ఎం కోటేశ్వరరావు
బిజెపికి చమురు సెగ తగిలింది. తమను గెలిపిస్తే ఏడాదికి ప్రతి ఇంటికి మూడు గాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మూడు సంవత్సరాల పాటు చమురుపై పన్నులు పెంచబోమని గోవా బిజెపి ఓటర్లకు వాగ్దానం చేసింది. తమను గెలిపిస్తే లీటరు పెట్రోలు ధర రు.80కి మించి పెరగనివ్వం అని వాగ్దానం చేసింది.దీని మీద బిజెపి మానిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ త్వరలో వాహనాలకు అమర్చే ఇంజన్లను ఇథనాల్‌తో నడిపించవచ్చని, అది లీటరు ధర రు.62కు మించదని, అందువలన కాంగ్రెస్ రు.80 పరిమితి విధించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. అంతపరమ రహస్యం తెలిసిన పెద్దలు తామే ఆ ముక్క వాగ్దానంగా చెప్పవచ్చు, అంత సంతోషకరమైన వార్తను కేంద్రమే ఒక ప్రకటనగా చేయవచ్చు. ఇంక బిజెపి పెద్దలు గోవాలో అమెరికా ప్రమాణాలతో కూడిన రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా సెలవిచ్చారు.
అమెరికా – ఇరాన్ మధ్య అణుచర్చలు జరుగుతాయనే వార్తలు రాగానే ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి.సఫలమైతే మరికొంత తగ్గవచ్చు, విఫలమైతే పెరగవచ్చు. అంటే అమెరికా చర్యలు అంతర్జాతీయ మార్కెట్ మీద ప్రభావం చూపుతున్నాయి. అనేక దేశాలు అణు పరీక్షలు జరుపుతున్నా అమెరికాకు పెద్దగా పట్టదు, అదే ఇరాన్ జరిపితే దానికి నొప్పి ఏమిటి ? ఏ దేశాన్నీ ప్రశాంతంగా ఉండనివ్వదా ? దాని రాజకీయం, లబ్ది కోసం ప్రపంచమంతా బలి కావాలా ? అలాంటి అమెరికా తోకపట్టుకొని మనం పోవాలా ?
గత ఏడు సంవత్సరాలలో తొలిసారిగా ఫిబ్రవరి ఏడున బ్రెంట్ రకం ముడిచమురు 94 డాలర్లను తాకింది(దానికి ఒక డాలరు తక్కువగా మన దేశం దిగుమతి చేసుకొనే చమురు ధర ఉంటుంది) అమెరికా-ఇరాన్ పరోక్షంగా చర్చలను ప్రారంభించనున్నాయి.దీంతో బుధవారం నాడు 90.6 డాలర్ల వద్ద మార్కెట్ ఉంది. గతంలో అంగీకరించిన ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగిన కారణంగా తాను అణు కార్యక్రమాన్ని పునరుద్దరిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దాన్ని సాకుగా తీసుకొని మన దేశంతో సహా ఎవరూ ఇరాన్ చమురు కొనుగోలు చేయకూడని అమెరికా ఆంక్షలు విధించింది. ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు మనం తలొగ్గి మిత్రదేశమైన ఇరాన్ నుంచి చమురుకొనుగోలు నిలిపివేశాము. ఇరాన్‌పై కొన్ని ఆంక్షలను అమెరికా తొలగించటంతో ధరలు పరిమితంగా తగ్గాయి. చమురుకు డిమాండ్ పెరుగుతున్నందున ఇది తాత్కాలికమే అని చెబుతున్నారు.
గతంలో ఆసియా దేశాలకు సరఫరా చేసే చమురు ధరలను సౌదీ అరేబియా స్వల్పంగా తగ్గించినపుడు చూశారా నరేంద్రమోడీ పలుకుబడి అంటూ డబ్బాకొట్టారు. ఇప్పుడు ధరలను పెంచుతున్నట్లు సౌదీ ప్రకటించింది. నోరు మూతపడింది. నిజానికి గతంలో కూడా ఒక్క మన దేశానికే కాదు, ఇతర ఆసియా దేశాలకూ తగ్గించింది. ఇప్పుడు గిరాకీ ఉంది కనుక ఎంతైనా కొనుగోలు చేయక తప్పదు. వెనెజులా కూడా మనకు మిత్రదేశమే.దాని దాడికి దిగిన అమెరికా ఆంక్షల కారణంగా అక్కడి నుంచి కూడా మనం చమురు కొనుగోలు నిలిపివేశాము. పేరుకు స్వతంత్ర దేశం ఆచరణలో అమెరికా అడుగులకు మడుగులొత్తటం.వెనెజులా బదులు మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇప్పుడు దానికి మెక్సికో కోత పెట్టింది.గతేడాది రోజుకు 98వేల పీపాలను దిగుమతి చేసుకోగా ఈ ఏడాది తొలి రెండు నెలల్లో దాన్ని 15వేలకు తగ్గించారు. దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే విధానంలో భాగంగా ఈ చర్యతీసుకున్నట్లు చెబుతున్నారు. మనకు చమురును విక్రయించే దేశాలు సమంజసమైన ధరలకు చమురు సరఫరా చేయాలని కోరుతున్నట్లు మన చమురుశాఖ సహాయ మంత్రి రామేశ్వర తేలి ఫిబ్రవరి ఏడున రాజ్యసభలో చెప్పారు. గతంలో ఇరాన్ మనకు రవాణా రాయితీతో పాటు, ప్రపంచంలో ఎక్కడా చెల్లని మన రూపాయిలను తీసుకొనేందుకు కూడా ఇరాన్ వీలు కల్పించింది. ఇప్పుడు దానితో పరోక్షంగా వైరం తెచ్చుకున్నాం. జర కాస్త చూసి ధరవేసుకోండి అంటూ ఇతర దేశాలను బతిమాలుకుంటున్నాం.
