Tags
#Akhilesh Yadav, 2022 UP polls, BJP, BSP, Lakhimpur Kheri killings, Narendra Modi Failures, Samajavadi party, UP BJP poll fate, Yogi Adityanath
ఎం కోటేశ్వరరావు
ఉత్తర ప్రదేశ్ విధాన సభ ఎన్నికల్లో చరిత్రను తిరగరాసేందుకు బిజెపి నేతలు గంగకు ఎదురీదుతున్నారు.కరోనా శవాలను తనలోకి నెట్టిన వారిని గంగామాత ఏం చేస్తుందో చెప్పలేము. గడచిన నాలుగు దశాబ్దాలలో 1985 తరువాత ఇక్కడ ఒకసారి అధికారానికి వచ్చిన పార్టీ వరుసగా రెండవసారి గద్దెనెక్కలేదు.దాన్ని చరిత్రలోకి నెట్టివేసేందుకు నరేంద్రమోడీ ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రాన్ని ఒకేసారి రెండు ఇంజన్లు (కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో యోగి) లాగుతూ అభివృద్ది పరుగుపెట్టిస్తున్నామని చెప్పుకొనే బిజెపి నేతలు కొత్త రికార్డు నెలకొల్పుతారా ? ఎన్నికల ముందు అనేకం అంటాం, అనుకుంటాంగానీ గానీ సంప్రదాయం కొనసాగింది తప్ప ఇది మా ఓటమి కాదు అని చెప్పే పరిస్ధితి వస్తుందా లేక చూశారా మా తడాఖా మల్లయోధుడి పార్టీ(సమాజవాది- ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి రాక ముందు మల్లయోధుడు, ఆయన కుమారుడే ప్రస్తుత పార్టీ నేత, మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ )ని మట్టి కరిపించాం అని జబ్బలు చరుచుకుంటారా ? చూద్దాం, తినబోతూ రుచెందుకు ?
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు బిజెపిని ఇరుకున పెడుతుందని భావిస్తున్న లఖింపూర్ ఖేరీ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అక్టోబరు మూడవ తేదీన లఖింపూర్ ఖేరీ వద్ద సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై మోటారు వాహనాలను తోలి రైతులను హత్యచేసిన ఉదంతంలో నలుగురు రైతులు మరణించారు. ఒక జర్నలిస్టు ప్రాణాలు కూడా తీశారు. ఆగ్రహించిన రైతుల చేతిలో వాహనాల్లో ఉన్న ముగ్గురు బిజెపి కార్యకర్తలు కూడా మరణించారు. రైతుల మీదకు కార్లను తోలిన వారిలో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఆషిష్ మిశ్రా తదితరులు ఉన్నారని వచ్చిన వార్తలను అప్పుడు బిజెపి తోసి పుచ్చింది. అప్పుడు అతగాడు వేరే చోట ఉన్నట్లు కతలు చెప్పింది. కేసును నీరు కార్చేందుకు పూనుకోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. మూడు నెలల తరువాత పోలీసులు దాఖలు చేసిన ఐదువేల పేజీల ఛార్జి షీట్‌లో మంత్రి కుమారుడు ఆషిష్ మిశ్రా ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న రైతులను హత్యచేసేందుకు పధకం ప్రకారం కుట్రపన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేర్కొన్నది. ఉదంతం జరిగిన సమయంలో ఆషిష్ మిశ్రా ఘటనా స్ధలిలో ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఆషిష్ బంధువు కూడా సహనిందుడని పేర్కొన్నారు. తాను ఆ సమయంలో అక్కడ లేనంటూ కొన్ని వీడియోలు, పది మందితో అఫిడవిట్‌లను పోలీసులకు అంద చేశారు. ఘటన జరిగినపుడు ధీరేంద్ర శుక్లా అనే అతను ఉన్నాడని, అతని కారు ఆషిష్ మిశ్రా కారువెనుకే ఉందని ఈ వాస్తవాన్ని ధీరేంద్ర దాచినట్లు సిట్ పేర్కొన్నది. ఈ కేసు తరువాత ఏమౌతుందో చెప్పలేము గానీ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను మంత్రి వర్గం నుంచి తొలగించాలనే డిమాండ్ మరింత ఊపందుకోవటంతో పాటు ఎన్నికల్లో ప్రచార అంశంగా మారనుంది. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపిక చేసిన పార్టీ ఎంపీలతో ప్రధాని నరేంద్రమోడీ జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా ఉంచినట్లు వార్తలు వచ్చాయి.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి తాజాగా టైమ్స్ నౌ నవభారత్‌కు వీటో సంస్ధ నిర్వహించిన సర్వేలో 403 స్ధానాలకు గాను బిజెపి 230-249 మధ్య తెచ్చుకొని సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందని తేలినట్లు ప్రకటించారు. సమీప సమాజవాది పార్టీకి 137-152, బిఎస్‌పికి 9-14, కాంగ్రెస్‌కు 4-7 మధ్య రావచ్చని పేర్కొన్నారు. బిజెపి ఏడు పార్టీలతో కూటమిగా పోటీలోకి దిగుతోంది. సమాజవాది , కాంగ్రెస్, బిఎస్‌పి, ఆప్ పార్టీ విడివిడిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. వాటితో ఏ పార్టీలు జత కట్టేది చూడాల్సి ఉంది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం బిజెపి కూటమికి 38.6శాతం, సమాజవాదికి 34.4, బిఎస్‌పికి 14.1 శాతం ఓట్లు రావచ్చని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు, ఓట్లు, వచ్చే ఎన్నికల్లో అంచనాల పోలిక ఇలా ఉంది.2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి 311, మిత్రపక్షం కాంగ్రెస్ 114 చోట్ల పోటీ చేసింది. 2019లో ఎస్‌పి, బిఎస్‌పి ఒక కూటమిగా, కాంగ్రెస్ విడిగా పోటీ చేసింది.
పార్టీ××××××× 2017×× శాతం×× 2019××శాతం ×× 2022××శాతం
బిజెపి కూటమి×× 325 ×× 40.78× 64 ××× 51.19×× 230-49×× 38.6
ఎస్‌పి కూటమి×× 48 ××× 21.82× 5 ×××18.11 ××137-152×× 34.4
బిఎస్‌పి×××××× 19 ××× 22.23× 10 ××× 19.43 ×× 9-14 ××× 14.4
కాంగ్రెస్ ××××× 7 ××× 6.25 × 1 ××× 6.41 ×× 4-7 ×××× 5
ఈ అంకెలను చూసినపుడు బిజెపి ఓటింగ్ 2017-2019 మధ్య పదిశాతంపైగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో 2017 కంటే తగ్గవచ్చని సర్వేలు చెబుతున్నాయి. సమాజవాది పార్టీ ఓటింగ్ 2017, 2019లో పెద్దగా మారలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుతో పోలిస్తే రెట్టింపు కావచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వే లఖింపూర్ ఖేరీ కేసులో చార్జిషీటు దాఖలు చేయక ముందు చేసినది. ప్రధాన సవాలు సమాజవాది నుంచే అనే వాతావరణం వచ్చిన తరువాత బిజెపి వ్యతిరేక ఓటర్లు సహజంగానే కొన్ని ఓట్లు ఎస్‌పికే పడతాయి.బిజెపిని ఓడించాలని కోరుకొనే బిఎస్‌పి, కాంగ్రెస్ అభిమానులు కూడా ఎస్‌పి వైపే మొగ్గవచ్చు. ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలవచ్చనే వాతావరణం ఉన్నందున బిజెపి తన మత, కుల అజెండాను మరింతగా ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. కరోనా రెండవ తరంగం నివారణలో వైఫల్యం, శవాలను గంగలోకి నెట్టివేసిన నిర్వాకం, లఖింపూర్ ఖేరీ ఉదంతం, రైతు ఉద్యమ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి రామాలయ నిర్మాణం వంటి అంశాలు తమను గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నమ్ముతోంది.
