Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను బలవంతంగా రుద్దుతున్నారు. మితవాద రిపబ్లికన్‌ పార్టీ ఏలుబడిలో ఉన్న అరిజోనా రాష్ట్రంలోని హైస్కూళ్లలో స్వేచ్చ, ప్రజాస్వామ్య అమెరికన్‌ ప్రమాణాలతో సంఘర్షిస్తున్న కమ్యూనిజం, నిరంకుశత్వం ప్రమాదకారి అనే పాఠాలు చదవకుండా విద్యార్ధులకు డిగ్రీలు ఇవ్వకూడదని ప్రతిపాదించారు. వియత్నాం నుంచి పారిపోయి వచ్చిన ఒక కమ్యూనిస్టు వ్యతిరేక కుటుంబానికి చెందిన అసెంబ్లీ సభ్యుడు క్వాంగ్‌ గుయన్‌ ఈ బిల్లును విద్యా కమిటీలో పెట్టి ఆమోదం పొందాడు. దీన్ని అసెంబ్లీలో ఆమోదిస్తే అమలు చేస్తారు. పౌర విద్య ముసుగులో సోషలిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించే ఇలాంటి బిల్లునే గతేడాది ఫ్లోరిడా రాష్ట్రంలో కూడా ఆమోదించారు. అరిజోనాలో జరిగే పరీక్షల్లో కమ్యూనిజం-నియంతృత్వాన్ని పోలుస్తూ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. దీన్ని ఎలా అమలు జరపాలా అని చర్చిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ భావజాలాల గురించి పాఠాలు ఉన్నాయని, శాసనసభ్యులు పాఠశాల సిలబస్‌ను నిర్ణయించటం ఒక ప్రమాదకర సంప్రదాయం అవుతుందని అనేక మంది విమర్శిస్తున్నారు.


అలబామా రాష్ట్రంలోని సదరన్‌ పావర్టీ లా సెంటర్‌ కె-12 విద్యార్దుల కోసం రూపొందించిన పాఠాలు అమెరికాను మౌలికంగా సోషలిస్టు సమాజంగా మార్చివేసేందుకు ఉద్దేశించినవంటూ, వాటిని పూర్తిగా తొలగించాలని ఒక పత్రికలో సంపాదకలేఖ ప్రచురితమైంది. తన కుటుంబం రష్యా నుంచి వచ్చిందని, అమెరికాలో కమ్యూనిజం పెరుగుదలను చూస్తున్నానని దానిలో ఉంది. ” నాలుగు సంవత్సరాల పాటు పిల్లలకు బోధించే అవకాశం నాకు ఇవ్వండి, నేను నాటే విత్తనాలను ఎవరూ తొలగించలేరు-వ్లదిమిర్‌ లెనిన్‌, ” పాఠ్యపుస్తకాలను అదుపు చేసేందుకు నాకు అవకాశమిస్తే దేశాన్నే అదుపులోకి తెస్తాను-అడాల్ఫ్‌ హిట్లర్‌, ” ప్రయివేటు ఆస్ధి, స్వేచ్చ విడదీయరానివి-జార్జి వాషింగ్‌టన్‌ చెప్పారంటూ మీకు స్వేచ్చ కావాలా నిరంకుశత్వం కావాలో తేల్చుకోవాలంటూ రెచ్చగొడుతూ ఆ లేఖ ప్రచురితమైంది.


