మోడీ నిలబడి వ్యవసాయంలో కార్పొరేట్ సామ్రాజ్యాలను స్థాపించాలని చేస్తున్నప్రయత్నానికి ఆదిలోనే గండిపడింది. కార్పొరేట్ వ్యవసాయక్షేత్రాలను స్ధాపించాలనే పేక మేడలను కూల్చిన ఘనత రైతులకు చెందుతుంది. కార్పొరేట్ శక్తులకు నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వంతో సంఘర్షించి రైతు ఉద్యమ చరిత్రను సష్టించారు.
రాజకీయ కోణమా లేక రైతు ఉద్యమ ఉధతా?
ప్రధాని తీసుకున్న నిర్ణయం వెనుక నూటికి నూరు పాళ్ళు రాజకీయకోణం ఉందనీ రైతుల ఉద్యమ ఉధతి కాదని కొంతమంది మేధావులు విశ్లేషిస్తున్నారు. మోడీ అపర చాణక్యనీతితో వ్యూహాత్మకంగా వ్యవసాయచట్టాల రద్దుపై కీలక నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ లతోపాటుఅయిదురాష్ట్రాల లో కీలకమైన ఎన్నికలు జరగబోతునందున వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతా మనే భయానికి కారణం అన్నదాతల ఉద్యమ ఉధతి అన్న సంగతిని గుర్తించ నిరాకరిస్తున్నారు.భాజపా పార్టీనాయకులు ప్రజలలోకి వెళ్ళలేని పరిస్ధితిని మర్చిపోతున్నారు. పట్టుదలతోప్రాణత్యాగాలకు నిలబడ్డ రైతుల పోరాటాన్ని తక్కువ చేయచూస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలవలననే ప్రజలు భాజపా కు దూరమౌతున్నారనే సంగతిని విస్మరిస్తున్నారు. ప్రజలు పోరాటాలలో రాటుదేలి చైతన్యవంతులౌతున్నారు.
మొక్కవోని దీక్షతో సాగించిన రైతుల పోరాటం కొన్నివిలువైన గుణపాఠాలను నేర్చుకుంది. ఉద్యమాలు అలలు లాగానే కాకుండా నిశ్చలప్రవాహంలాగా ఉధతంగా కూడాసాగించవచ్చని అనుభవం నేర్పింది. ప్రజా పక్షంవహించటమే పార్టీల ఎజెండా కావాలని ఉద్యమం డిమాండ్ చేసింది. అందుకనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని సష్టించింది.పార్టీల జెండాలు కాదు ఎజండా ముఖ్యమని చెప్పింది. పదవులు,రాజ్యాధికారమే పరమావధిగావున్నరాజకీయపక్షాలను ఉద్యమ వేదికలకు దూరంగా వుంచవలసిన అవసరాన్ని తెలియచెప్పింది.
”అంతా తమ ప్రయోజకత్వం, తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్యాజ్యాలూ , నిర్మించిన కత్రిమచట్టాల్,
ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై,
పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను.
చిరకాలం జరిగిన మోసం,బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలు ఇంకానా! ఇకపై చెల్లవు” – అన్న శ్రీశ్రీ స్ఫూర్తి మరింతగా పోరాటాలను ముందుకు తీసుకుపోనుంది.
రైతు సంఘాలన్నీ ఏకమై కనీసమద్దతుధర కోసం..ఉద్యమ క్రమం
2018 నవంబర్‌లో 217 రైతు సంఘాలన్నీ ఏకమై ఐక్యపోరాటానికి పిలుపునిచ్చాయి.నవంబర్ లో లక్షలాదిమంది రైతులుఢిల్లీ నగరవీధులలో కదంతొక్కారు. లక్షలాది మంది రైతులు అరుదైన ప్రదర్శన చేసి కనీసమద్దతుధరకు చట్టబధత ను కల్పించి, ఋణవిముక్తిని కల్పించమన్నారు. మరుసటి సంవత్సరం నవంబర్ లో రైతు పార్లమెంటును నిర్వహించారు. కనీసమద్దతు ధరకు, ఋణవిముక్తికి ముసాయిదా చట్టాలను తయారుచేసి పార్లమెంటులో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రధాన డిమాండ్లైన కనీసమద్దతు ధరను, ఋణవిముక్తి అంశాలను పక్కనపెట్టి 2020, జూన్ 5న మూడుసాగు చట్టాలు తీసుకొస్తున్నట్టు కేంద్రంఆర్డినెన్స్ జారీ చేసింది. అప్పటినుండి రైతు కి న్యాయం చేయాలంటూ అన్నంపెట్టే అన్నదాతలు, రైతుసంఘాలు పంజాబ్ లోగ్రామగ్రామాన ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్య పరిచారు.. ఐక్యంగా రోడ్డెక్కారు. రైలు పట్టాలపై పడుకున్నారు.సెప్టెంబర్ 17 న గందరగోళపరిస్ధితులమధ్య, విపక్షాల నిరసనలమధ్య లోక్ సభలో భాజపా కి వున్నమెజారిటీతో ఆమోదంపొందింది. సెప్టెంబర్ 20న రాజ్యసభలో బిల్లులను ఆమోదించామని అప్రజాస్వామ్యంగా ప్రకటించుకున్నారు. కనీసం వోటింగ్ జరపమన్న డిమాండ్ ను కూడా అంగీకరించలేదు. రైతుసంఘాలన్నీ ఏకమై నవంబర్ 26 న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. పశుబలంతో ఢిల్లీ సరిహద్దులలోనే ఆపిన ప్రభుత్వ బలగాలను ఎదిరించారు. రోడ్లపై కొట్టిన మేకులు, ముళ్ళకంచెలు రైతుల ప్రస్ధానాన్ని ఆపలేకపోయాయి. నల్ల చట్టాలను రద్దుచేయాలని పట్టువదలకుండా ఉక్కు సంకల్పంతో ప్రభుత్వాన్ని వణికించారు.