మనం దిగుమతి చేసుకొనే చమురు ధర డిసెంబరు ఒకటిన 71.32 డాలర్లు ఉండగా జనవరి 31న 89.41డాలర్లని మరోమంత్రి హరదీప్ సింగ్ పూరీ వెల్లడించారు. ఇంత పెరుగుదల ఉన్నప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా పెట్రోలు, డీజిలు ధరలను పెంచకుండా నిలిపివేశారు.ఎన్నికలు ముగియగానే ఈ మొత్తాలను వసూలు చేసే విధంగా ధరలను పెంచనున్నారు.
అనేక దేశాల్లో చమురు ధరల పెరుగుల సెగతగలటం ప్రారంభమైంది.ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కనిపిస్తోంది.న్యూజిలాండ్‌లో ఏడాది కాలంలో 30శాతం చమురు ధరలు పెరిగాయి.ద్రవ్యోల్బణం 5.9శాతానికి పెరగటంలో చమురు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. కాలుష్యనివారణలో భాగంగా పెట్రోలు మీద లీటరుకు ఎనిమిది నుంచి 16సెంట్ల వరకు పన్ను విధిస్తున్నారు. ఐరోపా యునియన్ దేశాల్లో జీవన వ్యయం పెరిగిపోతోంది. దాంతో జనం పొదుపు చర్యలకు పూనుకున్నారు. దానికి పెట్రోలు టూరిజం అని ముద్దుపేరు పెట్టారు. తన జనం మీద భారం తగ్గించాలని పోలెండ్ సర్కార్ చమురు, గాస్ మీద పన్ను తగ్గించింది. దాంతో లీటరుకు 25 నుంచి 35సెంట్ల భారం తగ్గింది. ఐతే ఈ చర్య ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇరుగుపొరుగుదేశాలైన హంగరీ, జర్మనీ, స్లోవేకియా, చెక్ తదితర దేశాల వారందరూ పెద్ద కాన్లతో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశంలో కొరత ఏర్పడింది. ఎవరూ 60లీటర్ల కాన్లు నాలుగుకు మించి విడిగా తీసుకుపోకూడదంటూ రోడ్ల మీద తనిఖీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.స్లోవాక్‌లు సరిహద్దుదాటి వచ్చి 50లీటర్ల కారు టాంకు నింపుకుంటే దూరాన్ని బట్టి 10 నుంచి 18 యురోలు మిగుల్చుకుంటున్నారు. పోలెండ్‌లో ఇతర సరకులపై కూడా పన్ను తగ్గించటంతో పెట్రోలు, డీజిలుతో పాటు సరకులను కూడాకొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. అనేక చోట్ల చమురు, గాస్ బంకులు సరఫరా లేక మూసివేస్తున్నారు. పోలెండ్‌తో ఇతర దేశాల్లోని సరిహద్దు సమీప బంకుల వారు పెట్రోలు టూరిజంతో భారీగా నష్టపోతున్నారు. వారి వద్ద కొనుగోలు చేసే వారు లేకుండా పోయారు.(మన దేశంలో ఢిల్లీ చుట్టూ ఉన్న హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు పన్ను తగ్గించటంతో ఢిల్లీ పరిధిలోని బంకులకూ అదే పరిస్దితి ఎదురైంది. ఢిల్లీ నుంచి సమీపంలోని రాష్ట్రాల బంకుల్లో కొనుగోలు లేదా ఇతర మార్గాల్లో సమకూర్చుకోవటంతో కేజరీవాల్ కూడా పన్ను తగ్గించాల్సి వచ్చింది)
చమురు, గాస్, విద్యుత్ ధరల పెరుగుదల ఐరోపా దేశాల పర్యాటక రంగం మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.బ్రిటన్‌లో ఏప్రిల్ నాటికి 54శాతం వరకు ఇంధన బిల్లులు పెరగవచ్చని అంచనా. కార్లలో విహార యాత్రలకు వచ్చే కుటుంబాలకు ఒక టాంకు పెట్రోలు నింపుకునేందుకు గతంలో 60యురోలు చెల్లించాల్సి వస్తే ఇప్పుడు 85కు పెరిగాయి, అందువలన ప్రయాణ దూరాలపై కూడా పరిమితులు విధించుకుంటున్నారు. మార్చి ఏడవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని చివరి దశ ఎన్నికలు ముగుస్తాయి, ఆ మరుసటి రోజునుంచే ధరల పెరుగుదల ప్రారంభం కానుంది.