Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పారు. సాధించిన మహత్తర విజయం తో యావత్‌ కష్టజీవులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.దీనిలో భాగస్వాములు కాని వారు కార్పొరేట్‌లు, వారికి మద్దతు ఇస్తున్న స్వదేశీ జాగరణ మంచ్‌ వంటి సంస్ధలను పుట్టించిన సంఘపరివారం, దాని ఇతర ప్రత్యక్ష -పరోక్ష సంతతి, సాగు చట్టాలకు మద్దతు ఇచ్చిన వారు మాత్రమే. ఈ మద్దతుదార్ల పరిస్ధితి మరీ ఘోరం. చట్టాల రద్దు గురించి నోరెత్తలేరు. తప్పు తెలుసుకున్నా సంతోషంలో భాగస్వాములు కాలేరు.ఇంకా సాధించాల్సిన డిమాండ్ల గురించి తదుపరి కార్యాచరణ గురించి రైతులు ఆలోచిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా రైతులు, ఇతర తరగతుల డిమాండ్లకు మద్దతు ఇవ్వకపోతే వారికి దూరం, సంఘీభావం తెలిపితే నరేంద్రమోడీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది కనుక రాజకీయ మేథోమద్దతుదారులు దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. ఇక నరేంద్రమోడీ వెనుకడుగుకు కారణాలు ఏమిటి అన్న చర్చ పరిపరివిధాలుగా సాగుతోంది. వాటిలో ఒకటి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) మీదకు మళ్లింది. ఒక నాటకం లేదా సినిమాలో మనకు తెర మీద తైతక్కలాడే నటీ నటులు మాత్రమే కనిపిస్తారు.దర్శకత్వం, మాటలు, పాటలు, నేపధó్య నిపుణులు మనకు దర్శనమివ్వరు. బిజెపి నేతలు అగ్ర నటులైతే, ఇతరులు సహాయ, జూనియర్‌ ఆర్టిస్టులు కాగా తెరవెనుక నిపుణులు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు అన్నది తెలిసిందే. హిట్‌ అనుకున్న ” సాగు చట్టాలు – నరేంద్రమోడీ క్షమాపణ ” అనే మహా ప్రదర్శన ఫట్‌ మంది.


ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు సంఘపరివారానికి చెమటలు పట్టిస్తున్నట్లు చెప్పవచ్చు. అది రైతులు, దేశం గురించి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పలువురు ముందుకు తెచ్చిన అంశాలను చూస్తే వారికి తమ హిందూత్వ పధకానికి ఎసరు వస్తోందన్నదే అసలైన ఆందోళన కారణంగా చెప్పవచ్చు. ఇండియా టుడే హిందీ పత్రిక మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌ దిలీప్‌ మండల్‌ అభిప్రాయం ప్రకారం సాగు చట్టాల రద్దు ఎందుకు అన్నదానికి సమాధానం ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల కంటే సావర్కర్‌ రాసిన అంశాల్లో దాగుంది. దిలీప్‌ మండల్‌ రాసినదాని సారాంశం ఇలా ఉంది. సాగు చట్టాల రద్దు ప్రకటనకు మోడీ సిక్కులు పవిత్రంగా పరిగణించే గురుపూర్ణిమ రోజును ఎంచుకుంటే అదే రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చత్తీస్‌ఘర్‌ రాజధాని రాయపూర్‌ లోని ఒక గురుద్వారాలో ప్రణమిల్లారు. పంజాబ్‌ ఎన్నడూ ఎన్నికల రంగంలో బిజెపికి ముఖ్యం కాదు, దేశ విభజన సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని తెరాయి, పశ్చిమ ప్రాంతంలోని అరడజను జిల్లాలో భూములు పొందిన సిక్కులు పరిమిత ప్రభావమే చూపుతారు. ఎన్నికల కంటే వి.డి. సావర్కర్‌ ఊహించిన హిందూత్వ భావనే హిందూత్వ దళానికి ముఖ్యం. మిమ్మల్ని మేము(ఆర్‌ఎస్‌ఎస్‌) మరో ముస్లింగా చూడటం లేదని సిక్కులకు చెప్పటమే సాగు చట్టాల రద్దు సందేశం. హిందూత్వలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి సిక్కుల అవసరం తప్పనిసరి. ” హిందూత్వ అనివార్యతలు ” అనే తన పుస్తకంలో భారత్‌లో విమర్శకు అతీతులైన సామాజిక తరగతి హిందువుల తరువాత ఏదైనా ఉందంటే వారు పంజాబ్‌లోని మన సిక్కు సోదరులు మాత్రమే. సప్త సింధు ప్రాంతంలోని సింధు లేదా హిందువుల ప్రత్యక్ష వారసులు సిక్కులు మాత్రమే అని రాశారు. నేటి సిక్కులు నిన్నటి హిందువులు, నేటి హిందువులు రేపటి సిక్కులు కావచ్చు. దుస్తులు, సంప్రదాయాలు, రోజువారీ జీవనంలో మార్పులుండవచ్చు తప్ప వారి రక్తం, జన్యువులు మారవని చెప్పారు. తన పుస్తకంలో అరవైసార్లు సిక్కులను సావర్కర్‌ ప్రస్తావించారు.


