Tags

, , ,


ఎం. కోటేశ్వరరావు


బీజింగ్‌ ఒలింపిక్స్‌ తుది సన్నాహాలు కూడా పూర్తి కావస్తున్నాయి. ఫిబ్రవరి నాలుగు నుంచి 20వ తేదీ వరకు జరిగే పోటీల్లో సత్తా చూపేందుకు క్రీడాకారులు ఒకవైపు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు చైనాను బదనాం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని దేశాలు అంతకంటే ఎక్కువగా సిద్ధం అవుతున్నాయి. క్రీడల కంటే అంతర్జాతీయ రాజకీయాలు ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. అసలేం జరగనుంది? అమెరికా కూటమి దేశాలు తమ క్రీడాకారులను బీజింగ్‌ పంపుతాయట గానీ వారి వెంట రాజకీయ నేతలు, అధికారులను మాత్రం పంపవట. దీనికి దౌత్యపరమైన బహిష్కరణ అని పేరు పెట్టారు. ఆడేది క్రీడాకారులు తప్ప అధికారులు కాదు కదా! వారు వస్తే ఏమిటి? రాకపోతే ఏమిటి అని క్రీడా సంబంధిత వర్గాలు పెద్దగా ఆ పిలుపులను పట్టించుకోవటం లేదని వార్తలు. రాజకీయ నేతల హడావుడి మరీ ఎక్కువగా ఉంది, మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత, అసలు మిమ్మల్ని రమ్మని పిలిచిందెవరు అని చైనా ప్రతినిధులు బహిష్కరణ గురించి చెప్పేవారి గాలితీశారు. తాము ఇంతవరకు అసలు అమెరికా రాజకీయవేత్తలకు ఆహ్వానాలే పంపలేదని, అలాంటప్పుడు బహిష్కరణకు తావెక్కడని అమెరికాలోని చైనా రాయబారి ప్రతినిధి ప్రశ్నించాడు.


నిర్వహించేది అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ, దానికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆతిధ్యదేశం చైనా మాత్రం దీన్ని తేలికగా తీసుకోవటం లేదు. ప్రతిగా క్రీడలు పూర్తయిన తరువాత కర్ర కాల్చి ఎక్కడ పెట్టాలో అక్కడ వాత పెడతాం అన్నట్లుగా హెచ్చరించింది. ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఎన్ని దేశాలు అమెరికాను అనుసరిస్తాయి, ఎన్ని తిరస్కరిస్తాయో ఇంకా తెలియదు. ఇప్పటి వరకు అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, లిధువేనియా బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించాయి. జపాన్‌ ఇంకా ప్రకటన చేయలేదు గానీ అలాంటి సూచనే చేసింది. అమెరికా అడుగులో అడుగువేసే దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ ఆ బాటలో నడిచేది లేదని చెప్పేశాయి. పంపటం లేదని, తమది బహిష్కరణ కాదంటూ కరోనాను కారణంగా న్యూజిలాండ్‌ చూపింది. మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అమెరికా తన పెరటితోటగా భావించే లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా కూడా హాజరవుతోంది. సముద్రంలోకి ప్రవహించే నదులను పర్వతాలు నిరోధించలేవని చైనా ఎద్దేవా చేసింది.


రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం క్రీడలను ఒక సాధనంగా వాడుకోచూడటం గర్హనీయం. చైనాలోని షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో ముస్లిం సామాజిక తరగతి మానవహక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ అమెరికా, దాని కూటమి దేశాలు యాగీ చేస్తున్నాయి. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ పట్టణంలో జరిగిన జి7 దేశాల విదేశాంగ, అభివృద్ధి మంత్రుల సమావేశం చైనా ఆర్థిక బలాత్కారం పేరుతో కొత్త పల్లవి అందుకుంది. పొద్దున లేస్తే తమకు లొంగని దేశాల మీద ఆర్థిక, దౌత్య, ఇతర ఆంక్షలను విధిస్తున్న అమెరికా, దానికి తందాన తాన అంటున్న దేశాలు చైనా మీద ప్రచారదాడి ప్రారంభించటంలో ఆశ్చర్యం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో అమెరికా ఇప్పటివరకు సాధించిందేమీ లేకపోగా నష్టపోయింది.