ఏప్రిల్‌ పదవ తేదీన ఫ్రెంచి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేసిన వారిలో సగానికిపైగా ఓట్లు తెచ్చుకున్న వారు గెలుస్తారు. లేనట్లయితే 24వ తేదీన ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది. 2017లో జరిగిన ఎన్నికలలో తొలి ఇద్దరికి 24.1, 21.3, మూడు,నాలుగు స్ధానాల్లో ఉన్నవారికి 20.1, 19.58శాతాల చొప్పున వచ్చాయి. మొదటి స్ధానంలో ఉన్న ఇమ్మాన్యుయల్‌ మక్రాన్‌ రెండవ రౌండులో 66.1శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ఈ సారి కూడా మక్రాన్‌ పోటీ పడుతున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధి జీన్‌ లక్‌ మెలెంచన్‌ 19.58శాతం ఓట్లతో నాలుగవ స్ధానంలో ఉన్నాడు.ఈ సారి ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధిగా ఫాబియన్‌ రౌసెల్‌ రంగంలో ఉన్నారు.


” ఫ్రాన్స్‌కు మంచి రోజులు ” అనే నినాదంతో కమ్యూనిస్టులు పోటీ చేస్తున్నారు. గత పదిహేను సంవత్సరాలలో కమ్యూనిస్టులు పోటీ చేయటం ఇదే ప్రధమం. గత రెండు ఎన్నికల్లో పార్టీ మెలెంచన్‌కు మద్దతు ఇచ్చింది. సోవియట్‌ పతనం తరువాత బలహీన పడిన పార్టీలలో ఫ్రెంచి పార్టీ ఒకటి. ఐనప్పటికీ పారిస్‌, దాని శివార్లలోని పలు మున్సిపాలిటీలలో వరుసగా కమ్యూనిస్టులు గెలుస్తున్నారు. జనంతో ఉండటమే దీనికి కారణం. జాతీయ అసెంబ్లీలోని 577కు గాను 12, ఎగువసభ సెనెట్‌లోని 348 స్ధానాలకు 14 సీట్లు కమ్యూనిస్టులకు ఉన్నాయి. ప్రస్తుతం పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న రౌసెల్‌కు మీడియా సర్వేల ప్రకారం మూడు-నాలుగు శాతం మంది మద్దతు ఇస్తున్నారు. ఇంకా పెరగవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఇతర వామపక్ష పార్టీలు, శక్తులు కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటించాయి. అనేక పార్టీలు మార్పు గురించి చాలాకాలంగా చెబుతున్నప్పటికీ అలాంటిదేమీ కనిపించటం లేదని ఈ సారి సంభవించనున్నదని రౌసెల్‌ అన్నాడు. కరోనా కాలంలో ప్రభుత్వ సొమ్మును జనానికి బదులు బహుళజాతి గుత్త సంస్ధలకు అప్పగించారన్నారు. పెద్ద బాంకులన్నింటినీ, ఇంధన కంపెనీలు టోటల్‌, ఎంగీలను జాతీయం చేయాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు.

అసంతృప్తితో ఉన్న యువ ఓటర్లను మెలెంచన్‌ ప్రజాకర్షక నినాదాలు లేదా పచ్చి మితవాది మారినె లీపెన్‌కు మద్దతుదార్లుగా మారిన వారందరినీ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు, తిరిగి వారి హృదయాలను చూరగొనటమే తమ ప్రధాన సవాలని రౌసెల్‌ ప్రచార సారధి, పారిస్‌ ఉప మేయర్‌ ఇయాన్‌ రోసాట్‌ చెప్పాడు. దేశమంతటా స్ధానిక సంస్దల్లో 600 మంది కమ్యూనిస్టు మేయర్లు, వేలాది మంది కౌన్సిలర్లు అధికారంలో ఉన్నారు. వారందరూ ఉత్సాహంగా రంగంలో దిగవచ్చని వార్తలు. ఫ్రెంచి కమ్యూనిస్టు పత్రిక ఎల్‌ హ్యూమనైట్‌ వార్షిక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో జనం హాజరుకావటాన్ని చూస్తే మరోమారు కమ్యూనిస్టుల పట్ల జనంలో వ్యామోహం కనిపిస్తున్నట్లు చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకుడు,ఫాప్‌ పరిశోధనా సంస్ధ అధిపతి ఫ్రెడరిక్‌ డాబీ అన్నాడు. భావజాలాన్ని తిరస్కరించే వారు కూడా కమ్యూనిస్టులు సభ్యతగా, మాటకు కట్టుబడి ఉంటారని అంగీకరిస్తారని అన్నాడు. ఏవియన్‌ అనే పట్టణంలో ప్రతి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 60శాతం ఓట్లతో కమ్యూనిస్టులు గెలుస్తారని, 2017 ఎన్నికల్లో అక్కడ మితవాద నేత మారినే లీపెన్‌కు గణనీయంగా ఓట్లు వచ్చాయి. ఈ సారి కమ్యూనిస్టు పార్టీ స్వయంగా పోటీ చేస్తున్నందున పార్టీకే ఓటు వేస్తారనే ఆశాభావాన్ని వెలిబుచ్చుతున్నారు.


