Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఉన్నత స్ధాయిలో ప్రామాణికంగా పేర్కొన్న పరిశోధకుల పేర్లతో లండన్‌లోని శాస్త్ర సమాచార సంస్ద, క్లారివేట్‌ రూపొందించిన 6,602 మంది వివరాలను పరిశీలించినపుడు అమెరికా ప్రధమ స్థానంలో, తరువాత చైనా ఉంది. డెబ్బయి దేశాలకు చెందిన వారితో 2021నవంబరు 16న ఈ వివరాలను ప్రకటించారు. తొలి ఐదు దేశాలకు చెందిన వారు 71.4శాతం మంది కాగా, మొదటి పది దేశాలను తీసుకుంటే 82.9శాతం ఉండటాన్ని బట్టి కేంద్రీకరణను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలో 2,622, చైనాలో 935 మంది ఉన్నారు. గత పది సంవత్సరాలలో తమ పరిశోధనలతో గణనీయ ప్రదర్శన, ప్రచురించిన పత్రాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. వీరిలో 3,774 మంది ఒక నిర్ణీత రంగంలో, 2,828 మంది ఒకటి కంటే ఎక్కువ రంగాలలో పరిశోధనలు చేస్తున్నవారు ఉన్నారు. మూడవ స్ధానంలో ఉన్న బ్రిటన్‌కు చెందిన వారు గత మూడు సంవత్సరాల్లో తగ్గి 492 లేదా 7.5శాతంగా ఉన్నారు. జర్మనీని అధిగమించి ఆస్ట్రేలియన్లు 332 మంది నాలుగో స్ధానంలో, 331 మందితో జర్మనీ ఐదవ, నెదర్లాండ్స్‌(207, కెనడా(196), ఫ్రాన్స్‌ 146) స్పెయిన్‌(109), స్విడ్జర్లాండ్‌(102)తో తొలి పదిస్దానాల్లో ఉన్నాయి.

గతంతో పోల్చితే అమెరికన్లు 2014లో 55శాతం, 2018నాటికి 43.3, 2021కి 39.7శాతానికి తగ్గారు. చైనీయులు 2018లో 7.9శాతం కాగా 2021కి 14.2కు పెరిగారు.చైనాలో 2014లో కేవలం 122 మంది మాత్రమే ఉన్నారు. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనీయుల పెరుగుదల, అమెరికన్ల తగ్గుదల మరింత స్పష్టంగా కనిపిస్తోందని సీనియర్‌ విశ్లేషకుడు డేవిడ్‌ పెండెల్‌బరీ అన్నాడు. బ్రిటన్‌లో పరిశోధన తగ్గుతున్నది. హాంకాంగ్‌లో ఒక ఏడాది కాలంలోనే పరిశోధకుల సంఖ్య 40 నుంచి 79కి పెరిగింది.తొలిసారిగా బంగ్లాదేశ్‌, కువైట్‌, మారిషస్‌, మొరాకో, జార్జియా ఈ జాబితాకు ఎక్కాయి. క్లారివేట్‌ సంస్ధ దేశాల జనాభా సంఖ్య-శాస్త్రవేత్తలతో పోల్చింది.నూట ముఫ్పై ఎనిమిది కోట్ల మంది ఉన్న భారత్‌లో 22 మంది,22.1 కోట్ల మంది ఉన్న పాకిస్ధాన్‌ నుంచి ఐదుగురు, 27.3 కోట్ల మంది ఉన్న ఇండోనేషియా నుంచి ఒక్కరు ఉన్నట్లు పేర్కొన్నది. ఇండోనేషియా నుంచి ఉన్న ఒక్కరు కూడా మహిళ కావటం విశేషం.ఆమె బయోఫ్యూయల్‌ మీద పరిశోధనలు చేస్తున్నారు. సంస్ధల వారీగా చూస్తే 1,300లో శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు.హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 214 మందితో అగ్రస్ధానంలో ఉంటే చైనా సైన్స్‌ అకాడమీ 194 మందితో రెండవ స్ధానంలో, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం 122 మందితో తృతీయ స్ధానంలో ఉంది. యాభై అగ్రశ్రేణి సంస్ధలలో 28 అమెరికాలో, ఐదు బ్రిటన్‌, నాలుగేసి చైనా,ఆస్ట్రేలియాలో సింగపూర్‌, సౌదీ అరేబియాలో రెండేసి, హాంకాంగ్‌, జర్మనీ, కెనడా, నెదర్లాండ్స్‌, బెల్జియంలలో ఒక్కొక్కటి ఉన్నాయి.


