ఎం కోటేశ్వరరావు
ఏడాదికి పైగా సాగిన మహత్తర రైతు ఉద్యమం మూడు సాగు చట్టాల రద్దుతో ఘన విజయం సాధించింది. సింహం లాంటి నరేంద్రమోడీ ఎత్తుగడగా ఒక అడుగు వెనక్కు తగ్గారు తప్ప తగు సమయంలో తిరిగి అదే అజండాతో ముందుకు వస్తారని మోడీ అభిమానులు వెంటనే స్పందించటాన్ని చూశాము. వారికి రైతు ఉద్యమం మీద ఉన్న అవగాహన కంటే నరేంద్రమోడీ మీద పెంచుకున్న విశ్వాసం బలంగా ఉందన్నది స్పష్టం. రైతుల పోరాటం ముందుకు తెచ్చిన ఇతర ప్రధాన అంశాలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. కొన్నింటిపై ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీల మేరకు ఉద్యమ విరమణ ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి చర్చ, అవసరమైతే తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు జనవరి 15న సమావేశం జరపనున్నట్లుసంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నేతలు ప్రకటించారు. సమస్యల తీవ్రత, సంక్లిష్టత, అనుమానాల దృష్ట్యా 378 రోజుల పోరులో ఒక విరామంగానే దీన్ని చెప్పవచ్చు.
కనీస మద్దతు ధరల చట్టం గురించి ఒక కమిటీని వేస్తామని, దానిలో రైతు సంఘాల ప్రతినిధులు ఉంటారని కూడా చెప్పారు. ఆ కమిటీని వేస్తారు, వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోపు దాని నివేదిక వచ్చే అవకాశాలు లేవు. ఎన్నికల పబ్బం గడచిన తరువాత ఏం జరుగుతుందో చెప్పలేము.ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. కొన్ని అంశాలను చూద్దాం. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి టి.నందకుమార్ డిసెంబరు 8వ తేదీన రాసిన విశ్లేషణాభిప్రాయంలో వెంటనే ఎంఎస్‌పి డిమాండ్‌ను భరించగలిగే స్ధితి దేశానికి లేదని, అరాజకత్వం, దీర్ఘకాలిక నష్టం జరుగుతుందంటూ గుండెలు బాదుకున్నారు. ఇదేమీ అనూహ్యమైంది కాదు, ఇలాంటి వారు సాగు చట్టాలకు ముందు-తరువాత చర్చలో – రద్దు తరువాత కూడా ఇదే వైఖరిని వెల్లడించారు. వీరంతా స్వదేశీ-విదేశీ కార్పొరేట్ లాబీకి చెందిన పెద్దమనుషులు. రైతులను విభజించే వాదనలను కూడా నందకుమార్ ముందుకు తెచ్చారు. మిగులు పంటను అమ్ముకొనే తరగతి రైతులు ఎవరు ? ఏ ప్రాంతాల్లో సేకరణకు అవసరమైన సదుపాయాలున్నాయి ? వర్షాధారిత రైతులకు పెట్టుబడి సబ్సిడీలు అందకపోతే, సేకరణ వ్యవస్తలు అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుంది ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే ఆ మేరకు జరుగుతోందా లేదా అని ప్రతిలావాదేవీని తనిఖీ సిబ్బంది చూడాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన వారిని శిక్షించాలి.అప్పుడు వ్యాపారులెవరూ మార్కెట్లో ఉండరు, ప్రభుత్వ విక్రయాల కోసం ఎదురు చూస్తారు. అప్పుడు ప్రభుత్వం ఏకైక వ్యాపారి అవుతుంది.అది విపత్తుకు దారి తీస్తుంది. ప్రస్తుత డిమాండ్‌ను చూస్తే విశ్వాస ప్రాతిపదిక వ్యవస్ధ బదులు హక్కుల వ్యవస్ధను కోరుతున్నారు. అదే జరిగితే పంజాబ్ మరికొన్ని రాష్ట్రాలకు పరిమితమైన దానిని దేశమంతటా విస్తరించాల్సి ఉంటుంది. ఆహారభద్రత హక్కు మాదిరి రైతులకు సేకరణ హక్కు లభిస్తుంది. అదే జరిగితే అదొక సేకరణ పధకం లేదా మద్దతు ధరకంటే తక్కువకు అమ్ముకుంటే ఆ తేడాను చెల్లించేది లేదా రెండూ అమలు జరపాల్సి రావచ్చు. అప్పుడేం జరుగుతుంది అని నందకుమార్ ప్రశ్నించారు.
