Tags
‘Make In India’progamme, BJP, Make In India, Modi 7 years rule, Narendra Modi, Narendra Modi Failures
ఎం కోటేశ్వరరావు
మేకిన్ ఇండియా పధకాన్ని ప్రకటించి ఏడు సంవత్సరాలు గడచింది. ఈ కాలంలో అంటే 2014 సెప్టెంబరు 25 నుంచి 2021 డిసెంబరు ఒకటవ తేదీ వరకు 8,42,710 కొత్త కంపెనీలు నమోదైనట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఇటీవల రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో చెప్పారు. పెట్టుబడులు, తయారీ, రూపకల్పన, నవకల్పన వంటి వాటికి నిలయంగా, ప్రపంచ ఎగుమతి ఎగుమతి కేంద్రంగా మారి చైనాను పక్కకు నెట్టాలన్నది ప్రకటిత లక్ష్యం. పోటీ పడాల్సిందే, ఉపాధి కల్పించాల్సిందే, అంతకంటే కావాల్సింది ఏముంది.పైన పేర్కొన్న కంపెనీలలో పని చేస్తున్నవి 7,82,026 అని కూడా మంత్రి వెల్లడించారు. సులభతర వాణిజ్యానికి అనువైనదిగా గుర్తించటమే అత్యంత ప్రధాన కారణం అని కూడా చెప్పారు.
చిత్రం ఏమిటంటే బిజెపి లేదా నరేంద్రమోడీ విజయ గాధల్లో ఈ కార్యక్రమం లేదా చొరవ లేదు. కొండంత రాగంతో ప్రారంభించి కీచుగొంతుతో ముగిస్తున్నారు. గుజరాత్ ఆదర్శ నమూనాను దేశమంతటా అమలు జరుపుతానన్నది నరేంద్రమోడీ 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. తరువాత మోడీ నోట ఆ మాటను ఎవరైనా విన్నారా ? ప్రపంచమంతటికీ నేను ఒక వినతి చేయదలచాను. రండి భారత్‌లో తయారు చేయండి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా అమ్ముకోండి గానీ తయారీ మాత్రం మాదగ్గరే జరగాలి అని నరేంద్రమోడీ చెప్పారు. తరువాత జరిగిందేమిటో చూశాము. ఇంతచేసినా 2019లో దేశ జిడిపిలో వస్తుతయారీ రంగ వాటా 20 ఏండ్ల నాటికంటే తక్కువగా నమోదైంది.తరువాత స్వయం సమృద్ధి గురించి చెప్పటం ప్రారంభించారు, కరోనా వచ్చిన తరువాత ఆత్మనిర్భరత గానాలాపాన తెలిసిందే. సంస్కరణల పేరుతో మూడు దశాబ్దాల క్రితం తీసుకున్న చర్యల్లో భాగంగా లైసన్సులు ఎత్తివేశారు,కార్పొరేట్ పన్ను భారీగా తగ్గించారు. అనేక దిగుమతి పన్నులు తగ్గించారు. కార్పొరేట్లకు అనేక సబ్సిడీలు, రాయితీలు ఇచ్చారు. ప్రణాళికా సంఘం అవసరం లేదంటూ దాన్ని ఎత్తివేశారు. ఉత్పత్తి, ఎగుమతులకు లంకెపెట్టి మరికొన్ని సబ్సిడీలను ప్రకటించారు. వాటికీ సడలింపులు ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఎవరూ వ్యతిరేకించలేదు. కనుకనే వేగంగా అమలు జరిపేందుకు పూనుకున్నారు. సంస్కరణల పేరుతో మొదటికే మోసం తెస్తున్నారని జనానికి మూడు దశాబ్దాల తరువాత అర్ధం కావటం ప్రారంభమైంది. కరోనా కాలంలో జనానికి ఖర్చు పెట్టేందుకు చేతులు రాలేదుగానీ కార్పొరేట్లకు దాదాపు రెండు లక్షల కోట్ల మేరకు కట్టపెట్టారు. మేడిన్ ఇండియాలు కార్యక్రమం జయప్రదం కావాలంటే సులభతర వాణిజ్య సూచికను మెరుగుపరిచేందుకు కేంద్రీకరించారు. ఐదు సంవత్సరాల్లో 79 పాయింట్లను మెరుగుపడినట్లు ప్రకటించారు.వీటితో ప్రపంచబాంకును సంతృప్తి పరచారు తప్ప పెట్టుబడిపెట్టేవారికి విశ్వాసం కల్పించలేకపోయారు.
