Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మఠాల్లో ఉంటూ సర్వసంగ పరిత్యాగులైనట్లు చెప్పుకొనే యోగులు, యోగినులకు తుపాకులు అవసరమా ? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాధ్‌కు ఉన్న వ్యక్తిగత ఆస్తి రు.1.5 కోట్లలో లక్ష రూపాయల విలువైన ఒక రివాల్వరు, రు.80వేల ఖరీదైన ఒక రైఫిల్‌, రుద్రాక్షలతో కూడిన రెండు బంగారు గొలుసులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.యోగులు రుద్రాక్షలు కలిగి ఉండటంలో అబ్బురం ఏమీ లేదు, తుపాకులెందుకని ? సిఎం గాక ముందు ఐదు దఫాలు ఎంపీగా పని చేసిన యోగికి అవసరమైన భద్రతను అధికారికంగా కల్పిస్తారు.ఐనా స్వంతంగా రెండు మారణాయుధాలను ఎందుకు వెంట ఉంచుకుంటున్నట్లు ? రాత్రుళ్లు ప్రాణభయం ఉందా ? 2017 ఎంఎల్‌సి ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నాలుగు కేసులు, రెండు కార్లు ఉన్నట్లు పేర్కొన్న యోగి తాజా అఫిడవిట్‌లో కేసులేమీ లేవని,స్వంత వాహనాలేమీ లేవని తెలిపారు.
గోరఖ్‌పూర్‌ అర్బన్‌ స్ధానం నుంచి పోటీలో ఉన్న ఆదిత్యనాధ్‌పై తాను పోటీ చేయనున్నట్లు గత 26సంవత్సరాలుగా నిరవధిక ధర్నా చేస్తున్న మాజీ టీచర్‌ విజయ సింగ్‌ ప్రకటించారు.ముజఫర్‌నగర్‌లో భూమాఫియా మీద చర్య తీసుకోవాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. యోగి మీద పోటీతో పాటు ఎస్‌పి నేత అఖిలేష్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న చోట వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు.


ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో బ్రాహ్మణ సామాజిక తరగతి కీలకపాత్ర పోషిస్తున్నారు.1989 తరువాత వారి నుంచి సిఎం గద్దెనెక్కిన వారు లేరు. కారణం తరువాత కాలంలో ఓబిసి కులాలు, రాజకీయాలు ముందుకు వచ్చాయి.మండల్‌ (కమిషన్‌) ఆందోళన తరువాత ఈ తరగతి నుంచి ఎవరూ సిఎం కాలేదు. కులాలు, మతాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 21 మంది సిఎంలుగా పని చేస్తే వారిలో ఆరుగురు గోవిందవల్లభ పంత్‌, సుచేతా కృపలానీ,కమలాపతి త్రిపాఠీ, శ్రీపతి మిశ్రా, హెచ్‌ఎన్‌ బహుగుణ, ఎన్‌డి తివారీ ఈ సామాజిక తరగతికి చెందినవారే.పదిశాతంపైగా ఓటర్లుగా కూడా ఉన్నందున వీరు మొగ్గినవైపు అధికారం చేతులు మారుతూ వస్తోంది. విధాన సభలోని 403 స్ధానాలకు గాను 115 చోట్ల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారని అంచనా. ఆ రీత్యానే గతంలో బిఎస్‌పి నేత మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌, గత ఎన్నికల్లో యోగి గద్దెనెక్కారన్నది కొందరి సూత్రీకరణ. దానిలో భాగంగానే ఇప్పుడు యోగి పట్ల ఆగ్రహంగా ఉన్నందున బిజెపి ఇంటిదారి పట్టవచ్చని చెబుతున్నారు.నిజానికి దీనికంటే ఇతర అంశాలు బలంగా పని చేస్తున్నాయి.


ఈ సామాజిక తరగతి సమాజవాది పార్టీకి మద్దతు ఇచ్చినపుడు యాదవులు వీరిని చిన్నచూపు చూశారని బిజెపి, ఇతర పార్టీలు రెచ్చగొట్టాయి. ఇప్పుడు అదే ఆయుధాన్ని బిజెపి మీద ఇతరులు ప్రయోగిస్తున్నాయి. ఠాకూర్ల మోచేతి నీళ్లు తాగాల్సి వస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. యోగి పాలనలో కనీసం ఐదువందల మంది బ్రాహ్మలను హత్య చేశారని,20 మందిని నకిలీ ఎన్‌కౌంటర్లలో చంపినట్లు విమర్శలున్నాయి. దీని తీవ్రతను గమనించే అనేక మంది బ్రాహ్మణనేతలకు బిజెపి పెద్దపీటవేస్తోంది. ఇతర పార్టీల నుంచి ఆహ్వానిస్తోంది.లఖింపూర్‌ ఖేరీలో రైతుల మీద వాహనాలను తోలి హత్యకావించిన కేసులో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఉన్నట్లు విచారణలో తేలినా మంత్రి మీద చర్య తీసుకొనేందుకు బిజెపి వణికి పోవటానికి ఇదే కారణం. అంతేకాదు బ్రాహ్మలతో ఏర్పాటుచేసిన కమిటీలో కూడా మంత్రిని చేర్చారు.


