Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మాతో మరో ప్రచ్చన్న యుద్దానికి తలపడితే తాట తీస్తాం అని అమెరికా పాలకులను చైనా హెచ్చరించింది. డిసెంబరు చివరివారంలో వాషింగ్టన్‌ నగరంలో అమెరికా మీడియా సంపాదకులు, సీనియర్‌ జర్నలిస్టులతో చైనా రాయబారి క్విన్‌ గాంగ్‌ మాట్లాడారు.” మూడు దశాబ్దాల నాడు అమెరికా ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. చైనా మాజీ సోవియట్‌ రిపబ్లిక్‌ కాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా నాటి సోవియట్‌ పార్టీ వంటిది కాదు. ఎవరైనా నిజంగా ప్రచ్చన్న యుద్ధం ప్రారంభించాలనుకుంటే చైనా ఓడిపోదని నేను చెప్పగలను. అమెరికాకు చైనా ఎంత అవసరమో చైనాకూ అమెరికా అంతే అవసరం ఉంది.” అని క్విన్‌ గాంగ్‌ చెప్పారు. ఎటువైపు నుంచి ప్రచ్చన్న యుద్దం వస్తుంది ? అసలు వస్తుందని కొందరు జనాలు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే అమెరికాలో కొందరు అలాంటి మన:ప్రవృత్తితో ఉన్నారు, సోవియట్‌ మాదిరి చైనా మీదకు పోవాలనుకుంటున్నారని విమర్శించారు.


ఈ దశాబ్ది చివరికి ఆర్ధిక అగ్రరాజ్యంగా అవతరించనున్న చైనా సాంకేతిక రంగంలో కూడా అదే స్ధాయికి చేరుకొనేందుకు అడుగులు వేస్తోంది. ప్రపంచంలో ఇ కామర్స్‌లో పెద్ద సంస్ధగా ఉన్న అలీబాబా గ్రూపు కంపెనీలను అణచివేస్తున్నదంటూ గగ్గోలు పెట్టిన వారు సాంకేతిక రంగంలో ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ తయారీకి అదే కంపెనీని ప్రోత్సహిస్తున్నదనే అంశాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. ఇటియాన్‌ 710 పేరుతో తన మూడవ ప్రోసెసర్‌ను అక్టోబరు నెలలో విడుదల చేసింది. మూడు సంవత్సరాల్లోనే ఈ పని చేసింది. దానిని ఇతర దేశాలకు అమ్మేది లేదని చెప్పింది. చిప్‌ రూపొందించినా తయారీ సమస్య ఉంది. ఇతర చైనా కంపెనీలు టెన్‌సెంట్‌, షియామీ అదే పోటీలో ఉన్నాయి. ప్రోసెసర్‌ చిప్‌లు ఫోన్లు, కార్లు, వైద్య, గృహ పరికరాల్లో ఎంతో ప్రాధాన్యవహిస్తున్నాయి. కరోనా కారణంగా సరఫరాలు దెబ్బతింటే, చైనాను ఆర్ధికంగా నష్టపరిచేందుకు కొన్ని కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించాయి.


సెమీకండక్టర్లు లేదా చిప్స్‌ కోసం ప్రస్తుతం అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, తన తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌పై చైనా ఎక్కువగా ఆధారపడుతోంది.ఈ రంగంలో చిప్స్‌ చైనా తనకు తానే సమకూర్చుకోగలిగితే అది మిగతా దేశాల్లో నవకల్పనలను, ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందని కొందరు వాపోతున్నారు.జాతీయ ఆర్ధిక భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానంలో ఇతరుల మీద ఆధారపడకూడదని, సాంకేతిక అగ్రరాజ్యంగా మారాలని 2021 మార్చినెలలో చైనా నేత షీ జింపింగ్‌ పిలుపునిచ్చారు. తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తస్కరిస్తున్నదనే తప్పుడు ప్రచారాన్ని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా తన చిప్స్‌ను తానే ప్రత్యేకంగా రూపొందించుకుంటే, తాము రూపొందించినవి చైనా కార్లు, సెల్‌ఫోన్లకు పనికి రాకపోతే, మిగతా దేశాలు కూడా అదే బాట పడితే తాము ప్రతి దేశానికి విడివిడి ప్రమాణాలతో ఎలా తయారు చేయగలం, అందుకు అవసరమైన పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని, అభివృద్ధి మందగిస్తుందని అమెరికా, ఐరోపా బడా సంస్ధలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచం విడిపోకుండా చూడాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అమెరికా-చైనాలను కోరారు. ఒకచేత్తో చప్పట్లు కష్టం కదా !


