Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసింది సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం. దానిపై జనాన్ని రెచ్చగొట్టి లబ్దిపొందేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి సంబంధిత సంస్ధలు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, కుట్రలను జనం వమ్ము చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చారు. ఇప్పుడు ముస్లిం లీగు పార్టీ, కొన్ని మత సంస్ధలు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, చర్యలకే పూనుకున్నాయి. హిందూత్వ శక్తులకు బుద్ది చెప్పిన జనాలు ముస్లింమతశక్తులను సహిస్తారా ?


సమస్త కేరళ జమాయతుల్‌ ఉలేమా(ఎస్‌కెజెయు) మలప్పురం గోల్డెన్‌ జూబిలీ సమావేశంలో ఇటీవల కమ్యూనిస్టు ఉద్యమం, భావజాలానికి వ్యతిరేకంగా చేసిన ఒక తీర్మానం ఆ సంస్ధలోను, వెలుపలా వివాదం రేపింది. తనకు తెలియకుండా చేసిన దానితో తనకు సంబంధం లేదని, తన ఫొటోను జత చేసి ఆ తీర్మానాన్ని ప్రచారం చేయటం పట్ల తన అసంతృప్తిని వెల్లడిస్తూ సంస్ధ అధ్యక్షుడు సయద్‌ మహమ్మద్‌ జిఫ్రీ ముతుకోయా తంగల్‌ తమ పత్రిక సుప్రభాతంలో ప్రకటించారు. ముస్లింలు కేరళలో కమ్యూనిస్టు భావజాలం, ఉద్యమం పట్ల జాగరూకులై ఉండాలని నాస్తికవాదం, దేవుడున్నాడో లేడో తెలియదనే ధోరణిని పధకం ప్రకారం మత విశ్వాసుల్లో కలిగించేందుకు చేసే ప్రయత్నాల పట్ల జాగరూకులై ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వటం, వారితో కలవటం ప్రమాదకరమని నూరిపోయటం తప్ప మరొకటి దాని లక్ష్యం కాదన్నది స్పష్టం. ఆ తీర్మానం తనకు తెలియకుండా చేయటమే కాదు అనుమతి కూడా లేదని తంగల్‌ పేర్కొన్నారు.


మత విశ్వాసులైన పార్టీ సభ్యులు ఆరాధనా స్ధలాలకు వెళ్లటం, క్రతువుల్లో పాల్గొనటాన్ని పార్టీ వ్యతిరేకించటం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. ఏ విశ్వాసానికి, నమ్మకానికి పార్టీ వ్యతిరేకం కాదు, అలాంటి వారికి పార్టీ సభ్వత్వం ఇవ్వకూడదని నిబంధనావళిలో ఎక్కడా లేదు అన్నారు. పూజారులు కూడా పార్టీలో చేరవచ్చని ఒక సందర్భంలో మార్క్సిస్టు మహౌపాధ్యులలో ఒకరైన లెనిన్‌ చెప్పారని కోజికోడ్‌ జిల్లా సిపిఎం మహాసభలో చెప్పారు. నాస్తికత్వాన్ని పాటించటం, మతానికి పార్టీ వ్యతిరేకమని కొన్ని శక్తులు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఓట్ల కోసం విమర్శలు చేశారు. మతాన్ని దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులు పూనుకున్నారని ఒక వైపు మతశక్తులు ధ్వజమెత్తుతుంటే మరోవైపు మరికొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఒకేసారి రెండు పరిణామాలు ఎలా జరుగుతాయి. శాస్త్ర, తర్కవిరుద్దం, ఏదో ఒకటే వాస్తవం కావాలి. సిపిఎంపై విమర్శలు చేసే వారు రెండు రకాలు. కమ్యూనిస్టు, లౌకిక భావాజాలాలకు ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే సానుకూల వైఖరితో ఆందోళన చెందేవారు, విమర్శలు చేసే వారు కొందరైతే, సందట్లో సడేమియా అన్నట్లుగా రాళ్లేసే వ్యతిరేకులు రెండవ తరగతి.