దిలీప్‌ ఇంకా ఇలా చెప్పారు. ” అన్ని మతాలకు చెందిన రైతులు ఈ ఉద్యమంలో భాగస్వాములు, వారి డిమాండ్లన్నీ ఆర్ధికపరమైనవి, ప్రభుత్వ విధానాలతో సంబంధం కలిగినవే.హిందూ, ముస్లిం నేతలను అన్ని ప్రతినిధి వర్గాలు, పత్రికా సమావేశాలలో భాగస్వాములను చేయటం ద్వారా రైతుల ఆందోళన మతపరమైనదిగా కనిపించకుండా చూసేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక అభిప్రాయాన్ని సృష్టించారు-ఉద్ధేశ్యపూర్వకంగా చేసిన దానిలో భాగం కావచ్చు – అదేమంటే ప్రభుత్వం సిక్కులను అణచివేస్తున్నది. బిజెపి దీన్ని ఎన్నడూ కోరుకోలేదు.ఒక పరిమితిని దాటి సిక్కులు దూరం కావటం హిందుత్వ భావం, ఆర్‌ఎస్‌ఎస్‌కు విరుద్దమైనది కనుక బిజెపి అంతిమంగా సన్నిహితం కావటానికి నిర్ణయించింది.ఈ నిర్ణయం తీసుకొనేందుకు బిజెపి ఎందుకు ఇంత సమయం తీసుకుందని ఎవరైనా అడగవచ్చు. అర్ధిక అజెండా-భావజాలం మధ్య వైరుధ్యం ఉంది కనుకనే బిజెపి నిర్ణయం చేసేందుకు వ్యవధి తీసుకుంది. కచ్చితంగా చెప్పలేము గానీ గురుగ్రామ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన నిర్ణయాత్మకం గావించి ఉండవచ్చు. అక్కడ శుక్రవారం నాడు బహిరంగ స్ధలంలో నమాజు చేయటం గురించి వివాదం ఉంది. పట్టణంలోని సాదర్‌ బజార్‌ గురుద్వారా కమిటీ తమ ప్రాంగణంలో నమాజ్‌ చేసుకోవచ్చని స్వాగతం పలికింది. ఆ మేరకు నమాజైతే జరగలేదు గానీ సిక్కులు-ముస్లింలు దగ్గర అవుతున్నారనే భావన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను వణికించి ఉండవచ్చు. 2020 ప్రారంభంలో అలాంటి సౌహార్ధ్రత ఢిల్లీలోని షహీన్‌ బాగ్‌లో జరిగిన సిఎఎ-ఎన్‌ఆర్‌సి వ్యతిరేక నిరసన సందర్భంగా స్పష్టంగా వ్యక్తమైంది. నిరసనకారులకు వండిన ఆహారాన్ని తాజాగా అందించేందుకు సిక్కులు ఒక వంటశాలను అక్కడ ఏర్పాటు చేశారు. రైతు ఉద్యమంలో ప్రధానమైన సిక్కులు తమకు దూరం కావటం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను గడగడలాడించింది.” అని దిలీప్‌ పేర్కొన్నారు.


పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో జాట్‌ – ముస్లిం మతపరమైన విభజన గోడ కూలిపోతుండటాన్ని బిజెపి గమనించటం మోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొనేట్లు చేసిందని మానవహక్కుల కార్యకర్త విద్యాభూషణ్‌ రావత్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. దానిలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. సాగు చట్టాల రద్దుకు సాగిన ఆందోళనతో బిజెపి తన దీర్ఘకాల మిత్రపక్షాలలో ఒకటైన అకాలీదళ్‌ను కోల్పోయింది. రైతుల్లో కనిపించిన రాజకీయ అవగాహన పట్టణాల్లో ఆంగ్లం మాట్లాడే మధ్యతరగతి వారికంటే ఎంతో ఉన్నతంగా ఉంది.2013లో తెచ్చిన భూసేకరణ చట్టంలో సహేతుకమైన పరిహారంతో పాటు, కఠిన నిబంధనలు, రైతుల సమ్మతి వంటి అంశాలు ఆ తరువాత దేశంలో రైతుల నిరసనలు తగ్గటానికి ఒక కారణంగా విశ్లేషణలు వెల్లడించాయి.గత రెండు సంవత్సరాల్లో అనేక జాతీయ సమ్మెలు, రైల్‌, రోడ్డు రోకో, బందులు జరిగాయి. పోలీసులు అణచివేతకు పాల్పడినా కూడా శాంతియుతంగా జరిగాయి.లఖింపూర్‌ ఖేరీలో మోటారు వాహనాలను ఎక్కించి రైతులను చంపిన ఉదంతంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తరువాతే నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఎంత విలువ ఇస్తుందో ఈ ఉదంతం వెల్లడించింది.


సాగు చట్టాల రద్దు ప్రకటన చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం, రాజ్యాంగ వ్యతిరేకం. ప్రధాని లేదా ఏ మంత్రైనా విధానపరమైన అంశాలను పార్లమెంట్‌ వెలుపల ప్రకటించకూడదు.( ప్రధాని ప్రకటన నాటికే పార్లమెంటు సమావేశాల నోటిఫికేషన్‌ వెలువడింది. కాబినెట్‌ ఆమోదమూ లేదు) మోడీ, బిజెపి ప్రతిదాన్నీ తమ రాజకీయ లాభనష్టాల అంకెల మేరకు చేస్తారు. సాగు చట్టాల రద్దు రైతులపై ప్రేమతో తీసుకున్న చర్య కాదని, ఎన్నికలకోసం చేసిందని ఎవరూ మరిచి పోకూడదు.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ప్రత్యేకించి జాట్లు గత రెండు దశాబ్దాలలో బిజెపి మద్దతుదార్లుగా మారారు. దేశ రాజకీయాలను మండలీకరణ గావించిన తరువాత జాట్లు మరింతగా అగ్రకుల పార్టీల వైపు మొగ్గారు, బిజెపి వారికి సహజమైనదిగా కనిపించింది. 2013 ముజఫర్‌నగర్‌ ఘర్షణల ద్వారా వ్యవసాయ ప్రాంతంలో బిజెపి హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోయింది. ఆ ఉదంతంలో ఆప్రాంతంలో ముస్లింలను వేరు చేశారు, అవాంఛనీయమైన వారిగా చేశారు. ఈ సమీకరణను బిజెపి తన అధికార క్రీడలో ఎల్లవేళలా ఉపయోగించుకుంది. అయితే ఈక్రమంలో జాట్‌లు రాజకీయంగా ఆరోవేలుగా మారిపోయారు.దానికి తోడు జాట్‌లు బిజెపికి ఓటు చేసిన హర్యానాలో ఖత్రి సామాజిక తరగతికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేశారు. రైతు ఉద్యమం జాట్‌ల పూర్వపు ఔన్నత్యం, ముస్లింతో మమేకం కావటాన్ని ముందుకు తెచ్చింది.వాస్తవానికి జాట్‌-ముస్లిం ఐక్యత బిజెపి ఆలోచనలో ఆఖరాంశం. అది పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పార్టీకి తీవ్ర విపత్కర పరిస్ధితిని సృష్టిస్తుంది, అక్కడ పార్టీనేతలు తమ నియోజకవర్గాలకు వెళ్లలేనిదిగా మారింది.


