Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


” కమ్యూనిజం ప్రయోగాల కోసం నల్లజాతి అమెరికన్లను ఉపయోగించుకుంటున్న పురోగామివాదులు ” అనే శీర్షికతో ఇటీవల ఒక విశ్లేషణను అమెరికా మీడియాలో చదివాను. వెంటనే మన దేశంలో దళితులను కమ్యూనిస్టులు ఉపయోగించుకుంటున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం గుర్తుకు వచ్చింది. అమెరికాలో లేదా మన దేశం, మరెక్కడైనా ఇలాంటి ప్రచారం చేస్తున్న వారు రెండు రకాలు. ఒకటి ఒక పధకం ప్రకారం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసే మేథావులు, రెండో తరగతి వారి ప్రచారదాడి బాధితులుగా మారిన వారు. కమ్యూనిజం, పురోగామివాదులపై చేసిన దాడికి పాల్పడిన ఆడమ్‌ బి కోల్‌మన్‌ ” బ్లాక్‌ విక్టిమ్‌ టు బ్లాక్‌ విక్టర్‌ ” అనే పుస్తక రచయిత కూడా, ఆఫ్రో-అమెరికన్‌ అని వేరే చెప్పనవసరం లేదు.


ఏమంటాడు ఇతను ? ” అమెరికాలో నేడు నల్లవారు ఫుట్‌బాల్‌ బంతుల్లా ఉన్నారు. వారిని ఎవరు ఎప్పుడు ఎటు తంతారో తెలియదు. నల్లవారికి తమ మీద అదుపు ఉండదు. ఆధునిక రాజకీయాల్లో రాణించాలంటే నల్లజాతి వారికి సాయం అనే అంశాన్ని సోపానంగా చేసుకుంటున్నారు. సాయం చేస్తున్నట్లు చెప్పుకోవటం వేరు నిజంగా సాయం చేయటం వేరు. పురోగామివాదులు ఊహాజనిత కమ్యూనిస్టు జ్వర ప్రేలాపనలో నల్లజాతి అమెరికన్లను ఒక ప్రయోగశాలలో మాదిరి వాడుతున్నారు. అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని ఉపయోగించుకొని నల్లజాతీయులను ధనికులు కాకుండా అడ్డుకుంటున్నారు.” అన్నం ఉడికిందో లేదో చూసేందుకు ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలు అన్నట్లుగా అతగాడు రాసిందాన్ని మొత్తం పునశ్చరణ చేయాల్సిన అవసరం లేదు. నల్లజాతీయుడై ఉండి ఒక వైపు జాత్యహంకార వివక్ష ఉంది, దాడులు నిజమే అని సన్నాయి నొక్కులు నొక్కుతూ అక్కడి దోపిడీ వ్యవస్ధకు మద్దతు ఇచ్చే, కమ్యూస్టు వ్యతిరేకతను అడుగడుగునా వెల్లడించిన కోల్‌మన్‌ వాదనల గురించి ఎంత చెప్పుకున్నా వాటి చుట్టూనే తిరుగుతుంటాయి.


కోల్‌మన్‌ ఇంకా ఎంత కుతర్కం చేశాడో చూడండి ” అమెరికా చరిత్రలో నల్లజాతీయులు హతులయ్యారా ? నిస్సందేహంగా ఎలాంటి మినహాయింపుల్లేవు. పోలీసులు నల్లజాతీయులను అన్యాయంగా కాల్చి చంపారా ? అవును. కానీ జాత్యహంకారం ఉనికిలో ఉండటం, జాత్యహంకార అన్యాయం జరుగుతుండటాన్ని ఉపయోగించుకొని సర్వకాలాల్లో అందరిని సమానంగా చూస్తారు, ప్రతిభతో నిమిత్తం లేకుండా అందరికీ సమంగా ఉత్పత్తిని పంచుతారు అనే ఊహాజనితమైన వైఖరివైపు అమెరికా జనాన్ని వామపక్షం లాగుతున్నది. ఇది కేవలం ప్రహసన ప్రాయమైన అసాధ్యం. సమాజం పని చేసేందుకు అవసరమైన ప్రతిదాన్నీ నాశనం చేయాలని, దానిలోనే జీవించాలని, అదే సరైనదని చెబుతారు… అమెరికా అంతటా పట్టణాల్లో జరుగుతున్నదాన్ని మీరు చూడవచ్చు.శాన్‌ఫ్రాన్సిస్‌కోలో చివరికి పట్టపగలు కూడా దొంగతనాలు జరగటం సర్వసాధారణం. ఇళ్లు లేని వారు నగరమంతటా ఎక్కడబడితే అక్కడ వారు అనుకున్న చోట గుడారాలు వేస్తున్నారు, అనుకున్న ప్రతిదాన్నీ అపరిశుభ్రంగావిస్తున్నారు. తప్పుడు విధానాలు దీనికి కారణం కావచ్చు గానీ ఇదంతా మన సమాజాన్ని నిర్వీర్యం చేసేందుకే పధకం ప్రకారం చేస్తున్నది. మార్క్సిస్టు భావజాలపు ప్రత్యక్ష ప్రభావం ఇది ”


