Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా సభ్యత్వం పొంది(2001) రెండు దశాబ్దాలు గడిచింది. ఈ కాలంలో జరిగిన పరిణామాలు, పర్యవసానాలేమిటి అనే సింహావలోకనం జరుగుతోంది. చైనా సంస్కరణలకు నాలుగుదశాబ్దాలు దాటాయి. సోషలిస్టు బాటను వదలి ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్నదని చెప్పేవారు కొందరు మనకు తారసపడతారు. తమవైన లక్షణాలు కలిగిన సోషలిస్టు సమాజ నిర్మాణం అని చైనా చెబుతోంది. నిజంగా పెట్టుబడిదారీబాటనే పడితే మిగతాదేశాలు ఎదుర్కొన్న స్వభావసిద్ద సంక్షోభాలకు దూరంగా ఎలా ఉండగలిగింది ? అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు అందరూ ఒక్కటై ఎందుకు కత్తులు దూస్తున్నారు ? ఏ మార్కెట్లను పంచుకొనేదగ్గర విబేధాలు తలెత్తినట్లు ? ఇవన్నీ ఆలోచించాల్సిన, తర్కించాల్సిన అంశాలు.చైనా మిగతా దేశాలు ప్రత్యేకించి అమెరికాతో ముడిపడిన కొన్ని అంశాలను చూద్దాం.


ఇతర దేశాల ఉత్పత్తులను కాపీ కొట్టి స్వల్ప మార్పులను చేసి స్వంత నవకల్పనలుగా చెప్పుకొంటోంది అన్నది చైనాపై ఒక ప్రధాన ఆరోపణ.పదిహేను లక్షల సంవత్సరాల క్రితం నుంచి కొనదేలిన రాతి ముక్కలను గొడ్డళ్లుగా వినియోగించటం ప్రారంభించగా, పిడితో ఉన్న గొడ్డలి క్రీస్తుపూర్వం ఆరువేల సంవత్సరాల నుంచి ఉనికిలోకి వచ్చింది. ఇప్పుడు ఎన్నిరకాల గొడ్డళ్లు, పిడులు ఉన్నాయో తెలిసిందే. ఎవరిని ఎవరు కాపీ కొట్టినట్లు ? కార్ల సంగతీ అంతే కదా !1879 కారుకు తొలి పేటెంట్‌ పొందిన జర్మన్‌ కార్ల్‌ బెంజ్‌ అంతకు ముందు జరిగిన రూపకల్పనలను పరిగణనలోకి తీసుకోకుండానే కొత్తగా కనిపెట్టాడా ? కాపీరైట్‌ చట్టాలు లేక ముందు నవీకరణలు లేవా ? వాటిని చూసి మరింత మెరుగైన వాటిని కనుగొనలేదా ?ఎవరైనా, ఏ దేశమైనా చేసేది, చేస్తున్నది అదే. మరి చైనాలో కొత్తగా కనుగొన్నవేమీ లేవా ? చైనీయులు కాపీ గొట్టటం తప్ప మరేమీ చేయటం లేదని అమెరికా అధికారులు, కొందరు మేథావులు చెబుతుండగానే వారి ఊహకు అందని రీతిలో చైనా, ఇతర దేశాల్లో నవకల్పనలు జరుగుతున్నాయి. తన అవసరాలకు అనుగుణంగా చైనా వాటిని మార్చుకుంటోంది.చైనాతో పోల్చితే మన దేశంలో ఆంగ్లం తెలిసినవారు, నిపుణులు ఎక్కువ మందే ఉన్నారు. కాపీ కొట్టవద్దని, లేదా వాటిని చూసి మన అవసరాలకు తగినట్లు కొత్త రూపకల్పనలు చేయవద్దని ఎవరూ చెప్పలేదు కదా ! మరెందుకు జరగలేదు ?


