Tags
BJP, Farmers agitations, Narendra Modi, Narendra Modi Failures, PM Modi security breach, Satya Pal Malik
ఎం కోటేశ్వరరావు
జనవరి ఐదు, బుధవారం నాడు జరిగిన అనూహ్యపరిణామాల మధ్య పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా హుసేనీవాలాలో జరగాల్సిన సభలో పాల్గొనకుండా ప్రధాని నరేంద్రమోడీ వెనక్కు వెళ్లిపోయారు. సభా స్ధలికి 30కిలోమీటర్ల దూరంలోని రోడ్డుమీద ఒక పైవంతెన(ఫ్లైఓవర్) సమీపంలో రైతులు నిరసన తెలపటంతో 15-20నిమిషాల పాటు ప్రధాని, వాహన శ్రేణి వంతెన మీద నిలిచిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండానే వెనుదిరిగి భటిండా విమానాశ్రయానికి వచ్చి ఢిల్లీ వెళ్లిపోయారు. పంజాబ్ ప్రభుత్వ భద్రతాలోపాల కారణంగానే ఇలా జరిగిందని బిజెపి, కేంద్ర ప్రభుత్వం ఆరోపించాయి. గురువారం నాడు భద్రత అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై సమీక్షించింది. రాష్ట్రపతి రామానాధ్ కోవింద్‌ను కలిసి బుధవారం జరిగిన ఉదంతం గురించి ప్రధాని నరేంద్రమోడీ వివరించారు. రాష్ట్రపతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలను దీనికి బాధ్యులుగా చేయాలని సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. నరేంద్రమోడీని కాంగ్రెస్ ద్వేషించింది, ఇప్పుడు హాని తలపెట్టాలని చూసిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. జరిగిన దాని మీద విచారం వ్యక్తం చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ , కాంగ్రెస్ కూడా బిజెపి ఆరోపణను తోసిపుచ్చింది.తగు సంఖ్యలో బలగాలను దింపి ఏర్పాట్లు చేయలేదని కేంద్ర హౌంమంత్రిత్వశాఖ ఆరోపించింది. కాంగ్రెసే ఇది చేసినట్లు ఆరోపిస్తూ అందుకు క్షమాపణ చెప్పాలని అమిత్ షా అన్నారు.
పంజాబ్ పోలీసు యంత్రాంగ భద్రతాపరమైన లోపాల కారణంగానే ఇది జరిగిందని, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ గనుక దాని నేతలు క్షమాపణ చెప్పాలంటూ బిజెపి డిమాండ్ చేసింది. కేంద్ర హౌంశాఖ సహజంగానే వివరణ ఇవ్వాలని, బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పంజాబ్ ప్రభుత్వం ఇద్దరితో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు గురువారం నాడు ప్రకటించింది.విశ్రాంత న్యాయమూర్తి మెహతాబ్ సింగ్ గిల్, హౌంశాఖ ముఖ్యకార్యదర్శి అనురాగ్ వర్మ దీనిలో సభ్యులు. ఈ ఉదంతంపై విచారణ జరపాలని కోరటం గానీ, విచారించటంపైగానీ విబేధించాల్సిందేమీ లేదు. పంజాబ్ పోలీసులు తగువిధంగా వ్యవహరించలేదా లేక రైతుల చిన్నపాటి నిరసనను సాకుగా చూపి నరేంద్రమోడీ జనం లేని సభను రద్దుచేసుకొన్నారా అన్నది జనానికి తెలియాలి. అంతే కాదు ప్రధాని భద్రతను చూసే ప్రత్యేక రక్షణ దళం(ఎస్‌పిజి), కేంద్ర గూఢచార విభాగం ఏమి చేసిందన్నది, రోడ్డు మార్గంలో వెళ్లాలని ఎప్పుడు తెలిపారన్నది ఆసక్తికరంగా మారింది.
హుస్సేనీవాలా సభకు జనం చాలా తక్కువగా రావటంతో పాటు భారీ వర్షం, వాతావరణం కూడా అనుకూలించలేదని తెలియటంతో ఎన్నికల సభ కానప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపుతుందనే దూరాలోచనతో నరేంద్రమోడీ సభను రద్దు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. సాగు చట్టాల మీద ఉద్యమించిన సంఘాల వేదిక కిసాన్ ఏక్తా మోర్చా ఒకట్వీట్ చేస్తూ రైతులు, పంజాబు జనం పెద్ద ఎత్తున నిరసన తెలిపిన కారణంగానే మోడీ తన సభను రద్దు చేసుకున్నారని, సభా స్ధలిలో చాలా తక్కువ మంది ఉన్నారని, వారిని కూడా బలవంతంగా తీసుకువచ్చినట్లు, పంజాబీల నుంచి ప్రతికూల స్పందన కారణంగా సభ రద్దు జరిగినట్లు పేర్కొన్నది.
