Tags
Agricultural Produces, Farmers Delhi agitation, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, WTO-Agriculture, WTO-India
ఎం కోటేశ్వరరావు
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలు, అవగాహన మేరకు మన దేశంలో 23 పంటలకు అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలు ఆహార భద్రతా చర్యల్లో భాగం. దానిలో భాగమే సేకరణ, పంపిణీ నిర్వహణ. ఈ విధానం మేరకు వర్దమాన దేశాలకు అనుమతించిన పరిమితులకంటే ఎక్కువగా మన దేశం సబ్సిడీ ఇస్తున్నదని డబ్ల్యుటిఓలో మన మిత్ర, సహజ భాగస్వామి అని చంకలు కొట్టుకుంటున్న అమెరికా, కెనడా కేసు దాఖలు చేశాయి. మన మీద ఐక్యంగా దాడి చేస్తున్న ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటమే కాదు, కేసులు కూడా దాఖలు చేస్తున్నాయి. మన మీదే కాదు చైనా మీద కూడా అమెరికా అలాంటి కేసునే దాఖలు చేసింది. పరిమితికి మించి చైనా రైతులకు సబ్సిడీలు ఇస్తున్నదని డబ్ల్యుటిఓ 2019 మార్చినెలలో తీర్పు చెప్పింది. దాని మీద చైనా వినతి మేరకు ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నారు. దానిలో తృతీయ పక్షంగా మన దేశం మరికొన్ని దేశాలు చేరాయి. అది ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పరిష్కారం అవుతుందో చెప్పలేము.ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) ఇది ప్రపంచ వ్యవసాయదారుల సంస్ధ కాదు. పారిశ్రామిక, సేవ, వ్యవసాయ రంగాలన్నిటినీ వాణిజ్యంగా పరిగణించి ఆ దృక్పధంతోనే వాటి విధిని నిర్ణయిస్తోంది. అందువలన దానికి యజమానులు తప్ప ఆ రంగాల్లో పనిచేసే వారి గురించి పెద్దగా పట్టదని వేరే చెప్పనవసరం లేదు.
అమెరికా లేవనెత్తిన అంశాలు మనకూ ఆసక్తి-ఆందోళన కలిగించేవే. బరాక్ ఒబామా హయాంలో ఈ కేసు దాఖలైంది. చైనా ఇస్తున్న సబ్సిడీల కారణంగా తమ మొక్కజొన్న, గోధుమ, వరి రైతులు నష్టపోతున్నారని, ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేరిన సమయంలో అంగీకరించిన మొత్తాలకంటే ఎక్కువ మొత్తాలు ఇస్తున్నట్లు ఆరోపణ. ఈ కారణంగా చైనాలో అధికంగా ఉత్పత్తి చేస్తున్నారని, ఫలితంగా ప్రపంచ స్ధాయి నాణ్యత కలిగిన ఉత్పత్తులను తమ రైతులు చైనాకు ఎగుమతి చేయలేకపోతున్నారని, ఇది వాణిజ్య నిబంధనలకు విరుద్దమని ఫిర్యాదు చేసింది. ఒక బుషెల్ (25.4కిలోలు) గోధుమలకు మద్దతు ధరగా పది డాలర్లను(మన కరెన్సీలో రు.750,మన ప్రభుత్వం 2021-22కు ప్రకటించింది క్వింటాలుకు రు.2015) చైనా మద్దతు ఇస్తోందని, ఇది ప్రపంచ ధరల కంటే చాలా ఎక్కువన్నది అమెరికా ఆరోపణ. మన దేశంలో వరి, గోధుమలకు గరిష్టపరిమితిగా ఉన్న పదిశాతానికి మించి 60,70శాతం వరకు మద్దతు ధరల రూపంలో సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా చిత్రిస్తున్నది.