దొంగే దొంగని అరచినట్లుగా అమెరికా చేస్తున్న ఆర్థిక బలాత్కారాలకు అనేక ఉదంతాలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. దానికి తన మన పర బేధాలు లేవు. పసిఫిక్‌ సముద్రంలో నౌరు, కిరిబటి, మైక్రోనేసియా అనే మూడు చిన్న దీవుల దేశాలున్నాయి. ఇంటర్నెట్‌ సేవలను మెరుగుపరచేందుకు సముద్రంలో వైర్లద్వారా సమాచారాన్ని పంపే ప్రపంచబాంకు పథకాన్ని 7.25 కోట్ల డాలర్లతో రూపొందించి అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. దానిలో చైనా కంపెనీ ఒకటి 20శాతం తక్కువకు టెండరు వేసి కాంట్రాక్టు దక్కించుకుంది. చైనా కంపెనీకి గనుక పని అప్పగిస్తే భద్రతకు ముప్పు వస్తుందంటూ అమెరికా వత్తిడి తెచ్చి సదరు ప్రాజెక్టును అడ్డుకుంది. ఇది తాజా ఉదంతం. అంతకు ముందు హువెయి, టిక్‌టాక్‌, మూడు టెలికాం కంపెనీల మీద ఆంక్షలు విధించటం, వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టటం, వాటి ఉత్పత్తులు కొనుగోలు చేసిన, సేవలు పొందిన దేశాల మీద చర్యలు తీసుకుంటామని బెదిరించటం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి కంపెనీలను తొలగించటం, హువెయి కంపెనీ ఉన్నతాధికారిణిని కెనడాలో అరెస్టు చేయించటం తెలిసిందే. చైనా సంగతిని పక్కన పెడితే ఫ్రెంచి కంపెనీ అస్టోమ్‌పై 77.23 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. ఐరోపా విమానకంపెనీ ఎయిర్‌బస్‌పై 2020లో పన్నులు పెంచింది. అంతెందుకు మన నరేంద్రమోడీ కౌగిలించుకున్నా మరొకటి చేసినా మన ఎగుమతులపై రద్దు చేసిన పన్నుల రాయితీని రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌గానీ, తరువాత గద్దెనెక్కిన బైడెన్‌ గానీ వాటిని పునరుద్దరించలేదు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తే మన దేశం మీద కూడా చర్య తీసుకుంటామని అమెరికా చేసిన బెదిరింపులకు మన నరేంద్రమోడీ భయపడి నిలిపివేసిన అంశం తెలిసినదే.

లివర్‌పూల్‌లో జరిగిన జి7దేశాల సమావేశం చేసిన ప్రకటనల్లో ప్రస్తావించిన షిన్‌జాంగ్‌, హాంకాంగ్‌, టిబెట్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలన్నీ చైనా అంతర్గత విషయాల్లో వేలు పెట్టటమే. మానవహక్కులలో ఆరోగ్యం కూడా ఒకటి. ప్రపంచ జనాభాలో అమెరికా, బ్రిటన్‌ జనాభా కేవలం ఐదుశాతం, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలున్నాయి, అయినా ప్రపంచ కరోనా కేసుల్లో 23శాతం, మరణాల్లో 18శాతం అక్కడే అంటూ జీవించే హక్కును కాపాడాలని చైనా డిమాండ్‌ చేసింది. ఆపని చేయకుండా మిగతా దేశాల్లో మానవహక్కులు, ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతున్నాయని పేర్కొన్నది. ప్రపంచవ్యాపితంగా రెండులక్షలకు పైగా సైన్యాలను, అణ్వాయుధాలతో సహా ఆధునిక క్షిపణులను మోహరించి నిత్యం ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. ఎవరు ఏ ఆయుధాలు కొనాలో, కొనకూడదో నిర్దేశిస్తోంది. రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన మన దేశంపై ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు దిగిన అంశం కూడా తెలిసిందే.

చైనాను గుర్తించకుండా తైవానే అసలైనా చైనాగా చిత్రించి 1948 నుంచి 1971వరకు ఐక్యరాజ్య సమితిలో, 2001వరకు ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రవేశించకుండా అడ్డుకొన్నది అమెరికా. ప్రస్తుతం అది కానసాగిస్తున్న వాణిజ్య యుద్ధం ఆర్థిక బలాత్కారం కాదా? తనకంట్లో దూలాలు పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలుసులను వెతుకుతోంది. మానవహక్కుల పరిరక్షణ అన్నది తన డీఎన్‌ఏలోనే ఉన్నదని అమెరికా చెప్పుకుంటోంది. ఆచరణలో మానవహక్కుల హరణమే దాని డీఎన్‌ఏ అని రుజువు చేస్తోంది. వందల ఏండ్ల క్రితం ఆఫ్రికా నుంచి జనాలను బానిసలుగా పట్టుకువచ్చింది అమెరికన్లు, వారిని కాపలా కాసేందుకు ఏర్పాటు చేసుకున్నదే అమెరికా పోలీసు వ్యవస్థ, దాని అవశేషాలే ఇప్పటికీ ఆఫ్రో-అమెరికన్లను హతమారుస్తున్న దురంతాలు. అమెరికా పొలాలు, కార్ఖానాల్లో పని చేసిన ఆఫ్రికన్‌ బానిసలకు పరిహారం చెల్లించాల్సి వస్తే ఆమొత్తం ఇప్పుడు 97లక్షల కోట్ల డాలర్లని జాక్‌ కోపే అనే ఆర్థికవేత్త అంచనా.

రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబులు వేసి 66వేల మందిని హిరోషిమాలో, 39వేల మందిని నాగసాకిలో పొట్టన పెట్టుకుంది. తరువాత కూడా దాని పర్యవసానాలకు ఎందరో బలయ్యారు. ఇలాంటి అమెరికా ప్రజాస్వామ్యం, మానవహక్కుల గానాలాపన చేస్తుంటే దానికి కెనడా, బ్రిటన్‌, జపాన్‌ వంతపాడటం సహజమే. ఎందుకంటే ఈ దేశాలు కూడా మానవహక్కుల హరణంలో తక్కువ తినలేదు. ఇక ఐరోపా సామ్రాజ్యవాద వారసులే కనుక ఆస్ట్రేలియా వారి వెనుక నడవటంలో ఆశ్చర్యం లేదు. ఇరాక్‌లో మారణాయుధాలను వెతికే పేరుతో దాడిచేసి పదిలక్షల మందిని, ఉగ్రవాదం మీద పోరు పేరుతో ఆప్ఘనిస్తాన్‌లో రెండున్నర లక్షలు, ఎమెన్‌లో నాలుగు లక్షలు, సిరియా, సోమాలియా, లిబియాల్లో మరికొన్ని లక్షల మందిని హతమార్చిన అమెరికా అండ్‌కో హంతక ముఠా చైనాలో షిన్‌జాంగ్‌లోని ముస్లింల గురించి మొసలి కన్నీరు కారుస్తోంది. మన కాశ్మీరులో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టింది అమెరికా, దానికి సాధనంగా పని చేసింది పాకిస్థాన్‌. అదే మాదిరి చైనాలో చిచ్చుపెట్టేందుకు షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో రెచ్చగొట్టింది. అక్కడి ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాల ద్వారా ఆయుధాలు, డబ్బు అందచేసింది అమెరికా. మెక్సికో, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాల నుంచి అక్రమంగా వలసలను ప్రోత్సహించి వారిని ఎక్కడా అధికారికంగా నమోదు చేయకుండా సామాజిక రక్షణ కల్పించకుండా తక్కువ వేతనాలకు పని చేయించుకుంటున్న అమెరికా మానవత నిజస్వరూపం తెలియందెవరికి? లాటిన్‌ అమెరికాలో నిత్యం ఏదో ఒక దేశంలో మానవహక్కులను హరించే శక్తులకు మద్దతు ఇస్తున్న అమెరికా ప్రజాస్వామ్య బండారం తెలిసిందే. ప్రపంచమంతటా అమెరికాకు చిన్నవీ, పెద్దవీ 800 వందల సైనిక కేంద్రాలు ఉన్నాయి. చైనాకు ఉన్నది ఒక్కటి, అదీ నాలుగు వందల అమెరికా కేంద్రాల మధ్య ఉంది.

క్రీడలపై బహిష్కరణ అస్త్రం పెద్దగా పనిచేయకపోయినా దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కొందరు చెబుతున్నారు. చైనా సహకారం, ప్రమేయం లేకుండా నేడు అంతర్జాతీయ రాజకీయాలు ముందుకు పోవు. గతంలో 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికాతో సహా 66దేశాలు బహిష్కరించాయి. తైవాన్‌కు గుర్తింపు ఇచ్చిన కారణంగా 1956 నుంచి 1980వరకు చైనా అసలు మొత్తంగా ఒలింపిక్స్‌ను బహిష్కరించింది. తరువాత 1984 లాస్‌ ఏంజల్స్‌ క్రీడలలో సోవియట్‌, పదమూడు తూర్పు ఐరోపా దేశాలు పాల్గొనలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని 1980లో అమెరిరా సాకుగా చూపింది. కానీ అదే అమెరికా, దాని మిత్రదేశాలు తరువాత వివిధ దేశాల్లో మారణకాండ సాగించినా ఎవరూ క్రీడలకూ-వాటికి పోటీ పెట్టలేదు. బీజింగ్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ సభకు అందిన ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చెప్పారు. క్రీడలను రాజకీయం చేయకూడదని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ అన్నాడు.


అమెరికా దౌత్యపరమైన బహిష్కరణకే పరిమితం కావటం వెనుక అక్కడి మీడియా సంస్థల వాణిజ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. క్రీడలను చూపేందుకు ఎన్‌బిసి సంస్థ ఒలింపిక్స్‌ కమిటీకి బిలియన్ల డాలర్లు చెల్లించింది. పోటీల్లో అమెరికన్‌ క్రీడాకారులు లేకపోతే దానికి పెద్ద నష్టం వాటిల్లుతుంది. మిగతా దేశాలకూ అదే సమస్యలున్నాయి. 2014లో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన కారణంగా రష్యాలోని సోచిలో జరిగిన శీతాకాల క్రీడలను నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఉపాధ్యక్షుడు జోబైడెన్‌, ప్రధమ మహిళ మిషెల్లీ ఒబామా మాత్రమే వాటిని బహిష్కరించారు. ప్రస్తుత అమెరికా కూటమి చర్యకు ప్రతీకారంగా 2028 లాస్‌ ఏంజల్స్‌, 2032 బ్రిస్‌బేన్‌ (ఆస్ట్రేలియా) ఒలింపిక్స్‌ను చైనా బహిష్కరించ వచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా లేకపోలేదు. చైనా వైపు నుంచి అలాంటి సూచనలైతే లేవు.