Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


సిటీ మేయర్స్‌ ఫౌండేషన్‌ – వరల్డ్‌ మేయర్‌ ప్రాజెక్టు సంయుక్తంగా 2004 నుంచి అందచేస్తున్న ప్రపంచ ఉత్తమ మేయర్‌ అవార్డుకు 2021కి ఇద్దర్ని ఎంపిక చేసింది. వారిలో ఒకరు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ శివార్లలోని గ్రినీ పట్టణానికి 2012 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్న 47 ఏండ్ల ఫిలిప్‌ రియో, కమ్యూనిస్టు, మరొకరు నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌ మేయర్‌ అహమ్మద్‌ అబౌతాలెబ్‌, లేబర్‌ పార్టీనేత.


అబ్జర్వేటరీ ఆఫ్‌ ఇనీక్వాలిటీస్‌ (అసమానతల పరిశీలన) సంస్ధ వర్గీకరించినదాని ప్రకారం ఫ్రాన్స్‌లోని అత్యంత పేద మున్సిపాలిటీగా గ్రినీ ఉంది. సగం మంది జనం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. దారిద్య్రం, సామాజిక విస్మరణకు వ్యతిరేకంగా, విద్య-సంస్కృతి అంశాలు, పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడుల అంశాలపై ఫిలిప్‌ రియో నాయకత్వంలో జరిగిన కృషికి గుర్తింపు ఇది. కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి, పారిస్‌ డిప్యూటీ మేయర్‌ ఇయాన్‌ బ్రోసాట్‌ ఈ అవార్డు గురించి మాట్లాడుతూ కరోనా సమయంలో అవసరమైన జనాలకు ఆహారం,విద్యార్ధులకు కంప్యూటర్లను అందచేశారని, ఇటీవలి కాలంలో విద్యార్దులకు ఉదయపు అల్పాహారంతో సహా 21సామాజిక చర్యలను తీసుకున్నట్లు చెప్పారు.ఉత్తమ మున్సిపల్‌ కమ్యూనిజాన్ని ఫిలిప్‌ మూర్తీకరించారు, ఉన్నత విలువలను కలిగి ఉండటమే కాదు వాటిని అమలు జరిపేందుకు ప్రయత్నించారు, జన జీవితాల్లో మార్పులు తెచ్చారని ప్రశంసించారు.


గౌరవ ప్రదమైన ఈ అవార్డు గురించి ఫిలిప్‌ చిరునవ్వుతో వినమ్రంగా స్పందించారు. మేయరుగా పని చేస్తున్న క్రమంలో ప్రతికూల ముద్రవేశారు. రాజకీయ చర్చలో మమ్మల్ని బలిపశువులను చేశారు, కార్మికులు నివసించే ప్రాంతాలను విస్మరించారని అన్నారు. తమ మేయర్‌ కాళ్లు ఎప్పుడూ నేలమీదే ఉంటాయని, ఈ గౌరవాన్ని తాము చేసిన పనికి దక్కిన బహుమానమని, మాకు ఎదురవుతున్న అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు తమకు శక్తినిస్తుందని కౌన్సిలర్‌ ఒకరు చెప్పారు. ముఫ్పైవేల మంది పౌరులున్న ఈ పట్టణంలో నిరుద్యోగం, దారిద్య్రం, నేరాలు పెద్ద సమస్యలుగా ఉన్నాయి. ఈ అంతర్జాతీయ గుర్తింపు కార్మికవర్గం నివశించే ప్రాంతాలన్నింటినీ గర్వపడుతూ తలెత్తుకొనేలా చేస్తాయి. ఎందుకంటే రోజంతా వార్తలందించే వార్తా ఛానళ్లలో మాట్లాడేందుకు అవకాశం కల్పించిందని ఇయాన్‌ బ్రోసాట్‌ చెప్పారు.ప్రపంచంలో ఉత్తమ పట్టణంగా ఎన్నికైనప్పటికీ దీని వెనుక ఎంతో కృషి ఉంది. తెల్లవారే సరికి మార్పులను తేలేము.ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఎక్కడ ప్రారంభించాలనేది సమస్య. దారిద్య్రంపై పోరు అంటే ఆరోగ్యం,విద్య, ఉపాధి,గృహవసతి, శిక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టటం. ఈక్రమంలో మేము పంటికి తగిలే రాళ్లను కూడా మింగాల్సి ఉంటుంది అని ఫిలిప్‌ చెప్పారు.


