Tags
Arya Rajendran, BJP, CPI(M), governor arif mohammad khan, Kerala LDF, Pinarai Vijayan, RSS, UDF Kerala
ఎం కోటేశ్వరరావు
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పక్కా బిజెపినేతగా పని చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విధానపరమైన ప్రసంగంపై సంతకం చేయకుండా బ్లాక్‌మెయిలుకు పాల్పడ్డారు. దేశవ్యాపితంగా సంచలనం కలిగించిన కేరళ దొంగబంగారం కేసులో నిందితురాలుగా ఉండి పదహారు నెలల పాటు జైలులో ఉన్న స్వప్న సురేష్ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ లేదా దానికి సంబంధించిన నేతలు నడిపే ఒక స్వచ్చంద సంస్ధలో డైరెక్టర్‌గా చేరారు. బంగారం కేసులో అరెస్టయినపుడు ప్రభుత్వ స్పేస్ పార్క్ పధకంలో ఒక కన్సల్టెంట్‌గా ఉన్నారు. అంతకు ముందు యుఏఇ కాన్సులేట్‌లో పని చేశారు. ఆ సంబంధాలను వినియోగించుకొని బంగారాన్ని అక్రమంగా తెప్పిస్తున్నట్లు ఆమె, మరికొందరి మీద కేసు దాఖలు చేశారు. దాని మీద ఇంకా దర్యాప్తు సాగుతుండగానే స్వచ్చంద సంస్దలో చేరారు. న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న హెచ్‌ఆర్‌డిఎస్ ఇండియా అనే సంస్ధ తరఫున కేరళలోని పాలక్కాడ్ కేంద్రంగా ఆమె పని చేస్తారు. మళయాల మనోరమ పత్రిక కథనం ప్రకారం ఈ సంస్ధకు తొలుత పాట్రన్‌గా తరువాత అధ్యక్షుడిగా ఉన్న ఎస్ కృష్ణ కుమార్ కాంగ్రెస్‌లో ఉన్నపుడు కేంద్ర మంత్రిగా పని చేశారు.2004 ఆపార్టీ నుంచి వెలుపలికి వచ్చి బిజెపిలో చేరారు. తరువాత తిరిగి కాంగ్రెస్‌లో , 2019 తిరిగి బిజెపిలో చేరారు.
హెచ్‌ఆర్‌డిఎస్ ఇండియా సంస్దలో కేరళకు చెందిన అనేక మంది డైరెక్టర్లుగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నేత కెజి వేణుగోపాల్ ఉపాధ్యక్షుడు. ఆ సంస్దలో కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగ డైరెక్టర్‌గా యుఏఇ , ఇతర కార్పొరేట్ల నుంచి నిధులు తీసుకురావటం ఆమె విధిగానూ వాటితో పేద గిరిజనులకు అట్టపాడి ప్రాంతంలో ఉచితంగా ఇండ్లు నిర్మిస్తారని కేరళకౌముది పత్రిక పేర్కొన్నది. కోర్టులో ఉన్న కేసులు, తన ప్రస్తుత బాధ్యతలకు ముడి పెట్టవద్దని స్వప్ప మీడియాను కోరారు. కేసులు కేసులే ఉద్యోగం తన కడుపు నింపుకొనేందుకు అన్నారు.హెచ్‌ఆర్‌డిఎస్ ఇండియా సంస్ద మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. గిరిజనుల భూములను ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించిందని, అనుమతులు లేకుండా గిరిజనులకు కొన్ని ఔషధాలను పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఔషధాల ప్రయోగాలకు స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్నవారితో గ్రామీణులు, గిరిజనులను వినియోగించుకోవటం తెలిసిందే.
కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ సంయమనం కారణంగా ఒక వివాదాన్ని నివారించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కావటం తెలిసిందే. ఆ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం రూపొందించి ఇస్తుంది. దానిలోని అంశాలను చదవటం తప్ప గవర్నర్ తన స్వంత అభిప్రాయాలను చొప్పించకూడదు. గతంలో ఒకసారి అలాంటి చర్యకు పాల్పడి కొన్ని పేరాలను చదివేందుకు నిరాకరించారు. ఇటీవల బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు, జర్నలిస్టుగా ఉన్న హరి ఎస్ కర్తాను తన సహాయకుడిగా నియమించాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. రోజువారీ రాజకీయాల్లో ఉన్నవారిని సాధారణంగా సిబ్బందిగా తీసుకోరు. అభ్యంతరాలున్నప్పటికీ ప్రభుత్వం ఆమోదించింది. ఐతే ప్రభుత్వ అభ్యంతరాలను తెలుపుతూ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగ (జిఏడి) ముఖ్యకార్యదర్శి కె జ్యోతిలాల్ గవర్నర్‌కు లేఖ రాశారు. అది మీడియాకు వెల్లడైండి. ఆ పని జ్యోతిలాలే చేయించినట్లు భావించిన గవర్నర్ సదరు అధికారిని జిఏడి నుంచి తప్పిస్తే తప్ప తాను అసెంబ్లీ ప్రసంగాన్ని ఆమోదిస్తూ సంతకం చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.దాంతో ప్రభుత్వం సదరు అధికారిని వేరే బాధ్యతలకు బదిలీ చేస్తామని చెప్పిన తరువాతనే సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి.
