ఎం కోటేశ్వరరావు
బుద్దదేవ్ భట్టాచార్యకు పద్మ విభూషణ్ ప్రకటించటం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ సాధించదలచుకున్న లక్ష్యం ఏమిటి ? ఒక రాజకీయ పార్టీగా సిపిఐ(ఎం)ను, భావజాల పరంగా కమ్యూనిజాన్ని అంతంగావించాలన్న దాని బహిరంగ లక్ష్యం, కేరళ వంటి చోట్ల దాని హత్యాకాండ గురించి పదే పదే వివరించాల్సిన అవసరం లేదు. ఏ గల్లీ నేతను గిల్లినా వరదలా అదే ద్వేషం పారుతుంది. అలాంటిది బుద్దదేవ్ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకువచ్చినట్లు ? వివిధ రంగాలలో ప్రముఖులైన వారితో పాటు వివాదాస్పద కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్, బిజెపి మత చిహ్నాలలో ఒకరైన కల్యాణ సింగ్, మచ్చలేని మార్క్సిస్టు బుద్దదేవ్ భట్టాచార్యలకు కేంద్ర ప్రభుత్వం 73వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పద్మవిభూషన్ ప్రకటించింది. ప్రజాజీవితంలో జీవితంలో వీరి అసమానకృషికి ఇది గుర్తింపు అని చెప్పారు. రాజకీయ నేతలకు పద్మ అవార్డులు ఇవ్వటం ఇదేమీ కొత్త కాదు బుద్ధదేవ్ మాదిరి తిరస్కరించటమూ మొదటిసారే జరగలేదు. పాలకపార్టీకి అమ్ముడుపోయినట్లుగా గత కొంత కాలంగా వార్తలు వస్తున్న నేపధ్యంలో గులాంనబీ అజాద్‌కు అవార్డు ప్రకటించటంపై కాంగ్రెస్ నేత జయరామ్ రమేష్ చురక అంటించారు. బుద్దదేవ్ మంచి పని చేశారు అజాద్‌గా మరాలనుకున్నారు గులాముగా కాదు అన్నారు. కాంగ్రెస్‌లో చిచ్చును కొనసాగించాలన్నదే గులాంనబీ అజాద్ పేరు వెనుక ఉన్న అసలు కథ.
గతంలో నంబూద్రిపాద్‌కు కాంగ్రెస్ హయాంలోనే ప్రకటించారు. అది ఆయన మీద గౌరవమా ? తొలిసారిగా దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్ధలను ప్రహసన ప్రాయంగా మార్చివేసింది కాంగ్రెస్ పెద్దలే కదా ! తొలిసారిగా రాజ్యాంగాన్నే సాధనంగా మార్చుకొని దానితోనే కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. తరువాత అదే నేతకు అదే రాజ్యాంగం పేరుతో అవార్డును ప్రకటించారు. ఇఎంఎస్ తొలుత గాంధీజీ భావజాలంతో ప్రభావితుడై తరువాత పక్కా కమ్యూనిస్టుగా మారారు. పూర్వపు అనుబంధం కారణంగా కాంగ్రెస్ పాలకులు అవార్డు ప్రకటించారనుకుందాం! మరి ఆఎస్‌ఎస్ ఆధిపత్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏ అనుబంధంతో బుద్దదేవ్‌కు ప్రకటించినట్లు? అసలు బుద్దదేవ్ పేరును ఎవరు సిఫార్సు చేశారని ఒక తెలంగాణా బిజెపి నేతను ఒకటీవీ చర్చలో అడిగితే ఎవరూ సిఫార్సు చేయనవసరం లేదు, ఇప్పుడు నిబంధనలు సులభం ఎవరైనా పేరు పంపి అవార్డు ఇవ్వండి అంటే అవార్డుల కమిటీ పరిశీలించి సిఫార్సు చేస్తుందని సమాధానం చెప్పారు. బుద్దదేవ్ అనుమతి లేకుండా పంపిన వారి చిరునామా ఇస్తారా అంటే తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు, అవన్నీ ఎందుకు అని ఎదురుదాడి. రాజకీయాలు రాజకీయాలే, ఏ పార్టీలో ఉన్నా నేతలంటే గౌరవం గౌరవమే కనుక బుద్దదేవ్‌ను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే అంతకంటే సీనియర్ కేరళ నేత విఎస్ అచ్యుతానందన్‌ను ఎందుకు ఎంచుకోలేదని అవుట్‌లుక్ పత్రిక ప్రశ్నించింది.