షీ జింపింగ్‌ అధికారానికి వచ్చిన తొలి రోజుల్లోనే చైనా లక్షణాలతో కూడిన స్వతంత్ర నవకల్పనలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. దానికి అనుగుణంగానే పెద్ద మొత్తాలలో పరిశోధన-అభివృద్ధికి నిధులు కేటాయించారు, 2030వరకు ఒక కార్యాచరణను కూడా రూపొందించారు. పది సంవత్సరాల క్రితం ప్రపంచ నవకల్పన సూచికలో 43వదిగా ఉన్న చైనా 2020లో 14వ స్ధానంలో ఉంది.షీ అధికారానికి రాక ముందు కూడా శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉయి చాట్‌ పేరుతో ఉన్న ఆప్‌ నేడు చైనా జనజీవితాలతో విడదీయరానిదిగా ఉంది. ఆహార ఆర్డర్ల మొదలు బిల్లుల చెల్లింపు, చివరికి విడాకులు, వీసా దరఖాస్తులను కూడా దాని ద్వారా పంపవచ్చంటే పట్టణ-గ్రామీణ తేడాల్లేకుండా అందరికీ అందుబాటులోకి వచ్చిన ఆప్‌ మరొకటి ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు.2019లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మూడు నెలల కాలంలో 95శాతం మంది ఒకసారైనా ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసినట్లు తేలింది. సగటున ఒక వినియోగదారుడు రోజుకు నాలుగు లావాదేవీలు జరిపారు. అమెరికాలో 2018నాటి వివరాల మేరకు ఐదోవంతు మంది అమెరికన్లు ఒక్కసారి కూడా మొబైల్‌ చెల్లింపులు చేయలేదు.


పెట్టుబడిదారీ విధాన సమర్దకులు చెప్పే అంశాలలో ప్రభుత్వరంగం నవకల్పనలకు అనువైనది కాదు, ప్రయివేటువారే చేయగలరు అన్నది ఒకటి. బహుళపార్టీల ప్రజాస్వామిక వ్యవస్ధలున్న దేశాల్లోనే విశ్వవిద్యాలయాలు నవకల్పనల కేంద్రాలుగా ఉంటాయి అన్న భావనలను చైనా వమ్ము చేసింది. స్మార్ట్‌ సిటీ పేటెంట్లకు సంబంధించి కూడా చైనా ఎంతో ప్రగతి సాధించింది.అక్కడి మార్కెట్‌ విలువ లక్ష కోట్ల డాలర్లని అంచనా.ప్రపంచంలోని స్మార్ట్‌సిటీ పేటెంట్లు ఎక్కువగా ఉన్న పది అగ్రశ్రేణి కంపెనీలలో చైనా ప్రభుత్వ రంగ సంస్ధ స్టేట్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ప్రధమ స్ధానంలో ఉంది.2020 నవంబరు నాటికి ఉన్న సమాచారం ప్రకారం దీనికి 7,156 పేటెంట్లు ఉండగా రెండవ స్ధానంలో ఉన్న దక్షిణ కొరియా ప్రైవేటు కంపెనీ శాంసంగ్‌కు 3,148 ఉన్నాయి. చైనా తరహా స్మార్ట్‌ సిటీ కాంట్రాక్టులను పలు దేశాల్లో చైనా కంపెనీలు దక్కించుకున్నాయి.దీని అర్ధం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అమెరికా, ఇతర ఐరోపా దేశాలను చైనా అధిగమించిందని కాదు. కొన్ని రంగాలలో అది వెనుకబడే ఉంది.2018లో విద్యామంత్రిత్వశాఖ 35కీలకమైన టెక్నాలజీలను స్ద్ధానికంగా తగినంత నాణ్యత లేదా తగు మొత్తంలో ఉత్పత్తి చేయలేకపోతున్నట్లు ఒక సమాచారంలో పేర్కొన్నది. వాటిలో హెవీడ్యూటీ గాస్‌ టర్బైన్లు, హై ప్రెషర్‌ పిస్టన్‌ పంప్స్‌, కొన్ని బేరింగ్స్‌కు అవసరమైన ఉక్కు, ఫొటోలిథోగ్రఫీ మెషిన్లు, కీలక పరిశ్రమల సాఫ్ట్‌వేర్ల వంటివి వాటిలో ఉన్నాయి.


డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యయుద్దానికి ముందు నుంచే అమెరికా సాంకేతిక దాడి మొదలెట్టింది. దానిలో భాగంగా 2016 తరువాత రెండు దేశాల సాంకేతిక రంగ పెట్టుబడులు 96శాతం తగ్గాయి. అప్పటి నుంచి ఇతర వనరుల నుంచి వాటిని సేకరించేందుకు, స్వంతంగా అభివృద్ధి చేసుకొనేందుకు చైనా పూనుకుంది.కేవలం తమను కాపీ చేస్తోందని అమెరికా, తదితర దేశాలు అనుకుంటూ కూర్చుంటే వారు బావిలో కప్పల మాదిరి ఉన్నట్లే. టెలికాం రంగంలో 5జి, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి కొన్ని రంగాలలో చైనా ముందున్నది. మరి దాన్ని ఎక్కడి నుంచి కాపీ చేసిందని చెబుతారు.