మిగులు పంటను అమ్ముకొనే వారా లేకా స్వంత అవసరాల కోసం పండించుకొనే వారా అన్నది అసంబద్ద వాదన. అసలు ఎవరికీ సాగు గిట్టుబాటు కావటం లేదన్నది అసలు సమస్య. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా 116 దేశాల్లో ఆకలిలో 101వ స్ధానంలో ఉన్నామనే అంశం ఇలాంటి వాదనలు చేసే వారికి తెలుసా ? ఎవరి అవసరాలకు సరిపడా వారు పండించుకుంటే మిగులు లేకుండా ఆకలిని తీర్చేదెవరు ? అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలని-అక్కడి కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలని చెబుతున్నారా ? వర్షాధారిత ప్రాంతాల రైతులను ఆదుకొనేందుకు అవసరమైన పధకాలను అమలు జరిపితే సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు మరొకరెవరైనా అడ్డుకున్నారా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు ధరలను నిర్ణయించే అవకాశం, హక్కు పారిశ్రామిక, వాణిజ్యసంస్ధలకు ఉన్నపుడు రైతులకు అలాంటి అలాంటి హక్కు ఎందుకు కలిగించకూడదు ? ప్రతి రైతుకు అలాంటి అవకాశం లేదు కనుక వారి తరఫున ఆ పని ప్రభుత్వమే చేయాలి. ఇన్నేండ్లుగా విశ్వాసాన్ని వమ్ము చేశారు కనుకనే రైతులు హక్కుల విధానాన్ని కోరుతున్నారు. పెట్టుబడులు రావాలంటే పారిశ్రామిక, వాణిజ్య సంస్దలకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయి, ఇష్టం వచ్చినపుడు కార్మికులను నియమించుకొనే, తీసివేసే స్వేచ్చ ఇవ్వాలన్న వత్తిడికి లొంగి ఆ చట్టాలకు ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే వ్యాపారులు మార్కెట్ నుంచి తప్పుకుంటారని చెప్పటం బెదిరింపు తప్ప మరొకటి కాదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధరలకంటే తక్కువ వెలకు వినియోగదారులకు అమ్మాలనే నిబంధనలేమీ లేనపుడు వారికి వచ్చే నష్టం ఏమిటి ?