ఎముకలు కొరికే చలిని, చండ్ర నిప్పులుకక్కే ఎండలను, భీకర వర్షాలను లెక్కచేయలేదు.ది గజారుతున్న ఆర్ధిక పరిస్థి తుల్లో దేశవ్యాప్తంగా జయప్రదమైన బందులు, సమ్మెలు ప్రభుత్వాన్ని అందోళనకు గురిచేసాయి. రాబోయే ఎన్నికలు మరింత భయాన్ని కలిగించాయి. దిగజారుతున్న ఆర్ధిక పరిస్థి తుల్లో దేశవ్యాప్తంగా జయప్రదమైన బంధ్ లు, సమ్మెలు కు ప్రభుత్వాన్ని అందోళనకు గురిచేసాయి. రాబోయే ఎన్నికలు మరింత భయాన్ని కలిగించాయి. ఘోరమైన కోవిడ్-19 వేవ్ కాలంలో కూడా నిరసనకారులు తమ గుడారాల్లోనే ఉన్నారు.టాక్టర్లనే నివాసాలుగా మార్చుకున్నారు. రోడ్ల పైనే వండుకొని తిన్నారు. సంవత్సరం రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి నూతన తరహాలో చారిత్రక పోరాటాన్ని నిర్మించారు. రైతుల మనోధైర్యాన్ని దెబ్బకొట్టి ప్రజలలో వారిని అభాసుపాలు చేయడానికి రకరకాల అసత్య ప్రచారాలను లేవదీశారు. స్థానికులను రెచ్చగొట్టారు. హింసను సష్టించారు. ప్రభుత్వం ఆందోళనకారులను ఆందోళన జీవులనీ,పరాన్న జీవులనీ,ఖలీస్ధానీవాదులనీ, టెర్రరిస్టులనీ, దేశద్రోహులనీ పలు పేర్లతో నిందించారు.జనవరి 26, రిపబ్లిక్ డేరోజున రైతులు ట్రాక్టర్ల పెరెడ్ ను విజయవంతంగా నిర్వహించారు. కొంతమంది ఎర్రకోటపై జెండాను ఎగరేశారు. లఖింపుర్ ఖేరిలో అక్టోబరు 3న శాంతియతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై కేంద్రమంత్రి కుమారుడు కారును పోనిచ్చిరైతులను హత్యచేశాడు.నల్గురు రైతులు ఒక జర్నలిస్టు హత్యకుఅశిష్ మిశ్రా కారణమయ్యాడు. ఏడు వందల అరవై మంది రైతులు ప్రాణాలను అర్పించి పోరాటం కొనసాగించారు.
నల్ల చట్టాలను చట్టబద్ధంగా రద్దు చేసేంతవరకూ,కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేంత వరకూతమ నిరసన కొనసాగుతుందని పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సంఘర్షణ సమితి ప్రకటించింది. ఉదాహరణకు వరిధాన్యానికి కనీసమద్దతు ధర హామీ అమలులేకపోవడంతోఎకరానికి పదివేల పైగా నష్టపోతున్నారు.రైతు వరిధాన్యాన్ని75 కిలోల బస్తాను రు.1000- 1,200కి విక్రయించవలసి వస్తుంది.కనీస మద్దతు ధర క్వింటాలుకు రు.1960 అంటే 75 కేజీ లో బస్తాకు రు.1470 రావాలి.కనీసమద్దతు ధరకు చట్టబధత ఉంటే బస్తా దాన్యాన్ని 1470 కన్నా తక్కువకు కొంటానికి చట్ట ప్రకారం వీలు లేదు. ఒక్క బస్తాకు రు.300 నుండి 400 నష్టపోతున్నాడు. ఎకరానికి సగటున 30 బస్తాలు దిగుబడి ఉంటుందనుకుంటే, 9000 నుండి 12000 వరకు నష్టపోతున్నాడు. ఢిల్లీ లో రైతుల పోరాటంలో 2018 నుండీ ప్రధాన డిమాండ్ ఇదే. నల్ల చట్టాలు, చట్టాల రద్దు కోసం పోరాటం, పోలీసు కేసుల రద్దు,లఖింపుర్ ఖేరిలోహత్యలు, 760 మంది రైతుల మరణం – నష్టపరిహారం -అన్నీప్రభుత్వ రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల దుర్మార్గపు విధానాల ఫలితమేనని మరువరాదు.చట్టాలను రద్దు చేశారని సందడిలో పడి అసలు డిమాండ్లను వదలరాదు.కనీసమద్దతు ధరకు చట్టభద్దత కల్పించేవరకూ పోరాడుతూనేవుండాలి.. ఆ పోరాటంలో భాగంకావటం మనందరి కర్తవ్యం.
రచయిత డాక్టర్ కొల్లా రాజమోహన్, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘం నేత.