చైనా, భారత్‌ రెండూ సంస్కరణలల్లో భాగంగా విదేశీ పెట్టుబడులు, కంపెనీలను ఆహ్వానించాయి. కానీ ఇవి రెండూ చైనావైపే మొగ్గుచూపాయి. కరోనా కారణంగా సరఫరా వ్యవస్దలు దెబ్బతినటం, అమెరికాలో పెరుగుతున్న అసంతృప్తి నేపధ్యంలో ఇటీవల చైనా నుంచి కంపెనీలు తరలిపోతున్నాయని ప్రచారం చేశారు.కొన్ని అమెరికన్‌ కంపెనీలు చైనా నుంచి తరలిపోవాలనే ఆలోచనలు చేసినప్పటికీ అవి స్వదేశానికి లేదా సరిహద్దులో ఉన్న మెక్సికో గురించి పరిశీలిస్తున్నాయి తప్ప మనలను అసలు పరిగణనలోకి తీసుకోవటం లేదు. విదేశాల నుంచి అమెరికా తిరిగి వచ్చిన కంపెనీలు, ఎఫ్‌డిఐ కారణంగా 2020లో కొత్తగా ఉత్పాదక రంగంలో 1,60, 649 మందికి ఉపాధి వచ్చినట్లు ఒక పరిశీలన వెల్లడించింది.2022లో రెండు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా. గతంలో కోల్పోయిన ఉపాధితో పోల్చితే ఇది నామమాత్రం. అలా వచ్చిన కంపెనీల్లో 60శాతం విదేశాల్లో వేతనాలను, వస్తువులను తమ దేశానికి తరలించాలంటే అయ్యే రవాణా ఖర్చులను ప్రధానంగా పోల్చుకున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్ధితుల కారణంగా రవాణా ఓడల లభ్యత కూడా అనిశ్చితిలో పడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో ఆసియా నుంచి అమెరికాలోని పశ్చిమ తీరానికి ఒక 40 అడుగుల కంటెయినరులో సరకు రవాణాకు ఇరవైవేల డాలర్లు గరిష్టంగా పలికింది, ఈ ఏడాది జనవరి తొలివారంలో స్పాట్‌ రేటులో 14,487 డాలర్లుగా ఉంది. అవే వస్తువులను పక్కనే ఉన్న మెక్సికోలో తయారు చేస్తే సరకును బట్టి 1,600 నుంచి 1,800 డాలర్లకు ఒక ట్రక్కు వస్తుంది.పరిశ్రమలు తిరిగి వస్తే దేశ ఆర్ధికరంగంలోకి రానున్న కొద్ది సంవత్సరాల్లో 443 బిలియన్‌ డాలర్లు వస్తాయని కూడా ఆర్ధికవేత్తలు అంచనా వేస్తున్నారు.


తిరిగి రాదలుచుకున్న కంపెనీలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న సమస్యను కూడా ఎదుర్కొంటున్నాయి.కంపెనీలు వచ్చినా ఎందరికి ఉపాధి కల్పిస్తాయి అన్న ప్రశ్నకూడా ఎదురవుతోంది.ఆధునిక యంత్రాలు, రోబోలు,కంప్యూటర్లతో నడిచే ఫ్యాక్టరీలో కార్మికులు పరిమితంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న గోడవున్లు, భవనాలను అమెజాన్‌ వంటి కంపెనీలు ప్రధాన పట్టణాలన్నింటా ఇప్పటికే తీసుకున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే వాటికి నిర్మాణ ఖర్చు, స్ధలాల లభ్యత అంశాలు ముందుకు వస్తున్నాయి. అమెరికాకు పునరాగమన చర్చ ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు పొలోమంటూ తిరిగి వచ్చే అవకాశాలు పరిమితమే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.