1950దశకంలో ఆంధ్రదేశంలో కమ్యూనిస్టుల ప్రభావం బలంగా ఉన్న సమయంలో వ్యతిరేకులు ఇలాంటి ప్రచారాలే చేశారు. మనకు ఐదువేళ్లు సమంగా ఉండవు కదా, కమ్యూనిస్టులు వస్తే అన్నింటినీ సమంగా నరికేస్తారు. మీకు రెండు చొక్కాలు, పంచెలు ఉంటే ఒకటి లాక్కుని లేనివారికి ఇస్తారు. ఇంటిని సగం చేసి మిగతాది లేని వారికి అప్పగిస్తారు. ఎవరైనా వ్యతిరేకిస్తే నెత్తిమీద సుత్తితో కొట్టి కాడవలితో గొంతు కోస్తారు, ఇంకా నోరుబట్టని ప్రచారాలతో జనాన్ని రెచ్చగొట్టారు. అన్నింటినీ ధ్వంసం చేస్తామని కమ్యూనిస్టులు ఎక్కడ చెప్పారు. మనిషిని మనిషి దోచుకొనే పద్దతిని నాశనం చేస్తామన్నారు, దోపిడీకి రక్షణగా , జనానికి వ్యతిరేకంగా ఉండేవారి సంగతి చూస్తామన్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలోనో మరొక నగరంలో జనానికికందరికీ ఇంటి వసతి కల్పిస్తే రోడ్లమీద గుడారాలు ఎందుకు వేస్తారు. పని, ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తే ఎవరైనా దొంగతనాలు చేస్తారా ? నల్లవారు కనిపించగానే ఉట్టిపుణ్యానికే రెచ్చిపోతున్న పోలీసులను అదుపు చేస్తే ఎందుకు తిరగబడతారు ? అలాంటి పరిస్ధితులను నివారిస్తే కమ్యూనిస్టులు, మరొక పురోగామి, ప్రజాస్వామ్యవాదులతో పనేముంటుంది ?


మన దేశంలో కూడా దళితుల పేరుతో ఇలాంటి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగారు. దీనికి అమెరికాలోని కోల్‌మన్‌ వంటి వారి ప్రభావం ఒక కారణంగా చెప్పవచ్చు. అమెరికాలోని నల్లజాతివారు, దళితులకు అనేక పోలికలు కనిపిస్తాయి. ఇరువురూ బాధితులే. రాబిన్‌హుడ్‌ మాదిరి ఒక వీరుడు వచ్చి వారిని విముక్తి చేస్తాడని, దోపిడీ, వివక్ష నుంచి రక్షిస్తాడని ఎవరూ చెప్పలేదు. తామే విముక్తి చేస్తామని కమ్యూనిస్టులూ వకాల్తాపుచ్చుకోలేదు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నారు అంటే ఎవరి విముక్తికి వారు ముందుకు రావాలనే తప్ప మీరు అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండండి మేమే పోరాడతాం అనటం లేదు. జనం జరిపే పోరాటాల్లో ముందుంటాం అని దారి చూపుతున్నారు. అణగారిన తరగతులు వారు ఎవరైనప్పటికీ వారినందరినీ కమ్యూనిస్టులు వినియోగించుకుంటూ వారిని జెండాలు మోసేవారిగానే పరిమితం చేస్తున్నారనే ఆరోపణలు, వక్రీకరణలు తెలిసిందే. మహత్తర తెలంగాణా సాయుధ పోరాటంలో నైజాం, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు ? మల్లు స్వరాజ్యం వంటి వారంతా దొరల కుటుంబాలనుంచి వచ్చి తుపాకి పట్టిన వారే కదా ! వారితో పాటు వెట్టి,అణచివేతకు గురైన వారందరూ కూడా బందూకులు పట్టారు. ఆ పోరాటంలో ఎవరు అమరులైందీ ఆ గ్రామాలు, పట్టణాల్లో ఎవరిని అడిగినా చెబుతారు.కమ్యూనిస్టులు వాడుకుంటారు అని చెప్పేవారు కేరళలో వరుసగా రెండోసారి సిఎంగా చరిత్ర సృష్టించిన పినరయి విజయన్‌ గురించి ఏమి చెబుతారు ? ఒక గీత కార్మికుడి కుమారుడు కదా !


