Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అది అమెరికాలో అతి పెద్ద బ్యాంకు, స్టాక్‌ మార్కెట్లో వాటాల విలువ ప్రకారం ప్రపంచంలో అతి పెద్దది. బ్యాంకులకున్న ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలో ఐదవది.(మొదటి నాలుగు చైనావి) అమెరికా వాల్‌స్ట్రీట్‌లో రారాజుగా పేరు గాంచిన జెపి మోర్గాన్‌ సంస్ధ సిఇఓ జామీ డైమన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీకి ఒకే రోజు కొద్ది గంటల వ్యవధిలో రెండు సార్లు క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకున్నాడు. వినోద ఉత్పత్తులు అందించే అమెరికాలోని బడా కంపెనీలలో డిస్నీ ఒకటి. అది 2005లో ఒక టీవీ సీరియల్‌ నిర్మాణం చేసింది. దానిలో ఒక పాపను దత్తత తీసుకొనేందుకు ఒక కుటుంబం వివిధ ప్రాంతాలను సందర్శిస్తుంది. ఆ క్రమంలో చైనాలోని తియన్మెన్‌ స్క్వేర్‌ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తుంది. దానిలో ” తియన్‌ ఎన్‌ మెన్‌ స్క్వేర్‌ : ఈ ప్రాంతంలో 1989లో ఏమీ జరగలేదు ” అనే బోర్డు అక్కడ ఉన్నట్లు ఆ సీరియల్‌లో చూపారు. అది చైనాను కించపరిచే లేదా పరిహసించేది తప్ప మరొకటి కాదు. హాంకాంగ్‌ ప్రాంతంలో ఆ సీరియల్‌ను ప్రసారం చేయాలంటే అలాంటి దృశ్యాలను చైనా సెన్సార్‌ నిబంధనలు అంగీకరించవు. దాంతో డిస్నీ కంపెనీ వాటిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. లాభాల కోసం మార్కెట్‌ కావాలని వెంపర్లాడుతూనే చైనాను కించపరుస్తూ వ్యవహరించే వారికి ఈ రెండు ఉదంతాలు కనువిప్పు కలిగిస్తాయా ?


అమెరికాలోని బోస్టన్‌ కాలేజీలో కంపెనీల సిఇఓలతో నిర్వహించే ఒక కార్యక్రమంలో జామీ డైమన్‌ మాట్లాడుతూ ” నేను ఇటీవల హాంకాంగ్‌లో ఒక జోక్‌ వేశాను. జెపి మోర్గాన్‌ మాదిరే చైనా కమ్యూనిస్టు పార్టీ వందవ వార్షికోత్సవం జరుపుకుంటోంది, అయితే దాని కంటే మా బ్యాంకు ఎక్కువ కాలం మనగలుగుతుందని పందెం అన్నాను ” అని చెప్పాడు. అంతే కాదు, ఈ మాటలను నేను చైనాలో చెప్పలేను, వారు ఏదో విధంగా వింటూ ఉండవచ్చు అని కూడా అన్నాడు. చైనా కమ్యూనిస్టు పార్టీకి రోజులు దగ్గర పడ్డాయనే భావంతో చేసిన ఈ వ్యాఖ్యలతో అమెరికన్‌ మీడియా పండగ చేసుకుంది. పెద్ద ఎత్తున ప్రచారమిచ్చింది. బ్లూమ్‌బెర్గ్‌ మరీ రెచ్చిపోయింది. తమ బ్యాంకు, దేశానికి హాని చేస్తున్నామనే అంశం ఆ క్షణంలో తట్టలేదు గానీ కొద్ది గంటల్లోనే తెలిసి వచ్చింది. ” నేను అలాంటి మాటలు మాట్లాడి ఉండాల్సింది కాదు. మా కంపెనీ దీర్ఘకాలంగా ఉండటాన్ని, అదెంత బలమైనదో వక్కాణించటానికి అలా చెప్పాల్సి వచ్చింది అని జామీ డైమన్‌ ఒక ప్రకటనలో తెలిపాడు. తరువాత మరి కొద్ది గంటల్లోనే మరొక ప్రకటన చేశాడు. చైనాలో తొలిసారిగా పూర్తిగా ఒక విదేశీ బ్యాంకు స్వంతంగా స్టాక్‌మార్కెట్‌లో బ్రోకర్‌గా పని చేసేందుకు ఆగస్టు నెలలో జెపి మోర్గాన్‌ అనుమతి పొందింది. తద్వారా తన లావాదేవీలను పెద్ద ఎత్తున విస్తరించాలని పధకాలు రూపొందించుకుంటోంది. ఈ దశలో అధికార కమ్యూనిస్టు పార్టీని కించపరుస్తూ డైమన్‌ నోరుపారవేసుకున్నాడు.” ఎవరి మీదా అది ఒక దేశం, దాని నాయకత్వం, లేదా సమాజంలోని ఒక భాగాన్ని, సంస్కృతి మీద జోకులు వేసేందుకు, కించపరిచేందుకు హక్కులేదు. ఆ విధంగా మాట్లాడటం ఎప్పటి కంటే మరింత అవసరమైన సమాజంలో నిర్మాణాత్మక, ఆలోచనా పూర్వకమైన సంప్రదింపులను హరించటమే అవుతుంది.” అని డైమన్‌ రెండవ ప్రకటనలో పేర్కొన్నాడు.