నందకుమార్ ముందుకు తెచ్చిన మరికొన్ని వాదనలేమిటి ? ఇరవై మూడు పంటలకు ఇప్పటికే ఉన్న ఎంఎస్‌పికి చట్టబద్దమైన హామీ కల్పించాలని అడుగుతున్నారు. ఇతర రైతుల గురించి ఎలాంటి నిర్దిష్టత లేదు. అందువలన వారు కూడా ఎంఎస్‌పిని అడగరని ఏముంది ? (నిర్ధిష్టత లేకపోతే ప్రభుత్వం ఆ పని చేస్తే వద్దన్నదెవరు ? ఇతర పంటలకూ ఎంఎస్‌పి అడిగితే ఇవ్వాలి. సాగు చేయాలా వద్దా ? ఇతర పంటలు అవసరం లేదా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు అలాంటి పరిమితులేమీ లేవుగా !) ప్రస్తుతం ఎంఎస్‌పి పరిధిలో ఉన్న 23 పంటల విలువ ఏడులక్షల కోట్ల రూపాయలు.చట్టబద్దత కల్పిస్తే అదనపు ఖర్చు రు.47,764(2017-18 సమాచారం) అవుతుందని కిరన్ విస్సా, యోగేంద్ర యాదవ్ చెప్పారు. వీరు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.వాటిలో ఆహార సబ్సిడీ రు.2,40,000 కోట్లున్నాయి.(ఇంత సబ్సిడీ ఇచ్చిన తరువాత కూడా దేశం ఆకలి సూచికలో 116 దేశాల్లో 101వదిగా దిగజారిన స్ధితిలో ఉంది, ఈ సబ్సిడిని తగ్గిస్తే మరింతగా అన్నార్తులు పెరగరా ?) అందులో ఎక్కువ భాగం వినియోగదారులకే చెందుతోంది. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సేకరణ విధానాన్ని, ఆహార సబ్సిడీ కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఎంఎస్‌పి పెరిగినపుడు సబ్సిడీ కూడా పెరుగుతుంది, జారీ ధరలు స్ధిరంగా ఉంటాయి.దీనికి ప్రతి ఏటా 50వేల కోట్లను జత చేస్తే మూడులక్షల కోట్లవుతాయి. గోధుమ, బియ్యం కాకుండా చిరు,పప్పు ధాన్యాలు, ఖాద్యతైలాలను కూడా సేకరించి బహిరంగ మార్కెట్ వేదికలద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తారు.కనీస మద్దతు ధరలలో 40-45శాతం మేరకు నష్టం రావచ్చు.కనుక ఏ సేకరణ చేపట్టినా విలువలో సబ్సిడీ భారం 30శాతానికి తగ్గదు.
ఎంఎస్‌పికి హామీ ఇస్తే పరిమితంగా కొనుగోలు చేయాలి.పౌరపంపిణీ వ్యవస్ధతో సేకరణకు ఉన్న లంకె, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మితే కష్టం, ఎంతో ఖర్చవుతుంది కనుక వాటి లంకెను విడగొట్టాల్సిన తరుణం వచ్చింది.కనీస మద్దతు ధరలేని పంటలను సాగు చేసేందుకు రైతులను ఒప్పించాలి, లేకపోతే వారు ఇతరులు కూడా ఎంఎస్‌పి పంటలను సాగు చేస్తారు. కొత్త సమస్యలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు పిఎం కిసాన్, ఎరువులు, ఇతర సబ్సిడీలతో పాటు ఆహార సబ్సిడీని రు.2,40,000 కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచగలదా ?(వీటిని నష్టాలుగా పరిగణించి గుండెలుబాదుకుంటున్నవారు, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఇస్తున్న ఇతర అనేక రాయితీల గురించి ఏమి చెబుతారు ? వారి సంపదలను పెంచితే జనానికి వచ్చేదేమిటి ? తిండి కలిగితే కండకలదోయి-కండకలవాడేను మనిషోయి అన్న గురజాడను మరిస్తే ఎలా ? కార్మికులు ఆరోగ్యంగా ఉంటే అది వారికే కాదు దేశానికీ లాభమే.) తాజా దారిద్య్రసమాచారం ప్రకారం ఆహార భద్రత వర్తింపును నలభైశాతానికి కుదించటం, చౌకదుకాణాల ద్వారా విక్రయించే వాటి ధరలను పెంచగలదా ? రైతుల ఆదాయాన్ని పెంచే ప్రాధమిక బాధ్యను తీసుకొనే విధంగా రాష్ట్రాలకు ప్రమేయం కల్పించాల్సిన అవసరం లేదా ?( రాష్ట్రాలను సంప్రదించుకుండా సాగు చట్టాలను మార్చినపుడు నందకుమార్ లాంటి వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆ చర్చను ఎందుకు ముందుకు తెస్తున్నారు? )