తమ పట్టణాన్ని మీడియా తరచూ ప్రతికూల వైఖరితో చూస్తుందని, ఈ అవార్డు తన ఒక్కడిది కాదన్నారు.కరోనా కాలంలో పట్టణంలో లక్షా30 మాస్కులు పంపిణీ, ప్రతి రోజూ వృద్దుల క్షేమ సమాచారాలు తెలుసుకోవటంలో తమ పట్టణంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలోని పట్టణ పాలక సిబ్బంది, ఎన్నికైన ప్రతినిధులు, సంఘాలన్నింటికి దక్కిన ఉమ్మడి గౌరవం ఇది.అనేక ఆటంకాలను అధిగమించాం, ఎంతో గర్వంగా ఉంది అని కూడా ఫిలిప్‌ చెప్పారు.2021లో 21 పరిష్కారాలు అనే పధకాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం,2022కు సైతం కొత్త పధకాన్ని రూపొందిస్తున్నాం అన్నారు. ఈ రోజు గ్రినీ పట్టణం ప్రభుత్వ విధానాలను రూపొందించేందుకు ఒక జాతీయ ప్రయోగశాలగా ఉంది. మా ఆలోచన, ఆచరణను సమీక్షించుకొనేట్లు చేసిందీ అవార్డు అన్నారు.మానవహక్కుల విషయంలో మేము తొలి అడుగు వేయాల్సి ఉంది. దారిద్య్రం మానహక్కులకు ఆటంకంగా మారింది, దీని కోసం దీర్ఘకాలం పట్టవచ్చు అనికూడా మాకు అర్దమైంది అన్నారు. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాత్వం అనే భావనకు పుట్టిల్లు ఫ్రాన్స్‌.ప్రస్తుతం దేశం దానికి విరుద్దంగా ఉందని ఫిలిప్‌ చెప్పారు.”గ్రినీ వినతి ” పేరుతో జాతీయ ప్రభుత్వానికి 2017 రూపొందించిన పత్రంపై దేశంలోని వందలాది మంది మేయర్లు బలపరుస్తూ సంతకాలు చేశారు. పేదలు నివశించే ప్రాంతాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలన్నదే దాని సారాంశం.