పార్టీ సభ్వత్వానికి కావలసిన అర్హతల గురించి సిపిఎం కార్యక్రమం, నిబంధనావళి అనే పుస్తకాల్లో స్పష్టంగా ఉంది. అవేమీ రహస్యపత్రాలు కావు. ఎవరైనా పుస్తకాల్లో షాపుల్లో కొనుగోలు చేసి లేదా పార్టీ వెబ్‌సైట్‌లో చదువుకోవచ్చు. నాస్తికులైనే సభ్వత్వం అని లేదు. అలాగే దిద్దుబాటు కార్యక్రమం చేపట్టి అనుసరించాల్సిన పద్దతులు, పార్టీ సభ్యులకు ఉండకూడని అంశాల గురించి కూడా సిపిఎం చెప్పింది. ఇవేవీ పరస్పర విరుద్దంగా కనిపించటం లేదు. ఒకసారి పార్టీ సభ్వత్వాన్ని అంగీకరించిన తరువాత అనుసరించాల్సి ప్రవర్తన గురించి చెప్పిన అంశాలే దిద్దుబాటు. దీని అర్దం ఏదో ఘోరమైన తప్పిదం చేశారని కాదు. పార్టీ ఆమోదించిన ప్రవర్తనా నియమావళిని ఏ స్ధాయిలో ఉన్న వారైనా పాటిస్తున్నారా లేదా అన్నదాన్ని పరిశీలించేందుకు ప్రపంచంలోని ప్రతి పార్టీ అనుసరించిన పద్దతే అది. దానికి ఇమడలేని వారు సభ్యులుగా వైదొలగి మద్దతుదారులుగా ఉండవచ్చు. ఇక పార్టీ సభ్యులు- మత విశ్వాసాల గురించి లెనిన్‌ చెప్పిన సందర్భం ఏమిటి ? ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం. లెనిన్‌ కాలంలో మొదటి ప్రపంచ యుద్దంలో టర్కీ కేంద్రంగా ఉన్న ఒట్టోమన్‌ సామ్రాజ్య కూల్చివేతలో నాటి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు ప్రధాన పాత్రధారులు. అందువలన అనేక మంది ముస్లింలు బ్రిటీష్‌ వ్యతిరేకతతో ముందుకు వచ్చారు. అదే విధంగా రష్యాలో జారుచక్రవర్తిని వ్యతిరేకించిన మత పూజారులు, విశ్వాసుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాంటి సందర్భంలో అనేక మంది అనేక అభిప్రాయాలు వెల్లడించారు.


ఒక క్రైస్తవ పూజారీ,మత విశ్వాసుడైన కార్మికుల పట్ల పార్టీ ఏ వైఖరి అనుసరించాలనే అంశం గురించి లెనిన్‌ వివరణ ఇచ్చారు. ” ఒక పూజారి పార్టీ లక్ష్యాలను ఆమోదించి వాటి కోసం పార్టీలో చురుకుగా పని చేస్తానని ముందుకు వస్తే అతను పార్టీలో చేరవచ్చు. అతని మతవిశ్వాసం-కమ్యూనిజం మధ్య వైరుధ్యం వస్తే అది అతనికి మాత్రమే సంబంధించిన అంశం. కానీ పూజారి పార్టీలో చేరి ఇతరులను మతంలోకి ప్రోత్సహిస్తే, తన మతభావాలను ఇతరుల మీద రుద్దితే, మతం పట్ల పార్టీ కలిగివున్న అంగీకృత వైఖరికి కట్టుబడి ఉండకపోతే అప్పుడు సభ్వత్వాన్ని కోల్పోతాడు. ఇదే సూత్రం విశ్వాసుడైన ఒక కార్మికుడు పార్టీలో చేరినపుడు కూడా వర్తిస్తుంది. పార్టీలో చేరి తన మత భావాలను ఇతరుల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తే పార్టీ నుంచి తొలగించాల్సి ఉంటుంది.” అన్నారు. ఇలా చెబుతున్నపుడు అసలు మత విశ్వాసులను పార్టీలోకి చేర్చుకోవటం ఎందుకు ? అనే ప్రశ్న వస్తుంది.