నందకుమార్ లేదా జయప్రకాష్ నారాయణ లాంటి వారు చేస్తున్న వాదనలు ప్రపంచ వాణిజ్య సంస్ధకు అనుగుణ్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు. కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా తదితర దేశాలు వేసిన కేసులు, వాదనల తీరు తెన్నుల గురించి మరో విశ్లేషణలో చూద్దాం. వాటికి అనుగుణ్యంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలను సంతుష్టీకరించేందుకు, వాటి కార్పొరేట్లకు ద్వారాలు తెరిచేందుకు సంస్కరణలు-రైతుల పేరుతో హడావుడిగా నరేంద్రమోడీ సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కనీస మద్దతు ధరల మీద కమిటీ వేయగానే ఏదో జరిగిపోతుందనే భ్రమలకు లోను కానవసరం లేదు. ఆందోళనకు నాయకత్వం వహించిన ఎస్‌కెఎం ప్రతిపాదించిన వారిని మాత్రమే రైతు ప్రతినిధులుగా పరిగణించాలన్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించలేదు. అంటే ఆర్‌ఎస్‌ఎస్ రైతు సంఘం, ప్రభుత్వ కనుసన్నలలో నడిచేవారిని రైతుల పేరుతో నియమించనున్నారన్నది స్పష్టం.అలాంటి వారితో కూడిన సుప్రీం కోర్టు కమిటీ రూపొందించిన నివేదికను నెలలు గడిచినా బహిర్గతం చేయలేదు, ఏముందో తెలియదు. బహుశా అది రైతులకు అనుకూలంగా లేనందున జనానికి అందుబాటులోకి రాకపోవచ్చు. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. ఎస్‌కెఎంతో వాగ్దాన-ఒప్పంద భగ్నానికి పాల్పడితే మరింత తీవ్ర రూపంలో ఉద్యమం తిరిగి ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు తమకు వ్యతిరేకమైన చర్యల మీద రైతాంగం ఉద్యమించింది. అందినట్లే అంది చేజారిన వ్యవసాయ మార్కెట్‌ను తిరిగి చేజిక్కించుకొనేందుకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్ శక్తులు కేంద్ర ప్రభుత్వం మీద రైతులకంటే తీవ్రంగా వత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. నరేంద్రమోడీ తమకు ఉపయోగపడే అవకాశాలు లేవనుకుంటే ఆ స్ధానంలో మరొకరిని రంగంలోకి తెచ్చినా లేదా తమ హిందూత్వ అజెండాకే ప్రమాదం ముంచుకువచ్చిందని సంఘపరివార్ భావించినా దాన్ని అమలు జరపగల సమర్ధుడిగా భావిస్తున్న నరేంద్రమోడీ మరో రూపాన్ని ప్రదర్శించినా ఆశ్చర్యం లేదు.
రైతులు డిమాండ్ చేస్తున్న అంశాలలో కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్నది ఒకటి. అదేమీ వారు కొత్తగా కోరిన గొంతెమ్మ కోరిక కాదు. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలలో ఒకటే. నెలవులు మారిన తరువాత పాతవాటిని మరచిపోయినట్లు నటించటం కొందరిలో చూస్తాము. కానీ మోడీ గారి విషయంలో అలా అనుకోలేము. అసలు కథవేరే ఉంది. అది బయటకు చెప్పలేరు-రైతులను మెప్పించలేరు, అందుకే అనేక మంది పాలకుల మాదిరే బలవంతంగా రుద్దేందుకు పూనుకొని మూడు సాగు చట్టాలను తెచ్చారు. అనుకున్నది ఒకటి-అయింది ఒకటి. చివరకు క్షమాపణలు చెప్పి మరీ వాటిని వెనక్కు తీసుకున్నారు. నిజానికి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించేందుకు కాబినెట్‌లో చర్చించి ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదం పొందటం క్షణంలో పని. జమ్ము- కాశ్మీరు రాష్ట్రం, ఆర్టికల్ 370ని ఒక్క రోజులో వేగంగా రద్దు చేయటంలో చూపిన సామర్ధ్యం జగమెరిగిందే. అలాంటిది కనీస మద్దతు ధరల చట్టం తేలేరా ?
.