శుక్రవారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు జరిగి ఓట్ ఆన్ అకౌంట్‌కు ఆమోదం తెలిపిన తరువాత మార్చి 23న ముగుస్తాయి. తరువాత పూర్తి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. గవర్నర్ సభలో ప్రసంగం చదవటం మొదలు పెట్టగానే ప్రతిపక్ష సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్ గవర్నర్ గోబాక్ అంటూ నినాదాలు చేశారు. తరువాత సభనుంచి వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం చదువుతుండగా సాధారణంగా అధికారపక్ష సభ్యులు తమ ప్రభుత్వ విజయాలను పేర్కొన్నపుడు బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేస్తే ప్రతిపక్షం నిరసన తెలుపుతుంది. దీనికి భిన్నంగా పాలక సభ్యులు మౌనంగా ఉంటూ గవర్నర్ తీరుతెన్నులకు నిరసన తెలిపినట్లు మీడియా పేర్కొన్నది. ప్రభుత్వం బిజెపి నేత నియామక పత్రంతో పాటు అభ్యంతరం తెలిపే లేఖను కూడా గవర్నర్‌కు పంపింది. దీన్ని గవర్నర్ అవమానంగా భావించి భరించలేకపోయారు.
మంత్రుల వద్ద సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్ ఇవ్వటం కేరళలో ఒక పద్దతిగా ఉంది. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అమలు చేస్తున్నారు. రాజభవన్‌లో రాజకీయ పార్టీలకు చెందిన వారిని గవర్నర్ సిబ్బందిగా నియమించటం అసాధారణం అని ప్రభుత్వం రాసిన లేఖలో ఉంది. దానికి ప్రతిగా ఎక్కడా మంత్రుల సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్ చెల్లింపు పద్దతి లేదని దాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించటమే కాదు వెంటనే అమలు జరపాలని గవర్నర్ కోరారు. ఈ అంశాన్ని మరింతగా చర్చించాలని ప్రభుత్వం చెప్పింది. ఇది కూడా లీకైంది. జ్యోతిలాల్‌ను తొలగించినట్లు రాజభవన్‌కు సమాచారం అందిన తరువాతే గవర్నర్ ప్రసంగంపై సంతకం చేశారు.
గవర్నర్‌ను వెనకేసుకు వస్తూ బిజెపి రంగంలోకి దిగింది. రాజకీయ పార్టీలకు చెందిన వారిని మంత్రుల సిబ్బందిగా నియమించుకోవటం, వారికి పెన్షన్లు చెల్లించటం చట్టబద్దమో కాదో ఆలోచించాలని కేరళకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్ అన్నారు. రాజభవన్ను నియంత్రించాలని సిఎం విజయన్ చూస్తున్నారని ఆరోపించారు. మంత్రుల సిబ్బందికి పెన్షన్ చెల్లించటం గురించి సిపిఎం నేత, మాజీ మంత్రి ఎంఎం మణి మాట్లాడుతూ ఐదు పార్టీలు మారిన తరువాత ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బిజెపిలో చేరారని, గవర్నర్ పదవిలో ఉంటూ చౌకబారు ఆటలు ఆడుతున్నారని, పెన్షన్ సొమ్ము ఖాన్ కుటుంబ సంపద నుంచేమైనా చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు. మరోమారు గవర్నర్ పదవి కోసం చెత్త మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారారాని అన్నారు. గవర్నర్- ప్రభుత్వం నాటకాలాడుతున్నాయని ప్రతిపక్ష యుడిఎఫ్ నేత విడి సతీషన్ ఆరోపించారు. కేరళలో బిజెపి అధికార ప్రతినిధిగా గవర్నర్ పని చేస్తున్నారని విమర్శించారు.
దేశంలోని మేయర్లలో పిన్న వయస్కురాలైన ఆర్య రాజేంద్రన్(తిరువనంతపురం-సిపిఎం) కేరళ అసెంబ్లీలో పిన్న వయస్కుడైన సచిన్‌దేవ్ ఒకింటివారు కాబోతున్నారు. వారిద్దరూ బాలసంగం నుంచి ఎస్‌ఎఫ్‌ఐలో పని చేస్తూ చాలా కాలం నుంచి పరిచయం ఉన్నవారే. రెండు కుటుంబాలూ ఆమోదం తెలిపాయి. మార్చినెలలో వివాహం జరగవచ్చు.ఆర్య ప్రస్తుతం బాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నపుడు సచిన్ దేవ్ ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు, ప్రస్తుతం ఆలిండియా సహాయకార్యదర్శి. తామిద్దరం ఒకే భావజాలంతో ఉన్నామని, ఇద్దరం ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశామని, మంచి స్నేహితులమని ఆర్య విలేకర్లతో చెప్పారు. తామిద్దం ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత రెండు కుటుంబాలకు, పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనందున పార్టీకి తెలిపామని, రెండు కుటుంబాలు, పార్టీతో చర్చించిన తరువాత వివాహతేదీని ఖరారు చేసుకుంటామని తెలిపారు.