ఢిల్లీ నుంచి భటిండా వరకు విమానంలో వచ్చిన ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హుస్సేనీవాలా వెళ్లాలన్నది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం. మధ్యాహ్నం 1.30కు సభ ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం 10.20కి విమానశ్రయంలో దిగిన ప్రధాని వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేనీవాలా చేరాలంటే రెండు గంటలు పడుతుంది,వాతావరణం సరిగా లేని కారణంగా రోడ్డు మార్గాన వెళ్లాలని నిర్ణయించారు 11.50కి ప్రధాని రోడ్డు మార్గాన బయలు దేరారు.
ప్రధాని పర్యటనలకు ముందు ఎఎస్‌ఎల్(ముందస్తు పర్యవేక్షక సమావేశం) నిర్వహించి అనుకోని పరిస్ధితులు ఏర్పడినపుడు ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా చర్చిస్తారు. తగు ఏర్పాట్లు చేస్తారు. రక్షణ బాధ్యత ఎస్‌పిజి కమాండోలదే.ఎస్‌పి హౌదా కలిగిన కమాండెంట్, 40 నుంచి 60 మంది వరకు సిబ్బంది ఉంటారు.వీరు అంతర వలయంగా పని చేస్తారు. తరువాత ఇతర భద్రతా సిబ్బంది ఉంటారు. . ప్రధాని ఒక బహిరంగ సభలో, ఇతర కార్యక్రమంలో పాల్గొన్నా,ఈ అంతరవలయంలోకి రాష్ట్రపోలీసులను అనుమతించరు.ప్రధాని ప్రయాణించే మార్గాన్ని ఖరారు చేయటం, సిబ్బందిని ఏర్పాటు చేయటంలో స్ధానిక పోలీసులకు పాత్ర ఉన్నప్పటికీ ఆ మార్గాన్ని రక్షించేందుకు పారామిలిటరీని రంగంలోకి దించుతారు. ఏవైనా టవర్లు, ఎత్తైన భవనాల వంటివి ఆ మార్గంలో ఉంటే అక్కడ వారే ఉంటారు. రోడ్డు మీదకు ఎవరూ రాకుండా, పనులు చేయకుండా స్ధానిక పోలీసులు చూస్తారు. మూడు నాలుగు గంటల ముందే రోడ్లను శుభ్రపరచటం వంటివి చేస్తారు. బుధవారం నాటి ప్రధాని పర్యటనకు అవన్నీ చేసేందుకు స్ధానిక పోలీసులకు అవకాశం ఉందా అన్నది ప్రశ్న. భారీ వర్షం, వాతావరణం సరిగా లేని కారణంగా (బిపిన్ రావత్ ఇతర మిలిటరీ అధికారుల దుర్మరణం నేపధ్యంలో ప్రధానిని హెలికాప్టర్‌లో తీసుకు వెళ్లేందుకు భద్రతా సిబ్బంది తిరస్కరించి ఉండవచ్చు) రోడ్డు మార్గాన వెళ్లాలని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. ఏఎస్‌ఎల్ సమావేశంలో ప్రత్నామ్నాయ మార్గం గురించి ఆలోచించి ఉంటే ఆ దిశగా వేరే మార్గంలోకి ఎందుకు మళ్లించలేదు, రైతుల ఆందోళనను ఊహించి ఎందుకు అంచనా వేయలేదు అన్న ప్రశ్నలు, ఆ ప్రాంతంలో మరొక మార్గం లేదన్న వార్తలు వచ్చాయి. రైతులు ఆందోళనకు దిగితే కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయిందన్న ప్రశ్నలూ ఉన్నాయి. ఒకవేళ పసిగట్టినా రైతులు తప్పించుకొని నిరసన తెలిపి రోడ్డును ఎలా దిగ్బంధించారు అన్నది తేలాల్సి ఉంది. పర్యటన గురించి ఎంతో ముందుగానే తెలిపినందున తగు భద్రతతో పాటు ప్రత్నామాయ ఏర్పాట్ల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నది కేంద్ర వాదన.