కొందరు జర్నలిస్టులు, ఆ పేరుతో ఉంటూనే పార్టీల ప్రతినిధులుగా మారిన వారు అవసరమైనపుడు పార్టీలకు అనుకూలంగా కచేరీలకు దిగుతారు. ఇప్పుడు అదే బాటలో కొందరు పద్మ అవార్డును బుద్దదేవ్ తిరస్కరించటాన్ని దేనితోనో ముడిపెట్టేందుకు తెగఆయాస పడ్డారు.” ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అనే 1950 నినాదం నుంచి బుద్దదేవ్ పద్మ అవార్డు తిరస్కరణ వరకు ” వరకు అంటూ ఒక జర్నలిస్టు దాడికి దిగారు.1950 దశకపు నినాదం ఒక తప్పిదం అన్నట్లుగా పద్మ అవార్డు తీరస్కరణను కూడా తప్పిందంగా భవిష్యత్ కమ్యూనిస్టులు అంగీకరిస్తారా అంటూ ఒక సవాలు విసిరారు. కమ్యూనిజానికి భవిష్యత్తే లేదు, కమ్యూనిస్టులే ఉండరనే ప్రచారదాడి తరుణంలో సదరు జర్నలిస్టు భవిష్యత్‌లో కమ్యూనిస్టులు ఉంటారని చెప్పినందుకు వారి పోషకులు ఏమంటారో !
చరిత్రను విస్మరించాలని నియంతలు, శాశ్వతంగా అధికారంలో నిలిచిపోవాలని కోరుకొనే శక్తులు, వాటి మద్దతుదారులు తప్ప మిగతావారెవరూ కోరుకోరు.గత చరిత్ర నూతన తరాలకు మార్గదర్శి.స్పార్టకస్ తిరుగుబాటును విస్మరిస్తే తదుపరి బానిసల తిరుబాట్లు జరిగేవా ? బానిసత్వం లేని సమాజం ఉనికిలోకి వచ్చేదా ? అణచివేతకు గురైన 1857నాటి ప్రధమ స్వాతంత్య్ర తిరుగుబాటును విస్మరిస్తే మరో పోరాటం జరిగి తెల్లవారి పాలన అంతరించేదా ? బ్రిటీష్ వారికి భజన చేసిన వారిని చూసిన జనం నీరుగారి పోయి ఉంటే కొత్తవెల్లువలు వచ్చి ఉండేవా ? బుద్దదేవ్ పద్మఅవార్డు తిరస్కరణను అవకాశంగా తీసుకొని మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకదాడి జరిగింది.1940-1950 దశకంలో దేశంలో కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక పరిణామాలు జరిగాయి. వాటిని సైద్దాంతిక, ఆచరణాత్మక అంశాలకు సంబంధించిన మధనంలో భాగంగా చూడాలి. వాటిలో అనేక కోణాలున్నాయి. తాత్కాలిక రాజీలు, ఎవరి అభిప్రాయం సరైనదో తరువాత చూద్దాం అనే వాయిదాలు ఏవైనా కావచ్చు.
ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అని అప్పుడే కాదు, ఇప్పటికీ కొందరు చెబుతున్నారు. వచ్చేంతవరకు చెబుతూనే ఉంటారు. వారు కమ్యూనిస్టులే కానవసరం లేదు. ఒకవైపు నిజాం సర్కార్‌దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా పోరుసల్పుతున్న సంస్ధాన కమ్యూనిస్టులకు మద్దతుగా పక్కనే ఉన్న తెలుగువారు తాము సైతం బందూకులు పట్టి ప్రాణాలు అర్పించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. కమ్యూనిస్టులు తప్ప ఎందరు కాంగ్రెస్ వాదులు, ఇతర పార్టీల వారూ అలాంటి త్యాగాలకు పాల్పడ్డారో ఎవరినైనా చెప్పమనండి ? నెహ్రూ సర్కార్ నైజామ్ సర్కార్‌ను అణచివేస్తే అదొక తీరు. దానికి బదులుగా తిరుగుబాటు చేసిన జనం మీదనే ఏండ్ల తరబడి దాడులకు దిగి వేలాది మందిని బలితీసుకుంది. భూస్వాములను గ్రామాలకు రప్పించింది. కోస్తా ప్రాంతాలలో అనేక గ్రామాలను పోలీసు చిత్రహింసల శిబిరాలుగా మార్చివేసింది, అనేక మంది మానవతుల మీద అత్యాచారాలు జరిపించింది, వందలాది మంది ప్రాణాలు తీసింది. వేలాది మీద కేసులు, జైళ్ల పాలు చేసింది. అలాంటి స్ధితిలో వాటిని మరచిపోయి జండా పండగవచ్చింది, స్వాతంత్య్ర సంబంరాల్లో bాల్గొనాలని, అక్కడ పెట్టే పప్పు బెల్లాలు తినాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇవ్వగలదా ? ఉద్యమానికి విద్రోహం చేసి బ్రిటీష్ వారితో చేతులు కలిపిన కాషాయ దళాలు తమ హిందూత్వకు అనుకూలంగా లేదనే కారణాలతో స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని ఆమోదించలేదనేది బహిరంగ రహస్యం.