మరోవైపు జరిగిందేమిటి ? 2021 మార్చి 31 నాటికి దేశంలో నమోదైన కంపెనీలు 21,51,349, వీటికి గాను మూతపడినవి 7,58,350, ఇవిగాక నిద్రావస్ధలో 2,266, రద్దు ప్రక్రియలో 6,893, దానికి ముందు దశలో 38,983 ఉన్నాయి. సాంకేతికంగా ఏ పేరు పెట్టినా ఇవన్నీ మూతపడేవే గనుక మొత్తంగా లెక్కిస్తే 8,06,809 ఉంటాయి. పార్లమెంటులో ప్రకటించిన మేరకు ఏడున్నర సంవత్సరాల్లో కొత్తగా వచ్చినవి 8,42,710, ఏతావాతా వచ్చినవాటికి సమానంగా మూతపడినవీ ఉన్నాయి. ఇవన్నీ మోడీ ఏలుబడిలోనే మూతపడలేదు, సంస్కరణల మాదిరే మూతల వేగం పెరిగింది.
తొలిసారి గద్దె నెక్కినపుడు దేశం కంటే విదేశాల్లోనే ఎక్కువ కాలం గడిపారు నరేంద్రమోడీ. ఎందుకంటే విదేశీ పెట్టుబడుల సాధన, పోయిన ప్రతిష్టను పునరుద్దరించేందుకు అని చెప్పారు. నిజమే కామోసు అనుకున్నారు జనం. ఆ ఊసుల మేరకు విదేశీ కంపెనీలేమైనా ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయా ? ప్రస్తుతం నమోదైనవి 4,979 వాటిలో పని చేస్తున్నవి 3,334. సులభతర వాణిజ్య సూచికలు మెరుగుపడిన తరువాత 2018 -2021 మధ్య దేశంలో కొత్తగా నమోదైన విదేశీ కంపెనీలు 320 అని 2021జూలైలో కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ పార్లమెంటులో చెప్పారు. 2014 నుంచి 2021నవంబరు వరకు 2,783 విదేశీ కంపెనీలు మన దేశం నుంచి వెళ్లిపోయినట్లు వాణిజ, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ పార్లమెంటులో చెప్పారు. మన దేశంలో పర్యవేక్షక లేదా బ్రాంచిఆఫీసులు లేదా ప్రాజెక్టు ఆఫీసులు కలిగిన విదేశీ కంపెనీల సంఖ్య 10,756. కొన్ని కంపెనీల ప్రాజక్టులు ముగిసిన తరువాత వెళ్లినవి, కొన్ని విలీనాలతో మూతపడినవి రకరకాల కారణాలు వెళ్లిపోయిన వాటి వెనుక ఉన్నాయి. ఆఫీసులు కలిగిన కంపెనీలన్నీ ఉత్పాదక లేక సేవలు అందిస్తున్నవి కాదు.
