Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మధ్యలో 278 రోజులు మినహా పదిహేను సంవత్సరాలకు పైగా వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న జనతాదళ్‌(యు)-జెడియు నేత నితీష్‌ కుమార్‌ పదిహేనేండ్ల నాటి బీహార్‌ ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరోసారి ముందుకు తెచ్చారు. అలాంటి హోదాను వర్తింప చేసే అధికారం నీతి అయోగ్‌కు లేనప్పటికీ ఆ డిమాండ్‌ను పరిశీలిస్తాం అన్నట్లుగా ఆ సంస్ధ అధికారి చెప్పటం, మీడియా ప్రముఖంగా ప్రచారంలోకి తేవటంతో సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోణాల్లో (ఒక చోట నిజంగానే ఇస్తే -మరో చోట వత్తిడి చేస్తే ఇస్తారేమో అన్నట్లుగా) ఆసక్తి రేపింది.బీహార్‌ ప్రత్యేక హోదా డిమాండ్‌ను తాము మరింత లోతుగా, దగ్గరగా పరిశీలిస్తామని నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. మూడు సాగు రైతు చట్టాలను వెనక్కు తీసుకొనేది లేదంటూ ఏడాదికి పైగా భీష్మించుకు కూర్చున్న నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పి మరీ వాటిని వెనక్కు తీసుకున్న తీరు చూసిన తరువాత కాస్త వత్తిడి చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు దాన్ని వర్తింపచేసే చర్యలు తీసుకోవచ్చేమో అని ఆశపడిన వారు కూడా లేకపోలేదు. మా మోడీ కారణంగా అటు సూర్యుడు ఇటు పొడిస్తే పొడవవచ్చు గాక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మాత్రం ఇచ్చేది కల్ల అన్నట్లుగా బిజెపి వ్యవహరించిన తీరు, పార్లమెంటులో కూడా ప్రకటించటాన్ని చూసిన తరువాత కూడా నితీష్‌ కుమార్‌ ఎందుకు ముందుకు తెచ్చారు అన్నది ఆసక్తి కలిగించే అంశం. నీతిఅయోగ్‌ తాజాగా ప్రకటించిన నివేదిక ప్రకారం దరిద్రంలో బీహార్‌ అగ్రస్ధానంలో ఉంది.


2020 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బిజెపిని బీహార్‌లో ఇరకాటంలో పెట్టాయి. రెండువందల నలభై మూడు స్దానాలున్న సభలో ఎన్‌డిఏ కూటమిలో 74 స్ధానాలతో బిజెపి పెద్ద పార్టీగా జెడియు 43 స్దానాలతో సరిపెట్టుకుంది. మరో రెండు పార్టీలతో కలుపుకొని కూటమికి వచ్చిన వచ్చిన మొత్తం సీట్లు 125కావటం, సంపూర్ణ మెజారిటీకి కేవలం మూడు సీట్లే ఎక్కువ. దాంతో బిజెపి అనివార్యంగా నితీష్‌ కుమార్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా అంగీకరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి అది పెద్దన్నగా మారింది. తాము చెప్పినట్లు వినాలని మాటి మాటికీ గుర్తు చేస్తోంది. రాష్ట్ర పేదరికం, వెనుకబాటుతనంతో ఉందనే పేరుతో ప్రత్యేక హోదా డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చినట్లు పైకి చెప్పుకోవచ్చుగానీ అది అతికే వాదన కాదు. బీహార్‌కు ఆ స్ధితి ఇవాళ కొత్తగా వచ్చిందేమీ కాదు. ప్రత్యేక హోదా డిమాండ్‌ అసంబద్దం అని బిజెపికి చెందిన ఉప ముఖ్యమంత్రి రేణు దేవి అన్నారు. హోదాను ఎవరైనా వ్యతిరేకిస్తే వారికి సమస్య అర్ధంగాక పోయి ఉండాలి అని నితీష్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా అర్హతల గురించి ఒకసారి చూద్దాం.