తమ స్ధానిక కమ్యూనిస్టు పాలనను అంతర్జాతీయ విజయగాధగా మార్చేందుకు స్ధానిక సామాజిక కార్యక్రమాలు తోడ్పడ్డాయని అమెరికా నుంచి వెలువడే జాకోబిన్‌ పత్రిక ఇంటర్వ్యూలో ఫిలిప్‌ చెప్పారు. అనేక మంది తమ మూలాలను మరచి తమ వర్గాలను విస్మరించి అందలాలు ఎక్కేందుకు అర్రులు చాస్తూ ” మన ” అనే భావం నుంచి దూరమై ”తన ”కు మాత్రమే గిరిగీసుకుంటున్న తరుణమిది. ఈ నేపధ్యంలో ఫిలిప్‌ రియో గమనం ఆదర్శనీయంగా ఉంది. దానికి సంబంధించిన అనేక అంశాలు జాకోబిన్‌కు చెప్పారు. .
ఉత్తమ మేయర్‌ అవార్డుకు అంతిమంగా పోటీ పడిన 32 పట్టణాల్లో నూఢిల్లీతో సహా వాషింగ్టన్‌, బగోటా, బ్యూనోస్‌ ఎయిర్స్‌ వంటివి ఉన్నాయి. వెళ్లకూడని ప్రాంతాలుగా కొంతమంది చిత్రించిన ప్రాంతాలలో ఒకటిగా ఉన్న గ్రినీ పట్టణానికి అవార్డు రావటం ఆశ్చర్యం కలిగించింది. అమెరికాలో పేదలు నివసించే ప్రాంతాల నుంచి ఒలింపిక్‌ ఛాంపియన్లు లేదా నటులు వచ్చినపుడు జనాలు నీరాజనాలు పడతారు.మమ్మల్ని అవమానిస్తారు గనుక ఈ అవార్డు మా ఛాతీని ఉప్పొంగించింది.మనం ప్రపంచ ఛాంపియన్లమయ్యామని మావారు అంటున్నారు. మా ప్రయత్నాలకు అంతర్జాతీయ గుర్తింపు తేవటంలో విజయవంతమయ్యామని ఫిలిప్‌ చెప్పారు.
1995లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఫిలిప్‌ తలిదండ్రులు దుర్భర పేదరికాన్ని అనుభవించారు. ” కమ్యూనిస్టుగా ఉండటం అంటే ఏమిటని నన్ను తరచు కొందరు అడుగుతారు.నేనెందుకు పార్టీలో చేరాను అని గుర్తుకు తెచ్చుకుంటే ఒకటికి రెండు సార్లు అన్యాయం మీద ఆగ్రహం, రెండవది మున్సిపల్‌ స్ధాయి కమ్యూనిస్టు ఉత్పత్తిని.సమాజంలో ఉన్నత స్ధాయి గురించి నాకు తెలియదు, అయితే తమ ఖాళీ సమయంలో ఇతరుల జీవనాల మెరుగుదల కోసం పని చేసే కార్యకర్తలతో పని చేశాను.వారు నాకు క్రీడల్లో ఫుట్‌బాల్లో పాల్గొనేందుకు తోడ్పడ్డారు.శిక్షణ ఇచ్చారు. నా తండ్రి నిరుద్యోగి, తలిదండ్రులు కడు పేదరికాన్ని అనుభవించారు.కొన్నిసార్లు తినటానికి కూడా ఉండేది కాదు. దాంతో కమ్యూనిస్టుల సమావేశాలతో సహా దిగువ స్ధాయిలో సాయం అందించే వారి దగ్గర ఆహారం తిన్నాను.గ్రాండ్‌ బోర్నె అనే గృహ సముదాయం నుంచి మమ్మల్ని దాదాపు ఖాళీ చేయించారు. అద్దెకుండే వారిని ఖాళీ చేయించకుండా అడ్డుకొనేందుకు కమ్యూనిస్టులతో సహా అనేక మంది వచ్చారు. ఈ కార్యకర్తలు ముఖ్యంగా కమ్యూనిస్టులు ఎలా పని చేశారో చూశాను. వారంతా కార్మికవాడల్లోనే ఉండటాన్ని గమనించాను, వారితో కలిశాను.


విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం, ప్రపంచాన్ని మార్చేందుకు దాన్ని మనం ఉపయోగించవచ్చన్న నెల్సన్‌ మండేలా మాటలు నాకు ఎంతగానో నచ్చాయి.గ్రీనీ వంటి కార్మిక ప్రాంతాల్లోని విద్యార్దులు సగం మంది ఎలాంటి డిప్లొమా పొందకుండానే బయటకు వస్తారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే కార్మికవాడల్లోని స్కూళ్లకు నిధులు సగమే ఇస్తారు.నేను ముందే చెప్పాను మున్సిపల్‌ కమ్యూనిజం ఉత్పత్తిని అని చెప్పాను. పార్టీ రూపొందించిన కార్యక్రమాలు భిన్నమైనవి. ఆరోగ్యపరిరక్షణకు స్ధానిక సంస్ధల అధికారాలను ఉపయోగించాము. విద్య అంటే క్రీడలు, సంస్కృతి కూడా కలసి ఉండేది.స్మార్ట్‌ ఫోన్ల ద్వారా అనేక మందితో సంబంధాలు పెట్టుకోవచ్చుగానీ మానవ సంబంధాలను నష్టపోతాము కనుక సమాజంతో సంబంధాలను కలుపుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుకొని డిప్లొమాలు, డిగ్రీలు పొందవచ్చు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించవచ్చు. కానీ దానికి అనువైన వాతావరణాన్ని కల్పించాలంటే పెద్దవారు బాధ్యత తీసుకోవాలి. పిల్లలు సమగ్రపౌరులుగా ఎదగాలంటే వారికి జీవితాంతం నేర్పాల్సి ఉంటుంది.గ్రినీలో మేము మూడు స్కూళ్లను స్ధాపించాము. ఒకటి పూర్తిగా యువకులైన పెద్దవారికి, అందరు పెద్దవారికి. వారికి డిప్లొమాలు లేనందున శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేశాము. అసాధారణమైన ఫలితాలు వచ్చాయి. మరొకటి వయోజన విద్యాకేంద్రం. ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చాము. మూడవది ఆరోగ్య,సామాజిక సాయం చేసే శిక్షణ కేంద్రం.ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన యువతలో 60శాతం మంది మహిళలు, వారిలో కూడా 55శాతం మంది కార్మిక పేటల నుంచి వచ్చిన వారే. విశ్వవిద్యాలయాలకు వెళ్లలేని వారికి ఇవి అలాంటి అవకాశం ఇచ్చిన విశ్వవిద్యాలయాల వంటివే.ఉపాధి పొందేందుకు ఫ్రెంచి భాష,గణితంలో నిష్ణాతులు కావటం తప్పనిసరిగా ఉన్నందున ఆ శిక్షణ ఇస్తున్నాము.


కమ్యూనిస్టు పార్టీకి ఎన్నికల విజయాలు-పరాజయాలు రెండూ ఉన్నాయి. బలమైన కేంద్రాలు, ఎన్నికల విజయాలకు గారంటీలేమీ లేవు.మనకు మనం కొత్త మార్గాలను కనుగొనాలి. ప్రస్తుతం కార్మికవర్గంలో మార్పు ఉన్నమాట నిజమే గానీ పేదలు ఇంకా ఉన్నారు కదా ! నలభై ఏండ్ల క్రితం నీవు నివశించిన ప్రాంతంలో అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటని కొందరు నన్ను అడుగుతారు. అప్పుడు ఐదు శాతం నిరుద్యోగం ఉంటే ఇప్పుడు 50శాతానికి పెరిగింది అని చెబుతాను. సంపదకోసం వెంపర్లాట పెరిగింది, ఉదారవాద సమాజం పేద కార్మికులను సృష్టిస్తున్నది. నేను మేయర్‌గా బాధ్యతలు చేపట్టేనాటికి అనేక సమస్యలున్నాయి.పదిహేడు వేల మంది నివాసం ఉండే ఐదువేల ఇండ్లకు వేడి నీరు, వెచ్చగా ఉంచే ఏర్పాట్లకు బిల్లులు చెల్లించక నిలిపివేశారు. అవి సహజవాయువుపై ఆధారపడి నడుస్తాయి.వాటి ధరలను మనం అదుపు చేయలేము. ప్రత్యామ్నాయంగా నూటికి నూరుశాతం ప్రజల భాగస్వామ్యంతో జియోథర్మల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేశాము, 25శాతం మేరకు బిల్లులను తగ్గించాము, పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడ్డాము.వామపక్షాల మేయర్లందరం సమన్వయంతో పని చేస్తున్నాము.”


ఐరోపా, అమెరికాల వంటి ధనిక దేశాల్లో ఉన్న స్ధానిక సంస్ధలు పని చేసే తీరు, మన దేశంలోని వాటికి తేడాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా వాటికి తగిన అధికారాల కోసం పోరాడుతూ పౌరుల సమస్యలపై పని చేయటం ద్వారా జనాల మన్ననలను పొందవచ్చు. ఫ్రాన్సులో కేంద్ర అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ అనేక ప్రాంతాలలో కమ్యూనిస్టులు ఎన్నికౌతున్నారంటే జనంతో కలసి ఉండటమే కారణం.

.