Tags

, , ,


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


పెప్సీకంపెనీ ” లేస్‌ ” బంగాళాదుంప ”చిప్స్‌” రకంపై హక్కులను కోల్పోయింది. ప్లాంట్‌ వెరైటీస్‌ ప్రొటెక్షన్‌ అధారిటీ పెప్సీ రిజిస్ట్రేషన్‌ను డిసెంబర్‌ 3న రద్దుచేసింది. ఇది విత్తనంపై హక్కును నిలుపుకోవటంలో భారత రైతులు సాధించిన ఘనవిజయం. బంగాళాదుంప పంటలో ఉపయోగించే ఈ వంగడాలను 2009 లో భారత్‌ లోకి తీసుకువచ్చారు. రైతులకు అందించి బంగాళదుంపలను కొనేలా పెప్సీకో ఒప్పందాలు కుదుర్చుకున్నది, 2016 సం.ఫిబ్రవరి 2 న ఈ రకపు వంగడం పిపిఇవిఆర్‌-2001 చట్టం 64,65 సెక్షన్ల క్రింద అధికారికంగా పెప్సీ కంపెనీ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నది.” చిప్స్‌” కోసం ఉపయోగించే ప్రత్యేకమైన బంగాళాదుంప పై పూర్తి హక్కులు తమవేనని పెప్సీ కంపెనీ విర్రవీగుతున్నది. ”పెప్సీకో ఇండియా హౌల్డింగ్‌ యఫ్‌. యల్‌.2027 ” అని పిలవబడే బంగాళాదుంప రకాలను పేటెంట్‌ చట్టం క్రింద నమోదు చేసుకున్నాం కాబట్టి ఈ వంగడం పై పూర్తి హక్కులు తమ స్వంతం అని పెప్సీకో దబాయిస్తున్నది. తమ అనుమతి లేకుండా ఎవరూ ఆ రకాన్ని పండించటానికి వీలు లేదని పెప్సీ కంపెనీ అంటున్నది. ఈ ప్రత్యేక రకమైన బంగాళాదుంపలను ఉపయోగించి ” లేస్‌ ” అనే బ్రాండ్‌ పేరుతో ”చిప్స్‌” తయారుచేసి అమ్ముకుంటున్నది. . చిరుతిళ్ళు, కూల్‌ డ్రింకులు తయారుచేసే పెప్సీకో ఒక పెద్ద మల్టీనేషనల్‌ ఫుడ్‌ కంపెనీ, 200 దేశాలలోవ్యాపారాన్ని చేస్తున్నది. గతసంవత్సరం అమ్మి మన దేశాన్నుండి 4.52 లక్షల కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. దేశంలో 12 రాష్ట్రాలలో 24 వేల మంది రైతులకి బంగాళాదుంప విత్తనాలను ఇచ్చి తిరిగి బంగాళాదుంపలు కొనేటట్లుగా కాంట్రాక్ట్‌ వ్యవసాయం చేస్తున్నది. చట్టాల పేరున సాంప్రదాయక రైతు విత్తన హక్కు పై దాడి చేస్తున్నది. రైతు తన విత్తనాన్ని తనే తయారుచేసుకుని వాడుకోకుండా అడ్డుకుంటున్నది.

ఒక్కొక్క రైతు నుండి ఒక కోటి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారాన్నిడిమాండ్‌ చేసిన పెప్సీ

రెండు సంవత్సరాల క్రితం గుజరాత్‌ లో నలుగురు రైతులపై 4.2 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టారు. 2018 ఏప్రియల్‌ 8 న అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు రైతులను విచారించకుండానే, వారి లాయర్‌ లేకుండానే కంపెనీకి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులనిచ్చింది. అయితే రైతులు, ప్రజాస్వామిక వాదులు రైతు విత్తన హక్కు కోసం నిలబడ్డారు. కోర్టు కేసులు రద్దు చేయాలని దేశ వ్యాపిత ఆందోళనలు చేశారు. గుంటూరు దగ్గర తుమ్మలపాలెంలోకూడా పెప్సీ కంపెనీ వద్ద రైతు సంఘాలన్నీ ఆందోళన చేశాయి. పెప్సీకంపెనీ చిరుతిళ్ళను, కూల్‌ డ్రింకులను బహిస్కరించాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఎన్నికల ముందు దేశ వ్యాపిత ఆందోళనల ఫలితంగా కంపెనీ కేసులన్నీ వెనక్కి తీసుకున్నది.

