Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


2021 నరేంద్రమోడీ సర్కార్‌కు నిదురపట్టకుండా చేసింది. దిగిరాను దిగిరాను అంటూ భీష్మించుకు కూర్చున్న నరేంద్రమోడీ మెడలు వంచిన సంఘటిత శక్తి ఎంత బలమైనదో ప్రపంచానికి దేశ రైతులు చూపించారు.ఆదరాబాదరా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాతరవేసి మూడు సాగుచట్టాలను ఆమోదించటం, చివరకు రైతాంగానికి క్షమాపణ చెప్పి వాటిని ఉపసంహరించుకున్న తీరు తెలిసిందే. ఈ అధ్యాయంలో నరేంద్రమోడీ కంటే మోడీ తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోరని గుడ్డిగా నమ్మిన వారు ఎక్కువగా ఆశాభంగం చెందారు, అభాసుపాలయ్యారంటే అతిశయోక్తి కాదు. నిజానికి రైతాంగ ఉద్యమ విరమణ అంతం కాదు ఆరంభం- ఒక విరామం మాత్రమే !


రానున్న సంవత్సరాల్లో రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన అంశాలను కేంద్రం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరం.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశానికి సంబంధించి ఒక కమిటీని వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దాని ఊసే ఎత్తటం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ప్రకటిస్తామని చెప్పారు. నిజానికి ఎన్నికలకు దానికి సంబంధం లేదు. కొద్ది నెలలైనా జాగు చేసేందుకే ఇలా చెప్పారన్నది స్పష్టం. దేశ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న కారణంగానే ఉన్న కొద్ది పాటి రక్షణలు కూడా రద్దు చేస్తున్నారనే ఆందోళనే రైతులు అసాధారణ రీతిలో ఉద్యమించటానికి కారణం. 2022-23 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌ కేటాయిలను చూస్తే రైతాంగం మరోసారి నిరాశకు గురయ్యారు.


కేంద్ర ప్రభుత్వం ఏడాదికేడాది సబ్సిడీలకు ఎసరు పెడుతున్నది.కేటాయింపు అంకెలు ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించటం లేదు. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని రకాల సబ్సిడీల విలువ రు.7,07,707 కోట్లు కాగా సవరించిన అంచనాల్లో ఆ మొత్తం రు.4,33,108 కోట్లకు అంటే 39శాతం కోతపడింది. పోనీ వచ్చే ఏడాది ఈ మొత్తమైనా ఇస్తున్నారా అంటే 2022-23 బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం రు.3,17,866 కోట్లు మాత్రమే. ఆకలిలో దేశ సూచిక మెరుగుపడిందేమీ లేదు.2020లో ప్రపంచ ఆకలి సూచికల్లో 107దేశాల్లో మనది 94వ స్ధానంలో ఉంది.2021లో 116దేశాలకు గాను 101వ స్ధానానికి దిగజారింది తప్ప మెరుగుపడలేదు. కానీ ఆహార సబ్సిడీని రు.5,41,330(2020-21) నుంచి 2022-23కు రు.2,86,469కోట్లకు కోత పెట్టారు.దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? వలస కార్మికులు పని స్దలాల నుంచి స్వస్ధలాలకు వెళ్లేందుకు కరోనా కాలంలో ఎన్ని ఇబ్బందులు పడిందీ దేశమంతా చూసింది. దాన్ని మరిచిపోయినట్లుగా వారే కరోనాను వ్యాప్తి చేసినట్లు నరేంద్రమోడీ తాజాగా ఆరోపించిన అంశం తెలిసిందే. వారికి, పనులు కోల్పోయిన వారికి అవసరమైన మొత్తంలో ఆహార ధాన్యాలను కూడా కేంద్రం సరఫరా చేయలేదు. మనిషికి నెలకు ఐదు కిలోలు ఇచ్చి వాటినే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. చమురు సబ్సిడీలు రు.38,455 నుంచి రు.6,517 కోట్లకు కోత పెట్టారు. వంటగాస్‌ సబ్సిడీ రు.14,073 కోట్లు ఇస్తామని చెప్పిన కేంద్రం ఆచరణలో రు.6,517 కోట్లకు కోత పెట్టింది.వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రు.5,813 కోట్లకు తగ్గించారు. ఇక ఎరువుల సబ్సిడీ తీరుతెన్నులను చూద్దాం. 2021-22లో రు.1,40,122 కోట్లు ఉంటుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని 2022-23లో రు.1,05,222 కోట్లుగా ప్రతిపాదించారు, 35వేల కోట్లు కోత పెట్టారు.