ప్రస్తుతం వామపక్ష భావాలు కలిగిన వారు ఏడుగురు పోటీ చేస్తున్నారు. గత ఏడాది జూన్‌లో జరిగిన ప్రాతీయ ఎన్నికల్లో వామక్షాలన్నింటికీీ కలిపి 26.4శాతం ఓట్లు ఉన్నాయని ఒక విశ్లేషణ.రెండవ దఫా గ్రీన్స్‌, సోషలిస్టుల మధ్య ఐక్యత కారణంగా పదమూడు మెట్రోపాలిటన్‌ ప్రాంతీయ మండళ్లలో ఐదు చోట్ల గెలిచారు.వామపక్షాల మధ్య ఐక్యత లేని కారణంగా జాతీయ ఎన్నికల్లో మితవాద అభ్యర్ధులకు అవకాశం వస్తోంది.2012 ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ అభ్యర్ది ఫ్రాంకోయిస్‌ హౌలాండేకు తొలి విడత 28.6శాతం ఓట్లు వచ్చి తుది పోటీలో గెలిచాడు. అదే పార్టీ గత ఎన్నికల్లో తొలి విడత కేవలం ఐదు శాతం ఓట్లు తెచ్చుకొని తుది పోటీకి అర్హతను కూడా కోల్పోయింది. ఆ ఓట్లు వామపక్ష అభ్యర్ధికి వేసి ఉంటే పోటీ వేరుగా ఉండేది. ఆ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు మక్రాన్‌ ఏర్పాటు చేసిన ఎన్‌ మార్చ్‌ పార్టీలో 85 మంది ఎంపీలు చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో వామపక్షాలు ఒకే అభ్యర్ధిని నిలిపి ఉంటే పోటీ రసవత్తరంగా ఉండేది. గత ఎన్నికల మాదిరే ఇద్దరూ మితవాదులే పోటీలో మిగిలితే పెద్ద మితవాదికి బదులు చిన్న మితవాదిని బలపరచటం తప్ప వామపక్షాలు, ఇతర ఓటర్లకు మరొక అవకాశం లేదు. పచ్చి మితవాదుల్లో కూడా ఐక్యత లేదు. ఎరిక్‌ జెమ్మర్‌, వారినే లీపెన్‌ అనే ఇద్దరు పోటీపడుతున్నారు. వామపక్ష నేత మెలంచన్‌కు తొలి రౌండులో ఈ సారి పదిశాతం, పారిస్‌ నగర మేయర్‌ సోషలిస్టు పార్టీ నాయకురాలు హిడాల్గోకు మూదుశాతం వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ధనిక దేశాలను ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఊపివేస్తున్న తరుణంలో జరుగుతున్న ఫ్రెంచి ఎన్నికలలో మక్రాన్‌ ఎదురీదుతున్నట్లే చెప్పవచ్చు. ఒక మితవాది స్ధానంలో పచ్చి మితవాదిని ఎన్నుకుంటారా లేక గతం మాదిరే తిరిగి మక్రాన్‌కే పట్టం కడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.