పెప్సీ కంపెనీకి విత్తనం పై హక్కు

కానీ విత్తనం పై హక్కు నాదే అని పెప్సీ ఇప్పుడు కూడా అంటున్నది. తాత్కాలికంగా వెనక్కితగ్గానంటున్నది. చట్టం ప్రకారం రైతులకు విత్తనం తయారుచేసుకునే హక్కులేదని కంపెనీ వాదిస్తూనే వుంది. ఇందుకు ప్రతిగా కవిత కురుగంటి రైతుల విత్తన హక్కుకోసం పిటీషన్‌ వేశారు. రైతుల విత్తన హక్కు ను పెప్సీ కంపెనీ ఉల్లంఘిస్తున్నదని ,పిపిఇవిఆర్‌-2001 చట్టం ప్రకారం వారికిచ్చిన రిజిస్ట్రేషన్‌ చెల్లదని పిటీషన్‌ దాఖలుచేశారు. చట్టంలోని సెక్షన్‌ 64 ను పెప్సీ ఉపయోగించుకున్నది. రైతులు అదేచట్టం లోని సెక్షన్‌ 39(1) ను ఉదహరించారు. ఈ సెక్షన్‌ ప్రకారం వ్యవసాయానికి విత్తనాలను నాటటం, తిరిగి నాటటం, విత్తనాలను మార్చుకోవటం, పంచుకోవటం లేదా విక్రయించటానికి రైతులకు అవకాశంవున్నది. ఈ చట్టం అమలులోకి రాకముందులాగానే రైతులకు హక్కులన్నీ వుంటాయని కూడా సెక్షన్‌ 39 చెప్తున్నది. కాకపోతే రైతులు బ్రాండులతో విత్తనాలను అమ్మకూడదు. ఈ రక్షణ నిబంధనలు విత్తన రకాలపై పేటెంట్‌ ను అనుమతించటంలేదని , పెప్సీ యొక్క యఫ్‌ సీ 5 బంగాళదుంప రకానికి మంజూరు చేసిన మేధోరక్షణను రద్దు చేయాలని చేసిన వాదనను పిపిఇవి అధారిటీ అంగీకరించింది. రైతులకు విత్తనాలను తయారు చేసుకునే హక్కు ఉన్నదన్నారు. బ్రాండు లేని విత్తనాలను అమ్మకునే హక్కుకూడా రైతుకు వుందన్నారు.

పెప్సీ కంపెనీ దబాయింపులకు కోర్టు అడ్డుకొట్టింది. ఆ బంగాళాదుంప వంగడం పై హక్కులు పూర్తిగా పెప్సీకో కంపెనీవి కావని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్‌ హక్కులను రద్దుచేస్తూ మొక్కల రకాల పరిరక్షణ, రైతు హక్కుల పరిరక్షణ అధారిటీ , శుక్రవారం తీర్పుఇచ్చి సందిగ్దాన్ని తొలగించింది. రైతులను నిలవరించటం కుదరదన్నారు. గతంలో కంపెనీకి ఇచ్చిన పేటెంట్‌ హక్కుల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తమ పేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఇతర రైతులు ఎవరూ పండించటానికి వీలులేదని పెప్సీకంపెనీ వాదిస్తూవుంది

ఈ తీర్పువలన మన రైతులకు చారిత్రక విజయం లభించింది. ఏ కోర్పోరేట్‌ కంపెనీ ఐనా విత్తనం పై సంపూర్ణ హక్కును పొందే అవకాశం లేకుండా స్పష్టమైన తీర్పును, పీపీవీ యఫ్‌ఆర్‌ఏ ఛైర్‌ పర్సన్‌ శ్రీ కే వీ ప్రభు గారు ఇచ్చారు. రైతులోకం స్వాగతించవలసిన తీర్పును సాధించిన కవితా కురుగంటి అభినందనీయులు.
డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, గుంటూరు.