ఈ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్ల కోసం పార్టీల పాట్లు ఇన్నిన్ని కావు. లక్నో నగరంలో పరశురాముడి విగ్రహాన్ని సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. గండ్రగొడ్డలితో కూడిన పరశురాముడు-అఖిలేష్‌ చిత్రాలు తరువాత దర్శనమిచ్చాయి.యాదవులు, బ్రాహ్మలు మాతోనే ఉన్నారని అఖిలేష్‌ చెప్పారు. బిఎస్‌పి నేత మాయావతి ఎన్నికల ప్రచారంలో దిగకపోయినా ఆ పార్టీ అగ్రనేత సతీష్‌ చంద్ర మిశ్రాను రంగంలోకి దించి బ్రాహ్మల ఓట్లకోసం తిప్పుతున్నారు. ప్రతిపక్షాల దాడికి తట్టుకోలేక బ్రాహ్మలను సంతృప్తి పరచేందుకు బిజెపి 16మందితో ఒక కమిటీని వేసి సమస్యలను గుర్తిస్తామంటూ బుజ్జగింపులకు దిగింది. గాంగస్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ సమయంలో మరణించిన అమర్‌దూబే భార్య ఖుషీ దూబే, ఆమెతో పాటు తల్లి గాయత్రీ తివారీకి సీట్లు ఇచ్చిన కాంగ్రెస్‌ తనవంతు తిప్పలు పడుతోంది.


ఆదిత్యనాధ్‌ తప్పక గెలవాలని తాము కోరుకుంటున్నామని, ఎందుకంటే అసెంబ్లీలో బలమైన ప్రతిపక్ష నేత అవసరం కనుక అని రైతు ఉద్యమనేత రాకేష్‌ తికాయత్‌ జోక్‌ వేశారు. పోటీ 80శాతం, 20శాతం మధ్యనే అంటూ హిందూ-ముస్లిం పోటీగా రెచ్చగొట్టేందుకు బిజెపి వేసిన ఎత్తుగడ దానికే నష్టకరంగా మారుతున్నట్లు వార్తలు రావటంతో నష్టనివారణ చర్యలకు పూనుకుంది. బిజెపి చేసిన ప్రచారంతో వివిధ పార్టీల వెనుక చీలిన ముస్లిం సామాజిక తరగతి బిజెపిని ఓడించేందుకు మొత్తంగా సమాజవాదికి మద్దతు ఇవ్వాలని వార్తలు వచ్చాయి. దాంతో మొదటిదశ ఎన్నికలు కూడా ప్రారంభంగాక ముందే 80-20 కాస్తా 90-10శాతంగా మారినట్లు స్వయంగా యోగి ఎన్నికల ప్రచారంలో చెప్పటం ప్రారంభించారు.మతంతో సంబంధం లేని ఎన్నికలని, ముస్లింలతో సహా అందరూ తమ వెనుకే ఉన్నారని చెప్పటమే ఇది.


రెండు ఇంజిన్లతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామని చెప్పిన బిజెపి ఇప్పుడు ఎన్నికల్లో తానే చెమటలు కారుస్తోంది. పండిన గోధుమల్లో 15శాతం, బియ్యంలో 32శాతం మాత్రమే మద్దతు ధరకు రాష్ట్రంలో సేకరించారు. మిగిలిన మొత్తాన్ని రైతులు అంతకంటే తక్కువకే అమ్ముకొని నష్టపోయారు. రైతుల ఉద్యమం, ఎన్నికల కారణంగా గత ఏడాది కంటే 10 నుంచి 15శాతానికి గోధుల సేకరణ పెరిగినప్పటికీ 2018-19లో 16శాతం సేకరణతో పోలిస్తే తక్కువే. బియ్యం సేకరణ మరీ ఘోరంగా ఉంది. గత ఐదేండ్ల సగటు 34.8శాతం కాగా, గతేడాది 43 నుంచి ఈ ఏడాది 32శాతానికి దిగజారింది. కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించే అంశం గురించి ఒక కమిటీని వేస్తామని సాగు చట్టాల రద్దు ప్రకటనతో పాటు చెప్పారు. ఇంతవరకు దాని ఊసే లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత అంటూ ఇప్పుడు కొత్త కబుర్లు చెబుతున్నారు.