ఆయా దేశాలకు ఇచ్చిన సబ్సిడీలను పరిమిత వ్యవధిలోపల ఎత్తివేయకపోతే కేసులో గెలిచిన దేశాలు ప్రతికూల పన్నులు విధించవచ్చునని డబ్ల్యుటిఓ నిబంధనలు చెబుతున్నాయి. పంటల విలువలో 8.5శాతానికి మించకుండానే తమ సబ్సిడీలు ఉంటాయని అంగీకరించిన చైనా అంతకు మించి అదనంగా వంద బిలియన్ డాలర్లు ఇచ్చిందన్నదే వివాదం. నిబంధనల మేరకు వర్ధమాన దేశాలు పదిశాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు. చైనా అధిక ఉత్పత్తి మరియు రక్షణ చర్యలు దీర్ఘకాలం కొనసాగుతున్న కారణంగా అమెరికా రైతులు దెబ్బతింటున్నారు. చైనా సబ్సిడీల కారణంగా ఏడాదికి 70కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నారని అమెరికా గోధుమ ఎగుమతిదారు విన్స్ పీటర్సన్ ఆరోపించాడు. గోధుమలు, వరికి కనీస మద్దతు ధర ఉన్నకారణంగానే రైతులు వాటివైపు మొగ్గుచూపుతున్నారని వాదించేవారి గురించి తెలిసిందే. ఆ మద్దతు ధర గురించి అదే అమెరికా మన మీద కూడా దాడి చేస్తోంది.
అమెరికా, ఇతర ధనిక దేశాల దాడులు, వత్తిడి నుంచి తప్పుకొనేందుకు రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎగుమతి చేసుకోవచ్చు అంటూ కొత్త పల్లవి అందుకొని మోడీ సర్కార్ హడావుడిగా మూడు సాగు చట్టాలను తెచ్చిన అంశం తెలిసిందే. చైనా ఇస్తున్న మద్దతు ధర చెల్లదని ప్రపంచ వాణిజ్య సంస్ధ ఇచ్చిన తీర్పు తమకు మంచి అవకాశమని అమెరికా రైస్ అనే వ్యాపార సంస్ధ చైర్మన్ చార్లీ మాథ్యూస్ చెప్పాడు. ఏ ఏడాదైనా తమ పంటలో సగాన్ని ఎగుమతి చేస్తామని ఇతర దేశాలు కూడా అదనంగా ఇస్తున్న మద్దతు ధరను తగ్గిస్తే అంతర్జాతీయంగా మంచి అవకాశాలు వస్తాయని అన్నాడు. దీని అర్ధం ఏమిటి ? భారత్, చైనా వంటి దేశాల రైతులకు ధర గిట్టుబాటుగాక సాగుమానేస్తే తమ పంటలను మనవంటి దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.
అమెరికా, కెనడా మన మీద ప్రధానంగా పప్పుధాన్యాలకు మద్దతు ఇవ్వటాన్ని సవాలు చేశాయి.2018-19 సంవత్సరానికి ప్రకటించిన మద్దతు ధరలు అనుమతించినదానికంటే 26రెట్లు అదనంగా ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాయి. పప్పుధాన్యాల విలువను మన దేశం రు.2,677 కోట్లుగా లెక్కిస్తే అమెరికా, కెనడా దాన్ని రు.69,923 కోట్లుగా చూపాయి. ఎందుకీ తేడా వచ్చింది ? మద్దతు ధర పధకం కింద కేంద్రం లేదా రాష్ట్రాలు సేకరిస్తున్న పరిమాణానికే మనం విలువ కడుతుండగా, అమెరికా, కెనడాలు మొత్తం ఉత్పత్తిని తీసుకొని దాని మీద చూపుతున్నాయి. మరొకటేమంటే మన దేశం విలువను డాలర్లలో లెక్కిస్తుండగా మన మీద ఫిర్యాదు చేసిన దేశాలు రూపాయల్లో లెక్కించాయి. అమెరికన్లు చైనా మీద మొక్కజొన్న, గోధుమ, వరి మీద ఫిర్యాదు చేయగా మన మీద పప్పుధాన్యాల మీద వేయటానికి కారణం వాటిని ప్రత్యేకించి బఠానీలను మనకు ఎగుమతి చేయాలని చూస్తున్నాయి. తరువాత మిగతావాటి మీదా వేస్తాయి. చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఈ రోజు మనల్ని కౌగిలించుకుంటున్న దేశాలన్నీ ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా మన మీద ఫిర్యాదు చేసినవే. చెరకు రైతులకు రాష్ట్రాలు ప్రకటించే సూచిక ధరలను రైతులకు ఇస్తున్న సబ్సిడీలుగా చూపుతూ ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. సౌరపలకలు, గోధుమలు, వరి, పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా, ఉక్కు ఉత్పత్తులపై జపాన్ అదేపని చేశాయి.