స్వాతంత్య్రతీరు తెన్నుల గురించి పార్టీలు, సంస్ధల చర్చలో కొన్ని అభిప్రాయాలు వెల్లడించటం వేరు.అదేమీ దేశద్రోహమూ కాదు, రాజాంగ వ్యతిరేకమూ కాదు. ఒకసారి రాజ్యాంగాన్ని ఆమోదించిన తరువాత దానికి కట్టుబడి ఉన్నాయా లేదా అన్నదే గీటు రాయి. న్యూస్ 18 టీవీ చర్చల్లో మాట్లాడిన బిజెపి నేతగా మారిన జర్నలిస్టు స్వపన్‌దాస్ గుప్తా విపరీత వ్యాఖ్యానం చేశారు. రాజ్యగౌరవాన్ని బుద్దదేవ్ తిరస్కరించటాన్ని చూస్తే వారి రాజ్యాంగబద్దత ప్రశ్నార్దకంగా మారింది.అలా చేయటం రాష్ట్రపతినే అవమానించటంతో సమానం. వారు లెనిన్ శాంతి బహుమతి తీసుకుంటారు కానీ భారత రిపబ్లిక్ ఇచ్చేదానితో మాత్రం సమస్య వస్తుంది. ఈ స్వాతంత్రం నిజమైంది కాదు అన్నది వారి వైఖరి. ఇది రాజకీయంగా సంకుచితమైన వైఖరి ” అని అరోపించారు. అంటే ఆర్‌ఎస్‌ఎస్ ఎలా అడిస్తే అలా ఆడాలన్నమాట.దేశం తోలుబొమ్మలాట తెరకాదు. అసలు ఈ ఎంపికే దురుద్దేశంతో కూడుకుంది కనుక బిజెపి నేతల నుంచి ఏది సంకుచిత వైఖరో ఏది విశాలమైనదో తెలుసుకోవాల్సినంత దుస్ధితిలో బుద్దదేవ్ లేరు.
తీసుకొనేవారి అంగీకారంతో నిమిత్తం లేకుండా ప్రకటించటమే ఒక అప్రజాస్వామిక లక్షణం. కేంద్రం ఇచ్చే అవార్డు విధిగా పుచ్చుకోవాలి లేకపోతే అది దేశద్రోహం అని రాజ్యాంగం నిర్దేశిస్తే అదొక తీరు. కానపుడు తిరస్కరించే హక్కు ఉంటుంది. తిరస్కరించిన వారిలో కమ్యూస్టులకంటే ముందే ఇతరులున్నారు. ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అన్న నినాదాన్ని ప్రస్తావించిన తరుణమే వంకబుద్ధి, అసందర్భమూ. పద్మ అవార్డులు స్వాతంత్య్రం,శాంతి గురించి ఇస్తున్నవి కాదు. అందువలన దానితో ముడిపెట్టటం సంస్కారహీనత. ” ఇప్పటికీ ఆర్ధిక స్వాతంత్య్రం లేదుకనుక ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. మేము రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నట్లుగా మరేపార్టీ చేయటం లేదు. అలాంటి అవార్డులను తిరస్కరించకూడదని ఎక్కడ రాసి ఉందో చూపమనండి. దీనిలో రాజకీయాలు ప్రభుత్వ దురుద్ధేశ్యాలను చూడాలని ” సిపిఎం రాజ్యసభ ఎంపీ వికాష్ భట్టాచార్య అన్నారు.
అవార్డులతో నిమిత్తం లేకుండానే ప్రజాజీవనంలో కొన్ని విలువలకు కట్టుబడి పని చేయాలని ఎవరైనా భావిస్తారు. అసలు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని చేసిన ప్రమాణానికే కట్టుబడని వ్యక్తి కల్యాణ సింగ్. బాబరీ మసీదు కట్టడానికి ఎలాంటి హాని జరగకుండా కాపాడతానని ఉత్తర ప్రదేశ్ ముఖమంత్రిగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన పెద్దమనిషి. దానికి ఏమైంది ? కూల్చివేస్తున్నంతసేపూ అచేతనంగా అవకాశమిచ్చి తరువాత ఎలాగూ చర్యతప్పదని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తికి అదే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పురస్కారమా ? ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకోసం కాకపోతే రాజ్యాంగాన్ని పరిహసించేందుకు ఇంతకంటే ఏమిచేయాలి ?ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేసిన కె బి హెగ్డెవార్, సిద్దాంతవేత్త ఎంఎస్ గోల్వాల్కర్‌కు భారత రత్న అవార్డులు ప్రకటించనంతవరకు తాను పద్మఅవార్డు స్వీకరించలేనని 2003లో ఆర్‌ఎస్‌ఎస్ నేత దత్తోపంత్ టేంగిడీ ప్రతిజ్ఞ చేశారు.వీరి వారసులు, రాజ్యాంగ వ్యవస్ధలను దిగజారుస్తున్న వారు రేపు చివరకు సావర్కర్, గాడ్సేలను కూడా జాతి రత్నాలుగా అందలమెక్కించినా ఆశ్చర్యం ఏముంటుంది ? ఆ క్రమంలోనే ఇదంతా జరుగుతోందేమో ?