విప్లవాన్ని సాధించాలన్నా, అందుకు అవసరమైన సాధనం పార్టీ నిర్మాణం జరగాలన్నా సభ్యులను ఎక్కడి నుంచి తేవాలి. ప్రతి వారికీ సమాజంలో ఉన్న వాటిలో ఏదో ఒక బలహీనత, విశ్వాసం ఉంటుంది. వారి నుంచే విప్లవ సైనికులను తయారు చేసుకోవాలి. వివిధ ఆందోళనలు, పోరాటాల సమయంలో చురుకుగా ఉన్న వారిని పార్టీ గుర్తిస్తుంది. అదే విధంగా వివిధ అంశాలపై పార్టీ తీసుకొనే సూత్రబద్ద వైఖరి, పోరాటాల సమయంలో పార్టీ కార్యకర్తలు చూపిన తెగువ, త్యాగాలను చూసి సాధారణ కార్మికులు, జనాలు తాము కూడా పార్టీలో చేరాలని అనుకోవచ్చు. అలాంటి వారిని కొంత కాలం రెండు మూడు దశల్లో తీరుతెన్నులను గమనించి బలహీనతలను సరిదిద్దుకొంటే వారిని సభ్యులుగా తీసుకుంటారు. తరువాత పార్టీ వైఖరికి అనుగుణంగా వారిని మరింతగా తీర్చిదిద్దేందుకు పూనుకుంటారు. ఆ సమయంలో దిద్దుబాటు అంశాలు ముందుకు వస్తాయి.ఒక స్త్రీ లేదా పురుషుడికి అన్నీ మంచి లక్షణాలు ఉండి, మత విశ్వాసాలు ఉన్నాయను కోండి. వారు పార్టీలో చేరతామని ముందుకు వస్తే ముందు మీరు కులాన్ని, మతాన్ని, దేవుడు, దేవతల మీద విశ్వాసాలను వదులుకొని రండి అప్పుడు పరిశీలిస్తాం అంటే కుదురుతుందా ? మతం, విశ్వాసాలు కుటుంబాలు, వ్యక్తిగతం అని చెప్పే కమ్యూనిస్టులు వాటికి కట్టుబడి ఉండేవారికి ఇతర అన్ని అర్హతలు ఉన్నపుడు పార్టీలో చేర్చుకోకపోతే నష్టం ఎవరికి? పార్టీలో చేరిన తరువాత అన్యవర్గ ధోరణులు, మత, మూఢవిశ్వాసాలను పోగొట్టేందుకు తగిన కృషి చేయకపోతే అది పార్టీ లేదా నాయకత్వ తప్పిదం అవుతుంది. సకాలంలో దిద్దుబాటు జరగకపోతే పార్టీలు దెబ్బతింటాయి.


కమ్యూనిజానికి మన మతం వ్యతిరేకం అని ప్రతి మతం వారు చెబుతారు. అలాగని ఏ మతం చెప్పింది. పురాతన మతమైన హిందూ, తరువాత వచ్చిన క్రైస్తవం దాన్నుంచి పుట్టిన తాజా మతం ఇస్లాం ప్రవక్తలు, దేవదూతలు గానీ ఎక్కడా కమ్యూనిజం గురించి చెప్పలేదు, అప్పటికీ అసలా భావనే లేదు కదా ! ఆ మతాలు పుట్టి పెరిగిన సమయంలో కూడా హేతువాదులు, నాస్తికులు ఉన్నారు. పార్టీలో చేరిన వారిని కమ్యూనిస్టులు మార్చి వేస్తారని, దోపిడీ శక్తులకు మద్దతు ఇచ్చే, తమ తిరోగమన, జనాన్ని తమ అదుపులో ఉంచుకొనే అజెండాలు సాగవనే భయంతోనే హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల పెద్దలు అభ్యుదయ, కమ్యూనిస్టు భావజాలాన్ని, పార్టీలను వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిస్టులు రాజీపడితే, భావజాలాన్ని పలుచన చేస్తే మతవాదులకు పేచీ ఉండదు కదా ?
సమస్త మలప్పురం సమావేశ తీర్మానం గురించి చర్చ జరుగుతోంది. తమ సమస్త సమావేశాలు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలు చేసేందుకు వేదికలు కాదని జిఫ్రీ కోయా తంగల్‌ స్పష్టం చేశారు. సమావేశాలను ముస్లిం లీగు హైజాక్‌ చేసిందని, రాజకీయ ప్రచారం కోసం వాడు కుంటున్నదని, వాస్తవానికి దీనిలో అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నవారున్నారని చెప్పారు. సమస్త ప్రభుత్వంతో సహకరిస్తుందని, దాని అర్ధం చేతులు కలిపినట్లు కాదని సమస్త సున్నీ యువజన సంఘం నేత అబ్దుస్‌ సమద్‌ పూకొత్తూర్‌ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలలో ముస్లిం మతవిశ్వాసులకు స్ధానం ఉండదని, అంత మాత్రాన ఆ పార్టీలతో సంబంధాలు ఉన్న వారందరూ నాస్తికులు,లు, మతవ్యతిరేకులు కాదన్నారు.ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంలో అనేక పార్టీలు ఉన్నాయని, ప్రభుత్వంతో విరోధ పంధాను ఎంచుకోవటం గాక సహకరించాలని తాము కోరుతున్నట్లు పూకొత్తూర్‌ చెప్పారు.