జమ్ము-కాశ్మీర్‌, హిమచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కింతో సహా ఎనిమిది ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించి నిధుల కేటాయింపు, రాయితీలు వర్తింప చేస్తున్నారు. పద్నాలుగవ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు నిధుల వాటాను 32 నుంచి 42శాతానికి పెంచినందున ఏ రాష్ట్రానికి అలాంటి హోదాను కల్పించాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతున్నది. నిబంధనలతో నిమిత్తం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించినప్పటికీ 14వ ఆర్ధిక సంఘాన్ని సాకుగా చూపి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తిరస్కరించిన అంశం తెలిసిందే. కొండ ప్రాంతాలు, జనాభా సాంద్రత తక్కువగా ఉండటం, వచ్చే ఆదాయం రాష్ట్రాలకు చాలని స్ధితి, విదేశీ సరిహద్దుల్లో ఉన్న పరిస్ధితి,ఆర్ధిక వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.విదేశీ సరిహద్దుల్లో ఉన్న స్ధితి అంటే వ్యూహాత్మకంగా కీలకంగా ఉందా లేదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కేవలం విదేశీ సరిహద్దును మాత్రమే తీసుకుంటే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌కు నేపాల్‌తో సరిహద్దు ఉన్నప్పటికీ గతంలో హోదాను వర్తింప చేయలేదు. అలాంటి జాబితాలో ఉన్న రాష్ట్రాలకు కలిగే లబ్దిని చూద్దాం. విదేశీ సాయంతో, కేంద్ర ప్రత్యేక సాయం, సాగునీటి సంబంధిత ఏఐబిపి ప్రాజెక్టులకు 90శాతం, కేంద్ర ప్రత్యేక పధకాలకు నూరుశాతం నిధులు కేటాయిస్తారు.ఆ పదిశాతం నిధులు కూడా వడ్డీ లేని అప్పుల రూపంలో కేంద్రం ఇవ్వవచ్చు.ఇవిగాక కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఉంటాయి.అయితే నిధుల బదలాయింపు 42శాతానికి పెరిగిన తరువాత అన్ని రాష్ట్రాలకు అనేక కేంద్ర సహాయ పధకాలను రద్దు చేశారు.విదేశీ పధకాలను కూడా పరిమితం చేశారు. ఏఐబిపి పధకాలకు 2014-15లో రు.8,992 కోట్లు ఉన్న బడ్జెట్‌ను మరుసటి ఏడాది కేవలం వెయ్యికోట్లకు పరిమితం చేశారు. అసలు మొత్తంగానే అనేక పధకాలను రాష్ట్రాలకు బదలాయించటం, కేంద్రవాటా తగ్గించటం వంటి పనులతో ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో తీసుకున్నట్లయింది. ఇన్ని చేసినా పరిశ్రమలకు రాయితీల వంటివి ఉన్నందున ప్రత్యేక హోదా ఇంకా ఆకర్షణీయంగానే ఉంది. కొత్తగా ఇవ్వకపోయినా పాతవాటిని కొనసాగిస్తున్నారు.రాజ్యాంగపరంగా అలాంటి హౌదా కలిగిన రాష్ట్రాలు లేకున్నా గతంలో జాతీయ అభివృద్ధి మండలికి మంజూరు అధికారం ఉండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలచుకుంటే ఇప్పటికైనా వర్తింప చేయవచ్చు.