కుల వివక్ష సమస్యను కమ్యూనిస్టులు గుర్తించలేదు అన్నది ఒక విమర్శ. ఇది కూడా వక్రీకరణే, వాస్తవం కాదు. అంబేద్కర్‌ కంటే ముందే నారాయణ గురు, అయ్యంకలి వంటి సంస్కరణవాదులెందరో కులవివక్ష పోవాలని చెప్పి ఎంతో కృషి చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎకె గోపాలన్‌ వంటి ఎందరో కమ్యూనిస్టులు దళితుల దేవాలయ ప్రవేశం వంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సోషలిస్టు వ్యవస్ధలో ఆర్ధిక అంతరాలను రూపుమాపితే తప్ప కుల సమస్య పరిష్కారం కాదని భావించిన కారణంగానే మొదటిదానికే ప్రాధాన్యత ఇచ్చారనిపిస్తుంది. ప్రతి సంఘసంస్కరణ ఉద్యమాన్ని సొంతం చేసుకున్న కమ్యూనిస్టులు దళిత కులవివక్షను పట్టించుకోలేదనటం వక్రీకరణే. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాటితో పోలిస్తే సిపిఎం నేతలు ఆ సమస్యను మకింత స్పష్టంగా గుర్తించారు గనుక కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐనా వర్గ సమస్యకు ఇచ్చినంత ప్రాధాన్యతను వర్ణ అంశానికి కూడా ఇచ్చి పోరాడలేదని సానుకూలంగా విమర్శిస్తే అదొకదారి. అందుకు సూచనలు చేయవచ్చు. శత్రుపూరిత దాడికి దిగితే ఏమనాలి ?


వర్గ శత్రువు కంటికి కనిపించేది, వర్ణశత్రువు స్వభావం అలాంటిది కాదు. ముందు కులాన్ని నిర్మూలించిన తరువాత వర్గ నిర్మూలన చేపట్టాలని చెప్పేవారు కమ్యూనిస్టులతో నిమిత్తం లేకుండా అంబేద్కర్‌ కాలం నుంచి ఇప్పటి వరకు ఎంత మేరకు జనాన్ని కూడగట్టారో, ఎంత పురోగతి సాధించారో ఒక్కసారి నెమరువేసుకోవాలి. చివరికి అంబేద్కర్‌ను సైతం ఒక కులానికి ప్రతినిధిగా దిగజార్చారనే విమర్శ ఉంది కదా ! కులవివక్షనే వ్యతిరేకించేందుకు మద్దతు తెలపని స్ధితిలో కుల నిర్మూలనకు పిలుపు ఇవ్వటం నేలవిడిచి సాము కాదా ! చట్టాలు, సంస్కరణలతో వెంటనే సామాజిక మార్పులు రావని అనేక దురాచారాల అంశంలో రుజువైంది. రిజర్వేషన్లను అనుభవించేందుకు కులాలవారీ వర్గీకరణ చేయాలనే ఒక ప్రజాస్వామిక డిమాండ్‌నే దళితులలో కొందరు అంగీకరించకుండా వీధులకు ఎక్కుతున్న స్ధితి ఉంది. దేశంలో కులనిచ్చెనమెట్లు అన్ని కులాల్లో ఉన్నాయి. ఇలాంటి వాటినే పరిష్కరించలేని స్ధితిలో మొత్తంగా కులనిర్మూలన అంశాన్ని చేపట్టాలనే వాదన ఆచరణాత్మకóమా ? లేదూ సాధ్యమే అని నమ్మేవారు అందుకోసం పోరాడితే ఎవరూ తప్పు పట్టరు. ఆర్ధిక సమస్యల మీద పోరాడేందుకే జనం ముందుకు రావటం లేదన్నది ఒక కఠోరవాస్తవం. నరనరాన వేల సంవత్సరాలుగా జీర్ణించుకుపోయిన కులవివక్ష అంశం ఎక్కడైనా ముందుకు వచ్చినపుడు దాని మీద పోరాడటం, మిగతా సమయాల్లో ఈ అంశాన్ని ప్రచారం చేస్తూ వర్గ సమస్యతో జమిలిగా చేపట్టటం ఆచరణాత్మక అంశం అవుతుంది.


