Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


చైనా గనుక బలవంతంగా స్వాధీనం చేసుకొనేందుకు పూనుకుంటే తైవాన్‌ తన సెమికండక్టర్‌ పరిశ్రమను (TSMC),పూర్తిగా ధ్వంసం చేయాలని అమెరికన్‌ మిలిటరీ పత్రిక ” పారామీటర్స్‌” సూచించింది. జార్‌డ్‌ మెకెనీ, పీటర్‌ హారిస్‌ అనే జంట రచయితలు ఈ సలహా ఇచ్చారు. ఎందుకటా ! తైవాన్‌లో ఉన్న వనరులను పనికి రాకుండా చేస్తే తైవాన్‌ అనావశ్యకమైనదిగా చైనాకు కనిపిస్తుందట. ఒకవేళ ఆక్రమించుకున్నా దానికి పనికి రాకుండా చేయటం చైనాను అడ్డుకొనే ఎత్తుగడల్లో ఒకటవుతుందట.తనకు దక్కని అమ్మాయి వేరెవరికీ దక్క కూడదంటూ యాసిడ్‌ పోసే, హత్యలు చేసే బాపతును ఈ సలహా గుర్తుకు తేవటం లేదూ ! చైనాను దారికి తెచ్చుకొనేందుకు ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించక అమెరికాలో పెరిగిపోతున్న అసహనం, దుష్ట ఆలోచనలకు ఇది నిదర్శనం. ఒక వేళ తైవాను పాలకులు ఆ పని చేయకపోయినా సిఐఏ వారే ఆపని చేయగల దుర్మార్గులు. తైవాన్‌లో రెండున్నర కోట్ల మంది జనాభా ఉన్నారు. వారేమైనా అమెరికన్లకు పట్టదు, కావలసిందల్లా చైనాను అడ్డుకోవటమే. పారా మీటర్స్‌ పత్రికలో ఈ సలహా ఇచ్చిన వారు చిన్నవారేమీ కాదు. అమెరికా ఎయిర్‌ విశ్వవిద్యాలయంలోని భద్రత, వ్యూహాత్మక అధ్యయన కేంద్ర అధిపతిగా మెకనీ, కొలరాడో స్టేట్‌ విశ్వవిద్యాలయ రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్‌గా పీటర్‌ హారిస్‌ ఉన్నాడు.


ఎలక్ట్రానిక్స్‌లో కీలకమైన చిప్స్‌ తయారీలో తైవాన్‌ ప్రాంతం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.అనేక ఇతర దేశాలతో పాటు వాటిని ప్రధాన భూభాగమైన చైనాకు సరఫరా చేస్తోంది.తైవాన్‌ గనుక సెమికండక్టర్‌ పరిశ్రమను నాశనం చేస్తే అమెరికా మిత్రదేశంగా ఉన్న దక్షిణ కొరియాలోని శాంసంగ్‌ ఒక్కటే చిప్స్‌ రూపకల్పనలో ప్రత్నామ్నాయంగా మారుతుందని, చిప్స్‌ లేకపోతే చైనాలోని హైటెక్‌ పరిశ్రమలేవీ పనిచేయవని,అప్పడు చైనీయులు తమ నేతల యుద్ధ ప్రయత్నాలపై తిరగబడతారని, ఒక వేళ స్వాధీనం చేసుకున్పప్పటికీ ఆర్ధిక మూల్యం సంవత్సరాల తరబడి ఉంటుందని, చైనా కమ్యూనిస్టు పార్టీపై జన సమ్మతి తగ్గుతుందంటూ ఒక ఊహా చిత్రాన్ని సదరు పెద్దమనుషులు ఆవిష్కరించారు. చైనా మిలిటరీ అలా వస్తున్నట్లుగా తెలియగానే ఇలా మీటనొక్కగానే వాటంతట అవే సెమికండక్టర్‌ పరిశ్రమలు పేలిపోయేవిధంగా చిప్స్‌ తయారు చేయాలన్నట్లుగా హాలీవుడ్‌ సినిమాల స్క్రిప్ట్‌ను వారు సూచించారు. ఈ రంగంలో పని చేస్తున్న తైవాన్‌ నిపుణులను త్వరగా వెలుపలికి తరలించే పధకాలను సిద్దం చేయాలని, వారికి అమెరికాలో ఆశ్రయం కల్పించాలని కూడా వారు చెప్పారు. తాము చేస్తున్న ప్రతిపాదన తైవానీస్‌కు నచ్చదని, సెమికండక్టర్‌ పరిశ్రమలను నాశనం చేస్తే నష్టం చాలా స్వల్పమని అదే అమెరికా యుద్ధానికి దిగితే పెద్ద ఎత్తున, దీర్ఘకాలం సాగుతుందని అమెరికన్‌ రచయితలు పరోక్షంగా తైవానీస్‌ను బెదిరించారు.