ప్రస్తుతం చైనాలో తయారవుతున్న సెల్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల వంటి వాటికి ఏటా 300 బి. డాలర్ల మేర చిప్స్‌ చైనా ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోంది, చమురు తరువాత స్ధానం వీటిదే. 2016లో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యయుద్దంలో భాగంగా చైనాలోని హువెయి టెక్నాలజీస్‌ సంస్ధకు అవసరమైన చిప్స్‌, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుకుంది. ఆ కంపెనీ పరికరాలతో ఇతర దేశాల భద్రతకు ముప్పు అనే ప్రచారాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేసి, చిప్స్‌ రూపకల్పనకు పూనుకుంది. దీంతో దిగ్గజాలైన క్వాలకమ్‌(అమెరికా) శాంసంగ్‌(దక్షిణ కొరియా, ఆర్మ్‌(బ్రిటన్‌) కంపెనీలకు సవాలు ఎదురైంది. సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన పరికరాలు, వస్తువులు, ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానంలో చైనా వెనుకబడి ఉంది. దాన్ని అలుసుగా తీసుకొని ఆ రంగంలో ముందున్న దేశాలు బెదిరిస్తున్నాయి. తన సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ఫౌండరీల్లో చైనా హువెయి కంపెనీ చిప్స్‌ తయారు చేయరాదని, ఒకవేళ చేసినా ఐదవ తరం ఫోన్లకు అసలు చేయకూడదని అమెరికా ఆంక్షలు విధించింది. ఐరోపా యూనియన్‌ కూడా తక్కువేమీ తినలేదు. జర్మనీలో రోబోలను తయారు చేసే కుకా కంపెనీని చైనా కొనుగోలు చేస్తే తమ పెట్టుడుల గురించి సమీక్షించాల్సి వస్తుందని బెదిరించింది.చిప్స్‌ తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఎటూ తేల్చకుండా ఉంది.


్ట మానవహక్కులు, టిబెట్‌, తైవాన్‌, హాంకాంగ్‌ అంశాలను ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తూ రాజకీయ దాడులు, మిలిటరీ కవ్వింపులకు పశ్చిమ దేశాలు పూనుకున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా సెమికండక్టర్లను తయారు చేస్తున్న దిగ్గజ కంపెనీ ఇంటెల్‌ తాజాగా చైనాకు క్షమాపణ చెప్పింది.చైనాలో ముస్లింలు అధికంగా ఉండే షిజాంగ్‌ రాష్ట్రంలో వారిని అణచివేస్తున్నారను తప్పుడు ప్రచారం సాగించటమే కాదు, ఆంక్షలను కూడా అమెరికా, ఇతర దేశాలు అమలు చేస్తున్నాయి. తైవాన్ను ప్రత్యేకదేశంగా పిలిచినందుకు హాలీవుడ్‌ నటుడు, అమెరికా రెజ్లర్‌ జాన్‌ సెనా చైనాకు క్షమాపణలు చెప్పారు.తన సినిమాలకు చైనాలో టిక్కెట్లు అమ్ముకోవటానికి తప్ప వేరే కారణం లేదు. జెపి మోర్గాన్‌ బాంకు సిఇఓ జామీ డైమన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీ మీద జోక్‌ వేసి తరువాత రెండుసార్లు క్షమాపణలు చెప్పాడు.జర్నలిజం నైతికవిలువలు, మానవత్వం గురించి చైనాకు వ్యతిరేకంగా నోరుపారవేసుకొన్న సిఎన్‌ఎన్‌ తరువాత క్షమాపణలు చెప్పింది. షిజాంగ్‌ రాష్ట్రంలో తయారయ్యే నూలును తాము వినియోగించబోమని ప్రకటించిన నైక్‌ కంపెనీ తరువాత చెంపలు వేసుకుంది.ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవన్నీ చైనా మార్కెట్‌, లాభాల కోసం వేసే నక్కజిత్లులు తప్ప వేరు కాదు.వాణిజ్య సంస్ధలు రాజకీయాల్లో వేలు పెడితే పర్యవసానాలకూ సిద్దపడాలి. లేకుంటే పరువు పోగొట్టుకోవాలి.