చైనాకు విదేశీ బాంకుల అవసరం ఉన్నప్పటికీ అక్కడ లావాదేవీలు నిర్వహించే పశ్చిమ దేశాల కంపెనీలు జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుందని జామీ డైమన్‌ ఉదంతంపై పరిశీలకులు హెచ్చరించారు. 2019లో స్విస్‌ బాంకు యుబిఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్ధకు చెందిన పాల్‌ డోనోవాన్‌ చైనా గురించి నోరు పారవేసుకున్నాడు. చైనాలో స్వైన్‌ ప్లూ కారణంగా తలెత్తిన ద్రవ్యోల్బణ ప్రభావాల గురించి రాసిన నివేదికలో మీరు ఒక చైనా పంది లేదా చైనాలో పంది మాంసం తినాలనుకుంటేనే మీకు సమస్యలు అవగతం అవుతాయని పేర్కొన్నాడు.దీనిపై తీవ్ర ఆగ్రహం తలెత్తటంతో ఆ కంపెనీతో చైనా సంస్ధలు లావాదేవీలు నిలిపివేశాయి. నష్టనివారణ చర్యగా సదరు కంపెనీ అతగాడిని సస్పెండు చేసింది. హాంకాంగ్‌లోని బ్రిటన్‌కు చెందిన విమాన సంస్ధ కాథే పసిఫిక్‌ సిఇఓ 2019లో హాంకాంగ్‌ వేర్పాటువాద నిరసనలను సమర్ధించాడు.చైనా అభ్యంతరం తెలపటంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో స్వీడిష్‌ ఫాషన్‌ సంస్ధ హెచ్‌ అండ్‌ ఎం, అమెరికాకు చెందిన నైక్‌ కంపెనీ చైనాలోని గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో బలవంతంగా ముస్లింలతో పని చేయించి పత్తి సాగు చేస్తూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించి చైనా మీడియా, వాణిజ్య సంస్ధల విమర్శలకు గురయ్యాయి.


తమ ప్రభుత్వాన్ని నేరుగా లేదా పరోక్షంగా సవాలు చేసినప్పటికీ అవసరమైతే విదేశీ కంపెనీల వాణిజ్య లావాదేవీలను పరిమితం చేసేందుకు లేదా మూసివేసేందుకైనా సిద్దమే అని చైనా స్పష్టంగా వెల్లడించిందని కార్నెల్‌ కంపెనీ ప్రతినిధి ప్రసాద్‌.ఏ చెప్పారు. డైమన్‌ విషయానికి వస్తే హాంకాంగ్‌ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించి పర్యటనకు అనుమతించింది. అక్కడి నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే వారు తమ స్వంత ఖర్చుతో రెండు నుంచి మూడు వారాల పాటు హౌటల్‌ క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. అలాంటిది 32 గంటల డైమన్‌ రాకకు మినహాయింపు ఇచ్చారు.” తన మనసులో ఉన్నదాన్ని మాట్లాడటమే జామీ డైమన్‌లో ఉన్న ఉత్తమ-చెత్త విశిష్టలక్షణం.అదొక ఆనవాలుగా అతనికి బాగా పని చేస్తుంది. మదుపుదార్లు అభినందిస్తారు, సాధికారికమైనది భావిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్లోకి నెడుతుంది. ” అని వెల్స్‌ ఫార్గో విశ్లేషకుడు మేయో అన్నాడు.