వక్ఫ్‌బోర్డులో ఉద్యోగుల నియామకాన్ని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారపు నమాజు సందర్భంగా మసీదులలో ప్రచారానికి పిలుపు ఇచ్చిన ముస్లింలీగ్‌ వైఖరిని సమస్త వ్యతిరేకించింది. దాంతో లీగ్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతకు ముందు కోజికోడ్‌ బీచ్‌లో లీగ్‌ నిర్వహించిన సభలో మాట్లాడిన అబ్దుర్‌ రహమాన్‌ కల్లాయి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై అవాంఛనీయ పదజాలం ప్రయోగించినందుకు ఇతర లీగ్‌ నేతలు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. రాష్ట్రమంత్రి, డివైఎఫ్‌ఐ నేతగా ఉన్న మహమ్మద్‌ రియాజ్‌తో విజయన్‌ కుమార్తె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అది అక్రమ సంబంధం అంటూ కల్లాయి నోరుపారవేసుకున్నాడు. అదే సభలో మరో లీగ్‌ నేత కెఎం షాజీ మాట్లాడుతూ మతం మాకు సంబంధించిన అంశం, మతమే మాకు గుర్తింపు, మా చివరి శ్వాసవరకు మతమే మాకు పునాది ” అన్నారు. మతోన్మాదులు తప్ప మరొకరి నోటి నుంచి ఇలాంటి మాటలు రావు. మరుసటి రోజు సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభ మాటలను ప్రస్తావిస్తూ ముస్లింలీగ్‌ ఒక రాజకీపార్టీనా లేక మత సంస్తో నిర్ణయించుకోవాలని అన్నారు. లీగ్‌ను మతోన్మాద జమాతే ఇస్లామీ నడిపిస్తున్నదని సిపిఎం పేర్కొన్నది.


వరుసగా రెండవ సారి ఎల్‌డిఎఫ్‌ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ నేతలకు పాలుపోవటం లేదు. ముస్లింమతోన్మాద ఎస్‌డిపిఐ, ఆర్‌ఎస్‌ఎస్‌తో ముస్లింలీగు పోటీ పడి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ తమ పునాదిని నిలుపుకోవాలని చూస్తోంది. నిజానికి వక్ఫ్‌బోర్డు వ్యవహారాలలో ఎల్‌డిఎఫ్‌ చేసిందేమీ లేదు. బోర్డు పాలకవర్గమే సిబ్బంది నియామకాలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరపాలని చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది. నియామక నిబంధనలను కూడా మార్చింది లేదు. ముస్లిమేతరులను సిబ్బందిగా నియమిస్తారంటూ ముస్లింలీగ్‌ రాజకీయ దాడికి, ముస్లింల్లో అనుమానాలను రేకెత్తించటానికి, సిపిఎంపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఈ నేపధ్యంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ముస్లిం సంస్ధలతో సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను వివరించిన తరువాత సమస్త నేతలు ఆందోళన మార్గం నుంచి విరమించారు, మసీదుల్లో లీగు ప్రచారాన్ని వ్యతిరేకించారు. మరింతగా చర్చలు జరిపిన తరువాతే అంతిమంగా నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు యధాతధ స్ధితి కొనసాగుతుందని సిఎం ప్రకటించారు.ఆశించిన విధంగా అధికారం దక్కకపోవటంతో లీగు తన మద్దతుదార్లు చెదరకుండా ఉండేందుకు మతోన్మాదాన్ని ముందుకు తెస్తోంది. అది నెరవేరేనా ?