నితీష్‌ కుమార్‌ ఎందుకు ఈ డిమాండ్‌ను ఇప్పుడు ముందుకు తెచ్చారనే ప్రశ్నపై భిన్న కోణాలలో చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల లబ్దికోసమే రైతుల డిమాండ్‌కు నరేంద్రమోడీ తలొగ్గి సాగు చట్టాలను రద్దు చేశారు. వచ్చే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను బీహార్‌లో బిజెపి ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు కనుక ప్రత్యేక హౌదా కోరితే కనీసం కొంత మేరకు నిధులైనా రాకపోతాయా అన్న ఆలోచన కావచ్చు. ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీకి కొన్ని సీట్లలో మద్దతు కోసం వత్తిడి కావచ్చు.ఇన్నేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అధ్వాన్నంగా ఎందుకుంచారో సంజాయిషి ఇవ్వాల్సిన పెద్దమనిషి (బిజెపికి సైతం వాటా ఉంది) ఆ ప్రశ్నను పక్కదారి పట్టించేందుకా లేక బిజెపితో సంబంధాలను తెంపుకోవాల్సి వస్తే ఏదో ఒక అంశం కావాలి గనుక ఆ జాబితాలో దీన్ని కూడా చేర్చారా అన్నది చెప్పలేము.గతేడాది అధికారానికి వచ్చినప్పటి నుంచి కలసి కాపురమే గానీ ఎవరి గది వారిదే అన్నట్లుగా బిజెపి-జెడియు మధ్య సంబంధాలున్నాయి.


అనేక అంశాలపై రెండు పార్టీల మధ్య విబేధాలు బహిరంగంగానే వెల్లడయ్యాయి. వెనుకబడిన తరగతుల కుల గణన చేపట్టాలంటూ రెండు సార్లు చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని బిజెపి కూడా బలపరిచనప్పటికీ కేంద్రంలోని బిజెపి తిరస్కరించింది. అవసరమైతే తమ ఖర్చుతో రాష్ట్రంలో కులగణన చేస్తామని నితీష్‌ కుమార్‌ ప్రకటించారు. 2011లో నాటి కేంద్ర ప్రభుత్వం చేసిన కులగణన వివరాలను రాజకీయ కారణాలతో బయట పెట్టలేదు. బీహార్‌కు ప్రత్యేక హోదా అర్ధం లేదు, అవసరంలేదు అన్న బిజెపి ఉపముఖ్యమంత్రి రేణు దేవీకి ఏమీ తెల్వదు, ఆమెకు తరువాత నేను చెబుతా అని నితీష్‌ మాట్లాడారు. ప్రతి సంకీర్ణ కూటమిలో చిన్న చిన్న విభేదాలుంటాయి, అవి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయవని ఒక బిజెపి మంత్రి అన్నారు. 2009లో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ చేసిన డిమాండ్‌ను మౌఖికంగా సమర్దించిన బిజెపి నేడు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నది.నాడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, నేడున్నది తమ నరేంద్రమోడీ, అప్పుడు సంకీర్ణ కూటమిలో బిజెపి తోకపక్షం ఇప్పుడు జెడియు ఆ స్ధానంలో ఉంది కనుక ఈ వైఖరి అన్నది స్పష్టం.


హర్యానాలో మాదిరి బహిరంగ స్ధలాల్లో నమాజును నిషేధించాలని బిజెపి మంత్రులు, ఎంఎల్‌ఏలు నితీషకుమార్‌ను డిమాండ్‌ చేశారు. అలాంటి పని చేస్తే బిజెపికి కొత్తగా పోయేదేమీ లేదు, తమ మీద ఆ ప్రభావం పడుతుందని జెడియు నేతలు మండిపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేసిన వారిలో ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. బిజెపి నేతలు తాము అసలు సిసలు దేశభక్తులమని జనం ముందు కనిపించేందుకు తాపత్రయపడుతున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే బిజెపికి చెందిన బీహార్‌ అసెంబ్లీ స్పీకర్‌ జెడియుతో సంప్రదించకుండానే ఇటీవలి శీతాకాల సమావేశాల్లో జాతీయ గీతం ఆలపించాలని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధిశాఖకు జెడియు మంత్రి ఉన్నారు. ఆ శాఖలో ఒక ఇంజనీరు అవినీతి గురించి విచారణ జరపాలంటూ స్పీకర్‌ ఒక సభాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక కొత్త సంప్రదాయం కాగా ఆ కమిటీకి నితీష్‌ కుమార్‌ మీద ఒంటికాలుతో లేచే బిజెపి ఎంఎల్‌ఏ, మాజీ మంత్రి నితీష్‌ మిశ్రాను నేతగా చేశారు.పార్లమెంట్‌లో బిజెపి బీహార్‌ ఎంపీ ఒకరు తమ రాష్ట్రంలో ప్రధాన మంత్రి గ్రామ రోడ్ల నిర్మాణ పధకం సక్రమంగా జరగటం లేదంటూ విమర్శకు దిగితే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ నిజమే అంటూ లెక్కలను ప్రకటించారు. బీహార్‌లోనూ కేంద్రంలోనూ ఉన్నది ఎన్‌డిఏ ప్రభుత్వమే అని బిజెపి నేతలకు గుర్తున్నట్లు లేదంటూ జెడియు నేతలు ఎద్దేవా చేశారు. మగధ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ మీద నిధుల దుర్వినియోగ విచారణ నేపధ్యంలో విసిని తొలగించాలన్న ముఖ్యమంత్రి నితీష్‌ వినతిని గవర్నర్‌ ఫగు చౌహాన్‌ ఖాతరు చేయకపోవటంతో నితీష్‌ పరువు పోయింది.