ఈ అంశాన్ని మరింతగా పెద్దది చేయటాన్ని మీడియా ఆపితే మంచిది అని చైనా ప్రతినిధి అన్నాడు. డైమన్‌ వ్యాఖ్యలు కంపెనీ అవకాశాలను సంకటంలో పడవేశాయని ఐతే వెంటనే క్షమాపణ చెప్పినందున పెద్దగా నష్టం జరగకపోవచ్చని కొందరు చెప్పారు.గతంలో జరిగిన వాటిని చూసి డైమన్‌ భయపడ్డారని చైనా నిపుణుడు రాబర్ట్‌ లారెన్స్‌ సిఎన్‌ఎన్‌ టీవీతో చెప్పారు.చైనా జనాలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఇష్టపడరన్న ఒక సాధారణ అభిప్రాయం వాస్తవం కాదు పెద్ద మెజారిటీ మద్దతు ఇస్తారు, సమస్యలు ఉండటాన్ని గుర్తించారు. కానీ తలసరి జిడిపి 50 రెట్లు పెరగటాన్ని వారు చూశారు.ఎనభై కోట్లకుపైగా జనాన్ని దారిద్య్రం నుంచి బయటపడవేశారు. ప్రపంచమంతటా కలిపి చూసినా వాటి కంటే ఎక్కువగా ఉన్న వేగవంతమైన రైళ్లను చూశారు. కాబట్టే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వారు ప్రభుత్వం పట్ల చాలా సంతృప్తితో ఉన్నారని లారెన్స్‌ చెప్పాడు.


జామీ డైమన్‌ ఇలా నోరుపారవేసుకోవటం, అహంకార ప్రదర్శన వెనుక ఏముంది అనే చర్చ కూడా జరిగింది.గత పదహారు సంవత్సరాలుగా జెపి మోర్గాన్‌ సిఇఓగా కొనసాగుతున్నాడు.2008లో తలెత్తిన ద్రవ్యసంక్షోభం నుంచి సంస్ధను కాపాడాడు, మంచి సమర్ధకుడిగా వాల్‌స్ట్రీట్లో పేరు తెచ్చుకున్నాడు, ప్రస్తుతం 65 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పటికీ మరో ఐదు సంవత్సరాలు సారధిగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇతగాడి నిర్వాకాలు వాటి మీద పడిన మచ్చలేమీ చిన్నవి కాదు. 2012లో లండన్‌ బ్రాంచి ద్వారా నిర్వహించిన లావాదేవీల్లో అక్రమాలకు గాను ఆరుబిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. ఒక బి.డాలర్ల మేర జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. దాంతో ఏడాదికి అతడి 23మిలియన్‌ డాలర్లవేతనాన్ని సగానికి కోత పెట్టారు.తరువాత తన పదవిని కాపాడుకొని అర్ధికంగా ఎంతో లబ్ది పొందాడు. నోరు ఒక్క చైనా మీదనే కాదు, డోనాల్డ్‌ ట్రంప్‌ను కూడా వదల్లేదు.2018లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గురించి మాట్లాడుతూ తాను ట్రంప్‌ కంటే తెలివిగలవాడినని, వారసత్వంగా పొందినది గాక తెలివితేటలతో ఆస్తి సంపాదించుకున్నానని అన్నాడు. వెంటనే ఒక ప్రకటన చేస్తూ తానలా మాట్లాడి ఉండాల్సింది కాదని, తాను మంచి రాజకీయవేత్తను కాదని తన మాటలు రుజువు చేశాయన్నాడు.


