Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


కార్మికులకు మెరుగైన వేతనాలివ్వండి :బెర్నీ శాండర్స్‌, ఆ పని నాది కాదు :వారెన్‌ బఫెట్‌. మొదటి వ్యక్తి అమెరికాలో డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ప్రకటించుకున్న కార్మిక పక్షపాతి అని వేరే చెప్పనవసరం లేదు. రెండవ పెద్దమనిషి ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో తొమ్మిదవ స్ధానంలో ఉన్న కార్పొరేట్‌ అమెరికన్‌. అమెరికాలో కార్మిక సమ్మెల తరంగం వస్తోందని పరిశీలకులు చెబుతున్న తరుణంలో ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక అది.పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలోని హంటింగ్‌టన్‌లోని వారెన్‌ బఫెట్‌ స్టీలు కంపెనీలో జరుగుతున్న సమ్మెను పరిష్కరించాలని శాండర్స్‌ ఒక లేఖలో కోరారు.కాస్టింగ్‌ పరికరాలను తయారు చేసే ఈ కర్మాగారంలో 450 మంది సిబ్బంది మూడునెలలుగా సమ్మె చేస్తున్నారు.మీ కంపెనీలో పని చేస్తున్న కార్మికులు తమ పిల్లల కడుపు నింపగలమా లేదా ఆరోగ్య సంరక్షణ చూడగలమా లేదా అని ఎందుకు ఆందోళన చెందాలంటూ శాండర్స్‌ ప్రశ్నించారు. ఐదు సంవత్సరాలలో మొదటి ఏడాది ఎలాంటి వేతన పెంపుదల లేకుండా, రెండవ ఏడాది ఒక శాతం, తరువాత మూడు సంవత్సరాలు రెండుశాతం చొప్పున వేతన పెరుగుదల ఉంటుందని, కేవలం రెండువేల డాలర్లు మాత్రమే బోనస్‌ ఇస్తామని, ఆరోగ్యబీమాకు నెలకు ఇప్పుడున్న 275 డాలర్ల నుంచి 1000డాలర్లకు కార్మికుల వాటా పెరగాలని, ఇప్పుడున్న సెలవుల సంఖ్యను తగ్గించుకోవాలని యాజమాన్యం షరతులు విధించింది.


శాండర్స్‌ లేఖపై స్పందించిన బఫెట్‌ తాను సిఇఓగా ఉన్న సంస్ధకు అనేక అనుబంధ కంపెనీలు ఉన్నాయని, ఏ కంపెనీకి అకంపెనీ అక్కడి సమస్యల సంగతి చూసుకోవాలి తప్ప సిఇఓగా ఉన్నంత మాత్రాన తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.మీరు పంపిన లేఖను సదరు స్పెషల్‌ మెటల్స్‌ ప్రిసిషన్‌ కాస్ట్‌పార్ట్స్‌ కంపెనీ సిఇవోకు పంపుతానని, ఎలాంటి సిఫార్సులు, చర్యలను తాను సూచించటం లేదని, వ్యాపారానికి అతనే బాధ్యుడని శాండర్స్‌కు జవాబిచ్చాడు.2016లో ఈ కంపెనీని బఫెట్‌ సిఇఓగా ఉన్న బెర్క్‌షైర్‌ కంపెనీ కొనుగోలు చేసింది. ఇక్కడ అంతరిక్ష నౌకలకు, విమానాలకు అవసరమైన నికెల్‌ అలాయి విడిభాగాలను తయారు చేస్తుంది. సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ కంపెనీ పని చేస్తూనే ఉందని, తాత్కాలిక సిబ్బందిని నియమించినట్లుగానీ, లేదా కార్మికులను పూర్తిగా తొలగించినట్లుగానీ ప్రకటించలేదని యునైటెడ్‌ స్టీల్‌ వర్కర్స్‌ యునియన్‌ వెబ్‌సైట్‌ పేర్కొన్నది. కార్మికులు కోరుతున్నదేమిటి ? సిబ్బంది సమ్మెలో ఉన్నా ఫ్యాక్టరీ ఎలా నడుస్తోందన్న ప్రశ్నలకు కంపెనీ సమాధానం ఇవ్వటం లేదు.