గతేడాది పట్టువదల కుండా రైతు ఉద్యమం జరగటం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాతావరణం, ఇదే తరుణంలో డిఏపి, మిశ్రమ ఎరువుల ధరలు గణనీయంగా పెరగటంతో కేంద్ర ప్రభుత్వం మరొకదారి లేక ఎరువుల సబ్సిడీని పెంచకతప్ప లేదు. గత పది సంవత్సరాలలో కేంద్రం ఎరువులపై రాయితీలను 70-80వేల కోట్ల రూపాయల మధ్యనే ఇచ్చింది. ప్రస్తుతం చమురు, గాస్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపధ్యంలో దిగుమతి ఖర్చు తడిచి మోపెడు అవుతుంది. దాన్ని రైతులు భరించాలా, కేంద్రం గతేడాది మాదిరి అదనపు కేటాయింపులతో భరిస్తుందా అన్నది తెలియదు. అంతర్జాతీయంగా వరుసగా రెండు సంవత్సరాల నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా గతం కంటే ఎక్కువగా పెరిగిన అంశం తెలిసినప్పటికీ కేంద్రం ఎరువుల సబ్సిడీకి కోత పెట్టిందంటే పెరిగిన మేరకు రైతులే భరించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మాదిరే దిగుమతి చేసుకుంటున్న ధరల మీద ప్రతిపాదించిన సబ్సిడీని పరిమితం చేస్తే ఆరేడు నెలలకు మించి రాదని విశ్లేషకులు చెబుతున్నారు. యురియా ధరలను పెంచటం ద్వారా సబ్సిడీని సర్దుబాటు చేసే అవకాశం కూడా ఉంది. గతేడాది బడ్జెట్‌లో రు.79,530 కోట్లు ప్రతిపాదించినా దిగుమతి,ఉత్పాదక ఖర్చు విపరీతంగా పెరిగినందున ఆ మొత్తాన్ని రు.1,40,122 కోట్లకు పెంచారు.


అంతర్జాతీయ మార్కెట్లో యురియా ధర 2021 ఏప్రిల్‌ ఒకటి 2022 జనవరి 28 మధ్య టన్ను ధర 357నుంచి 869డాలర్లకు పెరిగింది.(నవంబరు నెలలో 959 డాలర్లు పలికింది) డిఏపి ధర ఇదే కాలంలో 400 నుంచి 930 డాలర్లకు పెరిగింది. దాన్ని మొత్తంగా లేదా ముడిసరకులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే గతేడాది 46వేల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించాల్సివచ్చింది. ఇప్పుడు ధరలు తగ్గే సూచనలు లేవు.యురియా ఉత్పత్తికి అవసరమమైన గాస్‌ ధర దేశీయంగా కూడా పెరిగింది. మన దేశం 67శాతం ఎల్‌ఎన్‌జి దిగుమతి చేసుకుంటోంది. దాదాపు ఏడాది కాలంగా చైనా ఎరువుల ఎగుమతులపై అనేక ఆంక్షలు విధించటం కూడా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుదలకు ఒక కారణం. తమ అవసరాల్లో నాలుగోవంతు పొటాష్‌ ఎరువులు చైనా నుంచి ఇతర దేవాలు దిగుమతి చేసుకుంటున్నా యి. మన దేశంలో యురియా ధరలను మాత్రమే నియంత్రణ పరిధిలో ఉంచి మిగిలిన ఎరువులన్నింటీని మార్కెట్‌ శక్తులకు వదలివేశారు. వాటి మీద పరిమితంగా సబ్సిడీలు పోను భారమంతా రైతులమీదే పడుతోంది. మన దేశంలో ఏటా 18.7 మిలియన్‌ టన్నుల యురియా దిగుమతి లేదా దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. డిఏపి మూడు, మిశ్రమ(ఎన్‌పికె) ఎరువులు 6.8మి.టన్నులు దిగుమతి లేదా ఉత్పత్తి అవుతున్నాయి. గతేడాది రు.1.4లక్షల కోట్ల సబ్సిడీలో లక్ష కోట్ల వరకు యురియా సబ్సిడీకే కేటాయించారు.