ఎన్నికల నోటిఫికేషన్‌తో నిమిత్తం లేకుండానే బిజెపి మాదిరి సమాజవాది కూడా జరుపుతున్న సభలకు పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు.తాము అధికారంలోకి వస్తే 300యునిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామని ఎస్‌పి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించాయి. రైతులకు ఉచితంగా ఇస్తామని ఎస్‌పి పేర్కొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు రకాల రేట్లు వసూలు చేస్తున్నారు. గ్రామాలలో వంద యూనిట్లకు రు. 3.35, 101నుంచి 150కి రు.3.85, 151 నుంచి 300కు రు.5, ఆ పైన రు. 6 కాగా పట్టణాల్లో 150 వరకు రు.5.50, 151 నుంచి 300 వరకు రు.6, 301 నుంచి 500వరకు రు.6.50, ఆ పైన రు.7 ఉంది.
పార్టీని బూత్ స్ధాయివరకు విస్తరించి ఉంటే వచ్చే ఎన్నికల్లో 325కు మించి గెలుస్తామని సిఎం యోగి ఆదిత్యనాధ్ చెబుతున్నారు. సోదరి మాయావతి ఎన్నికలంటే భయపడుతున్న కారణంగానే ప్రచారం ప్రారంభించలేదని,చలిని వదిలించుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యను ఆమె ఖండించారు. ప్రభుత్వ సొమ్ముతో బిజెపి నేతలు జనాన్ని చలికాలంలో కూడా వెచ్చగా ఉంచుతున్నారని తిప్పికొట్టారు. తాము ఇతర పార్టీలను అనుకరించబోమని, తమ శైలి తమకు ఉందన్నారు. ఎన్నికల ముందు అధికారంలో ఉన్న వారు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల పేరు చెప్పి ప్రభుత్వ సొమ్ముతో సభలు పెడతారని, తమ వంటి వారికి సాధ్యం కాదన్నారు.తమను అపహాస్యం చేసినా తమ వైఖరి మారదని, ఇతర పార్టీలు తమ గురించి ఆందోళన చెందాల్సినపని లేదన్నారు.
కులాల సమీకరణలు,మత ధోరణుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉత్తర ప్రదేశ్ ఒకటి. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి చేయని పని లేదు. రామ మందిర సమస్యను ముందుకు తెచ్చి గతంలో లబ్ది పొందిన ఆ పార్టీకి ఒక సర్వే అంశాలు ఆందోళన కలిగించక మానవు. కుల, మత ప్రాతిపదికన ఓటు వేస్తున్నామని 24శాతం మంది చెప్పగా వచ్చే ఎన్నికల్లో రామ మందిరం ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెప్పిన వారు ఒక్కశాతమే అని ఇండియా న్యూస్ జన్‌కీ బాత్ సర్వే పేర్కొన్నది. బిజెపికి వస్తాయని చెబుతున్న ఓట్లలో యాదవేతర బిసి, బ్రాహ్మణ ఓట్లలో ఎక్కువ భాగం ఉంటాయని, ఎస్‌పికి ముస్లింలు, యాదవుల ఓట్లు గణనీయంగా వస్తాయని చెబుతున్నారు.
గో రక్షణ, గొడ్డుమాంసం పేరుతో బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వట్టిపోయిన వాటిని అమ్ముకొనే వీలు లేకపోవటంతో యజమానులు వాటిని వదలి వేయటంతో పంటలను కాపాడుకొనేందుకు రైతులు కాపలాలు కాయాల్సి వస్తోంది.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున చెరకు బకాయిలు పేరుకు పోయాయి. అత్యంత వెనుకబడిన తరగతుల వారిని యాదవులు పైకి రానివ్వటం లేదనే పేరుతో బిజెపి ఇతర వెనుకబడిన తరగతుల వారిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తమకు ఒరిగిందేమీ లేదని యాదవుల బదులు ఠాకూర్ల పెత్తనం కిందికి వచ్చామని వారు ఇప్పుడు భావిస్తున్నారు. మత ప్రాతిపదికన బిజెపి పరివారం జనాన్ని చీల్చితే, రైతు ఉద్యమం ఐక్యం చేసేందుకు బాటలు వేసిందని వార్తలు వచ్చాయి. నామినేషన్లు వేసి, ఎవరెటో తేలిన తరువాత ఎన్నికల తీరు తెన్నులపై మరింత స్పష్టత వస్తుంది.