ఇక్కడ ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఆఫ్రికా నుంచి అమెరికాకు అక్కడి జనాలను బానిసలుగా తీసుకురావటం 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. మన దేశంలో దళితులను కొన్ని వేల సంవత్సరాల నాడే సృష్టించారు. అనేక దేశాలలో ఆఫ్రికన్‌ బానిసల వారసులు గానీ, దళితులు గానీ లేరు. కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ గానీ, వారికి ముందున్న ఊహాజనిత సోషలిస్టులు కానీ నల్లజాతీయులు లేదా దళితుల కోసమే కమ్యూనిస్టు సిద్దాంతం అని గానీ, వారితోనే ప్రయోగాలు చేయాలని గానీ ఎక్కడా చెప్పలేదు. భవిష్యత్‌లో కమ్యూనిస్టు సిద్దాంతం పుడుతుందని, దాని ప్రయోగాలకు వీరిని సిద్దం చేసి ఉంచాలని వారిని వందలు, వేల ఏండ్లక్రితమే సృష్టించారా మరి ? సృష్టిస్తే ఎవరు వారు ? ఒక వేళ తమ ప్రయోగాల కోసమే ఈ సామాజిక తరగతులను లేదా కార్మికవర్గాన్ని సృష్టించి ఉంచారని మార్క్స్‌-ఎంగెల్స్‌లకు తెలుసా ? తెలిసినా, వారు అనుకున్నా తమ కార్యకలాపాలను అమెరికా లేదా లాటిన్‌ అమెరికాలోని స్పానిష్‌ వలస దేశాలు, భారత్‌కు వెళ్లి ప్రయోగాలు చేయకుండా జర్మనీ, బ్రిటన్‌కు ఎందుకు వెళ్లారు ? 1871లో జరిగిన పారిస్‌ కమ్యూన్‌ తిరుగుబాటులో అక్కడి ఆఫ్రో-ఫ్రెంచి జాతీయులు పాల్గని ఉండవచ్చు గానీ నాయకత్వం ఫ్రెంచి కార్మికవర్గమే కదా ? రష్యా,చైనా, వియత్నాం, క్యూబా, కొరియాలో ఎవరిని వినియోగించి విప్లవాలను తీసుకువచ్చారు ? ఎవరు లబ్ది పొందారు ?


ఇక కమ్యూనిస్టు నేతలు, వారి కుటుంబసభ్యులు త్యాగాలు చేయరు, సామాన్యకార్యకర్తలనే బలిపెడతారు అన్న దుర్మార్గమైన నిందలు కూడా వేసేవారున్నారు. జనం కోసం త్యాగాలకు సిద్దపడి ఏటికి ఎదురీదేవారు కమ్యూనిస్టులు తప్ప మరొకరు లేరు. ఎక్కడైనా పార్టీనేతలుగా ఉండి అక్రమాలకు పాల్పడేవారు వేళ్లమీద లెక్కించగలిగిన వారు లేరని ఎవరూ చెప్పరు. వారిని మాత్రమే చూపుతున్నారంటే ఏమనుకోవాలి ? ఎన్నో కుటుంబాలు అసమాన త్యాగాలు చేశాయి. ఆ వివరాలన్నీ పేర్కొనటం ఇక్కడ సాధ్యం కాదు. రెండు మూడు ఉదంతాలు చూద్దాం.


హిట్లర్‌ అంతు చూసిన స్టాలిన్‌ కుమారుడు ఎకోవ్‌ జర్మన్లకు చిక్కి వారి చేతిలో మరణించిన అంశం తెలిసిందే. అధినేతగా తలచుకుంటే తన కుమారుడిని ఏదో ఒక ఉద్యోగంలో పెట్టటం కష్టమేమీ కాదు. కానీ సైన్యంలో చేరాలని కోరాడు. రెండవ ప్రపంచ యుద్దంలో జర్మన్లకు బందీగా చిక్కాడు. తమ వారిని విడిచిపెడితే ఎకోవ్‌ను అప్పగిస్తామని హిట్లర్‌ మూకలు చేసిన ప్రతిపాదనను స్టాలిన్‌ అంగీకరించలేదు. కుమారుడి కోసం నరహంతక నాజీలను వదిలేదని తిరస్కరించాడు. తరువాత ఎకోవ్‌ను జర్మన్లు కాల్చి చంపారు. స్టాలిన్‌ తరువాత అధికారానికి వచ్చిన నికితా కృశ్చేవ్‌ కుమారుడు లియోనిద్‌ కృశ్చేవ్‌ ఆర్టిలరీ బాటరీ కమాండర్‌. అదే యుద్దంలో వీరమరణం పొందాడు. ఇలాంటి వారెందరో ఉన్నారు. సోవియట్‌ వెలుపల యుగోస్లావియా నేత టిటో కుమారుడు జర్‌కో బ్రోజ్‌ తన చేతిని పొగొట్టుకున్నాడు. స్పెయిన్‌ కమ్యూనిస్టు నేత డోలోర్స్‌ గోమెజ్‌ కుమారుడు రూబెన్‌ రూయిజ్‌ స్టాలిన్‌గ్రాడ్‌ పోరులో కమాండర్‌గా వీరత్వం పొందాడు.