ఇటీవలి కాలంలో అమెరికాలో కార్మిక సమ్మెలు పెరుగుతున్నాయి. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో కార్మికులకు వ్యతిరేకమైన అంశాలున్నాయి. కార్మికనేతల లొంగుబాటు, ఉపాధి లేమి వంటి కారణాలతో యజమానులు రుద్దిన ఒప్పందాలను అంగీకరించారు. గత కొద్ది నెలలుగా నిపుణులైన కార్మికులకు డిమాండ్‌ పెరగటంతో కోట్లాది మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మెరుగైన వేతనాలతో కొత్త కొలువుల్లో కుదురుతున్నారు. కొన్ని కంపెనీల్లో ఒప్పంద గడువులు ముగిసిన తరువాత మెరుగైన నూతన ఒప్పందాల కోసం సమ్మెలకు దిగుతున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం చూపినప్పటికీ కార్పొరేట్ల లాభాలకు ఎలాంటి ఢోకాలేకపోవటాన్ని కార్మికులు గమనించారు, తామెందుకు నష్టపోవాలని వారు భావిస్తున్నారు.2020లో మొత్తం 3.63 కోట్ల మంది రాజీనామాలు చేసి మెరుగైన ఉపాధిని వెతుక్కోగా 2021లో అక్టోబరు నాటికే 3.86 కోట్ల మంది రాజీనామాలు చేశారని అంచనా. సమ్మె చేస్తున్న కంపెనీలలో యజమానులు గతంలో మాదిరి తమ షరతులను రుద్దేందుకు చూస్తుండగా కార్మికులు అంగీకరించటం లేదు, దాంతో నెలల తరబడి సమ్మెలు కొనసాగుతున్నాయి. కడుపు నిండిన యజమానులు కడుపు మండుతున్న కార్మికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.


అమెరికా చరిత్రలో గత 15 సంవత్సరాల్లో సుదీర్ఘ సమ్మెగా మసాచుసెట్స్‌లోని సెయింట్‌ విన్సెంట్‌ ఆసుపత్రిలోని 700 మంది నర్సుల ఆందోళన నమోదైంది. రోగులకు తగిన సంఖ్యకు తగ్గట్లుగా సిబ్బంది లేకపోగా కరోనా సమయంలో, అంతకు ముందూ తగ్గించారు. సమ్మెకు దిగిన వారందరినీ పూర్తిగా తొలగిస్తామని బెదిరించినా 301రోజుల పాటు సమ్మె జరిగింది. జనవరి మూడున ఒప్పందం కుదిరింది. నర్సులందరినీ తిరిగి తీసుకొనేందుకు, వేతన పెంపుదల, వైద్య బీమా మొత్తాల పెంపుదలకు అంగీకరించారు. డిసెంబరు పదవ తేదీ నాటికి దేశంలో 346 సమ్మెలు జరుగుతున్నట్లు కార్నెల్‌ విశ్వవిద్యాలయ కేంద్రం నమోదు చేసింది. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో కార్మిక సంఘాలలో చేరుతున్న వారి సంఖ్య తగ్గుతోంది.ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న వారిలో 34.8శాతం మంది సభ్యులుగా ఉంటే ప్రయివేటు రంగంలో కేవలం 6.3శాతం మందే ఉన్నారు. 2019తో పోలిస్తే 2020లో స్వల్పంగా పెరిగారు. అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీలు కార్మిక సంఘాలను లేకుండా చేసేందుకు అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయి. కొత్తగా సంఘం పెట్టుకోవటమే గగనంగా మారుతోంది. స్టార్‌బక్స్‌ కార్పొరేట్‌ స్టోర్‌లో తొలిసారిగా సంఘాన్ని ఏర్పాటు చేస్తే గుర్తించాల్సి వచ్చింది.