మనది వ్యవసాయ ప్రధాన దేశం ఐనప్పటికీ రసాయన ఎరువుల వినియోగంలో చాలా వెనుకబడి ఉంది. 2018 సమాచారం ప్రకారం 162 దేశాల్లో హెక్టారుకు 393.2 కిలోలతో చైనా 12వ స్ధానంలో ఉండగా 49వ స్ధానంలో ఉన్న మన వినియోగం 175కిలోలు. రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ప్రకారం 2019-20లో సగటు వినియోగం 133.44 కిలోలు ఉంది. గతేడాది ప్రభుత్వ రంగ సంస్ధ ఇఫ్‌కో కొత్త స్టాక్‌ ఎరువుల ధరలను పెంచుతూ డీలర్లకు పంపిన సమాచారం మీద రైతాంగం గగ్గోలు పెట్టింది. గరిష్టంగా 58.33 డిఏపి, ఇతర ఎరువుల ధరలను 46 నుంచి 51.9శాతం వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నది. అప్పటికే రైతుల ఉద్యమిస్తుండటంతో కంగారు పడిన సర్కార్‌ వత్తిడి తెచ్చి ధరల పెరుగుదలను తాము అనుమతించలేదని పేర్కొన్నది. నిజానికి యురియా తప్ప మిగతా ఎరువుల ధరలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. సబ్సిడీ ఇస్తున్నందున ఏ ఎరువును ఎంతకు అమ్మాలో మాత్రమే ప్రకటిస్తుంది. తమ దగ్గర అప్పటికే ఉన్న 11.26లక్షల టన్నుల ఎరువులకు పెంచిన ధరలు వర్తించవని, కొత్త ఉత్పత్తికి తాత్కాలిక ధరలను మాత్రమే సూచించామని ఇఫ్‌కో పేర్కొన్నది. ధరలపై నియంత్రణ లేదని కూడా ఆ సంస్ధ అధికారి గుర్తు చేశారు. తమ నిర్ణయంతో ప్రభుత్వానికి లేదా మరొక పార్టీకి గానీ సంబంధం లేదని చెప్పారు. ఉత్పత్తిదారుగా ఉన్నందున కొత్త స్టాకు సంచులపై పెరిగిన ధరలను ముద్రించాలంటే ముందుగానే ఆదేశించాల్సి ఉంటుందన్నారు. అంటే ధరల పెంపుదల తప్పదన్నది స్పష్టం. ఈ పెరిగే ధరల్లో కేంద్రం సబ్సిడీ ఇస్తుందా, మొత్తం రైతాంగం మీదనే మోపుతారా అన్నది చూడాల్సి ఉంది.

ఇఫ్‌కో సంస్ధ ప్రకటించిన దాని ప్రకారం ఎరువుల ధరల పెంపుదల ప్రతిపాదన ఇలా ఉంది.( యాభై కిలోల ధర రూపాయలలో )
ఎరువు రకం××××× పాత ధర×××× కొత్త ధర
10:26:26×××××× 1,175 ×××× 1,775
12:32:16×××××× 1,185 ×××× 1,800
20:0:13 ×××××× 925 ×××× 1,350
డిఏపి ×××××× 1,200 ×××× 1,900
కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు అందించిన సమాచారం ప్రకారం సగటున హెక్టారుకు 2015-16లో ఎరువుల వినియోగం 135.76కిలోలు ఉండగా మరుసటి ఏడాదికి 123.41కి తగ్గింది, 2019-20కి 133.44 కిలోలకు పెరిగింది.పైన పేర్కొన్న పట్టిక ప్రకారం నాలుగు ఎరువులను కలిపి 50కిలోల యూనిట్‌గా తీసుకుంటే సగటున పాత ధర రూ.1,121 ఉంది, పెంపుదల అమల్లోకి వస్తే రు.1,706 అవుతుంది. ఈ లెక్కన దేశ సగటు వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక హెక్టారుకు పెరిగే పెట్టుబడి భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరుగుతుంది. గరిష్ట స్ధాయిలో బీహార్‌లో హెక్టారుకు 245.25కిలోలు వినియోగిస్తుండగా అత్యల్పంగా కేరళలో 36.49 కిలోలు మాత్రమే వినియోగిస్తున్నారు. సగటున రెండువందల కిలోలు వినియోగిస్తున్న రాష్ట్రాలలో పంజాబ్‌, హర్యానా, తెలంగాణా ఉన్నాయి. దేశ సగటు కంటే తక్కువ వినియోగం ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ ఉన్నాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే బీహార్‌లో ఒక హెక్టారు ఉన్న రైతుకు భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరిగితే అదే కేరళలోని రైతుకు రు.818 నుంచి రు.1,245కు పెరుగుతుంది.


అవసరానికి మించి యురియా వాడకం వలన భూమి ఆరోగ్యం దెబ్బతింటున్నదని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ సబ్సిడీ భారాన్ని తగ్గించుకొనేందుకు యురియా మీదనే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నది. దాంతో మిగతా ఎరువుల ధరలతో పోలిస్తే అది చౌకగా ఉండటంతో రైతాంగం అటే మొగ్గుతున్నది. అందువలన ఇతర ఎరువులకు సబ్సిడీని పెంచితే ఎరువుల వాడకంలో సమతుల్యత ఏర్పడుతుంది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ఇప్పుడున్న బిజెపి పాలకులకు అవేమీ పట్టటంలేదు. అసమతుల్యత కారణంగా ఆహారధాన్యాల ఉత్పాదకత తగ్గుతోందని కూడా విశ్లేషణలు చెబుతున్నాయి.