Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


దవోస్‌ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశాలు గత నెలలో జరగాల్సినవి కరోనా కారణంగా జనవరి 17-21 తేదీలలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఏటా ప్రపంచ ముప్పు నివేదికను వెలువరించటం ఆనవాయితీగా వస్తోంది. వివిధ దేశాలలో గడచిన ఏడాది కాలంలో సంభవించిన సంక్షోభాలను దీనిలో విశ్లేషిస్తారు.ఆర్ధిక వేదిక సమావేశాల్లో వాటికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రపంచ నేతలు చర్చిస్తారు. ఈ సారి ఏమి చర్చిస్తారో, ఏం జరుగుతుందో సమావేశాల తరువాత చూద్దాం. గతేడాది మాదిరే ఈ సారి కూడా కరోనా సంక్షోభం మీదే ప్రధానంగా కేంద్రీకరణ ఉంది. ప్రతిదేశం ఎదుర్కొంటున్న ముప్పుల గురించి దీనిలో చర్చించారు.
మన దేశం ఐదు ప్రధాన ముప్పులను ఎదుర్కొంటున్నదని 2022 నివేదికలో పేర్కొన్నారు. ఒకటి యువత అసంతృప్తి,రుణభారం, డిజిటల్‌ అసమానత, అంతర్రాష్ట సంబంధాలు దెబ్బతినటం, సాంకేతిక పాలన వైఫల్యంగా పేర్కొన్నారు. పని కోసం అడ్డాల మీదకు వస్తున్న వారికి ఉపాధి చూపకపోతే పక్కదార్లు పడతారు. అనేక సామాజిక సమస్యలు తలెత్తుతాయి. పర్యవసానాలను ఊహించలేము. జి-20 కూటమిలోని మన దేశంలో ఇది పెద్ద ముప్పుగా ఉంది. దేశంలో కార్మికశక్తి భాగస్వామ్యం 2020లో 46.29శాతం ఉండగా చైనాలో 66.82శాతం ఉంది. గతేడాది డిసెంబరులో సిఎంఐఇ సమాచారం ప్రకారం దేశం మొత్తంగా 7.91శాతం, పట్టణాల్లో 9.3,గ్రామాల్లో 7.28శాతం నిరుద్యోగులున్నారు. పరిస్ధితి ఎప్పుడు మెరుగుపడుతుందో అర్ధంగాని స్ధితిలో యువత ఉంది. కరోనాకు ముందే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల రికార్డును అధిగమించిందన్న సమాచారాన్ని లోక్‌సభ ఎన్నికల ముందు ప్రభుత్వం తొక్కిపెట్టింది. అనధికార మార్గం ద్వారా వెల్లడైన అంశాలను వాస్తవం కాదని తోసి పుచ్చి లెక్కలు సరిగా లేవని చెప్పింది. ఎన్నికలు ముగిశాక ఆ నివేదికనే గుట్టుచప్పుడు కాకుండా అంగీకరించింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్ధితి ఇంకా దిగజారింది.వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో నిరుద్యోగం ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగా ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి.


1975అత్యవసర పరిస్ధితికి ముందున్న నిరాశా, నిస్పృహలు కనిపిస్తున్నాయి.2014, 2019లో రెండు సార్లు మంచి రోజులను తెస్తానన్న నరేంద్రమోడీ వాగ్దానం,రేకెత్తించిన ఆశలకు ఇది విరుద్దం. వెనుకా ముందూ ఆలోచించకుండా, కుల, మతాలను అధిగమించి మద్దతు ఇచ్చిన వారు హతాశులౌతున్నారు. ఒకసారి అధికారంలో అన్నీ చేయటం ఎవరికైనా కష్టమే, రెండోసారి అవకాశం ఇద్దాం అనుకున్నవారు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచీ ఊహించని పరిణామాలను చూస్తున్నారు.


