Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మాయాబజార్‌ వాగ్దానాలతో పార్టీలు ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురిచేస్తున్నాయో తెలిసిందే. ఎన్నికల ఫలితాలు, కొందరు ప్రముఖుల గెలుపు, మెజారిటీల మీద తిధి, వార, నక్షత్రాల పేరుతో జోశ్యాలు చెప్పేవారు, పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంతో పాటు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే సంఖ్యల మీద కూడా పందాలు ప్రారంభమయ్యాయి.ఒక అంచనా ప్రకారం 2021 మే నెలలో జరిగి ఎన్నికల్లో 25వేల కోట్ల రూపాయల వరకు ఉండగా 2022 ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 50 వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో పోటీ తీవ్రంగా ఉంటే ఇంకా పెరగవచ్చు కూడా. వచ్చే లోక్‌సభ ఎన్నికలు-2024లో రావాల్సినవి- ఎప్పుడు వస్తాయో తెలియదు. వాటిని ముందుకు నెట్టే లేదా గడువు నాటికి జరిగేట్లు ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని భావిస్తున్న తరుణమిది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి ఎవరు పాగావేస్తారన్న ఆసక్తి పెరిగిన నేపధ్యంలో ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్‌కు ఆప్‌ గట్టి సవాలు విసురుతోంది. అకాలీదళ్‌ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత దుకాణం పెట్టుకున్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ – బిజెపి జట్టుగా రంగంలోకి దిగటంతో చతుర్ముఖ పోటీ జరగనుంది. జూదగాండ్లు ఇప్పటి వరకు ఈ జట్టును లెక్కలోకి తీసుకోలేదు.


క్రికెట్‌ మీద పందాలు కాయటం తెలిసిందే. గడచిన రెండు దశాబ్దాల్లో ఎన్నికల ఫలితాల మీద పందాలు అదీ సంఘటిత ముఠాలు నిర్వహించటం పెరిగింది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల మీద పందాలు మొదలయ్యాయి. వివిధ సర్వే సంస్ధలు వెల్లడించే జోశ్యాల ప్రాతిపదికన జరిగే పందాలు కొన్ని కాగా పందెం ముఠాల వెనుక ఉండే పెద్దలు స్వంతంగా చేయించుకొనే సర్వేల ప్రాతిపదికన కూడా మరికొన్ని జరుగుతున్నాయి. ఎన్నికల సర్వేలు ఎలా బోల్తాపడుతున్నాయో పందెం ముఠాలు కూడా అలాగే బొక్కబోర్లాపడుతున్నాయి. అయితే ఇవన్నీ చట్టవిరుద్దం, చీకట్లో జరిగేవి కావటంతో డబ్బు పొగొట్టుకున్నవారు లేదా గెలిచినవారు గానీ పైకి చెప్పుకోలేరు.పందెగాళ్ల అంచనా ప్రకారం పంజాబ్‌లో ఎవరికీ మెజారిటీ రాదు, ఉత్తర ప్రదేశ్‌లో తిరిగి బిజెపి గద్దెనెక్కనుంది.ఎన్నికల ప్రచారంలో పార్టీల జన సమీకరణ, మీడియా విశ్లేషణలను బట్టి కూడా పోలింగ్‌ తేదీ వరకు పందాల మొత్తాలు పెరగటం లేదా తగ్గటాన్ని గతంలో చూశాము. సాధారణ పరిస్ధితుల్లో ఎన్నికలు జరిగితే పందాలు ఒకరకం- అవి ధరల పెరుగుదల, దారిద్య్రం, నిరుద్యోగం వంటి అంశాల తీవ్రతను బట్టి ఉంటాయి.అదే పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ దాడుల వంటి ఉదంతాలు చోటు చేసుకుంటే మరోరకంగానూ మారతాయి.


ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదికి పైగా మూడు సాగు చట్టాల రద్దు కోసం సాగిన మహత్తర ఉద్యమ ధాటికి దిగివచ్చిన నరేంద్రమోడీ వాటిని రద్దు చేయటమేగాక రైతులకు క్షమాపణలు చెప్పారు. కనీస మద్దతు ధర చట్టబద్దత పరిశీలనకు ఒక కమిటీని వేస్తామని ప్రకటించి వారాలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి కదలికా లేదు. సాగు చట్టాల రద్దుతో దూరమైన రైతులు తిరిగి తమవైపు చేరతారని ఆశించిన బిజెపికి అలాంటి సూచనలేమీ కనిపించటం లేదనే వార్తలు వస్తున్నాయి. రైతాంగం ఎటు మొగ్గుతుందన్నది ఆసక్తికరమైన అంశమే.2017 ఎన్నికల్లో బిజెపి ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీలోని 403 స్ధానాలకు గాను 312 సాధించింది. వచ్చే ఎన్నికల్లో 250తో గట్టెక్కవచ్చని ఒకవైపు వార్తలు, రెండంకెలకు మించవనే అంచనాలు మరోవైపు ఉన్నాయి.


ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో రెండు పార్టీల గురించే పందాలు కాస్తున్నారు. బిజెపి 200 స్ధానాలు గెలిస్తే ప్రతి రూపాయికి అదనంగా 20పైసలు, 222 గెలిస్తే రూపాయికి రు.1.15, సమాజవాది110 తెచ్చుకుంటే 35పైసలు, 125 గెలిస్తే రు.1.40 ఇస్తామని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్‌, బిఎస్‌పికి ఐదు నుంచి పది స్ధానాలకు మించి రావని పందెంరాయుళ్లు చెబుతున్నారు. తరువాత ఈ అంచనాలు, పందాల మొత్తాలు మారిపోవచ్చు. పంజాబ్‌లోని 117 స్ధానాల్లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలకు కనీసంగా 25 గరిష్టంగా 40చొప్పున వస్తాయని, అకాలీదళ్‌, బిజెపిలకు ఐదు నుంచి పదిలోపు రావచ్చని, ఇక్కడ కూడా నామినేషన్ల తరువాత అంచనాలు మారవచ్చని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి.


పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
బిజెపి×× 200×× 0.20 ××ఎస్‌పి×× 110×× 0.35
బిజెపి×× 210×× 0.35 ××ఎస్‌పి×× 115×× 0.60
బిజెపి×× 215×× 0.57 ××ఎస్‌పి×× 120×× 1.05
బిజెపి×× 222×× 1.15 ××ఎస్‌పి×× 125×× 1.40
బిఎస్‌పి×× 5 ×× 0.04 ××కాంగ్రెస్‌ ×× 5×× 0.55
బిఎస్‌పి××10 ×× 0.67 ××కాంగ్రెస్‌ ×× 6×× 0.70
బిఎస్‌పి××15 ×× 1.10 ××కాంగ్రెస్‌ ×× 8×× 1.00
బిఎస్‌పి×× 0 ×× 0.00 ××కాంగ్రెస్‌ ××10×× 2.50
పంజాబ్‌లోని 117కు గాను ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి
పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
ఆప్‌×× 25 ×× 0.35 ××కాంగ్రెస్‌ ×× 25 ×× 0.45 ××అకాలీదళ్‌ ×× 5 ×× 0.35
ఆప్‌×× 30 ×× 0.40 ××కాంగ్రెస్‌ ×× 30 ×× 0.57 ××అకాలీదళ్‌ ×× 10 ×× 0.57
ఆప్‌×× 35 ×× 0.87 ××కాంగ్రెస్‌ ×× 35 ×× 0.90 ××అకాలీదళ్‌ ×× 15 ×× 0.87
ఆప్‌×× 40 ×× 1.15 ××కాంగ్రెస్‌ ×× 40 ×× 1.35 ××అకాలీదళ్‌ ×× 20 ×× 1.20

2021లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు అన్నాడిఎంకె గెలుస్తుందని, డిఎంకె ఓడిపోతుందని, స్టాలిన్‌కు సిఎం యోగం లేదని జోశ్యాలు చెప్పారు. పశ్చిమబెంగాల్లో మోడీ నాయకత్వంలో బిజెపి గెలుస్తుందన్నారు. బిజెపి పటాటోపం చూసి అక్కడ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపారు.బిజెపికి 145 స్దానాలు వస్తాయని, టిఎంసికి 115-120కి మించి రావని పందాలు కాశారు. రూపాయి 22 నుంచి 150పైసల వరకు అవి ఉన్నాయి. ఎవరి తల రాత ఏమిటో ముందే రాసి ఉంటుందని చెప్పేవీరు ఎన్నికల అంశాల్లో నామినేషన్ల నాటి నుంచి ప్రచారం వరకు భిన్నమైన జోశ్యాలు చెబుతున్నారు. వీరందరు చెప్పే గ్రహాలు ఒకటే, అవి అందరికీ ఒకే సందేశాలు ఇవ్వాలి, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పటాన్ని బట్టి ఊహాగానాలు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. అయినా ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా ప్రతివారూ జోత్యిష్కులను ఆశ్రయిస్తుండటంతో వారి వ్యాపారం కూడా రెండు చేతులు ఆరు కాసులు అన్నట్లుగా పెరిగిపోతోంది.