ప్రధాని వచ్చే మార్గం పంజాబ్ పోలీసులకు తెలుసని, వారే ఉప్పందించి ఉండకపోతే అప్పటికప్పుడు రైతులు ఎలా సమీకృతులౌతారంటూ బిజెపి నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు.ప్రధాని రోడ్డుమార్గాన వస్తున్నట్లు టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయని, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా తెలిసిందని, హుస్సేనివాలా వెళ్లేందుకు ఒక్కటే రోడ్డు మార్గం ఉన్నందున తమకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని రైతులు చెబుతున్నారు. సోమవారం నుంచే రైతులు ఆందోళనకు దిగారని మంగళవారం రాత్రి రైతులతో మాట్లాడి నిరసన తెలపవద్దని కోరగా అంగీకరించారని, తాను తెల్లవారు ఝామున 3గంటల వరకు చర్చించానని, తెల్లవారే సరికి కొందరు ఎలా వచ్చారో తెలియ లేదని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పారు. వాతావరణం సరిగా లేకపోవటం, రైతుల ఆందోళన కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించామని, తొలుత హెలికాప్టర్ ద్వారా అనుకున్న కార్యక్రమానికి భిన్నంగా ఆక్మసికంగా మార్చుకున్న నిర్ణయం గురించి సమాచారం లేదని సిఎం చెప్పారు. ఏ పోలీసు అధికారి మీద చర్య తీసుకొనేది లేదని, పంజాబీల మీద లాఠీలు, తూటాలను ప్రయోగించేది లేని కూడా చెప్పారు. నిరసన తెలిపిన రైతులు సమీపంలోని మిస్రీవాలా, పైరేవాలా గ్రామాలకు చెందిన వారని, మూడు రైతు సంఘాల జెండాలను ఎగురవేసినట్లు, సభకు వెళుతున్న బిజెపి మద్దతుదార్ల వాహనాలను కూడా ఆపినట్లు ఇండియా టుడే విలేకరి రాశారు.ప్రధానికి నిరసన తెలపాలని నిర్ణయించిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి గజేంద్ర షెఖావత్ మంగళవారం రాత్రి చర్చలు జరిపిన తరువాత ఆందోళన కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేశారు. జనవరి పదిహేను నాటికి ఎంఎస్‌పికి చట్టబద్దతను పరిశీలించే కమిటీని ఏర్పాటు చేస్తామని, మార్చి 15న రైతులతో ప్రధాని కలుస్తారని మంత్రి వారికి చెప్పారు.
” భటిండా విమానాశ్రయానికి ప్రాణాలతో తిరిగి వచ్చాను, అందుకుగాను మీ ముఖ్యమంత్రికి నా కృతజ్ఞతలు తెలపండి ” అని ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్ అధికారులతో ఢిల్లీ తిరుగు ప్రయాణంలో అన్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్ధ పేర్కొన్నది. ఈ ఎత్తిపొడుపు లేదా వ్యంగ్యం గురించి ఎలాంటి వివరణ వెలువడనందున ఆ వ్యాఖ్య నిజమే అనుకోవాలి. ఓట్ల కోసం రాజకీయ నేతలు ఏ అవకాశాన్నీ వదులుకోరని గతంలోనే రుజువైనందున ప్రధాని మోడీ ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవటంలో ఆశ్చర్యం ఏముంటుంది ! దేశంలో తనకు ఎదురులేదని భావిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఈ ఘటనను అవమానకరంగా భావించారా ? మయసభలో రారాజు మాదిరి మానసికంగా గాయపడ్డారా ?
నిజానికి ప్రధాని వెనక్కు కాకుండా ముందుకు సాగి నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు వెళ్లి వారెందుకు అలా చేశారో తెలుసుకొని భరోసా ఇచ్చి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. సాగు చట్టాల రద్దు చేస్తూ క్షమాపణలు కూడా చెప్పి వారి డిమాండ్ల పరిశీలనకు కమిటీ వేస్తానని హామీ ఇచ్చిన తరువాత ఇంకా ఎందుకు నిరసన తెలుపుతున్నారో తెలుసుకుంటే రైతాంగానికి దగ్గర కావాలన్న లక్ష్యం కొంత మేరకు నెరవేరి ఉండేదేమో ! ఒకటి మాత్రం స్పష్టం. ఫిరోజ్‌పూర్ ఉదంతాన్ని కాంగ్రెస్ మీద దాడి చేసేందుకు ఉపయోగించుకొని ఒక రాజకీయవేత్తగా నరేంద్రమోడీ ప్రయత్నించారు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు పంజాబ్‌లో బిజెపి, దానితో చేతులు కలిపిన మాజీ(కాంగ్రెస్)సిఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ పార్టీ, అకాలీదళ్ నుంచి వచ్చిన చిన్న చీలిక గ్రూపుకు గానీ దీంతో ఎలాంటి ప్రయోజనం కలగదు. కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీపోటీ గట్టి పోటీదారుగా ఉందన్న వాతావరణం ఇప్పటికే ఏర్పడింది. ఫ్లైఓవర్ ఉదంతానికి ముందు జరిగిన పరిణామాలను చూస్తే సాగు చట్టాల అంశంలో రైతులు నరేంద్రమోడీ మీద ఇంకా ఆగ్రహంగానే ఉన్నారన్నది స్పష్టమైంది.