ఇతర దేశాల మీద విరుచుకుపడుతున్న అమెరికా తాను చేస్తున్నదేమిటి ? డబ్ల్యుటిఓలో వ్యవసాయంపై కుదిరిన ఒప్పందం మేరకు ధనిక దేశాలు తమ సబ్సిడీలను ఐదుశాతానికి, మిగతాదేశాలు పదిశాతానికి పరిమితం చేయాలి. అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే నిబంధనలను ఉల్లంఘించే మార్గాలను వెతికారు. సబ్సిడీల్లో మూడు రకాలు. ఒకటి గ్రీన్ బాక్స్, రెండు అంబర్‌బాక్స్, మూడవది బ్లూబాక్స్. గ్రీన్ బాక్సు తరగతి సబ్సిడీలు వ్యాపారాన్ని వికృతీకరించకూడదు, లేదా పరిమితంగా ఉండాలి. అవి ప్రభుత్వం ఇచ్చేవిగా, మద్దతు ధర ప్రమేయం లేనివిగా ఉండాలి.పర్యావరణాన్ని, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉంటే వాటికి ఎలాంటి పరిమితులు లేవు. గ్రీన్, బ్లూబాక్స్ సబ్సిడీలు కానివన్నీ అంబర్‌బాక్సు తరగతిలోకి వస్తాయి. ఉత్పత్తి పరిమాణంతో నేరుగా సంబంధం ఉండే సబ్సిడీలు లేదా మద్దతు ధరల వంటివి దీనిలో ఉన్నాయి. బ్లూబాక్స్ అంటే షరతులతో కూడిన అంబర్ బాక్సు సబ్సిడీలు, వికృతీకరణను తగ్గించేవిగా ఉండాలి. అంటే రైతులు ఉత్పత్తిని పరిమితం చేసేవిగా ఉండాలి.ప్రస్తుతం ఈ సబ్సిడీలకు కూడా ఎలాంటి పరిమితులు లేవు.