తమ సరఫరాదారులు చైనా షిజాంగ్‌ రాష్ట్రం నుంచి ఉత్పత్తయ్యేవస్తువులు లేకుండా చూడాలని ఇంటెల్‌ కోరింది. ఆ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలను అణచివేస్తున్నారని, బలవంతంగా పని చేయిస్తున్నారంటూ ఆ వస్తువులను కొనుగోలు చేయకూడదంటూ అమెరికా ఆంక్షలు విధించింది. దానికి అనుగుణంగానే తాము అలాంటి లేఖ రాసినట్లు ఇంటెల్‌ తెలిపింది. ఇది తమ దేశాన్ని అవమానించటమే అంటూ ఇంటెల్‌ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ చైనా సామాజిక మాధ్యమంలో నెటిజన్లు స్పందించటం, ఇంటెల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తప్పుకుంటున్నట్లు చైనా పాప్‌ గాయకుడు వాంగ్‌ జుంకాయి ప్రకటించటం వంటి చర్యలతో కంపెనీ దిగివచ్చింది. షిజాంగ్‌ రాష్ట్రంలో దొరికే సిలికాను చిప్స్‌ తయారీకి వినియోగిస్తారు. ఆసియాలో ఉన్న ఏకైక ఇంటెల్‌ ఫ్యాక్టరీ చైనాలోని దలియాన్‌లో, బీజింగ్‌లో పరిశోధనా కేంద్రం ఉంది. ఇతర కంపెనీల చిప్స్‌ అందుబాటులో ఉండటంతో ఇంటెల్‌ దిగివచ్చింది. 2020లో ఆ కంపెనీ ఆదాయంలో నాలుగో వంతు చైనా నుంచే ఉంది. వేరే మార్కెట్‌ను వెతుక్కోవటం చాలా కష్టం, ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావటం, వీటికి తోడు స్వంతంగా చిప్స్‌ తయారీకి పూనుకోవటం కూడా ఇంటెల్‌ను ప్రభావితం చేసింది. మానవహక్కుల కోసం నిలబడే అమెరికన్‌ కంపెనీలు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్‌ మీడియా అధికారి జెన్‌ సాకీ అన్నారు.


రెండవ ప్రపంచయుద్దానికి ముందు తమతో పోటీ పడుతున్న జపాన్‌ సామ్రాజ్యవాదాన్ని అడ్డుకొనే క్రమంలో పశ్చిమ దేశాలు జపాన్‌కు అవసరమైన సహజవనరులు, ముడి సరకులను అందకుండా చూశాయి. ఇప్పుడు చైనా ఆర్ధికంగా పోటీపడుతున్న నేపధ్యంలో అడ్డుకొనేందుకు చిప్స్‌, సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు పశ్చిమ దేశాలు పూనుకోవటం గత పరిణామాలను గుర్తుకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచయుద్దంలో ఓడిపోయిన జపాన్‌కు మిలిటరీని లేకుండా ఆంక్షలు విధించారు. మిలిటరీ ఖర్చును జపాన్‌ తన పరిశ్రమలకు అవసరమైన పరిశోధన-అభివృద్ధి, సబ్సిడీలకు మళ్లించి పశ్చిమ దేశాలకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌ రంగంలో సవాలు విసిరి వాటికి మారుపేరుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనాను కూడా జపాన్‌తో సహా పశ్చిమ దేశాలన్నీ అదే దిశగా ఒకవైపుకు నెడుతున్నాయి. చైనా దీన్ని ముందుగానే అంచనావేసి వాటి మీద ఆధారపడకుండా ఉండేందుకు తగిన కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు పోతున్నది. అమెరికా 2016లో వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ అది ఆచరణలో సాంకేతిక యుద్దంగా పరిణమించిందని చెప్పవచ్చు. మేడిన్‌ చైనా 2025 కార్యక్రమంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి.


చైనాను దెబ్బతీయాలని చూస్తున్న వారికి జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు, అంతేకాదు బెంగపట్టుకుందని చెప్పవచ్చు.” ప్రపంచ అశాంతికి దోహదం చేస్తున్న చైనా సాంకేతిక స్వీయ ఆధార బాట ” అనే శీర్షికతో తాజాగా ఏపి వార్తా సంస్ధ ఒక కధనాన్ని వెలువరించింది. ఒక వైపు మార్కెట్లను మరింతగా తెరిచి తమ వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికా నాలుడేండ్లుగా ప్రత్యక్షంగా సాగిస్తున్న వాణిజ్యయుద్దం, చైనాకు వ్యతిరేకంగా చేస్తున్న సమీకరణలు, విధిస్తున్న ఆంక్షల నేపధ్యంలో ఎవరి మీదా ఆధారపడకుండా సాంకేతిక రంగంలో స్వీయ ఆధార దిశగా చైనా అనేక చర్యలు తీసుకుంది. అది సాధిస్తున్న పురోగతిని దిగ్జజదేశాలు ఊహించలేదు. తమ కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తామనట్లుగా ఉన్నాయి. ఇప్పుడు మొదటికే మోసం వస్తుందనే బెంగ పట్టుకుంది.