2004 ఎన్నికల్లో అతల్‌ బిహారీ వాజ్‌పాయి నాయకత్వంలోని ఎన్‌డిఏకు మరోసారి అవకాశం వస్తుందన్న ఎన్నికల సర్వేలు వాస్తవం కాదని తేలింది. 2009లో హంగ్‌ పార్లమెంట్‌ అన్న అంచనాలు తప్పి యుపిఏ మరింత బలపడింది. 2014లో ఎన్‌డిఏకు స్వల్ప మెజారిటీ అన్న అంచనాలు తారుమారైన సంగతి తెలిసిందే, 2019లో కూడా అదే జరిగి ఎన్‌డిఏ బలం మరింత పెరిగింది.అనేక మంది ప్రముఖ జ్యోతిష్కులు మోడీ అధికారానికి వచ్చినా సీట్లు తగ్గుతాయని చెప్పి నాలుక కరుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మధుర, హత్రాస్‌ వంటివి పందెగాండ్లకు పెద్ద కేంద్రాలు.2019 ఎన్నికలలో మోడీ సర్కార్‌కు తగినంత మెజారిటీ రాకపోతే సమాజవాది పార్టీతో బంధాన్ని తెంచుకొని బిఎస్‌పి నేత మాయావతి ఎన్‌డిఏలో చేరతారని, రాహులు గాంధీ పోటీ చేసిన రెండు స్ధానాల్లో గెలుస్తారని, సమాజవాది పార్టీ స్ధితి మెరుగుపడుతుందని కూడా పందాలు కాశారు.


సర్వే సంస్ధలు, మీడియాను మేనేజ్‌ చేసి అనుకూల సర్వేలు చేయించుకోవటం జగమెరిగిన సత్యం. అందుకే వాటిని జనం పెద్దగా విశ్వసించటం లేదు. ఫలితాలు కూడా అలాగే ఎక్కువ సందర్భాల్లో తారుమారయ్యాయి. సర్వేలతో పాటు ఇప్పుడు రాజకీయ పార్టీలు ముఖ్యంగా బిజెపి పందెగాళ్ల ముఠాలను కూడా ప్రభావితం చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. పందాల వార్తలు మీడియాలో ప్రముఖంగా చోటు చేసుకొంటున్నందున తద్వారా ఓటర్లను ప్రభావితం చేయవచ్చన్న ఎత్తుగడ దీనివెనుక ఉంది. ఫలానా పార్టీ గెలుపు గురించి ఎక్కువ మంది పందెంకాస్తున్నారంటే దానికి మద్దతు ఉండబట్టే కదా అని మొగ్గేవారు కొందరైనా ఉండవచ్చు. ఈ కారణంగానే 2014తో పోల్చితే 2019లో పందాల మార్కెట్‌ రెండు రెట్లు పెరిగిందని, ఇప్పుడు ఇంకా పెరిగిందని అంచనా. కనీస మొత్తాలతో ప్రారంభమై కోట్ల వరకు ఉంటాయి. అనేక మొత్తాలు విదేశాల్లోనే జమ అవుతాయి, దానికి హవాలాతో సహా అనేక మార్గాలను ఎంచుకుంటారు, ఎక్కడా రాతకోతలుండవు.బుకీలు తెలిసి ఉంటే ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా నమ్మకం, దందా మీదనే నడుస్తుంది.


ఎన్నికల ఫలితాలపై పందాలు మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా ఉన్నాయి. మన దేశంలో గుర్రప్పందాలు మాత్రమే చట్టబద్దం. మిగిలినవన్నీ చాటు మాటు దొంగ వ్యవహారాలే. అనేక దేశాల్లో అన్ని రకాల జూదాలు చట్టబద్దంగానే జరుగుతాయి. 2020 అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌, జోబైడెన్‌ మీద కూడా జూదం నిర్వహించారు. ప్రతి అధ్యక్షుడు రెండోసారి ఎన్నిక అవటం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు ట్రంప్‌ ఎన్ని పిచ్చిపనులు చేసినా రెండోసారి గెలుస్తాడంటూ పందెగాళ్లు ఎక్కువ మంది అటువైపే మొగ్గి చేతులు కాల్చుకున్నారు. లెక్కింపులో జో బైడెన్‌ ముందంజలో ఉన్నట్లు వార్తలు వచ్చిన తరువాత కూడా ట్రంప్‌ ఏదో ఒక మాజిక్‌ చేసి గెలుస్తాడని భంగపడినవారు లేకపోలేదు. ట్రంప్‌ గెలుపు గురించి న్యూజిలాండ్‌లో 62 నుంచి 37 , జోబైడెన్‌ మీద 61-44 సెంట్ల వరకు పందాలు నడిచాయి(ఒక డాలరుకు వంద సెంట్లు).స్టాక్‌ ఎక్సేంజ్‌ల మాదిరి బ్రిటన్‌లో బెట్టింగ్‌ ఎక్సేంజ్‌ బెట్‌ఫెయిర్‌ ఉంది. అమెరికా ఎన్నికలు ప్రారంభం కాగానే ట్రంప్‌ రెండోసారి విజయానికి అవకాశాలున్నాయని 39 నుంచి 75శాతానికి బెట్‌ఫెయిర్‌ సూచిక పెరగ్గా బైడెన్‌ అవకాశాలు 61 నుంచి 25శాతానికి తగ్గాయి. స్మార్‌కెట్స్‌ అనే మరో ఎక్సేంజ్‌లో కూడా ఇదే మాదిరి సూచనలు వెలువడినా చివరికి ట్రంప్‌ ఇంటిదారి పట్టాడు. అక్కడ కొన్ని రాష్ట్రాల తీరు తెన్నులను బట్టి పందాలు కాస్తారు.