నితీష్‌ కుమార్‌కు గతంలో ఉన్న పేరు ప్రతిష్టలు ఇప్పుడు లేవని గతేడాది ఎన్నికల్లో తేలిపోయింది. అందువలన నితీష్‌ను బలపరచటం తమకు లాభం కంటే నష్టమే ఎక్కువని బిజెపి నేతలు లెక్కలు వేసుకున్న కారణంగానే మంత్రులు, నేతలు తరచూ బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. కేంద్ర నాయకత్వం అదేమీ తెలియనట్లు అమాయకత్వం నటిస్తోంది. రెండు పార్టీల నేతలూ అబ్బే మాలో విబేధాలేమీ లేవంటూ సమాధానాలిస్తున్నారు. తాజా అంశానికి వస్తే రాష్ట్రానికి కేంద్రం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులిస్తోందని బిజెపి మంత్రి జివేష్‌ మిశ్రా అంటే నిబంధనల ప్రకారమే ఇస్తోందని ఎక్కువ ఎలా ఇచ్చారో చూపాలని జెడియు మంత్రి బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ సవాలు విసిరారు.


ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు పిల్లల విధానాన్ని ముందుకు తెచ్చిన బిజెపి సర్కార్‌ తీరును, లౌ జీహాద్‌ ప్రచారాన్ని జెడియు విమర్శించింది. 2020 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తేడా తెలియని స్ధితి ఏర్పడిందని ఎన్నికలు ముగిసిన తరువాత 2021జనవరి పార్టీ సమావేశంలో నితీష్‌ కుమార్‌ పరోక్షంగా బిజెపిని తప్పుపట్టారు. మొత్తం ప్రచారంలో బిజెపి-ఎల్‌జెపి భాయి భాయి అని కేంద్రీకరించారని, తమ మీద పోటీ చేసిన చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్‌జిపి కంటే బిజెపి వల్లనే ఎక్కువ సీట్లను కోల్పోయినట్లు జెడియు నేతలు వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపికి చెందిన 15 మంది ఎల్‌జెపి తరఫున పోటీకి దిగిన అంశం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం జలజీవన్‌ పధకం కింద బీహార్‌లో కోటీ 46లక్షల గ్రామీణ మంచినీటి సరఫరా కనెక్షన్లను అందచేసినట్లు బిజెపి చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పించినవి 87శాతం ఉన్నందున ఆ ఖ్యాతి నితీష్‌ కుమార్‌కు దక్కాలని జెడియు తిప్పికొట్టింది.


బిజెపి తన సైద్దాంతిక అంశాలలో భాగంగా అది రామాలయ నిర్మాణం లేదా ఆర్టికల్‌ 370 రద్దు వంటివి చేపట్టి తన మద్దతుదార్లను కాపాడుకుంటోందని, తమది ప్రత్యేక పార్టీ తప్ప బిజెపి అనుబంధ సంస్ద కాదని జెడియు ప్రతి సందర్భంలోనూ స్పష్టం చేస్తోంది.
