Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎన్నికల్లో ఎవరి గొప్ప గురించి వారు చెప్పుకోవటం ఒక పద్దతి. అలాగాక ఇతర రాష్ట్రాలను కెలికితే ఏమౌతుంది. కరోనాతో మరణించిన వారి శవాలను గంగలో నెట్టి వేయించిన ఘనత ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ మూటగట్టుకున్న అంశం తెలిసిందే. అలాంటి పెద్ద మనిషి ప్రతిపక్షాలకు గనుక అధికారమిస్తే ఒక బెంగాల్‌, ఒక కాశ్మీరుగా, ఒక కేరళగా ఉత్తర ప్రదేశ్‌ మారిపోతుంది గనుక ఓటరులారా తిరిగి బిజెపికే పట్టం కట్టండని ఒక వీడియో ప్రకటనలో యోగి ఆదిత్యనాధ్‌ పేర్కొన్నారు.


ఏ రాష్ట్రం ఏ రంగంలో ఎంత ప్రగతి సాధించిందో ఇటీవలనే కేంద్ర నీతి అయోగ్‌ ప్రకటించిన సంగతి ఎన్నికల్లో ఎదురీదుతున్న యోగి మరచిపోయి ఉంటారు.బహుముఖ దారిద్య్ర సూచిక(ఎంపిఐ)లో 0.71శాతంతో కేరళ ప్రధమ స్ధానంలో ఉంది. మరి యోగి పాలనలో ఉత్తర ప్రదేశ్‌ ఎక్కడ ఉంది? బీహార్‌ 51.91, ఝార్ఖండ్‌ 42.16, ఉత్తర ప్రదేశ్‌ 37.79శాతంతో అడుగునుంచి మూడవ స్ధానంలో ఉంది. అందుకే కేరళ సిఎం పినరయి విజయన్‌ వెంటనే సమాధానమిచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ గనుక కేరళగా మారితే జనాలకు మంచి విద్య, ఆరోగ్య సేవలు, సాంఘిక సంక్షేమం అందుతుందని తిప్పికొట్టారు. అంతే కాదు జీవన ప్రమాణాలు, సామరస్యపూరిత సమాజం ఉంటుంది కనుక మతం, కులం పేరుతో జనాలు హత్యలకు గురికారని, ఉత్తర ప్రదేశ్‌ జనాలు కూడా అదే కోరుకుంటున్నారని కూడా అన్నారు.


యోగి ఆదిత్యనాధ్‌ తన వీడియో ప్రకటనలో చెప్పిందేమిటి ? ” నా ఆందోళన ఏమిటంటే ఈ జనాలు(ప్రతిపక్షాలు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.వారు చెబుతున్నట్లుగా మీరు అధికారమిస్తే ఏమౌతుంది. నా ఐదేండ్ల కష్టమంతా వృధా అవుతుంది. ఉత్తర ప్రదేశ్‌ కాస్తా కాశ్మీరు, బెంగాల్‌,కేరళగా మారటానికి ఎంతో సమయం పట్టదు. మీ మంచి జీవనానికి మీ ఓటే హామీ. ఈ ఐదు సంవత్సరాల్లో అనేక అద్భుతాలు జరిగాయి” అంటూ ఆరునిమిషాల వీడియోలో తన పాలన ఘనత గురించి చెప్పుకున్నారు.


నీతి అయోగ్‌ నివేదికలో అలాంటి అద్భుతం ఏమిటో చూశాము. ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు-పురోగమన భారత్‌ పేరుతో నివేదిక రూపొందించారు. దాన్ని నీతి అయోగ్‌, కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ బాంకు 2019-20 సమాచారం మేరకు విశ్లేషించాయి. పెద్ద రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణా మొదటి మూడు స్ధానాల్లో ఉన్నాయి.చివరన 19వ స్ధానంలో ఉత్తర ప్రదేశ్‌ ఉంది. కేరళకు 82.2, ఉత్తర ప్రదేశ్‌కు 30.57 మార్కులు వచ్చాయి. ఇక నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) సమాచారం ప్రకారం 2018-20 సంవత్సరాల్లో కేరళలో 921 హత్యలు జరిగాయి. ఇది ప్రతిలక్ష మందికి 0.9శాతం కాగా జాతీయ సగటు 2.2గా ఉంది. దీనిలో కూడా ఉత్తర ప్రదేశే అలగ్రస్ధానంలో ఉంది. మాదక ద్రవ్యాల కేసుల్లో పంజాబ్‌, హిమచల్‌ ప్రదేశ్‌ తరువాత స్దానం ఉత్తర ప్రదేశ్‌దే.


దేశంలో సంచలనం కలిగించిన లఖింపూర్‌ ఖేరీ మారణకాండలో ప్రధాన నిందితుడైన( కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ) ఆశిష్‌ మిశ్రాకు ఎన్నికల తొలిదశ పోలింగ్‌ రోజే బెయిలు లభించింది. జనవరి 18న తీర్పును రిజర్వుచేసినట్లు ప్రకటించిన అలహాబాద్‌ హైకోర్టు గురువారం(ఫిబ్రవరి 10) నాడు వెల్లడించింది. గతేడాది అక్టోబరు మూడున కార్లతో తొక్కించి నలుగురు రైతులను దారుణంగా హత్యగావించిన అంశం తెలిసిందే. తదనంతరం రైతుల ఆగ్రహానికి ముగ్గురు బిజెపి దుండగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం జరిగినపుడు తన కుమారుడు అక్కడ లేడని కేంద్రమంత్రి బుకాయించారు. ప్రభుత్వం మాత్రం సంఘటన దురదృష్టకరం అని పేర్కొన్నది. అక్టోబరు 9న నిందితులను అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన కొన్ని కేసులలో సాక్షులను హతమార్చిన ఉదంతాల నేపధ్యంలో లఖింపూర్‌ ఖేరీ ఉదంత సాక్షులకు రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.నష్ట నివారణ చర్యల్లో భాగంగా అనివార్యమై యోగి సర్కార్‌ సుప్రీం కోర్టు ఆదేశం మేరకు ప్రత్యేక దర్యాప్తు బౄందాన్ని ఏర్పాటు చేసింది.తొలుత కుట్రదారుగా కేంద్ర మంత్రి పేరును చేర్చిన సిట్‌ తరువాత దాన్ని తొలగించి మంత్రి బావమరిది వీరేంద్ర శుక్లా పేరు చేర్చింది. మంత్రికుమారుడి దారుణానికి బలైన జగదీప్‌ సింగ్‌ తండ్రి నచత్తర్‌ సింగ్‌ తాను కేంద్ర మంత్రి మీద వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, తనకు మద్దతు ఇవ్వాలని ఎస్‌పి, కాంగ్రెస్‌లను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న పార్టీల కోరికను తిరస్కరించారు. రైతుల్లో మరింత ఆగ్రహం తలెత్తుతుందనే భయంతో ఇంతవరకు ఎక్కడా కేంద్ర మంత్రిని బిజెపి ప్రచారానికి పంపలేదు.