మన మద్దతు ధరలపై వేసిన కేసు విచారణ, తీర్పు వచ్చే వరకు వ్యవధి పట్టవచ్చు. చైనా మాదిరి మనకూ వ్యతిరేకంగా తీర్పు రావచ్చు. ఈ లోగా కేసు వేసిన దేశాలతో మనదేశం సంప్రదింపుల ప్రక్రియ ఉంటుంది. ఈలోగా మన దేశం కూడా కొన్ని మార్పులు చేయవచ్చు. చైనా వివాదం రెండున్నర సంవత్సరాలు పట్టింది. మరికొన్ని దేశాలు కూడా మన మీద కేసులో చేరవచ్చు. మన దేశం ఇస్తున్న మద్దతు ధరలను ఆహార భద్రతా చర్యల్లో భాగంగా చూపుతున్నాము గనుక అవి గ్రీన్ బాక్సు తరగతిలోకి వస్తాయని మన నిపుణులు భావిస్తున్నారు. గోధుమల మద్దతు ధరల వివాదంలో చైనాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తరువాత 2019లో నరేంద్రమోడీ రెండవ సారి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. బహుశా ఈ తీర్పు నేపధ్యంలో మద్దతు ధరలకు మంగళం పాడే ఉద్దేశ్యంతో లేదా మార్పులు చేశామని చూపేందుకు, సబ్సిడీ మొత్తాలకు కోత పెట్టేందుకు నేరుగా నగదు అందచేసే పేరిట ఏటా ఆరువేల రూపాయల సాగు లేదా ఆదాయ మద్దతు పేరుతో కిసాన్ సమ్మాన్ పధకాన్ని ప్రకటించారనుకోవాలి. ఇది ప్రపంచ బాంకు ఆదేశాల్లో భాగమే. తెలంగాణాలో, దేశంలో ధాన్య ఉత్పత్తి పెరిగిందనే వాదనలు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనే పల్లవి, పాట అందుకున్నారు.ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం అంటే కొనాలని మేము అడగం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవటం, వరి సాగు వద్దని, ఇతర పంటలు వేసుకోవాలని చెప్పటాన్ని చూస్తుంటే వీటన్నింటికీ సంబంధం లేదని ఎవరైనా చెప్పగలరా ? చైనా సర్కార్ ఇస్తున్న మద్దతు ధరల కారణంగానే అక్కడ ఉత్పత్తి పెరిగిందని, అది తమ ఎగుమతులను దెబ్బతీసిందని అమెరికా చేసిన వాదన మనకూ, మనలాంటి ఇతర దేశాలకూ వర్తించదా ?
విడదీసి పాలించాలనే బ్రిటీష్ వారి ఎత్తుగడను అమెరికా అమలు చేస్తోంది. దానిలో భాగంగానే మనకూ-చైనాకు మరోసారి తగదా పెట్టటంలో జయప్రదమైంది. రైతులకు మద్దతు ఇచ్చే అంశంలో మనమూ-చైనా కూడా ప్రపంచవాణిజ్య సంస్ధలో ఒకే వాదనను ఐక్యంగా ముందుకు తెస్తున్నాము. సవాలు చేసేందుకు వీలు లేని గ్రీను బాక్సు సబ్సిడీల పేరుతో అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు అమలు చేస్తున్న అంబర్ బాక్సు సబ్సిడీల సంగతేమిటని నిలదీస్తున్నాయి. అవి మన దేశంలో అమలు చేస్తున్న మద్దతు ధరలతో పోలిస్తే చాలా ఎక్కువ. గోధుమ రైతులకు చైనా ఇస్తున్న మద్దతు ధరలతో అంతర్జాతీయంగా ధరలు తగ్గి తమకు నష్టం వస్తోందని వాదించిన అమెరికా చేసిందేమిటి ? అమెరికా సర్కార్ పత్తి రైతులకు ఇస్తున్న మద్దతు ప్రపంచ మార్కెట్‌ను వక్రీకరిస్తోందంటూ 2002లో బ్రెజిల్ సవాలు చేసింది.1995-2002 మధ్య పత్తి ధరలు గణనీయంగా పడిపోవటానికి, అదే కాలంలో అమెరికా పత్తి ఎగుమతులు రెట్టింపు కావటానికి సబ్సిడీలే కారణమని ప్రపంచ వాణిజ్య సంస్ధ విచారణలో నిర్ధారణైంది. పశ్చిమ ఆఫ్రికాలోని పేద దేశాల పత్తి రైతులు నష్టపోయినట్లు కూడా తెలిపింది. మార్కెట్ సహాయ రుణాలు, మార్కెట్ నష్టాన్ని పూడ్చే పేరుతో అమెరికా రాయితీలు ఇచ్చింది.