కారన్‌ఫ్లేక్‌ వంటి తృణధాన్య ఉత్పత్తుల సంస్ధ కెలోగ్‌ కార్మికులు కూడా నెలల తరబడి సమ్మె చేశారు. అక్టోబరు ఐదు నుంచి డిసెంబరు 21వరకు సమ్మె చేశారు. ఐదు సంవత్సరాలు అమల్లో ఉండే ఒప్పందం చేసుకున్నారు.నాలుగు చోట్ల ఉన్న ఫ్యాక్టరీల్లోని 1,400 మంది కార్మికులు ఆందోళన చేశారు. ఒకే పని చేసే కార్మికులకు రెండు రకాల వేతనాలు ఇవ్వటాన్ని వారు నిరసించారు. పది సంవత్సరాలు, అంతకు మించి పని చేస్తున్నవారిని విశ్వాసపాత్రులైన కార్మికులనే పేరుతో వారికి గంటకు 35డాలర్లు, మెరుగైన బీమా, పెన్షన్‌ ఇస్తూ మిగిలిన వారిని తాత్కాలికం అనే పేరుతో ఒకే పని చేస్తున్న వారికి తక్కువ వేతనాలు ఇవ్వటాన్ని వ్యతిరేకించారు. కొత్త ఒప్పందం ప్రకారం అందరికీ వేతనాలు పెరుగుతాయి, ప్రతి ఏడాది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచుతారు. తాత్కాలిక కార్మికులకు కనీస వేతనం 24.11 డాలర్లు ఉంటుంది.అందరికీ ఒకే విధమైన ఆరోగ్యబీమా ఉంటుంది.రానున్న ఐదు సంవత్సరాల్లో ఏ ఫ్యాక్టరీని మూసివేయ కూడదు. రెండు రకాల కార్మికుల విభజన ఉన్నప్పటికీ నాలుగు సంవత్సరాలకు మించి పని చేసిన వారిని విశ్వాసపాత్రులుగా పరిగణించేందుకు అంగీకరించారు.పర్మనెంటు కార్మికుల సంఖ్య మీద పరిమితి విధించాలని అంతకు ముందు కంపెనీ వత్తిడి తెచ్చింది.


కోట్లాది మంది కార్మికులు ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి కొత్త ఉపాధి చూసుకున్న తరువాత అనేక కంపెనీలో సిబ్బంది సమ్మెకు దిగటం లేదా సమ్మె నిర్ణయాలు తీసుకొని సంప్రదింపులు జరుపుతున్నారు.దీనికి కారణాలను విశ్లేషిస్తే కార్మికుల్లో తలెత్తిన అసంతృప్తి కనిపిస్తోందని చెప్పవచ్చు. కరోనాకు ముందున్న స్ధితిలో 80శాతమే ఉపాధి పునరుద్దరణ జరిగింది. అయినా కార్మికులు రాజీనామా చేసి వేతనాలను మెరుగుపరుచుకోవాలని చూడటం ఒక ప్రత్యేక పరిస్ధితిగా కనిపిస్తోంది. కరోనా తీవ్రత సడలిన తరువాత ఆర్ధిక లావాదేవీలు ప్రారంభం కావటంతో సహజంగానే కార్మికులు తమ పని పరిస్ధితుల మెరుగుదలకు పూనుకుంటారు.అదే జరుగుతోందిప్పుడు. రికార్డు స్ధాయిలో ఉద్యోగాలకు రాజీనామాలు చేయటాన్ని చూసిన తరువాత యజమానులతో మన మెందుకు గట్టిగా బేరమాడకూడదనే ఆలోచనలు కార్మికుల్లో సహజంగానే తలెత్తాయని చెప్పవచ్చు. గత నాలుగు సంవత్సరాల్లో రిపబ్లికన్లు అధికారంలో ఉన్నారు. డెమోక్రాట్లలో కూడా కార్పొరేట్లకు వంతపాడేవారున్నప్పటికీ కార్మికులకు అనుకూలంగా ఉండేశక్తులు ఉండటం కూడా పోరాటాలకు ఊతమిస్తోందని చెప్పవచ్చు. మంత్రులుగా ఉన్నవారు కూడా సమ్మె కేంద్రాలను సందర్శించటం ఒక అసాధారణ పరిణామం. అసమానతలు విపరీతంగా పెరగటం సహజంగానే అసంతృప్తి, ఆందోళనలకు పురికొల్పుతుంది. సమ్మెలు విజయాలు సాధిస్తే మరిన్ని జరుగుతాయి. సమ్మె ఆయుధం మరింత పదునెక్కుతుంది. సంక్షోభాలు తలెత్తినపుడు,యుద్ధాలు ముగిసిన తరువాత కార్మికోద్యమాలు తలెత్తినట్లు గత చరిత్ర చెబుతోంది. ఆ సమయాలలో కార్మికులు త్యాగాలు చేస్తారు.కరోనా కూడా పెద్ద సంక్షోభమే. దానిలో తమ కష్టానికి,త్యాగాలకు దక్కిన ఫలితం ఏమిటని సహజంగానే ఆలోచిస్తారు. ప్రస్తుతం అమెరికాలో పెట్టుబడిదారీ విధానం విఫలమైనట్లు భావిస్తున్నవారు నానాటికీ పెరుగుతున్నారు. అది కూడా కార్మికశక్తి సంఘటితం కావటానికి, పోరాట రూపాలకు మళ్లటానికి దోహదం జరుగుతోందా అన్నది చూడాల్సి ఉంది.