చైనాలోని ఒక తిరుగుబాటు రాష్ట్రం తైవాన్‌ . ఐక్యరాజ్యసమితిలో రెండు చైనాలు లేవు, తైవాన్‌కు ఒక దేశంగా గుర్తింపు లేదు.తైవాన్‌లోని కొందరు స్వతంత్ర దేశంగా మార్చాలని చూస్తున్నారు. అధికారికంగా తైవాన్‌ ప్రాంతం కూడా చైనాలో విలీనం గురించే మాట్లాడుతుంది తప్ప మరొకటి కాదు. విలీనం అవుతాము గానీ అది కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చైనాలో కాదు అంటూ నాటకం ఆడుతోంది. అమెరికా సైతం ఒకే చైనా భావనను అంగీకరిస్తూనే విలీనం బలవంతంగా జరగకూడదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మరోవైపు దానికి ఆయుధాలు సమకూరుస్తూ, దొడ్డి దారిన అక్కడ కార్యాలయం తెరిచింది. బలవంతంగా ఆక్రమించుకుంటే చైనాను అడ్డుకుంటామని పదే పదే చెబుతోంది. ఐరాస తీర్మానానికి వ్యతిరేకంగా తైవాన్ను కొన్ని అమెరికా తొత్తు దేశాలు గుర్తిస్తున్నట్లు ప్రకటించి చైనాను రెచ్చగొడుతున్నాయి. ఆ ప్రాంతం తమదే అని, విలీనం సెమికండక్టర్‌ పరిశ్రమ కోసం కాదని చైనా స్పందించింది. ఒకవేళ తైవాన్ను ఆక్రమించదలచుకుంటే చైనాకు 14గంటల సమయం చాలునని, దాన్ని అడ్డుకొనేందుకు అమెరికా, జపాన్‌ రావాలంటే 24 గంటలు పడుతుందని కొందరు చెప్పారు.


తమ దేశాన్ని బాగు చేసుకోవటం గురించి ఇలాంటి పెద్దలు కేంద్రీకరించకుండా ఎదుటి వారిని దెబ్బతీయాలని దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు చేస్తున్నట్లు ? రెండు కారణాలున్నాయి. చైనా మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించాలన్నది అమెరికా కార్పొరేట్ల ఆలోచన. రకరకాల ఎత్తుగడలు వేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నకొద్దీ కొరకరాని కొయ్యగా మారుతోంది. ఆంక్షలను విధించటం, అమెరికా యుద్దనావలను తైవాన్‌ జలసంధిలో దించినప్పటికీ చైనా అదరలేదు బెదరలేదు. తాజాగా చైనా స్వంతంగా చిప్స్‌ తయారీకి పూనుకుంది.2049 నాటికి ఒక దేశం- రెండు వ్యవస్ధల ప్రత్యేక పాలిత ప్రాంతాలుగా ఉన్న హాంకాంగ్‌, మకావు దీవులు ప్రధాన ప్రాంతలో పూర్తిగా విలీనం అవుతాయి. అప్పటికి తైవాన్‌ విలీనం కూడా పూర్తి కావాలని చైనా భావిస్తోంది. ధనిక దేశాల స్ధాయికి తమ జనాల జీవన ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతో ఉంది. హాంకాంగ్‌ను స్వతంత్ర దేశంగా మార్చాలనే అమెరికా ఎత్తుగడలు విఫలం కావటంతో ఇప్పుడు తైవాన్‌ అంశం మీద రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.


