Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మంగళవారం నాడు ఉత్తర ప్రదేశ్‌ బిజెపికి అనూహ్య బహుమతి లభించగా, ఊహించని దెబ్బ తగిలింది. దాదాపు 60 మంది ఎంఎల్‌ఏలను తప్పించి కొత్త ముఖాలతో బరిలోకి దిగేందుకు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు. కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య పదవికి రాజీనామా చేసి సమాజవాది పార్టీ నేతతో ఫొటోకు ఫోజిచ్చారు. మరో ముగ్గురు ఎంఎల్‌ఏలు కూడా అదే బాట పట్టారు. పదమూడు మంది బిజెపి ఎంఎల్‌ఏలు రాజీనామా చేయనున్నట్లు ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ ప్రకటించారు. తన బాటలో నడిచే వారు 15 మంది వరకు ఉన్నట్లు మౌర్య చెబుతున్నారు. మరో మంత్రి ధరమ్‌ సింగ్‌ సయానీ కూడా ఇదే బాటపట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. సీట్లు రాని వారు, బిజెపి గెలిచే అవకాశాలు లేవని గ్రహించిన వారు ఎందరు రాం రాం చెబుతారో తెలియదు. మార్చి పదవ తేదీ తరువాత పార్టీ కార్యాలయాన్ని మూసుకోవాల్సి వస్తుంది కనుక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌కు తాళం కప్పను బహుమతిగా పంపినట్లు సమాజవాది పార్టీ నేత ఐపి సింగ్‌ ప్రకటించారు. ” ఓం ప్రకాష్‌ రాజభర్‌, జయంత్‌ చౌదరి, రాజమాత కృష్ణపటేల్‌, సంజయ చౌహాన్‌, ఇప్పుడు స్వామి ప్రసాద్‌ మౌర్య మాతో ఉన్నారు. బిజెపి ప్రధాన కార్యాలయానికి తాళం కప్పను బహుమతిగా పంపాను. మార్చి పదవ తేదీ(ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) తరువాత తాళం వేసి ఇంటికి వెళ్లి పోండి. ఇది అలకాదు, ఎస్‌పి తుపాను ” అని ట్వీట్‌ చేశారు.


యోగి సర్కార్‌ ఒబిసిలు, దళితులు, రైతులు,చిన్న సన్నకారు వ్యాపారులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య ట్వీట్‌ ద్వారా రాజీనామా లేఖ పంపారు. ఇది వెలువడిన కొన్ని నిమిషాల్లోనే మౌర్య సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ను కలిసిన ఫొటో దర్శనమిచ్చింది.స్వామి ప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు అఖిలేష్‌ ప్రకటించారు. ఐదు సార్లు ఎంఎల్‌ఏగా, మంత్రిగా పనిచేసి మాయావతి తరువాత నేతగా పేరున్న మౌర్య 2016లో బిఎస్‌పి నుంచి బిజెపిలో చేరారు. ఇప్పుడు సమాజవాదిలో నేరుగా చేరతారా లేక గతంలో ఏర్పాటు చేసిన వేదికను పునరుద్దరించి మిత్రపక్షంగా బరిలోకి దిగుతారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల గురించి వివిధ సర్వేలు వెలువడుతున్నాయి. ఏబిపి-సి ఓటర్‌ 2021 మార్చి 18న ఒక సర్వే, తాజాగా జనవరి 10న సర్వే వివరాలను ప్రకటించింది.మధ్యలో మరోనాలుగు సర్వేలను నిర్వహించింది.తొలి, తాజా సర్వేల అంచనా సీట్లు, ఓట్లశాతాలు ఇలా ఉన్నాయి.తొమ్మిది నెలల కాలంలో బిజెపి పలుకుబడి ఎలా పడిపోతోందో ఈ వివరాలు సూచిస్తున్నాయి. నామినేషన్లు, ఉపసంహరణల లోగా జరిగే పరిణామాలు పార్టీ ప్రభావాన్ని మరింతగా దిగజార్చేవే తప్ప పెంచేవిగా లేవు.


తేదీ××××××ఎన్‌డిఏ ×××××××ఎస్‌పి×××××××బిఎస్‌పి×××××××కాంగ్రెస్‌×× ఇతరులు
18.3.21××284-294(41)×××54-64(24.4)×××33-43(20.8)××1-7(5.9)××10-16(7.9)
10.1.22××223-235(41.5)××145-157(33.3)××8-16(12.9)××3-7(7.1)××4-8(5.3)
గతఫలితాలు××312(41.4)××47(23.6)××××19(22.2)××××××× 7(6.3)××××ు(6.5)


తన వంటి ఉదారవాదులు బిజెపి ఓడిపోవాలని కోరుకుంటున్నప్పటికీ ఉత్తర ప్రదేశ్‌లో అదే జరిగితే దేశంలో సంస్కరణలు వెనుకపట్టు పడతాయని కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ అంక్లేశ్వరియా అయ్యర్‌ పేర్కొన్నారు. ఎకనమిక్స్‌ టైమ్స్‌ ప్రతినిధితో మాట్లాడుతూ సాగు చట్టాల ప్రహసనంతో ఇప్పటికే సంస్కరణలు వెనుకపట్టు పట్టాయి.మానిటైజేషన్‌, కార్మిక సంస్కరణలు కూడా అదే విధంగా మారతాయన్నారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి వెలువడుతున్న చెడు సంకేతాల కారణంగా మానిటైజేషన్‌ మందగించిందన్నారు. బిజెపి గెలిస్తే సంస్కరణలు వేగంగా అమలు జరుగుతాయని, ఓడితే మిగతా రాష్ట్రాల సంస్కరణల మీద కూడా ప్రభావం ఉంటుందన్నారు. దేశ ఆర్ధిక రంగం ఏ బాటలో నడుస్తుందన్నది వచ్చే బడ్జెట్‌ మీదగాక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. బిజెపి మతతత్వ వైఖరిని అయ్యర్‌ వంటి వారు ఆమోదించనప్పటికీ సమాజం ఏమైనా ఫరవాలేదు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం గెలవాలని కోరుకుంటున్నారు. కార్పొరేట్ల అంతరంగానికి ఇది ప్రతిబింబం.