నైపుణ్యశిక్షణ ఉంటే ఇంకేముంది ఉద్యోగం సిద్దం అన్నారు. డిగ్రీలు పుచ్చుకున్నవారు కాలేజీల నుంచి వెలుపలికి రాగానే వేలాది రూపాయలు వెచ్చించి పొందిన శిక్షణలు ఉపాధికి పనికి రాకుండా పోతున్నాయి. అసమానతలు, ఆర్ధిక రంగ పునరుద్దరణ, కరోనా పర్యవసానాలు కనీసం పదేండ్ల పాటు ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే నిపుణుల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబాలు, దేశం అప్పుల పాలు కావటం కూడా యువత మీద ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. పాలకులు చేసిన అప్పులకు వడ్డీ, అసలు మొత్తాలకు వచ్చిన ఆదాయాలను ఖర్చు చేస్తారా లేక ఉపాధికి అవసరమైన పెట్టుబడులు పెడతారా అంటే మొదటి దానికే మొగ్గు. రెండవ దానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే వనరుల వృద్ది జరిగి అపులు చేయాల్సి వచ్చినా పరిమితంగా ఉండేవి. కరోనా పేరుతో ఒకవైపు జనాల మీద భారాలు మోపుతూ అప్పులకు సైతం వాటినే కారణాలుగా చూపుతున్నారు. అసలు కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలకే ఎక్కువగా మళ్లిస్తున్నారు.కరోనా కారణంగా అసమానతలు మరింత పెరిగినట్లు ప్రపంచబాంకు కూడా చెప్పింది. ప్రపంచంలోని ధనికుల్లో ఎగువన ఉన్న 20శాతం మంది 2021లో తమ నష్టాలలో సగాన్ని తిరిగి పొందగలిగితే, దిగువ 20శాతం మంది ఐదుశాతంపైగా ఆదాయాలను కోల్పోయారు. కరోనా ముందున్న పరిస్ధితితో పోల్చితే 2030 నాటికి 5.1 కోట్ల మంది ఎక్కువగా దుర్భరదారిద్య్రంలో ఉంటారని అంచనా.