2013 డిసెంబరు 31నాటికి దేశంలో నమోదైన 13,69,362 కంపెనీల్లో 19శాతం 2,67,639 మూతపడినట్లు నాటి కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్ లోక్‌సభలో చెప్పారు. పైన పేర్కొన్న వివరాల ప్రకారం 2021మార్చి 31 నాటికి అది 37.6శాతానికి పెరిగాయి. కొన్ని కంపెనీలు ప్రభుత్వం వద్ద నమోదైనప్పటికీ పన్నుల ఎగవేత, లాభాల తరలింపు వంటి అక్రమాలకు మాత్రమే పరిమితమైనవి ఉన్న అంశం అందరికీ తెలిసిందే. వాటిని షెల్ లేదా సూట్‌కేస్ కంపెనీలని పిలుస్తున్నాము. నిజానికి చట్టంలో కంపెనీ అంటే కంపెనీ తప్ప సూట్‌కేస్ అని ఉండదు. పాలకులు తమ హయాంలో సాధించిన గొప్పల గురించి చెప్పుకోవాల్సి వచ్చినపుడు వీటిని కూడా కలుపుకొనే చెబుతారు. అనేక అక్రమాలు బయట పడిన తరువాత అలాంటి వాటిని గుర్తించి కంపెనీల జాబితా నుంచి తొలగిస్తామని మోడీ సర్కార్ హడావుడి చేసింది. ఆ మేరకు 2018-21కాలంలో 2,38,223 సంస్ధలను గుర్తించినట్లు పార్లమెంటుకు తెలిపారు. వాటన్నింటినీ రద్దు చేశారా లేదా అన్నది స్పష్టత లేదు. ఇంకా అనేక కంపెనీలు ఉన్నాయి.యునిటెక్ గ్రూపు కంపెనీ 52 సూట్‌కేస్ కంపెనీలను సృష్టించినట్లు తాజాగా ఇడి వెల్లడించింది. వాటిలో డైరెక్టర్లుగా ఉన్న వారికి నెలకు పది, ఇరవై వేలు చెల్లిస్తూ అవసరమైనపుడు సంతకాల కోసమే పిలిపిస్తుంటారని కూడా తెలిపింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 తరువాత ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి వందల కోట్ల నిధులను సూట్‌కేసు కంపెనీల పేరుతో దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. హైదరాబాదు కేంద్రంగా పని చేస్తున్న కార్వి కంపెనీ సూట్‌కేస్ కంపెనీలను ఏర్పాటు చేసి పాల్పడిన అక్రమాలపై విచారణ, అరెస్టుల గురించి తెలిసినదే. ఇంకా ఇలాంటివి ఎన్నోఉన్నాయి. తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేసేందుకు వాటిని దారి మళ్లించి, విదేశాలకు తరలించి కంపెనీలను దివాలా తీయించి మూతవేసేవి కూడా ఉన్నాయి. పాతవాటిని మూసివేసి కొత్త పరిశ్రమల పేరుతో రాయితీలు పొందేందుకు కొత్త కంపెనీల సృష్టి, ఒకేచోట జరిపే ఉత్పత్తిని వేర్వేరు కంపెనీల పేరుతో లెక్కలు చూపే సంగతి తెలిసిందే. తప్పుడు మార్గాల్లో విదేశాలకు నిధులు తరలించి మారిషస్ మరొక దేశం పేరుతో తిరిగి వాటినే పెట్టుబడులుగా పెడుతూ లబ్దిపొందేవారు కూడా ఉన్నారు.
ఏడున్నర సంవత్సరాల పాలనలో ఎగుమతులేమన్నా పెరిగాయా ? ప్రపంచబాంకు సమాచారం మేరకు 2013లో గరిష్టంగా మన జిడిపిలో వస్తు, సేవల ఎగుమతులు 25.43శాతం ఉండగా 2020నాటికి 18.07శాతానికి తగ్గాయి. 2013-14 కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం మన జిడిపిలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల వాటా వర్తమాన ధరల్లో 18.2 -24.77-57.03 శాతాల చొప్పున ఉంది. అదే కరోనాకు ముందు 2019-20లో 20.19-25.92-53.89శాతాల చొప్పున ఉంది. ఈ అంకెలు వెల్లడిస్తున్నదేమిటి ? విదేశీ పెట్టుబడులు, మేకిన్, మేడిన్ ఇండియా పేరుతో ఆర్భాటం తప్ప పెను మార్పులేదన్నది స్పష్టం. ఎగుమతి రంగంలో చూస్తే 2014లో 468-2018లో 538, 2020లో 474 బిలియన్ డాలర్ల మధ్య ఉన్నాయి.ఈ ఏడాది 400 బి.డాలర్లు అంటున్నారు.నరేంద్రమోడీ గారు చెప్పిన అచ్చేదిన్ కనుచూపుమేరలో కనిపించటం లేదు. అభివృద్ధి రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి దిగజారిన తరువాత కరోనా వచ్చింది. తిరిగి ఎంత మేరకు వృద్ధి ఉంటుందో చెప్పలేము. ఏడేండ్లలో జరిగిందేమిటి ?