మోడీ నిర్ణయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ దాగుందని అవుట్‌లుక్‌ పత్రిక విశ్లేషకుడు స్నిగ్దేందు భట్టాచార్య పేర్కొన్నారు. సారాంశం ఇలా ఉంది.” సాగు చట్టాలపై సిక్కు సామాజిక తరగతిలో తలెత్తిన వేదన వారిని ముస్లింలకు సన్నిహితం చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గమనించారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలే సాగు చట్టాలు వెనక్కు తీసుకొనేందుకు కారణం అనుకుంటే గురునానక్‌ జయంతి రోజునే ప్రకటనకు ఎందుకు ఎంచుకుంటారు ? బిజెపి సైద్దాంతిక మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ లేదా హిందూ సాంస్కృతిక జాతీయవాదంలో సిక్కిజం అంతర్భాగం కనుక ఈ పని చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్దాంతవేత్త ఒకరు తన గుర్తింపును వెల్లడించవద్దనే షరతుతో అవుట్‌లుక్‌ ప్రతినిధికి చెప్పారు. సాగు చట్టాలపై సిక్కుల వేదన వారిని ముస్లింలకు సన్నిహితులను చేస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వ్యతిరేకించే ఆందోళన నిర్వాహకులు సాగు చట్టాల నిరసనకారులకు ఎలా దగ్గర అవుతున్నారనే అంశంపై మాకు నిర్దిష్ట సమాచారం ఉంది. గురుగ్రామ్‌లోని గురుద్వారా నిర్వాహకులు తమ ప్రాంగణంలో నమాజు చేసుకోవచ్చన్న ఇటీవలి ఉదంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాము.దేశంలో ఉద్భవించిన అన్ని రకాల విశ్వాసులను ఏకం చేయాలన్న మా దీర్ఘకాలిక ప్రణాళికకు ఇవి ఆందోళన కలిగించే ధోరణులు ‘ అని సిద్దాంతవేత్త చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ విశ్వహిందూపరిషత్‌తో సహా ఇతర సంస్ధలన్నీ భారత్‌లో జన్మించిన మతాలు అంటే బౌద్దం, జైనం, సిక్కు అన్నీ హిందూ సాంస్కృతిక గుర్తింపులో భాగమే అని, దురాక్రమణదారుల మతమైన ఇస్లాం దానికి విరుద్దమని భావిస్తున్నాయి. బిజెపి సారధ్యంలోని ప్రభుత్వ విధానాలపై తన ప్రభావం ఏమీ ఉండదని లాంఛనంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతుంది. విష్ణుమూర్తి పదవ అవతారమే బుద్దుడని, ముస్లిందురాక్రమణదారుల మీద సిక్కులు తమ శౌర్యాన్ని ప్రదర్శించారన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ సాహిత్యంలో చిత్రించారు. సిక్కులతో వైరానికి ముగింపు పలికేందుకు వెనక్కు తగ్గుతున్నాము, సిక్కులు ముస్లింలతో సన్నిహితం కావటంలో ఆర్ధిక ప్రయోజనం తప్ప మరొకటి లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘనేత చెప్పినట్లు అవుట్‌లుక్‌ పేర్కొన్నది.ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం కలిగిన బిజెపి నేత ఒకరు మాట్లాడుతూ రైతు ఉద్యమ సమయంలో ప్రభుత్వ విధానాలను సమర్ధించేవారిలో కొందరు అత్యుత్సాహపరులు నిరసనకారులను ఖలిస్తానీలని చిత్రించారు. అది సిక్కులలో ఒక పెద్ద భాగాన్ని హిందూత్వను ప్రబోధించే వారికి వ్యతిరేకులను చేసింది. మా హిందూ భావజాలంలో సిక్కులు కూడా ఉన్నారు. ప్రతి నిజమైన సిక్కు హృదయంలో చూస్తే హిందువే అని గురూజీ గోల్వాల్కర్‌ చెప్పేవారు. ఈ ఆందోళన హిందువులందరినీ ఏకం చేయాలన్న మా ముఖóó్య అజెండాకు ఈ నిరసన హాని చేసింది. సంస్ధల ఉన్నతనేతలు ఈ అంశాన్ని చూస్తున్నందున తాము బహిరంగంగా అభిప్రాయాలను చెప్పలేమని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు చెప్పినట్లు ఆవుట్‌లుక్‌ పేర్కొన్నది.


సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం కేవలం ఉత్తర ప్రదేశ్‌లో బిజెపికి సవాలు మాత్రమే కాదని ది ఫెడరల్‌ డాట్‌ కామ్‌ ప్రతినిధి పునీత్‌ నికోలస్‌ యాదవ్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను వికాస పురుషుడిగా చిత్రిస్తూ ప్రచారం ప్రారంభమైంది. సాగు చట్టాల రద్దుపై మోడీ ప్రకటనకు కొద్ది రోజుల ముందు రెండు భిన్న బృందాలు సర్వేలు నిర్వహించాయి. సిఓటర్‌-ఎబిపి సర్వే ప్రకారం 403 స్ధానాల్లో 2017లో బిజెపి తెచ్చుకున్న 312లో వంద సీట్లు తగ్గుతాయి చెప్పగా పోల్‌స్టార్ట్‌-టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం 213-245 మధ్యవస్తాయని పేర్కొన్నారు.1989 తరువాత ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి నెగ్గని ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి తిరిగి అధికారంలోకి రావటం పెద్ద అసాధారణ కృత్యమే. ఇప్పటి వరకు మోడీ విధానాలు, రాజకీయాలను ఎవరూ మార్చలేరని అనుకొనే వారు, సాగు చట్టాలను రద్దు చేసిన తరువాత రోడ్ల మీద జనం ఇప్పుడు మోడీ భయపడ్డారని అనుకుంటున్నారు, కొద్ది నెలలో ఎన్నికలు జరగనుండగా ఇది మాకు మంచిది కాదని ఉత్తర ప్రదేశ్‌ మంత్రి ఒకరు చెప్పారు. లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్‌ వంటి మా నోటి తుత్తర నేతలు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముగిసిన తరువాత సాగు చట్టాలను తిరిగి తీసుకువస్తారని బహిరంగంగా ప్రకటించారు, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసమే వెనక్కు తీసుకున్నారని అనుకుంటుండగా మేము రైతుల విశ్వాసాన్ని తిరిగి పొందగలమని మీరెలా అనుకుంటారని ఒక ఎంఎల్‌ఏ ప్రశ్నించినట్లు ఫెడరల్‌ పేర్కొన్నది. . ఈ దిగజారిన పరిస్దితిలో రైతుల మీద కార్లను తోలి నలుగురు రైతులను చంపిన లఖింపూర్‌ ఖేరీ ఉదంతానికి బాధ్యుడిని చేస్తూ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను తొలగించాలన్న డిమాండును నెరవేర్చకపోవచ్చు.అదే జరిగితే ఆదిత్యనాధ్‌ ఠాకూర్లకు ప్రాధాన్యత ఇచ్చి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తున్న బ్రాహ్మణులను మరింతగా కలవర పెట్టవచ్చు.(తొలగించకపోతే రైతులు తేల్చుకుంటారు) ఏడాది క్రితం వరకు బిజెపి, యోగి నడక నల్లేరు మీద బండిలా ఉంటుందని మొత్తం మీద అందరూ అనుకున్నారు.రైతుల ఆందోళన, హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య,కరోనా రెండవ తరంగం,బిజెపి 2014లో ఏర్పాటు చేసిన కులాల కుంపటిలో కుమ్ములాటలు పరిస్ధితిని మార్చివేశాయని ఫెడరల్‌ పేర్కొన్నది.


సంఘపరివార్‌ బహిరంగంగా ఎన్నడూ సాగు చట్టాలను వ్యతిరేకించటం లేదా చట్టాల రద్దును సమర్ధించటం గానీ చేయ లేదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో దీప్తిమన్‌ తివారీ పేర్కొన్నారు.హిందువు-సిక్కుల మధ్య గండి ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ భయపడిందని, సమస్యను పరిష్కరించలేని కేంద్ర అసమర్ధత గురించి హెచ్చరిస్తూ ఇబ్బందికి గురైందని కూడా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి మాట్లాడుతూ సామాజిక ఐక్యత మీద చూపుతున్న ప్రభావం గురించి ఆందోళన చెందారు. ఇలాంటి చట్టాలను ఏ దేశంలోనూ వెనక్కు తీసుకోలేదని అన్నారు. గతేడాది దసరా ఉపన్యాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సాగు చట్టాలను సమర్ధించారు.


భిన్నమైన సామాజిక తరగతులు ఐక్యంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు పూనుకోవటం సర్వాంగీకార స్వభావాన్ని సంతరించుకోవటం ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి కూటమికి మనస్తాపాన్ని కలిగించిందని జర్నలిజం ప్రొఫెసర్‌ నళిన్‌ వర్మ పేర్కొన్నారు. రైతుల నిరసన బిజెపి హిందూత్వ రాజకీయాలకు సవాలుగా మారిందని, నిరసనకారులు ఇతర జీవన్మరణ సమస్యలపై సామాజిక న్యాయం నుంచి పౌరహక్కుల వరకు ఉద్యమాన్ని విస్తరించేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద ఇప్పటికీ రైతుల్లో అనుమానాలు పెద్ద ఎత్తున ఉండగా వాటిని మరింతగా పెంచేరీతిలో రాజస్తాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, ఎంపీ సాక్షి మహరాజ్‌ మాట్లాడుతూ ఈ చట్టాలను తిరిగి చేస్తారని చెప్పారు. రైతులు కోరుతున్న డిమాండ్లను ఆచరణ సాధ్యం కానివని, అరాచకాన్ని పెంచుతాయని ఇప్పుడు అమితాసక్తిగల ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి మద్దతుదారులు చిత్రించుతున్నారు. నిజానికి వారు కొత్తగా జతచేసిన డిమాండ్లేవి లేవు. ఎంఎస్‌పి డిమాండు మూడు చట్టాలకంటే పాతదే, దానికి చట్టబద్దత కల్పించాలన్న కోరిక 2011లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ సంతకం చేసి అందచేసిన మెమోరాండంలో ఉన్న అంశమే. 2014లో ఓట్ల కోసం అనేక సభల్లో మోడీ చెప్పినదే.