జామీ డైమన్‌ ఉదంతం దక్షిణ కొరియాలో చర్చను రేపింది. చైనాతో వాణిజ్యమిగులు ఉన్న దేశాలలో అది ఒకటి. ఇటీవల అక్కడి షిన్‌సెగే గ్రూపు ఉపాధ్యక్షుడు చంగు యాంగ్‌ జిన్‌ చేసిన కమ్యూనిస్టు వ్యతిరేక వ్యాఖ్యను వెనక్కు తీసుకొనేందుకు నిరాకరించటం రానున్న దినాల్లో సమస్యలు తేవచ్చని భావిస్తున్నారు. నవంబరు 15న ఒక పీజా దుకాణం వద్ద ఇద్దరు సిబ్బందితో కలసి ఒక ఫొటో తీసుకున్నాడు, దాని మీద తనపైత్యాన్ని జోడించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. పీజా బాక్సుమీదు ఎరుపు రంగులో ముద్రించిన లోగో ఉంది. సిబ్బంది కూడా ఎరుపు దుస్తులు ధరించి ఉన్నారు.” కొన్ని కారణాలతో ఫొటోను చూస్తుంటే అది కమ్యూనిస్టు పార్టీ సంబంధితంగా ఉంది. అపార్ధం చేసుకోవద్దు. నేను కమ్యూనిజాన్ని ద్వేషిస్తాను ” అని వ్యాఖ్యానించాడు. ఉత్తర కొరియాను కించపరచటం, అపహాస్యం చేస్తూ చిత్రించిన స్వికిడ్‌ గేమ్‌ అనే సీరియల్‌ను ఒక స్మగ్లర్‌ ఉత్తర కొరియాలోని వారికి అందించాడని, అందుకుగాను అతడిని ఉరితీసినట్లు వచ్చిన వార్తల మీద నవంబరు 24న స్పందిస్తూ కమ్యూనిజాన్ని ద్వేషిస్తానని పేర్కొన్నాడు. యాభై మూడు సంవత్సరాల చుంగ్‌ తన చిన్నతనంలో ప్రచ్చన్న యుద్దవాతావరణంలో కమ్యూనిస్టు వ్యతిరేకిగా పెరిగానని తన చర్యలను సమర్ధించుకున్నాడు. ప్రతివారికీ భావ ప్రకటనా స్వేచ్చ ఉందని అయితే చుంగ్‌ ఒక కంపెనీ బాధ్యతలో ఉన్నందున అపార్ధం చేసుకొనే లేదా తప్పుడు భాష్యం చెప్పటానికి వీలున్న వ్యాఖ్యలను చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని జుంగ్‌ యోన్‌ సంగ్‌ అనే ప్రొఫెసర్‌ చెప్పాడు.


చైనాలో లావాదేవీలు నిర్వహించాలనుకొనే వారికి కమ్యూనిస్టు పార్టీ, దేశం గురించి కొన్ని పాఠాలు నేర్చుకొని రావాలని చైనా అధ్యయన సంస్ధ డైరెక్టర్‌ ఝాంగ్‌ టెంగ్‌జున్‌ అన్నాడు. అమెరికా కంపెనీల విజయం వెనుక చైనా మార్కెట్‌ ఉందని, చైనా విజయం వెనుక కమ్యూనిస్టు పార్టీ వెన్నుదన్నుగా ఉందని, రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని వారు చూడరా అని ప్రశ్నించాడు. నిజం ఏమిటంటే వారు ఇప్పటికీ చైనాను అర్ధం చేసుకోవటం లేదు. వారు చైనా నుంచి లాభాలను మాత్రమే చూస్తున్నారని అన్నాడు. ఇంటి వారు మాంసంతో పెట్టిన భోజనం చేసిన వాడు తరువాత వారినే దూషించినట్లు అనే ఒక సామెత చైనాలో ఉంది.(తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు, పెట్టిన చేతినే కొట్టాడు లేదా తిట్టాడు అన్న మన సామెతలు కూడా అలాంటివేే) సిఇఓ, బిలియనీర్లైన వాణిజ్యవేత్తలు అర్ధం చేసుకోవాలని, బహుశా జామీ డైమన్‌ దాన్ని మరచి ఉంటాడు, తరువాత వెంటనే గుర్తుకు తెచ్చుకొని ఉంటాడని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ఆగస్టులో చైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో జెపి మోర్గాన్‌ బాంకు చైనాలో 20బి.డాలర్ల మేరకు లావాదేవీలు జరిపే వీలుందని, ఇంకా పెరగవచ్చని అంచనా.ఇంతటి మేలు చేకూర్చిన చైనా పాలకపార్టీ మీద ఇంత త్వరలోనే నోరు పారవేసుకున్న నేపధ్యంలో చైనా సామెతను గుర్తు చేసింది.