సంకీర్ణ కూటమిలో నాలుగేసి స్ధానాలున్న హిందుస్తానీ అవామీ పార్టీ(హామ్‌), వికాస్‌షీల్‌ ఇన్సాన్‌ పార్టీ (విఐపి)కూడా బిజెపి మీద విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఒక ప్రయివేటు మదర్సాలో జరిగిన పేలుడును అవకాశంగా తీసుకొని మదర్సాలు ఉగ్రవాదుల తయారీ కేంద్రాలుగా మారాయంటూ, అన్ని మదర్సాలను మూసివేయాలని బిజెపి నేతలు చేసిన ప్రకటనలను హామ్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి జితిన్‌ రామ్‌ మాంఝీ ఖండించారు. దళితులు విద్యావంతులైతే నక్సలైట్లు, ముస్లింలు చదువుకుంటే ఉగ్రవాదులని చిత్రిస్తున్నారని అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతుల వారి మద్దతు పొందే ఎత్తుగడలో భాగం, ముస్లింలపై వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ఓటుబాంకును ఏర్పాటు చేసుకొనేందుకు కూడా బిజెపి పావులు కదుపుతోంది. దశాబ్దాల తరబడి ఏదో విధంగా అధికారంలో కొనసాగినప్పటికీ తాము పెద్దపార్టీగా ఎదగలేకపోయామని, ఇప్పటికైనా అందుకు పూనుకోవాలని వారు చెబుతున్నారు.దళితులు, బిసిలపై ముస్లింలు దాడులు చేస్తుంటే నితీష్‌ కుమార్‌ సర్కార్‌ తగిన చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వంలో కొనసాగుతూనే బిజెపి నేతలు విమర్శలకు దిగుతున్నారు.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో జెడియును చీల్చి ఆరుగురు ఎంఎల్‌ఏలను బిజెపి తనలో చేర్చుకున్నది. దానిపైజెడియునేతలు మండి పడ్డారు. తమ నేతను స్పీకర్‌గా, ఇద్దరిని ఉపముఖ్యమంత్రులుగా చేయాలని బిజెపి ఆదేశించినట్లుగా చెప్పటం తప్ప ముందుగా నితీష్‌ కుమార్‌తో కనీసం సంప్రదించలేదని అప్పుడే వార్తలు వచ్చాయి.హౌంమంత్రిత్వశాఖను కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.బీహార్‌ రాజకీయాల్లో నితీష్‌ కుమార్‌ వేసినన్ని పిల్లి మొగ్గలు మరొకరు వేసి ఉండరేమో ! అటు ఆర్‌జెడి-ఇటు బిజెపిని రెండింటినీ ఉపయోగించుకొని పదవులు పొందారు. వాటికోసం నితీష్‌ కుమార్‌ ఏమైనా చేయగలరు అనే పేరు తెచ్చుకున్నారు. నరేంద్రమోడీని 2014లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తేనున్నారని గ్రహించి 2013లో బిజెపితో 17 సంవత్సరాల బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. మొరటు లేదా విభజించే లక్షణాలు లేని ఉన్నతమైన లౌకిక భావాలు కలిగిన వారే తమకు ఆమోదయోగ్యమని జెడియు అప్పుడు చేసిన తీర్మానంలో పేర్కొన్నది. తరువాత జరిగిన పరిణామాలేమిటో తెలిసిందే. అదే నరేంద్రమోడీతో కలసి పని చేస్తున్నారు. బిజెపితో కలసి ఉంటే కలదు సుఖం అనుకున్నన్ని రోజులు ఉంటారు. లేదనుకుంటే బయటకు వస్తారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బలాబలాల ప్రకారం ఇష్టం ఉన్నా లేకున్నా బిజెపి దయాదాక్షిణ్యంతో అధికారంతో కొనసాగటం లేదా బయటకు వచ్చి ఆర్‌జెడి సర్కార్‌కు మద్దతు ఇవ్వటం మినహా మరొక మార్గం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమికి 40కి గాను 39 స్ధానాలు వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని సెప్టెంబరులోనే ప్రతిపక్ష ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ ప్రకటించారు.