ఒక్క యువతే కాదు, గత ఎనిమిది సంవత్సరాల మోడీ పాలన చూసినపుడు ఏ రంగంలోనూ ఆశాజనక పరిస్ధితి కనిపించటం లేదు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లు ఏ రంగంలో చూసినా దిగజారుడు లేదా గిడసబారుడే.చెప్పుకొనే గొప్పలకు తక్కువ లేదు. దేశాన్ని అవినీతి నుంచి రక్షిస్తానని నేను తినను ఎవరినీ తిననివ్వను అని నరేంద్రమోడీ చెప్పినపుడు సంసార బంధాలు, బాధ్యతలు లేవు గనుక నిజంగానే చేస్తారని జనం నమ్మారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. తన ఆశ్రితులకు అప్పనంగా జన సంపదలను అప్పగించటం ఏమిటన్నది ప్రశ్న. ఎవరి మేలుకోసం ఇది చేస్తున్నట్లు ?ప్రపంచ వాణిజ్య లంచాల ముప్పు సూచికలో మన దేశ స్ధానం 2021లో 82లో ఉంది, అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఏడు స్ధానాలు దిగజారింది. మొత్తంగా ఎనిమిదేండ్ల పాలన చూసినపుడు 2014లో ఉన్న 82వ స్ధానమే ఇప్పుడూ ఉంది. మరి అవినీతిని అరికట్టిందెక్కడ ? ట్రేస్‌ అనే అంతర్జాతీయ సంస్ధ 194 దేశాలతో రూపొందించిన జాబితాలో మన స్ధానం అది. 2020లో 45 మార్కులు వస్తే 2021నాటికి 44కు తగ్గాయి.2014లో కూడా అన్నే మార్కులొచ్చాయి. ప్రభుత్వంతో వాణిజ్యలావాదేవీలు, అవినీతి నిరోధక చర్యలు, పౌరయంత్రాంగ పారదర్శకత, మీడియాతో సహా పౌరసమాజ నిష్ట సామర్ధ్యం తదితర అంశాల ప్రాతిపదికన దీన్ని మదింపువేస్తారు. ముడుపుల డిమాండ్‌ ఎక్కువగా ఉందంటే విదేశీ సంస్ధలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేసిన వాటిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేసినట్లు చెప్పుకున్న పాలకుల ఏలుబడిలో ఉన్నాము. అనేక సూచికలను చూస్తే వివిధ అంశాలలో మనం ఎక్కడున్నాం అన్నది అవలోకనం చేసుకోవాల్సి ఉంది. వైఫల్యాలను కాంగ్రెస్‌ మీదో మరొకరి మీదో నెడితే ఇంకేమాత్రం కుదరదు. స్వాతంత్య్రం తరువాత అత్యంతబలమైన ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ మాత్రమే నెలకొల్పారని చెబుతున్నపుడు ఫలితాలు కూడా అలాగే ఉండాలి కదా ! లంచాల సూచికలో పని తీరు ఏమిటో చూశాము. మరికొన్నింటిలో ఏ స్ధానంలో ఉన్నామో పరిశీలించుదాం.
ప్రపంచ వాణిజ్య లంచాల ముప్పు సూచిక 82(2021)
నిరంతర అభివృద్ధిసూచిక(ఎస్‌డిజి) 120 (2021)
మానవాభివృద్ధి సూచిక(యుఎన్‌డిపి) 131 (2020)
ప్రపంచ లింగవివక్ష(ప్రపంచ ఆర్ధికవేదిక) 140 (2021)
ప్రపంచ ఆకలి సూచిక 94(2020)
ప్రపంచ యువత ఆభివృద్ధి సూచిక 122(2020)
ప్రపంచ ఆరోగ్య భద్రత సూచిక 57(2019)
ప్రపంచ ముప్పు సూచిక 89(2020)
ప్రపంచ పర్యావరణ ముప్పు సూచిక 7(2021)
ప్రపంచ ఉగ్రవాద ముప్పు సూచిక 8 (2020)
ప్రపంచ ప్రజాస్వామ్య (ఇఐయు) సూచిక 53(2020)
ప్రపంచ మానవ స్వేచ్చ (కాటో) సూచిక 111(2020)
ప్రపంచ ఆర్ధిక స్వేచ్చ సూచిక 105(2020)
ప్రపంచ అవినీతి దృష్టి సూచిక 86(2020)
ప్రపంచ పత్రికా స్వేచ్చ సూచిక 142(2021)
ప్రపంచ సుపరిపాలన సూచిక 49(2021)
ప్రపంచ సులభతర వాణిజ్య సూచిక 63(2019)
ప్రపంచ పోటీతత్వ సూచిక 43(2021)
ప్రపంచ నవకల్పన సూచిక 48(2020)
ప్రపంచ పిల్లల హక్కుల సూచిక 112(2021)
ప్రపంచ అసమానతల నివారణ నిబద్దత సూచిక 129(2020)
ప్రపంచ ఇంటర్నెట్‌ సూచిక 49(2021)
ప్రపంచ ప్రతిభ పోటీతత్వ సూచిక 72(2021)
ప్రపంచ శాంతి సూచిక 135(2021)
ప్రపంచ విద్యా సూచిక 135(2020)


దేశ రుణ భారం ఆకస్మికంగా పెరిగింది. ఇది అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం ప్రపంచ రుణం 226లక్షల కోట్ల డాలర్లు.2019 కంటే 27లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ. కరోనా తరువాత విపరీతంగా పెరిగింది. మన జిడిపిలో అప్పు మొత్తం 90.6శాతం ఉంది. మన అప్పులు 2016లో 68.9శాతం కాగా 2020 నాటికి 89.6, మరుసటి ఏడాదికి 90.6శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. తరువాత మొత్తంగా చూస్తే అప్పు పెరిగినప్పటికీ జిడిపి పెరుగుదల కూడా ఉంటుంది కనుక దానితో పోలిస్తే 2022లో 88.8 నుంచి 2026 నాటికి 85.2శాతానికి చేరుతుందని అంచనా. అంటే కరోనా ముందు స్ధితికి చేరే అవకాశమే లేదు. రుణాల పెరుగుదల వలన సామాజిక అశాంతి పెరుగుతుందని ఐఎంఎఫ్‌ నివేదిక హెచ్చరించింది. పాలకులు ఇప్పటికైనా పట్టించుకొని పరిష్కారాలను చూస్తారా ?