ఎం కోటేశ్వరరావు
అనేక మంది ఊహించినట్లుగానే సాగు చట్టాల పునరుద్దరణకు ఆర్‌ఎస్‌ఎస్ తనదైన శైలిలో రంగంలోకి దిగింది. రద్దు చేసిన మూడు సాగు చట్టాలను కొన్ని మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలంటూ దాని అనుబంధ భారతీయ కిసాన్ సంఫ్‌ు(బికెఎస్) జనవరిలో ఆందోళన చేస్తామని ప్రకటించింది. రద్దు చేసిన చట్టాలు 90శాతం రైతులకు లబ్ది చేకూర్చుతాయని, ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోవాలని కోరుకున్న వారికి సంతోషం కలగటం తప్ప రద్దు తరువాత రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నది. అందువలన కొన్ని మార్పులతో తిరిగి వాటిని ప్రవేశపెట్టాలని కోరుతూ తాము దేశవ్యాపిత ఆందోళన చేస్తామని సంఘ ప్రధాన కార్యదర్శి బదరీ నారాయణ చౌదరి ప్రకటించారు. జై జవాన్-జైకిసాన్ పిలుపు ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి వర్ధంతి రోజైన జనవరి 11న దేశమంతటా తహసీల్దారు కార్యాలయాల ముందు నిరసన, బహిరంగ సభలు జరుపుతామని వెల్లడించారు. అంతకు ముందు ఒకటవ తేదీ నుంచి పది వరకు గ్రామగ్రామాన రైతులను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సాగు చట్టాల రద్దు కోసం సాగించామని చెబుతున్న ఉద్యమం సాధించిందేమీ లేదని, తొలుత తాము కూడా దానికి మద్దతు ఇచ్చామని తరువాత హింసా కాండ, దేశ. సంఘ వ్యతిరేక చర్యల కారణంగా ఉపసంహరించుకున్నామని చెప్పారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతూ గతంలో 20వేల గ్రామాల నుంచి వినతులు పంపామని, 513 జిల్లాల్లో సెప్టెంబరు ఎనిమిదిన ధర్నాలు చేసినట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మూడు సాగు చట్టాల్లో మార్పుల్లో భాగంగా కనీస మద్దతు ధరలకు హామీతో సహా కొనుగోలు దార్ల నమోదుకు ఒక పోర్టల్, రైతుల ఫిర్యాదుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తూ సవరించాలని కోరుతున్నామన్నారు. తమ సంఘం సన్న, చిన్నకారు రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని రద్దైన చట్టాలు 90శాతం మంది రైతులకు మేలు చేసేవన్నారు. వాటి రద్దు తమకు ఆశ్చర్యం, ఆశాభంగం కలిగించిందని,విచ్చిన్నం, హింసను సృష్టించిన వారి మాటలనే ప్రభుత్వం వినటం, తమ వంటి శాంతియుత, ప్రజాస్వామికంగా ఉండే వారు చెప్పేవాటిని పట్టించుకోకపోవటం విచారకరమని చెప్పారు. ప్రస్తుత కనీస మద్దతు ధర విధానం దేశమంతటా రైతులకు తోడ్పడేదిగా లేదన్నారు. ఎంఎస్‌పిగా ఇస్తున్న మొత్తాలు నైపుణ్యం లేని కార్మికులకు సైతం చాలదని గిట్టుబాటు ధర ఇవ్వాలని సంఫ్‌ు జాతీయ కార్యదర్శి కె.శాయిరెడ్డి చెప్పారు.రైతులకు గిట్టుబాటు కావాలంటే సహజ వ్యవసాయ పద్దతులు అనుసరించాలని రసాయన ఎరువుల బదులు ఆవు పేడ వంటి వాటిని వాడాలన్నారు.