పరిశోధనారంగంలో వివిధ దేశాలు పోటీ పడుతున్నతీరును చూశాము.ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెది మరొకదారి అన్నట్లుగా మనం ఉన్నాం.నరేంద్రమోడీ సర్కార్‌ గత ఏడున్నర సంవత్సరాల్లో ఈ రంగానికి అందించిన ప్రోత్సాహంతో మనంపైన పేర్కొన్న పరిశోధకుల్లో 22 మందైనా ఉన్నారని భక్తులు భజనకు దిగవచ్చు.పరిశోధనలు, నవకల్పనల పాత్ర ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. దేశీయ ఆవుల అద్వితీయత,వాటి పాలు, పేడ, మూత్రంలో ఉన్న రోగనిరోధకత లేదా కాన్సర్‌తో సహా రకరకాల వ్యాధులను నయం చేసే గుణాల గురించి పరిశోధించాలని మన కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది అశాస్త్రీయం, నిధులను దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఐదు వందల మంది శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా వెనక్కు తగ్గలేదు. విశ్వాసాల ప్రాతిపదికన ముందుకు తెస్తున్న కుహనా సైన్సును సక్రమమైనదిగా చెల్లుబాటు చేసే యత్నమని పేర్కొన్నారు. హౌమియోపతి, అల్లోపతి, నేచురోపతి వంటి వాటి సరసన కౌపతిని చేర్చేందుకు పూనుకున్నారు. ఆవు మూత్రం, పాలు, పేడలతో చీడపీడల నివారణ మందులు, షాంపూలు, తలనూనెలు, నేలను శుభ్రం చేసే ద్రవాల వంటి వాటి తయారీకి పరిశోధనలు జరపాలని కేంద్రం నిధులు కేటాయించింది. పుక్కిటి పురాణాల్లో రాసిన ఊహాజనితమైన వాటిని రుజువు చేసేందుకు డబ్బు దుర్వినియోగం తప్ప మరొకటి కాదు.దీనికి ”సూత్రా-పిక్‌ అని పేరు పెట్టారు ఆవు మూత్రంతో తన కాన్సర్‌ మాయమైందని బిజెపి ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


కేంద్రం వెనక్కు తగ్గలేదు సరికదా ఆవు శాస్త్ర పధకాలను వేగంగా అమలు జరిపి 2021 ఆగస్టు పదిహేనున ప్రధాని ప్రసంగానికి ముందే పురోగతిని చూపాలని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఏప్రిల్‌ నెలలో ఆదేశించారు. అనుమతులు, నిధుల మంజూరులో ఎందుకు జాప్యం చేశారంటూ అధికారుల మీద మండిపడ్డారు. ఆలస్యానికి సాకులు చెబితే కుదరదని హెచ్చరించారు.ప్రధాని నరేంద్రమోడీకి దేశీయ ఆవులు ఎంతో ముఖ్యమని కూడా చెప్పారు. ఢిల్లీ ఐఐటి రూపొందించిన ఈ పధకంలో 2016 నుంచి ఎలాంటి పురోగతి లేదన్నారు.2017లో తొలుత పంచగవ్య సుగుణాలను శాస్త్రీయంగా నిరూపించాలని ఆదేశించారు. తరువాత 2020లో దాన్ని మరింత విస్తరించి కొత్త పధకంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో పెట్రోలు లేకుండా పైకీ కిందికీ, ఎందరెక్కినా ఒకరికి జాగా ఉండే పురాణాల్లోని విమానాలు,వినాయకుడు పాలు తాగాడు వంటి నమ్మకాలు, ఇతర ఊహలన్నింటినీ 2024 ఎన్నికల నాటికి ఫాస్ట్‌ట్రాక్‌ ప్రాజక్టులుగా చేపట్టి నిర్ధారించమని నిధులు కేటాయించినా ఆశ్చర్యం లేదు.