చైనాలో చౌకగా దొరికే శ్రమశక్తి, మార్కెట్‌ను ఆక్రమించుకొనే లక్ష్యంతోనే ఐరాస, ప్రపంచ వాణిజ్య సంస్ధలో సభ్యత్వం ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది తప్ప మరొక మహత్తర లక్ష్యం లేదు. అనుకున్నదొకటీ, అయింది ఒకటీ అన్నట్లుగా ఇప్పుడు అమెరికన్లు గుండెలు బాదుకుంటున్నారు. చైనాను దారికి తెచ్చేందుకు వేసిన ఎత్తులూ, జిత్తులు, బెదిరింపులు, బుజ్జగింపులు ఏవీ మొత్తం మీద పని చేయటం లేదు. ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఉంది.కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా దెబ్బకు దెబ్బతీస్తున్నప్పటికీ చైనా నుంచి అమెరికా దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. కారణం చైనా మీద ప్రేమ దోమా కాదు. ఇప్పటికీ ముందే చెప్పుకున్న రవాణా ఖర్చు ఉన్నప్పటికీ అక్కడి నుంచి సరకులను దిగుమతి చేసుకుంటే అమెరికన్లకు 30-35శాతం ఉత్పత్తి ఖర్చు కలసి వస్తోంది. గతంతో పోలిస్తే అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై ఆంక్షలేమీ పెట్టకపోయినా, స్వంతంగా రూపొందించుకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా నానాటికీ స్వయం సమృద్దం అవుతున్న కారణంగా హైటెక్‌ ఉత్పత్తుల దిగుమతులు తగ్గి అమెరికా వాణజ్యలోటు పెరుగుతూనే ఉంది.


ఇప్పటికిప్పుడు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులలో నాలుగోవంతు నిలిపివేస్తే అమెరికాకు ప్రారంభంలో 35శాతం ఖర్చు పెరుగుతుందని అంచనా. విధిస్తున్న షరతులకు బదులు స్ధానిక కొనుగోళ్లను ప్రోత్సహించాలని స్ధానిక కంపెనీలు కోరుతున్నాయి. కొందరైతే చైనా కంపెనీలనే తమ గడ్డమీదకు ఆహ్వానిస్తే సరఫరా సమస్యలు తలెత్తవని చెబుతున్నారు. ఆ మేరకు ఫుయావో గ్లాస్‌ అనే చైనా కంపెనీ అమెరికాలో ఉత్పత్తి చేస్తోంది. అదే విధంగా ఎక్సకవేటర్‌ కంపెనీ కూడా పని చేస్తోంది.ఇది కొత్త పరిణామం. ఇతర దేశాలతో అమెరికా చేసే వాణిజ్యం వలన దానికి జిడిపి విలువలో రెండు నుంచి ఎనిమిదిశాతం వరకు లబ్దికలుగుతున్నది. అది అప్పనంగా వచ్చినట్లే కదా అని చూసుకున్నారు తప్ప దాని వలన తమ జనాలు కోల్పోయే ఉపాధిని అక్కడి పెట్టుబడిదారీ విధానం పట్టించుకోలేదు.


ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా చేరినప్పటి నుంచి ఇరవై సంవత్సరాల్లో వాణిజ్యలోటుతో పాటు 37 నుంచి 65లక్షల ఉద్యోగాలు అమెరికాలో గల్లంతైనట్లు అంచనా. మన దేశంలో సంస్కరణల పేరుతో విదేశాలకు మార్కెట్‌ తెరిచిన తరువాత వారి షరతులను మన మీద రుద్దారు. వాటికి అనుగుణంగా మన ప్రభుత్వ రంగ సంస్ధలను పధకం ప్రకారం నీరుగార్చారు, ఇప్పుడు తెగనమ్మేందుకు పూనుకున్నారు.చైనాలో కూడా అదే చేయ వచ్చని తప్పుడు అంచనా వేశారు.కానీ జరిగింది అది కాదు. అమెరికా, ఇతర దేశాలు తమ వస్తువులు, సంస్ధలకు ఎంత మేరకు ప్రవేశం కల్పిస్తాయో ఆ మేరకే తానూ అనుమతించింది. తమ దగ్గరకు రావాలని కోరుకున్న కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని తమతో పంచుకోవాలన్న షరతు విధించింది. విదేశీ కంపెనీల నుంచి ప్రభుత్వ కొనుగోళ్లకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ రంగ సంస్ధలకు సబ్సిడీలను కొనసాగించింది. తమ దగ్గర నుంచి కొనుగోలు చేసిన విలువగల సరకులను దిగుమతి చేసుకున్న దేశాల నుంచి కొనాల్సిన అగత్యం తమకు లేదని స్పష్టం చేసింది.