బికెఎస్ నేతలు గత ఏడాది కాలంగా ఉద్యమించిన రైతుల మీద బిజెపి మోపిన నిందలనే మరోసారి పునశ్చరణ కావించించారు తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. ఆందోళన ప్రారంభమైన నాటి నుంచి బిజెపి, కేంద్ర మంత్రులు చేసిన ఆరోపణలు, నిందలకు తందాన తాను అంటూ వాటినే బికెఎస్ వల్లె వేసింది. ఆ సంస్ధ ఇప్పుడు చెబుతున్న అంశాల మీదనే వేరు దుకాణం పెట్టి ఆందోళన చేసి ఉంటే అదొక తీరు. మొక్కుబడిగా ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. పోనీ వారు చేసిన పోరాటం లేదా ఆరాటం నిజంగా జరిగి ఉంటే మోడీ సర్కార్ సదరు అంశాలకు సానుకూలంగా ఎందుకు మాట్లాడలేదు ? ఎంఎస్‌పికి చట్టబద్దతకు ఇప్పటికీ కేంద్రం ఆమోదం చెప్పకుండా కమిటీ వేసి పరిశీలిస్తామని అంటోంది. కొన్ని మార్పులతో పాత వాటినే పునరుద్దరించాలని బికెఎస్ చెప్పటం వెనుక ఉన్న ఎత్తుగడ, ప్రభుత్వ హస్తం గురించి తెలియనంత అమాయకంగా ఇప్పుడు రైతులు లేరు. ఏడాది పాటు ఉద్యమం సాగిన సమయంలో బికెఎస్ వ్యవహరించిన తీరు, ప్రభుత్వానికి అనుకూలంగా రైతులను సమీకరించేందుకు చేసిన విఫల యత్నాలు ఎవరికి తెలియనివి. అవన్నీ విఫలం అయిన కారణంగానే తప్పనిసరై మోడీ వెనక్కు తగ్గారు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు బికెఎస్ చెబుతున్నవి కొత్త ప్రతిపాదనలేమీ కాదు, ఎంఎస్‌పికి చట్టబద్దత కుదరదంటే కుదరదని ఏడాది పాటు మొండికేసిన మోడీ ఇప్పుడు సానుకూలంగా ఉండేట్లయితే కమిటీ పేరుతో కాలయాపన ఎందుకు ? బికెఎస్‌ను ఏర్పాటు చేసిందే ఆర్‌ఎస్‌ఎస్ అన్నది బహిరంగ రహస్యం. మరణించేంత వరకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా ఉన్న దత్తోపంత్ టేంగిడీ 1979లో దీన్ని ఏర్పాటు చేశారు.
ఢిల్లీ శివార్లలో రైతుల నిరవధిక ఆందోళనకు పోటీగా బిజెపి రైతు సంపర్క యాత్రల పేరుతో తన మద్దతుదార్లను సమీకరించేందుకు అనేక చోట్ల విఫల యత్నం చేసింది. ప్రత్యేకించి కీలకమైన ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్‌లో రైతులను ప్రసన్నం చేసుకొనేందుకు పడని పాట్లు లేవు.డిసెంబరు 23వ తేదీ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినం సందర్భంగా బిజెపి ఎక్కడలేని శ్రద్ద చూపింది. చరణ్ సింగ్ కుటుంబ, రాజకీయ వారసులు ఆర్‌ఎల్‌డి పార్టీలో ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీని గద్దె దించేందుకు సమాజవాది పార్టీతో జతకట్టారు. చరణ్ సింగ్ జన్మదినాన్ని రైతుదినోత్సవంగా బిజెపి పాటించింది.లఖింపూర్ ఖేరీలో కేంద్రమంత్రి అజయ మిశ్రా తనయుడు, అనుచరులు చేసిన దుర్మార్గంతో అవన్నీ కొట్టుకపోయాయి. బిజెపి నేతలు గ్రామాలకు వెళ్లలేని స్ధితి కొన్ని చోట్ల ఏర్పడింది. దాని సెగ ఎంతగా ఉందంటే ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర ప్రదేశ్ నుంచి ఎన్నికైన బిజెపి ఎంపీలతో జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బికెఎస్‌ను రంగంలోకి దించారు.
లఖింపూర్ ఖేరీలో పధకం ప్రకారమే రైతుల మీదకు మోటారు వాహనాలను నడిపి హత్యచేసినట్లు విధిలేని పరిస్ధితిలో దర్యాప్తు సంస్ధ కూడా నివేదిక ఇచ్చింది. ఆ ఉదంతం గురించి బికెఎస్ నేతలు చెప్పిందేమిటి ? తమ మీదకు వాహనాలు నడిపి తోటి వారిని చంపి దొరికిన హంతకులను రైతులు రాచమర్యాదలలో సాగనంపుతారా ? వారు రైతులు కాదు, హత్యలే రోజువారీ పనిగా ఉన్న వారని, వామపక్ష పద్దతుల్లో చేశారని, గుమికూడిన వారు రాజకీయ పార్టీల మద్దతుదారులు తప్ప రైతులు కాదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని నిందిస్తూనేే జరిగిన సంఘటనలు దురదృష్టకరం అని సన్నాయి నొక్కులు నొక్కింది. పధకం ప్రకారం జరిపిన హత్యాకాండను ఘర్షణలు అని వర్ణించింది. రైతుల మీదకు కార్లను తోలి చంపిన బిజెపి మద్దతుదారులు అమాయకులన్నట్లు, రైతులు హంతకులైనట్లు చిత్రించటం రైతు సంఘం పేరుతో ఊరేగుతున్నవారికి తగినపనేనా ? ఇంతగా నిందించిన వారు చట్టాలను పునరుద్దరించాలని రోడ్లెక్కుతామనటంలో ఆశ్చర్యం ఏముంది ! బిజెపికి కార్పొరేట్లు అందచేస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులతో రైతుల ముసుగులో తన మద్దతుదార్లను సమీకరించి కృత్రిమ ఆందోళనలు చేయించినా ఆశ్చర్యం లేదు.