సీట్ల సంఖ్య తగ్గినా తిరిగి అధికారం ఖాయం అనే ముక్తాయింపులు తప్ప గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బిజెపికి ఓట్లశాతం పెరుగుతుందని ఏ సర్వే కూడా చెప్పటం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెబుతున్నపుడు ఓట్లు తగ్గకుండా ఎలా ఉంటాయన్న ప్రశ్న తలెత్తుతోంది.తన ఓటు బాంకును నిలుపుకొనేందుకు యోగి ఆదిత్యనాధ్‌ రాష్ట్ర ఎన్నికలు 80-20శాతాల మధ్య జరగనున్నాయంటూ మతాన్ని ముందుకు తెచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 80శాతం హిందువులు, 20శాతం ముస్లింలు ఉన్నారన్న సంగతి తెలిసిందే.403కు గాను 140 నియోజకవర్గాలలో 70 చోట్ల ఓటర్లలో 30శాతం, మిగిలిన చోట్ల 25-30శాతం వరకు ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారున్నారని అంచనా. బిజెపి బీ టీమ్‌గా భావిస్తున్న మజ్లిస్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది, ఐనప్పటికీ అత్యధిక ఓటర్లు ఎస్‌పి వైపు మొగ్గు చూపనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బిఎస్‌పిలో మాయావతి తరువాత స్ధానంలో ఉన్న మౌర్య తమ పార్టీలో చేరినపుడు గొప్ప పరిణామంగా చిత్రించిన బిజెపి ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఒక రోజు సంచలన వార్త తప్ప ఏదో ఒక రోజు ఇలా చేస్తారని తమకు తెలుసు అని బిజెపి చెబుతోంది. కుమార్తె సంఘమిత్ర ఎంపీగా ఉన్నారని, తన కుమారుడికి సీటు ఇవ్వాలన్న కోర్కెను పార్టీ తిరస్కరించినందున ఇలా చేశారని ఆరోపించింది.(గత ఎన్నికల్లో సీటు ఇచ్చారు, సమాజవాదీ చేతిలో ఓడారు) బిజెపి విధానానికి వ్యతిరేకంగా ఓబిసి జన గణన చేయాలని కోరిన వారిలో మౌర్యఒకరు.


సమాజవాదితో మౌర్య చేతులు కలిపితే యాదవేతర ఓబిసిల్లో కొంత శాతం బిజెపికి దూరమైనా ఫలితాలు చాలా చోట్ల తారుమారౌతాయి. వెనుకబడిన తరగతుల్లో మౌర్య, కుష్వాహ సామాజిక తరగతికి చెందిన వారిలో స్వామి ప్రసాద్‌ మౌర్య పలుకుబడి కలిగిన నేత. ఇదే సామాజికి తరగతికి చెందిన కేశవ ప్రసాద్‌ మౌర్య ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అంతపలుకుబడి కలిగిన వారని కాదని చెబుతారు. ఇప్పటికే బిజెపి కూటమి నుంచి మరో రెండు బిసి సామాజిక తరగతుల నేతలు సమాజవాది పార్టీతో చేతులు కలిపారు.యాదవులు మినహా మిగిలిన ఓబిసిలందరూ తమతో ఉన్నారని బిజెపి చెప్పుకొనేందుకు ఇప్పుడు అవకాశం లేదు. కాంగ్రెస్‌కు చెందిన బలమైన నేత ఇమ్రాన్‌ మసూద్‌ కూడా తాను ఎస్‌పిలో చేరుతున్నట్లు ప్రకటించారు. గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌ పార్టీల వెనుక చీలి ఉన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో మెజారిటీ ఇప్పుడు ఎస్‌పి వెనుక సమీకృతులౌతున్నట్లు చెబుతున్నారు. గతంలో ముజఫర్‌ నగర్‌ ప్రాంతంలో మతఘర్షణల్లో జాట్లు-ముస్లింలు మతాల వారీ చీలినప్పటికీ ఇటీవలి రైతు ఉద్యమం వారిని సన్నిహితం చేసిందని వార్తలు వచ్చాయి. ఏడు దశలుగా జరిగే ఎన్నికల్లో తొలి రెండు దశలకు జనవరి 14న నామినేషన్లు ప్రారంభమౌతాయి. ఈ దశల్లోని 113 సీట్లకు ముందుగా బిజెపి అభ్యర్దులను ఖరారు చేయనుంది. సమాజవాది కూడా అదే పద్దతిని పాటించవచ్చు. తాను పోటీ చేయటం లేదని ప్రకటించిన మాయావతి బిఎస్‌పి తరఫున అన్ని చోట్లా పోటీ పెట్టనున్నట్లు ప్రకటించారు.