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయరాదంటూ 57రైతుల సంఘాల పిలుపు మేరకు ఎస్‌కెఎం మిషన్‌ ఉత్తర ప్రదేశ్‌ అనే కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ప్రతి గ్రామాన్ని సందర్శించి బిజెపి పాల్పడిన విద్రోహం గురించి రైతులు, ఇతర జనాలకు వివరిస్తామని నేతలు తెలిపారు. తాము ఏ పార్టీకి ఓటు వేయాలన్నది చెప్పటం లేదని, మోసం చేసిన బిజెపిని ఓడించాలని కోరతామన్నారు. జనవరి 15న సమావేశమైన ఎస్‌కెఎం కమిటీ ఎంఎస్‌పి కమిటీ ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడవు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటికీ ఏర్పాటును ప్రకటించకపోతే జనవరి 31న దేశమంతటా విద్రోహదినంగా పాటించాలని పిలుపు ఇచ్చారు. ఆ మేరకు పలుచోట్ల పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఆందోళన పునరుద్దరణలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలల్లో బిజెపి ఓటమికి పిలుపు ఇచ్చారు.


ఉత్తర ప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతంలో సమాజవాది-ఆర్‌ఎల్‌డి కూటమి ప్రచారం బిజెపికి చెమటలు పట్టిస్తున్నట్లు వార్తలు. విజయ రధం పేరుతో బస్సు ద్వారా అఖిలేష్‌ యాదవ్‌ – జయంత్‌ చౌదరి చేస్తున్న పర్యటన యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది.జాట్‌ – ముస్లిం ఐక్యతను ముందుకు తెస్తున్నారు. తరచుగా జయంత్‌ చౌదరి సభలకు హాజరైన యువతను ఇలా అడుగుతున్నారు ” ఇక్కడున్న అందరికీ వివాహమైందా ? మీరు పెండ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా ? గుర్తు పెట్టుకోండి, వివాహం కావాలంటే మీరు ఇంట్లో సామరస్యతను పాటించాలి. ఇంట్లో ప్రశాంతత లేదని ఇతరులకు తెలిస్తే వివాహానికి ఎవరూ ముందుకు రారు ” అని చెబుతున్నారు. అఖిలేష్‌ రైతులను ఆకర్షించేందుకు ఇలా మాట్లాడుతున్నారు.” మీకు వికాసం కావాలా లేక రోడ్ల మీద తిరిగే పశువులు కావాలా ?” గో సంరక్షణ పేరుతో ఒట్టిపోయిన పశువులను అమ్ముకోనివ్వకుండా రైతులను బిజెపి సర్కార్‌ అడ్డుకుంటున్నది. వాటిని మేపటం దండగ అని రైతులు రోడ్ల మీదకు వదలి వేయటంతో వాటిని నుంచి రైతులు పంటలను కాపాడుకోవటం మరొక సమస్యగా మారుతోంది. దాంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తుతోంది.


ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందన్నట్లుగా అసెంబ్లీ ఎన్నికలు బిఎస్‌పి చావుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. దళితుల్లో జాతావులు మాయావతి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. దాన్ని అవకాశంగా తీసుకొని బిజెపి ఇతరులను రెచ్చగొట్టి కొంత మేరకు తమవైపు తిప్పుకోగలిగింది. ఇప్పుడు బిఎస్‌పి ఎక్కడా రంగంలో కనిపించకపోవటంతో జాతావులు, ఇతర దళితులను తమ వైపు ఆకర్షించేందుకు బిజెపి, ఎస్‌పి పూనుకున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లలో దళితులు 21శాతం కాగా వారిలో జాతావులు తొమ్మిదిశాతం ఉన్నారు.గత ఎన్నికల్లో 84రిజర్వుడు స్ధానాల్లో బిజెపికి 69, దానితో జతకట్టిన పార్టీలకు మరోఐదు వచ్చాయి. గిరిజనులకు ఉన్న మరో రెండుతో మొత్తం 86 స్ధానాల్లో బిఎస్‌పికి వచ్చింది కేవలం రెండంటే రెండు మాత్రమే. ఎస్‌పి ఎనిమిది చోట్ల గెలిచింది. ఈ సారి బిజెపి జాతావు సామాజిక తరగతికి చెందిన మాజీ ఉన్నతాధికారులతో పాటు ఉత్తరాఖండ్‌ మాజీ గవర్నర్‌ను కూడా రంగంలోకి దించి ఓటర్లను ఆకట్టుకొనేందుకు పూనుకుంది.