గతంలో అనేక కంపెనీలు కార్మికులను బెదరించాయంటే అతిశయోక్తి కాదు. తాము ఇచ్చిన మేరకు వేతనాలు తీసుకొని చెప్పిన మేరకు పని చేయకపోతే ఫ్యాక్టరీలను మెక్సికో లేదా మరో దేశానికో తరలిస్తామని బెదరించేవారు.ఇప్పుడు అమెరికాలో వస్తు వినియోగానికి జనం(కార్మికులు) కావాలి, అందువలన కార్పొరేట్లు కొంత మేరకు దిగిరాకతప్పటం లేదని చెబుతున్నారు. కరోనాలో కెలోగ్‌ కంపెనీ కార్మికులు ఇబ్బంది పడినా కంపెనీకి రికార్డు స్ధాయిలో 120 కోట్ల డాలర్ల మేర లాభాలు వచ్చాయి. జనం ఇళ్ల వద్దే ఉండటం, లాక్‌డౌన్‌ కారణంగా డిమాండ్‌ పెరిగి దుకాణాల్లో సరకులన్నీ ఖాళీ అయ్యాయి. దీంతో కెలోగ్‌ కార్మికులు తమ వారాంతాలను వదులుకొని, పన్నెండు గంటల చొప్పున పని చేసి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేశారు. కంపెనీ వాటా ధర బాగా పెరిగింది, వాటాదార్లకు బోనస్‌లు, అధికార్లకు పెద్ద మొత్తాలు ఇచ్చారు. కానీ గత ఒప్పంద గడువు ముగిసిన తరువాత యాజమాన్యం కార్మికులను రాయితీలు కోరింది. ఇప్పుడున్న కార్మికులు తమ పెన్షన్లకు చెల్లింపు మొత్తాలను పెంచాలని, సెలవులకు ఇచ్చే మొత్తాల కోతకు అంగీకరించాలని, కొత్తగా పనిలోకి తీసుకొనే వారికి వేతనాల తగ్గింపునకు అంగీకరించాలని వత్తిడి చేసింది. విధి లేక కార్మికులు సమ్మెకు దిగారు. నెలలో మూడు రోజుల పాటు యంత్రాలను శుద్ది చేస్తారు, కార్మికులను కనీసం యంత్రాల మాదిరిగా కూడా చూడకుండా వరుసగా వంద నుంచి 130 రోజుల వరకు పనిచేయించిన ఉదంతాలున్నట్లు కార్మికులు వాపోయారు.
అనేక రంగాల కార్మికులు పోరుబాటలో ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా హాలీవుడ్‌లో పని చేస్తున్న 60వేల మంది కార్మికులు ఆందోళన హెచ్చరిక చేశారు. పని గంటలు పెరిగినందున ఎక్కువ వేతనాలు చెల్లించాలన్నది వారి ప్రధాన డిమాండు. అనేక రంగాల్లోని కార్మికులు ఇదే బాటలో ఉన్నారు. ఒక చోట సమ్మెలు మొదలైతే దాని ప్రభావం ప్రపంచమంతా ఉండటం గతంలో చూశాము. అదే పునరావృతం కానుందా ?