మన దేశంలో కూడా ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తున్నవారు లేకపోలేదు.ఆర్‌సి పాటియల్‌ అనే మాజీ సైనికాధికారి తాజాగా రాసిన వ్యాసంలో అమెరికా ఎత్తుగడలకు అనుగుణంగా ప్రతిపాదించారు. దాని సారాంశం ఇలా ఉంది. అడ్డుకొనే వారు లేకపోతే వివిధ దేశాల పట్ల చైనా కప్పగంతులు వేస్తూ ముందుకు సాగుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో మిత్రరాజ్యాలు జపాన్‌ మీద దాడి చేసినపుడు భారీ ఎత్తున మిలిటరీ ఉన్న దీవులను వదలి ఇతర వాటిని పట్టుకున్నాయని ఇప్పుడు చైనా కూడా అదే పద్దతులను అనుసరించవచ్చని పేర్కొన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు దిగువ సూచనలు పాటించాలని పాటియల్‌ పేర్కొన్నారు. చైనా బలవంతానికి గురైన దేశాలు ముందు స్వంతంగా పోరాడాలి, తరువాత ఉమ్మడిగా పధకం వేయాలి. చైనా వాణిజ్య, ఇతర వత్తిళ్లకు ఇప్పటికై గురైన వాటిని, భవిష్యత్‌లో అవకాశం ఉన్న దేశాలన్నింటినీ అమెరికా, భారత్‌ ఒక దగ్గరకు చేర్చాలి. చైనాలో టిబెట్‌ అంతర్భాగమంటూ 1954లో నెహ్రూ ప్రభుత్వం గుర్తించినదానిని రద్దు చేయాలి. ముందుగా దేశ రాజకీయనేతలు ఆ పని చేసేందుకు భయపడకూడదు. తైవాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలి, దాని తరఫున అమెరికా నిలవాలి. కొత్త దలైలామాను ఎన్నుకొనేందుకు సాంప్రదాయ పద్దతి పాటించేందుకు ప్రస్తుత దలైలామాను అనుమతించాలని భారత్‌ వత్తిడి తేవాలి. ఈ అంశంలో చైనా వైఖరిని గట్టిగా ఎదుర్కోవాలి. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న ఉఘిర్స్‌ ఈస్ట్‌ టర్కిస్తాన్‌ ప్రభుత్వాన్ని(చైనాలోని షిన్‌జియాంగ్‌ రాష్ట్ర తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసినది. వారికి మానవహక్కులు లేవంటూ ప్రచారం చేస్తున్న అంశం తెలిసిందే) గుర్తించే విధంగా ముస్లిం దేశాలను ఒప్పించాలి. అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలతో ఉన్న చతుష్టయం(క్వాడ్‌) ప్రస్తుతం మిలిటరీ కూటమి కాదు, రాబోఏ రోజుల్లో అలా మార్చాలి. మరిన్ని దేశాలతో విస్తరించాలి.అమెరికా, ఇజ్రాయెల్‌,భారత్‌, ఐక్య అరబ్‌ దేశాలతో రెండవ చతుష్టయాన్ని ఏర్పరచాలి.చైనాతో అన్ని దేశాలూ వాణిజ్యాన్ని తగ్గించుకోవాలి.ఆస్ట్రేలియా,బ్రిటన్‌, అమెరికాలతో కూడిన అకుస్‌ మాదిరి భారత్‌, ఫ్రాన్స్‌, జపాన్‌ భద్రతా కూటమిని ఏర్పాటు చేయాలి. ఇండో-పసిఫిక్‌, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని దేశాలన్నింటికీ అమెరికా రక్షణ కల్పించాలి. చైనాను అగ్రరాజ్యంగా ఎదగకుండా చూడాలి.భావ సారూప్యత కలిగిన దేశాలు ముప్పును ఎదుర్కొనేందుకు సిద్దపడి చైనా కప్పగంతు పధకాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి.


అమెరికా అజెండాకు అనుకూలమైన ఎత్తుగడలతో మన దేశాన్ని ఎక్కడకు తీసుకుపోదామనుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లనే అదుపు చేయలేని అమెరికా మిలిటరీ చైనాను నిలువరించగలదా ? తన మిలిటరీని తానే రక్షించుకోలేక తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని దేశం విడిచిన వారు మన దేశం, మరొక దేశం కోసం పోరాడతారా? అసలు అమెరికా తాను స్వయంగా ప్రారంభించిన ఏ యుద్దంలో ఐనా గెలిచిన ఉదంతం ఉందా? దురద తనది కాదు గనుక ఇతరులను తాటి మట్టతో గోక్కోమన్నట్లుగా పడక కుర్చీలకు పరిమితమైన ఇలాంటి యుద్దోన్మాదులు చెప్పే ఉచిత సలహాలను అనుసరిస్తే వారికేమీ పోదు, సామాన్య జనజీవితాలు అతలాకుతలం అవుతాయి.చైనాతో మనకు పరిష్కారం కావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. శుభకార్యానికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు ఇలాంటి పనులు చేస్తే ఫలితం ఉంటుందా ? కావాల్సింది సరిహద్దు సమస్య పరిష్కారమా ? చైనాతో వైరమా ? దాన్ని గురించి ఒక్కటంటే ఒక్క సూచన కూడా ఈ పెద్దమనిషి చేయలేదు.