పిండికొద్దీ రొట్టె అన్నారు పెద్దలు, కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు దుడ్డుగా ఉండాలి అంటే కుదరదని కూడా అదే పెద్దలు అన్నారు. వీటిని ఎవరు ఎలా వర్తింప చేస్తున్నారు ? చైనాతో పోటీ పడాలని, దేవుతలు కరుణిస్తే అధిగమించాలని మనం కోరుకోవటం తప్పుకాదు. స్టాటిస్టా డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2021లో పరిశోధన-అభివృద్ధికి గాను చైనా పెట్టుబడి 621.5బిలియన్‌ డాలర్లు కాగా అమెరికా 598.7, జపాన్‌ 182.36, జర్మనీ 127.25, భారత్‌ 93.48 బి.డాలర్లు. ఈ మొత్తం నుంచే ఆవు పాలు, పేడ, మూత్ర పరిశోధనలు జరుగుతున్నాయి. మన జనాలకు తెలివితేటలేమైనా తక్కువా, సోమరిపోతులు మరొకటి కాదే. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి అదృష్టం కోసం ఎదురు చూసే బాపతు కూడా గణనీయంగా ఉన్నందున కాళ్లు, చేతులూ చూసే, జోశ్యాలు చెప్పే రకరకాల మోసగాండ్లు తామర తంపరగా పెరిగిపోతున్నారు. మన అప్పును నరేంద్రమోడీ 55 లక్షల కోట్ల నుంచి 130లక్షల కోట్లకు పెంచటం పట్ల చూపిన శ్రద్ద పరిశోధనకు కేటాయింపుల్లో లేదు. ఈ అంశంలో అంతకు ముందున్న వాజ్‌పాయి, మన్మోహన్‌ సింగ్‌ సర్కార్లు కూడా ఇంతకు మించి పొడిచిందేమీ లేదు.

గేట్‌వేహౌస్‌ డాట్‌ఇన్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో జిడిపిలో మన పరిశోధన ఖర్చు 0.7శాతం ఉంటే 2012 నాటికి 0.8శాతం, ఇదే కాలంలో చైనా 0.9 నుంచి 1.8కి పెరిగింది. ప్రపంచబాంకు సమాచారం ప్రకారం 2018లో చైనా 2.14శాతం, మన దేశం 0.65శాతం ఖర్చు చేసింది. రూపాయల్లో పెరుగుదల చూడండి అని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. వాటి విలువ సంగతేమిటని అడగాల్సి వస్తుంది. దేశభక్తి దేశభక్తి అని అరిస్తే,వేషాలు వేస్తే, ఇరుగు పొరుగుదేశాల గురించి కుట్ర సిద్దాంతాలతో జనాలను భయపెడితే, ఆ సాకుతో అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే, గంజాయి దమ్ముకొట్టి ప్రగల్భాలు పలికినట్లు వారిని అధిగమిస్తాం వీరిని దాటిపోతాం, మా గత ఘనం చూడండి అంటే సరిపోతుందా ? కృత్రిమ మేథలో కొన్ని రంగాల్లో ఇప్పటికే అమెరికాను అధిగమించి, మొత్తంగా సవాలు విసురుతున్న చైనాతో పోల్చుకుంటే మనమెక్కడ ? నేచర్‌ ఇండెక్సు డాట్‌కామ్‌ ప్రకారం 2015-19 సంవత్సరాలలో అమెరికన్లు 7,020,బ్రిటీషర్లు 2,073, జర్మన్లు 1,756, చైనీయులు1,446 ఆర్టికల్స్‌ను ప్రచురిస్తే మొదటి 25లో 20వ స్దానంలో ఉన్న మనవారికి 192 మాత్రమే. మనం గొప్పగా చెప్పుకొనే ఆంగ్ల భాషా జ్ఞానం, సంస్కృత పరిజ్ఞానం ఏమైనట్లు ? ఆ రెండింటిలోనూ మనకంటే వెనుకబడిన చైనా శాస్త్ర పరిశోధనలో ఎందుకు ముందున్నట్లు ? ఇతర దేశాల జనం ప్రపంచాన్ని చుట్టి వస్తుంటే మనం ఆవుచుట్టూ తిరుగుతున్నాం ?తీవ్రంగా ఆలోచించాలా వద్దా ?