1974నాటి జయప్రకాష్‌ నారాయణ సంపూర్ణ విప్లవానికి, ఇప్పుడు రైతు ఉద్యమానికి కొన్ని పోలికలు ఉన్నాయి. గుజరాత్‌లో ఒక హాస్టల్లో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా తలెత్తిన నిరసన జెపి ఉద్యమానికి నాంది. రైతులు తొలుత పంజాబ్‌లోనే ఆందోళనకు దిగారు. విద్యార్ది ఆందోళన ఉత్తరాదిన అనేక ప్రాంతాలకు విస్తరించినట్లుగానే రైతు ఉద్యమం హర్యానా,హిమచల ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్తాన్‌,మధ్యప్రదేశ్‌లకు విస్తరించి దక్షిణాదిన మద్దతు పొందింది. జెపి ఉద్యమం తొలుత విద్యార్దులతో ఉన్నప్పటికీ తరువాత జనసంఫ్‌ు(బిజెపి పూర్వరూపం) లోక్‌దళ్‌, డిఎంకెపి, ఇతర సోషలిస్టు, మితవాద పార్టీలన్నీ చేరాయి. చివరకు అవన్నీ జనతా పార్టీగా ఏర్పడ్డాయి.


జాగ్రత్తగా రూపొందించిన హిందూత్వ భావజాలానికి తగిన సామాజిక విభజనపై మోడీ-అమిత్‌షా రాజకీయాలు వృద్ది చెందాయి. హర్యానాలో జాట్‌-జాటేతర కులాల ప్రాతిపదికన బిజెపి రాజకీయాలు చేసింది, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కొట్లాటలతో జాట్లకు పోటీగా ముస్లింలను నిలిపారు.ములాయం సింగు యాదవ్‌ కుటుంబాన్ని చీల్చారు. లాలూ యాదవ్‌ ఇంట్లో తగాదాలు పెట్టారు అని రాకేష్‌ తికాయత్‌ దీని గురించి వక్కాణించారు. హిందూత్వ ఆధిపత్య రాజకీయాలకు సవాలుగా జీవన సమస్యలపై చివరికి రాజకీయ పార్టీలు ఏకమౌతాయా అన్నది చూడాల్సి ఉంది. సాగు చట్టాల రద్దు తరువాత నవంబరు 22న గోరఖ్‌పూర్‌లో జరిపిన సభలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో మహమ్మదాలీ జిన్నా (పాకిస్తాన్‌) మద్దతుదార్లను వ్యతిరేకించాల్సిన బాధ్యత జాతీయవాదుల మీద ఉందని పిలుపునిచ్చారని నళిన్‌ వర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.


నరేంద్రమోడీ సర్కార్‌ చర్య పర్యవసానాలు పరిణామాల గురించి వెలువడిన మరికొన్నింటిని స్ధలాభావం వలన సృజించటం లేదు. రానున్న రోజుల్లో మరిన్ని విశ్లేషణలు వెలువడుతాయి. బిజెపి కనుసన్నలలో నడిచే మీడియా వాటికి తగిన చోటు కల్పించినా కల్పించకపోయినా అవి జనంలో ఏదో ఒక రూపంలో వెళతాయి. హిందూత్వ రాజకీయాలు, ఎత్తుగడలను మరింతగా బట్టబయలు చేస్తాయి. నీవు జనాలందరినీ కొంతకాలం వాజమ్మలుగా చేయవచ్చు,కొందరిని ఎల్లకాలం చేయవచ్చు గానీ, అందరినీ అన్ని వేళలా చేయలేవన్న అబ్రహాం లింకన్‌ మాటలను, ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ బోధను ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా సదా గుర్తుంచుకోవాలి.