Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


మన పాలకులు, వారికంటే ఎక్కువగా మన మీడియా జనాలకు ఎక్కిస్తున్న దేశభక్తి ఎక్కడికి పోతున్నది ? గాంధీ, నెహ్రూ వంటి నేతలు సరైన పునాది వేయని కారణంగా దేశభక్తి అంటే పంద్రాగస్టు, రిపబ్లిక్‌ దినోత్సవాలకే పరిమితం అయిందని అనుకుందాం కాసేపు. వారి కంటే దేశాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు, ప్రపంచానికే గురువు అని చెబుతున్న నరేంద్రమోడీ ఓకల్‌ ఫర్‌ లోకల్‌( స్ధానిక వస్తువులనే వాడండి), మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత వగైరా , దేశ కాలాలతో నిమిత్తం లేకుండా ముందుకు తెచ్చిన చైనా వ్యతిరేకత ఏమైనట్లు ? ఎక్కడా ఆ ఛాయలే కనిపించటం లేదు. దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని సెలవిచ్చిన కంగనా రనౌత్‌ వంటి అసలు సిసలు సమరయోధులు గుండెలు దిటవు చేసుకోవాలి.


2021 చైనా-భారత వాణిజ్య లావాదేవీలలో నరేంద్రమోడీ సర్కార్‌ ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. డిసెంబరు నాటికి వంద బి.డాలర్లకు చేరతాయని అంచనా వేస్తే ఏకంగా 126 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా నుంచి మనం దిగుమతి చేసుకున్నది 97.52 బి.డాలర్లు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 46.2శాతం ఎక్కువ. మనం చైనాకు ఎగుమతి చేసిన సరకుల విలువ 28.14బి.డాలర్లు. ఇది 34.2శాతం పెరిగింది. మన సరకుల ఎగుమతుల పెరిగినందుకు సంతోషించాలా, దిగుమతు ఎక్కువైనందుకు విచారించాలా ? ఎందుకిలా దిగుమతుల రికార్డులను బద్దలు కొడుతున్నాము ? మీకేం బాబూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వాళ్లు ఎన్ని కబుర్లైనా చెబుతారు. వీలుపడక గానీ లేకపోతేనా దేశాన్ని వేల సంవత్సరాలు వెనక్కు తీసుకుపోయి ఉండేవారు.చైనా సెల్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఏవీ లేకుండా వారి వాట్సాప్‌ విశ్వవిద్యాలయాలు, ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు ఒక్క క్షణం పని చేయవు. వారికి ఒక న్యాయం ఇతరులకు ఒకటా ? పది మందికి పని కల్పించి తిండిపెడుతున్నాం. తగ్గేదేలే ! దిగుమతులను ఆపేదేలే, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఎవరు, ఇంకెవరు, చైనా వస్తు దిగుమతిదారులు.


రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే ముందు ఎవరైనా వెనుకా ముందూ చూసుకోవాలి. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాలని ఇక్కడి కమ్యూనిస్టులెవరూ తీర్మానాలు చేయలేదు. ధర్నాలు, రాస్తారోకోల వంటివి అసలు చేపట్టలేదు. పార్టీ నేతల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా దిగుమతిదారులు ఉన్నట్లు ఎవరూ నిరూపించలేదు.మన దేశంలోని మూలస్దంభం వంటి పరిశ్రమల్లో ఔషధరంగం ఒకటి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నవాటిలో 50-60శాతం వరకు ఈ రంగానికి అవసరమైన రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులే అని తెలుసుకోవాలి. ఒక అర్ధరాత్రి అమెరికా వాడు కల్లోకి వచ్చి తెల్లవారేసరికి మీరు చైనా వ్యతిరేకతను ప్రచారం చేయాలి అనగానే చిత్తం దేవరా అన్నట్లు చేశారా లేదా ? ఎలాంటి అజెండా లేకుండానే మన ప్రధాని మోడీ ఊహాన్‌, చైనా అధినేత షీ మహాబలిపురం వచ్చి ఉయ్యాలలూగి, విందులు ఆరగించి, ఊసులు చెప్పుకున్నవారు ఒక్కసారిగా శత్రువులు ఎలా అవుతారు? జనం అమాయకులు కాదు కదా !


చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అక్కడి నేతలు మన కాళ్ల దగ్గరకు వస్తారని ప్రచారం చేశారు.చైనా తొలిసారిగా ప్రస్తుతం ఏటా ఆరులక్షల కోట్ల డాలర్ల మేర ఎగుమతి దిగుమతులు జరుపుతున్నది. దానిలో పన్నెండవ వంతు అంటే 755బి.డాలర్ల మేరకు అమెరికాతో జరుగుతున్నాయి. మొదటి స్ధానంలో ఉన్న వారే ఎందుకు పెట్టుకున్నామురా బాబూ వీరితో తగాదాని తలలు పట్టుకుంటున్నారు. పదిహేనవ స్ధానంలో ఉన్న మనతో ఉన్న లావాదేవీలు కేవలం 126 బి.డాలర్లు మాత్రమే. అలాంటిది మనం దిగుమతులు ఆపేస్తే చైనా దారికి వస్తుందా ? పగటి కలలు గాకపోతే, మన గురించి మనకు అవగాహన ఉందా లేక హనుమాన్‌ తాయత్తు కట్టుకొని మాట్లాడుతున్నామా ? వెనుకటి రోజుల్లో పిచ్చి మంత్రం పెడతామని పిల్లల్ని బెదిరించినట్లుగా చైనా యాప్‌ల నిషేధం వలన ఒరిగిందేమిటి ? ఔషధ పరిశ్రమకు అవసరమైన దిగుమతులు చేసుకున్నామంటే అర్ధం ఉంది. పోనీ వాటిని కూడా అక్కడి నుంచి గాక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అడ్డుకున్నదెవరు? అమెరికా నేతలతో కౌగిలింతలకు దిగినా మరొకటి చేసినా రెండు దేశాల లావాదేవీలు 2021లో 110 బి.డాలర్లు మాత్రమే. చైనా వస్తువులా అబ్బే అవి నాశిరకం, చౌకరకం అని ఒక వైపు ఈసడించుకుంటారు. కానీ అదే చైనా నుంచి విలాసవంతమైన సెల్‌ఫోన్లు, రంగురాళ్లు, ఆటోమొబైల్స్‌కు మన విలువైన విదేశీమారక నిల్వలను ఖర్చు చేయాలా? ఎందరు సామాన్యులకు ఉపయోగం ఉంటుంది ? వీటి మీద దిగుమతి పన్నులు పెంచినా జనం తగ్గటం లేదు, అసలు అనుమతి ఎందుకివ్వాలి ? మన దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి, మన దేశం నుంచి చైనా దిగుమతి చేసుకొనే సరకులేవీ ప్రపంచంలో ఎక్కడా దొరకనివి కాదు. వివాదాలు ఎన్ని ఉన్నా సర్దుకుంటాయనే భావంతో లావాదేవీలను నిర్వహిస్తున్నదా ?
ఒకవైపు పశ్చిమ దేశాలతో బేరసారాలు, మరోవైపు చైనా మీద అనధికారికంగా తప్పుడు ప్రచారం, మరోవైపు రికార్డులను బద్దతు కొడుతూ దిగుమతులు. పరస్పర విరుద్దం కదా ? ప్రపంచంలో మనకు విలువ ఉంటుందా ? గతంలో మన దేశాన్ని బ్రిటీష్‌ పాలకులు ఏలినపుడు మన దగ్గర నుంచి ముడిసరకులు దిగుమతి చేసుకొని వారి నుంచి పారిశ్రామిక ఉత్పత్తులను మన మీదకు వదిలారు. రెండింటిలోనూ వారికే లాభం. ఇప్పుడు చైనా విషయంలో కూడా జరుగుతున్నది అదే. మనం వాణిజ్య లోటుతో ఉన్నాము అంటే అది చైనా, మరొక దేశం ఏదైనా సరే మన సంపదలకు అక్కడకు తరలుతున్నట్లే కదా ?నాడు మనది ఆక్రమిత దేశం, పరాధీనత, నేడు మనది స్వతంత్ర దేశమైనా స్పష్టమైన వైఖరి లేకపోవటంమే కారణం. మనం నేర్చుకున్నది ఏమిటి ? చైనాను పక్కన పెట్టి పశ్చిమ దేశాలతో సంబంధాలు పెట్టుకొని జనాన్ని ఉద్దరించమనండి. ఎవరు వద్దన్నారు. కావలసింది పిల్లి ఎలుకలను పడుతుందా లేదా అన్నది తప్ప నల్లదా తెల్లదా అన్నది కాదు. చైనాతో సంబంధాలను వెనక్కు మళ్లించుకొనేందుకు అమెరికా వంటి బడా దేశాల వల్లనే కావటం లేదు, చైనా మూడు చెరువుల నీరు తాగిస్తున్నది. దీని అర్ధం చైనాకు లొంగిపొమ్మని కానే కాదు. చైనా వస్తువుల మీద అక్రమంగా దిగుమతి పన్ను విధించటం చట్టవిరుద్దమని జనవరి 16న ప్రపంచ వాణిజ్య సంస్ధ తీర్పు ఇచ్చింది. అంతే కాదు, పరిహారంగా అమెరికా వస్తువుల మీద 64.5 కోట్ల డాలర్ల మేర ఏటా పన్నులు విధించుకోవచ్చని కూడా తీర్పు ఇచ్చింది. నిబంధనలకు చెప్పిన భాష్యం అంతా తొండి, మొత్తంగా ప్రపంచ వాణిజ్య సంస్దనే సంస్కరించాలని అమెరికా ఇప్పుడు గోలగోల చేస్తున్నది.


ఇక్కడ జనం తీవ్రంగా ఆలోచించాలి. ఒకవైపు చైనా మీదకు మనల్ని ఉసిగొల్పుతున్న అమెరికా మరోవైపు వారితోనే ఏడాదికేడాది లావాదేవీలను ఎందుకు పెంచుకుంటున్నట్లు ? అంతకు ముందుతో పోల్చితే 2021లో 28.7శాతం లావాదేవీలు పెరిగాయి.చైనా మిగులు 396.5 బి.డాలర్లు ఉంది.2018లో వాణిజ్యయుద్దం ప్రారంభానికి ముందు ఇది 323 బి.డాలర్లు మాత్రమే ఉంది. 2021లో తొలిసారిగా చైనా ఆరులక్షల కోట్ల డాలర్ల వాణిజ్యలావాదేవీల మైలు రాయిని అధిగమించింది. అమెరికా తనను తానే రక్షించుకోలేని స్ధితిలో ఉన్నపుడు మరొక దేశాన్ని రక్షించగలదా ? అమెరికా అడ్డగోలుగా ప్రపంచాన్ని నడిపే రోజులు కావివి అని గ్రహించాలి.