చైనా అగ్రనేత మావో సంతానంలో మావో అనీయింగ్‌ ఒకడు. తల్లి యాంగ్‌ కైహుయి విప్లవకారిణి.1930 అక్టోబరులో కొమింటాంగ్‌ యుద్దప్రభువు హి షియాన్‌ ఆమెను బందీగా పట్టుకున్నాడు. మావోకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన చేస్తే వదలివేస్తామని చెప్పాడు. నిరాకరించినందుకు చిత్రహింసలు పెట్టారు. చివరకు నవంబరు 14న ఆమెను ఉరితీశారు. ఆ నాటికి ఆమె వయసు 29 సంవత్సరాలు. మావో ఎక్కడున్నాడో తెలియదు, ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు.మావో అనీయింగ్‌కు అప్పుడు ఎనిమిది సంవత్సరాలు. షాంఘైవీధుల్లో అడుక్కొని పొట్టపోసుకున్నాడు.1936లో అతన్ని కనుగొన్న మావో రష్యా పంపాడు. మావో కుమారుడు కనుక అతన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. సెర్గీ మయవ్‌ అని కొత్త పేరు పెట్టారు. 1942లో తనను రెడ్‌ ఆర్మీలో చేర్చుకోవాలంటూ స్టాలిన్‌కు సెర్గీ లేఖ రాశాడు.” ప్రియమైన కామ్రేడ్‌ స్టాలిన్‌ ! నేను ఒక చైనా యువకుడిని. మీ నేతృత్వంలోని సోవియట్ల దేశంలో ఐదు సంవత్సరాలు చదువుకున్నాను. నేను చైనాను ఎంతగా ప్రేమిస్తానో యుఎస్‌ఎస్‌ఆర్‌ను కూడా అంతగొప్పగా ఆరాధిస్తాను. మీ దేశం జర్మన్‌ ఫాసిస్టుల పదఘట్టనల కింద నలిగిపోతుంటే నేను చూస్తూ కూర్చోలేను. లక్షలాది మంది సోవియట్‌ పౌరులను చంపినదానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ముందు పీఠీన నిలిచి పోరాడేందుకు పూర్తి సంసిద్దంగా ఉన్నాను. దయచేసిన నా వాంఛను మన్నించాలని కోరుతున్నాను.” అని రాసిన లేఖకు సమాధానం రాలేదు. తరువాత ఒక అధికారి వచ్చి ” తండ్రి ఒక హీరో, కుమారుడు ఆయన ఒడిలో పెరిగిన బలశాలి ” అంటూ సైనిక శిక్షణకు పంపాడు.1944లో టాంకుల కమాండర్‌గా పోలాండ్‌, జర్మనీ రంగాలలో పోరాడాడు. అయితే అతను రష్యన్‌ భాష బాగా మాట్లాడుతుండటంతో తోటివారెవరూ మావో కుమారుడని గుర్తించలేదు. తరువాత 1945లో సోవియట్‌ -జపాన్‌ యుద్దంలో కూడా పాల్గొన్నాడు. అతని ధైర్యసాహసాలకు మెచ్చి స్టాలిన్‌ స్వయంగా తన సంతకంతో కూడిన ఒక ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చాడు. 1946లో చైనాకు తిరిగి వచ్చాడు.1950లో కొరియాలో పోరాడేందుకు వెళ్లాడు. అక్కడ అమెరికా వైమానిక దాడిలో ప్రాణాలు అర్పించాడు.


మన దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఇతర దేశాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో కమ్యూనిస్టులు కాని వారు కూడా ఎందరో అసమాన త్యాగాలు చేసిన చరిత్ర ఉంది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఆ పోరాటాల్లో ఎందరో నేతలతో పాటు వారి అడుగుజాడల్లో నడిచిన సామాన్యులు కూడా అమరులైనారు. స్వాతంత్య్రం పేరుతో సామాన్యులను బలిపెట్టారని ఎవరైనా నాటి నేతలను నిందించగలమా ? చౌకబారుతనం, పాలకవర్గాల ప్రచారాన్ని భుజానవేసుకొనే బానిస బుద్ది తప్ప అది సంస్కారమేనా !