ఈ తీర్పు తరువాత అమెరికా రాజీకి వచ్చి బ్రెజిల్ పత్తి రంగ సామర్ధ్యం పెరుగుదలకు తన ఖర్చుతో శిక్షణ ఇస్తామని ప్రకటించింది. దీనికి తోడు 2014 అమెరికా వ్యవసాయ బిల్లులో కొన్ని మార్పులు చేయటంతో బ్రెజిల్ మౌనం దాల్చింది. అయితే అమెరికా ఆ బిల్లును 2019లో సవరించి పది సంవత్సరాలలో వివిధ రూపాలలో 867బిలియన్ డాలర్ల మేరకు రైతుల పేరుతో రాయితీలు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో ఉన్న అనూహ్య అంశం ఏమిటో తెలుసా ! పొలంలో పని చేయకపోయినా రైతు మేనళ్లు, మేన కోడళ్లు,ఇతర బంధువులు కూడా రైతుల పేరుతో సబ్సిడీలను పొందవచ్చు. ధనిక దేశాల ఉత్పత్తులకు మనమూ, చైనా వంటి దేశాలు మార్కెట్లను తెరిచి దిగుమతులు చేసుకుంటే ఎలాంటి కేసులూ ఉండవు. మనం దిగుమతులకు అనుమతిస్తే పారిశ్రామిక రంగం విదేశీ సరకులతో కుదేలైనట్లే వ్యవసాయం కూడా మరింత సంక్షోభానికి లోనవుతుంది.
ప్రపంచ వాణిజ్య సంస్ధలో తొలిసారిగా బాలీ సంధికాల నిబంధనను గతేడాది, ఈ ఏడాది ఉపయోగించుకున్న దేశం మనదే. వరికి ఇస్తున్న రాయితీ పదిశాతం దాటటమే దీనికి కారణం.2019-20లో బియ్యం ఉత్పత్తి విలువ 46.07బిలియన్ డాలర్లు కాగా ఇచ్చిన రాయితీ 6.31బి.డాలర్లని ఇది 13.7శాతానికి సమానమని మన దేశం డబ్ల్యుటిఓకు తెలిపింది. అయినప్పటికీ ఇది సమర్దనీయమే అంటూ సంధికాల నిబంధనను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఎఫ్‌సిఐ ద్వారా సేకరణను కొనసాగించవచ్చు. రాయితీలు తమ అంతర్గత ఆహార భద్రత కోసం ఇచ్చినవి గనుక వాణిజ్య వికృతీకరణ జరగలేదు. ప్రభుత్వం సేకరించిన నిల్వల నుంచి విదేశాలకు వాణిజ్యపరమైన ఎగుమతులు జరపలేదు. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం విక్రయిస్తున్న వాటిని కొనుగోలు చేసిన వారు ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేయకూడదనే షరతు ఉన్నందున ఎవరికీ నష్టం జరగలేదు, అందువలన భారత్‌పై చర్యలు తీసుకోకూడదన్నది మన వాదన. దీన్ని సమర్ధించుకొనేందుకే కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత బియ్యాన్ని ఆహార భద్రత పధకం కింద చూపారు. వాటి సరఫరాను విరమించినట్లు ప్రకటించిన కేంద్రం తిరిగి కొంత కాలం కొనసాగించనున్నట్లు ప్రకటించిన అంశం తెలిసిందే. ఈ కారణాలను ఎవరూ సవాలు చేసేందుకు వీలులేదు. ఈ నిబంధన ఒక్క బియ్యానికే కాదు, ఇతర పంటలకూ వర్తిస్తుంది.
మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే సంభవించే పర్యవ సానాల గురించి ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం తలచుకుంటే దాన్ని సాధించటం అసాధ్యం కాదు. ఇప్పటికే చెరకు పంటకు ఒక చట్టబద్దత ఉంది. ప్రభుత్వం సూచించిన ధరకంటే తక్కువకు కొనుగోలు చేసేందుకు మిల్లులకు అవకాశం లేదు. ఆ ధర ఎక్కువా తక్కువా, రికవరి లెక్కల్లో మోసాలు వేరే అంశం. పేరుకు ఇరవై మూడు పంటలైనా ఆచరణలో అన్నింటినీ ప్రభుత్వం సేకరించే అవసరం రావటం లేదు, నిర్ణీత ధరలకంటే ఎక్కువ లేదా వాటికి దరిదాపుల్లో ఉన్నందున రైతులు ప్రభుత్వం మీద ఆధారపడటం లేదు. గతేడాది బియ్యం ఉత్పత్తిలో 49శాతం, గోధుమలను 40శాతమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉత్పత్తి పెరిగితే ఇంకాస్త పెరుగుతుంది తప్ప అసాధారణంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో పత్తి సేకరణ అవసరమే ఉండటం లేదు. మద్దతు ధరలు ప్రకటిస్తున్న 23 పంటల మొత్తం విలువ పన్నెండులక్షల కోట్ల రూపాయలని (2020-21) అంచనా. కుటుంబ అవసరాలకు, పశుదాణాకు పోను మార్కెట్‌కు వస్తున్నదానిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదాని విలువ రు.నాలుగులక్షల కోట్లు. మరొక ఐదులక్షల కోట్ల మేరకు బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. కోట్లాది మంది రైతులు, కూలీలతో, ఇతరంగా ఆధారపడే వారికి సంబంధించిన దీనికి హామీ ఇవ్వటానికి ప్రభుత్వానికి సత్తా, అవకాశాలు లేవా ?
ఒక అంచనా ప్రకారం మన దేశంలో ఏటా ప్రతి రైతుకూ సగటున 260డాలర్ల మేర సబ్సిడీలు ఇస్తున్నారు. అదే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 100రెట్లు ఎక్కువ. మరొక అంచనా ప్రకారం భారత్‌లో 200 డాలర్లు ఇస్తుంటే అమెరికాలో 50వేల డాలర్లు ఇస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం చట్టవిరుద్దం. మన కార్పొరేట్ మేథావులు ఈ వాదనను భుజానవేసుకొని దాన్నే వల్లిస్తున్నారు.నిజానికి మనకు ఆ హక్కు నిబంధనలకు లోబడే ఉంటుందన్నది మరొక అభిప్రాయం. మరి నరేంద్రమోడీ సర్కార్ ఏదో ఒక వాదనను తన వైఖరిగా తీసుకుంటే అదొక తీరు. రైతు ఉద్యమం సాగిన ఏడాది కాలంలో చెప్పిందేమిటి ? గతంలో చట్టబద్దత లేదు కదా, కొనసాగిస్తామని రాతపూర్వకంగా ఇస్తామంటున్నాం కదా, ఏటా ధరలను సవరిస్తూనే ఉన్నాం అని అటూ ఇటూ తిప్పటం తప్ప చట్టబద్దత కుదురుతుందో లేదో కుదరకపోతే కారణాలేమిటో చెప్పకుండా నాటకం ఎందుకు ఆడినట్లు , ఇప్పుడు ఒక కమిటీ వేస్తామని ఎందుకు చెప్పినట్లు ? అసలు సంగతేమంటే అన్ని రంగాలనుంచి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొంటున్న మాదిరే వ్యవసాయాన్ని కూడా ప్రయివేటు రంగానికి అప్పగించాలనే తాపత్రయమే. అందుకే రైతు ఉద్యమంలో ఐక్యత కీలకమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కారణంగా మోడీ సర్కార్ క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గింది తప్ప మారుమనసు కలిగి కాదన్నది స్పష్టం. అందుకే కనీస మద్దతు ధరల చట్టబద్దతపై కమిటీ వేసినా దానికి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. అందుకే రైతుల ఆందోళన అంతం కాదు, మరో ఆరంభానికి విరామమే అని చెప్పాల్సి వస్తోంది.