2013 డిసెంబరు 31నాటికి దేశంలో మూతపడిన కంపెనీలు 2,67,639 కాగా 2021 మార్చి 31నాటికి మూతపడినవి 7,81,987. అంటే ఏడు సంవత్సరాల మూడునెలల్లో కొత్తగా మూతపడినవి 5,14,348. సులభంగా అర్ధం కావాలంటే రోజుకు రెండువందల కంపెనీలు మూతపడ్డాయి. మేక్ ఇండియా ప్రకటన తేదీ నుంచి 2021డిసెంబరు ఒకటి వరకు అంటే ఏడు సంవత్సరాల రెండు నెలల ఆరు రోజుల్లో నమోదైన కొత్త కంపెనీలు 8,42,710. అంటే రోజుకు 321 కొత్త కంపెనీలు నమోదు, మూతపడిన వాటిని తీసుకుంటే నిఖరంగా పెరిగినవి రోజుకు 121. మూతపడుతున్నవాటి కంటే కొత్త కంపెనీలే ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పవచ్చు. ప్రపంచంలో దేశంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. చైనా వంటి వర్ధమాన దేశాల్లో వస్తూత్పత్తి రంగం ప్రధాన ఉపాధి కల్పన వనరుగా ఉంది. అందుకే మన పాలకులు చైనా స్ధానాన్ని ఆక్రమించి వస్తూత్పత్తి చేస్తామని చెప్పారు. ఆశయం మంచిదేగానీ ఆచరణేలేదు. సేవారంగం మీద ఆధారపడ్డారు. వస్తూత్పత్తి రంగంలో ఆటోమేషన్, రోబోలు ఎలా వచ్చాయో, సేవారంగాన్ని కూడా ఆటోమేషన్ ఆవరిస్తున్నది. బాంకులకు వెళ్లి డబ్బు తీసుకోనవసరం లేకుండా ఎటిఎం మెషీన్లే మనకు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్, కంప్యూటర్ల ద్వారా నిధుల బదిలీ, ఇతర లావాదేవీలు జరుపుకోవచ్చు, సేవలకు చెల్లింపులు జరపవచ్చు. ఇవన్నీ ఉపాధిని హరించేవే. అందువలన మన అవసరాలకు అనుగుణంగా వృద్ధి లేదు. జనానికి ఆదాయం లేనపుడు వస్తు, సేవల వినియోగం తగ్గుతుంది. పంటలకు తగిన గిట్టుబాటు ధరలను సమకూర్చలేని పాలకులు నాటు, కోత, ఇతర యంత్రాలను ప్రోత్సహిస్తున్నారు, ఫలితంగా గ్రామాల్లో ఉపాధి తగ్గుతోంది. చేతి వృత్తుల్లో కూడా యాంత్రీకరణ పెరిగిపోతోంది. అసలు మొత్తంగానే వృద్ది రేటు తగ్గింది. ఉన్నమేరకు చూసినా అది ఉపాధి రహిత వృద్ధి. మోడీ సర్కార్ డిజిటైజేషన్ గురించి తాజాగా కబుర్లు చెబుతోంది. అది పెరిగే కొద్దీ ఉపాధి అవకాశాలు తరుగుతాయి.