నోటిఫికేషన్ వెలువడక ముందే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అభివృద్ది పనుల పేరుతో పలు చోట్ల ఓటర్లను ఆకట్టుకొనేందుకు నరేంద్రమోడీ సభలు పెడుతున్నారు. దానిలో భాగంగానే రు.42,750 కోట్లతో రూపొందించిన పధకాలను పంజాబీలకు ఎరగా వేసేందుకు బుధవారం నాడు సభను ఏర్పాటు చేశారు. అదేమీ రహస్యసభ కాదు కనుక నిరసన తెలపాలని రైతులు నిర్ణయించారు.
రైతులను రెండు వార్తలు మరింతగా ప్రేరేపించినట్లు చెప్పవచ్చు. సాగు చట్టాల మార్పును పరిశీలించాలని తాను కలిసినపుడు మోడీతో చెప్పానని, చాలా పెడసరంగా మాట్లాడినపుడు ఐదు నిమిషాలు ఆ సందర్భంగా వాదనలు జరిగినట్లు ప్రస్తుతం మేఘాలయ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ చెప్పారు. రైతులు మరణిస్తున్నారని, చట్టాలను సవరించాలని తాను కోరగా వారేమైనా నా కోసం చచ్చారా అని మోడీ దురహంకారంతో అన్నట్లు మాలిక్ చెప్పారు. ఈ వార్త కూడా పంజాబ్ రైతులకు ఆగ్రహం కలిగించి నిరసనలకు ప్రేరేపించిందన్నది స్పష్టం. దీనికి తోడు లఖింపూర్ ఖేరీలో రైతులపై( వారంతా సిక్కు సామాజిక తరగతి వారు) కార్లను తోలి నలుగుర్ని బలితీసుకున్న ఉదంతంలో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఆషిష్ మిశ్రా ప్రధాన నిందుతుడని, ఆ దుర్మార్గం జరిగినపుడు అతడు అక్కడే ఉన్నట్లు దాఖలైన చార్జిషీట్ వార్త కూడా వచ్చిన అంశం తెలిసిందే. సదరు కేంద్రమంత్రిని పదవి నుంచి తొలగించాలని రైతు సంఘాలు చేసిన డిమాండ్‌ను నరేంద్రమోడీ పెడచెవిన పెట్టి కొనసాగిస్తున్నారు. సాగు చట్టాల రద్దు తరువాత ఎన్నికలు జరగాల్సిన పంజాబులో మోడీ తొలి పర్యటన అవమానకరంగా ముసిందని చెప్పవచ్చు.
ఈ ఉదంతం జరిగి ఉండాల్సింది కాదనటంలో మరోమాట లేదు. దేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని కొందరు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు, చరిత్రలో జరగనివి ఇటీవల అనేకం జరుగుతున్నాయి. రైతులు నిరసన తెలిపేందుకు తమ రాజధానికి వస్తే రోడ్ల మీద మేకులు కొట్టి, కాంక్రీటు దిమ్మలు పోసి నానాయాతనలకు గురి చేసింది నరేంద్రమోడీ కాదా ! ఒక ఇరవై నిమిషాలు నిలిచి పోవాల్సి వచ్చినందుకే అవమానంగా భావిస్తే రైతులు ఏడాది పాటు ఏం జరుగుతుందో తెలియని స్ధితిలో గడపారని మరచిపోవద్దు. వారిని ఉగ్రవాదులని, అసలు రైతులే కాదని చేసిన ప్రచారాలు, నిరసన శిబిరాల మీద దాడులకు పురికొల్పిన ఉదంతాలను అంత సులభంగా మరచిపోతారా? వాతావరణం బాగోలేనపుడు గతంలో అనేక కార్యక్రమాలను రద్దు చేసుకోలేదా ? బుధవారం నాడు కూడా అదే ఎందుకు చేయలేదు ?