Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


నాటో కూటమిలోని యుద్దోన్మాద దేశాలు ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌ సృష్టించిన ఉక్రెయిన్‌-రష్యా వివాద ప్రతికూల పర్యవసానాలు అనేక దేశాలను కలవరపెడుతున్నాయి.వాటిలో మన దేశం ఒకటి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే ఈ వివాదం తలెత్తింది. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో మన దేశం సరైన వైఖరినే వెల్లడించింది. ఈ వివాదం వలన తలెత్తే ఆర్ధిక ఇబ్బందుల గురించి మంత్రులు లేదా పాలకపార్టీల నేతలెవరూ నోరు విప్పటం లేదు. కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద ప్రభావం పడకూడదనే. ఎంతకాలం మౌనవ్రతం పాటిస్తారు.మార్చి ఏడవతేదీతో ఆఖరు దశ పోలింగ్‌ ముగుస్తుంది, పదవ తేదీన ఫలితాలు వెలువడతాయి. వాటితో నిమిత్తం లేకుండానే గత నవంబరు నాలుగు నుంచి ఉన్న చమురు ధరల స్ధంభన ఎత్తివేసి సుప్రభాత చమురు ధరల పెరపుదలకు తిరిగి శ్రీకారం చుడతారు. ఇతర పర్యవసానాలు దాని వెంటే ఉంటాయి.


అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 99.5 డాలర్లు దాటి 2014 తరువాత కొత్త రికార్డు స్దాపించింది. ఆర్ధిక విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు, రూపాయి విలువ పతనానికి దారితీస్తుంది. ప్రస్తుతం ఒక డాలరుకు 75కు అటూ ఇటూగా ఉన్న విలువ రు.80కి పడిపోవచ్చని చెబుతున్నారు.రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటే సహజవాయు, నిత్యావసర వస్తువులు, లోహాలు, ఇతర వస్తువుల ధరలు మన దేశంలో కూడా పెరుగుతాయని చెబుతున్నారు. జెపి మోర్గాన్‌ చెబుతున్నదాని ప్రకారం 150 డాలర్ల వరకు ముడిచమురు ధర పెరగవచ్చు. అదే జరిగితే ప్రపంచ జిడిపి వృద్ది రేటు కేవలం 0.9శాతానికి పడిపోతుంది. మన దేశ టోకు ధరల సూచికలో చమురు సంబంధిత ఉత్పత్తులు తొమ్మిదిశాతం ఉంటాయి. చమురుధరలు పెరిగితే ద్రవ్యోల్బణం 0.9శాతం పెరుగుతుందని అంచనా. మరోవైపున కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీ మరింత పెరుగుతుంది. ఎరువులు, వంటగాస్‌ ధరలను పెంచనట్లైతే ఆ మేరకు అదనంగా సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కేంద్రం భరిస్తుందా జనం మీదే మోపుతుందా అన్నది చూడాల్సి ఉంది. మన దిగుమతుల్లో ఒక్క చమురే నాలుగోవంతు ఉన్నందున దాని ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మోటారు వాహనాలు, మొబైల్‌ ఫోన్లకు అవసరమైన పల్లాడియం అనే లోహపు ధర ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది, ఇప్పుడు మరింతగా పెరగటం, లభ్యత సమస్యలు కూడా తలెత్తవచ్చు.
ఈ ఏడాది ఆగస్టు-డిసెంబరు నాటికి రెండు సార్లు వడ్డీ రేట్లు పెరగవచ్చని భావిస్తున్నారు. గతేడాది ధరల పెరుగుదలను అదుపులో ఉంచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఐదు, పది వంతున సెస్‌లను తగ్గించగా కొన్ని రాష్ట్రాల్లో వాట్‌ను తగ్గించారు. అప్పటికీ ఇప్పటికీ చమురు ధరల పెరుగుదల తేడా చాలా ఉంది. సెస్‌లను మరింతగా తగ్గించకపోతే ధరల పెరుగుదలను అరికట్టలేరు.


మన దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాల్లో ఎక్కువ భాగం తేలిక రకం ముడిచమురును మాత్రమే శుద్ది చేస్తాయి. రష్యా చమురు సాంద్రత ఎక్కువ కనుక మనం పరిమితంగా దిగుమతి చేసుకుంటున్నాము. ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయినా మన దిగుమతుల్లో ఒకశాతమే కనుక ఇబ్బంది లేదు. మన అవసరాల్లో 63.4శాతం పశ్చిమాసియా నుంచి తెచ్చుకుంటున్నాము. చమురు ధరల పెరుగుదలే అసలు సమస్య.బుధవారం నాడు ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం 97.19 డాలర్లు ఉంది. ప్రపంచ ఎగుమతుల్లో రష్యా వాటా 11-12శాతాలుగా ఉంది. దీనిలో 60శాతం చమురును ఆంక్షలను ఖాతరు చేయని చైనా, బెలారస్‌, మరికొన్ని దేశాలు కొనుగోలు చేస్తున్నాయి.రోజుకు మూడు మిలియన్‌ పీపాల మేరకు ఆంక్షల కారణంగా సరఫరా ఉండదు. దీని వలన చమురు ధర 110 డాలర్లకు పెరుగుతుందని జోశ్యం చెబుతున్నారు.ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకోనుందన్న వార్తలు వాస్తవరూపం దాల్చితే ఒకటిన్నర మిలియన్‌ పీపాల చమురు అందుబాటులోకి వస్తుంది. ఐనప్పటికీ ఈ ఏడాదిలో ఎక్కువ భాగం వంద డాలర్లకంటే తగ్గదని అంటున్నారు. ఉక్రెయిన్‌లో పరిస్ధితి విషమిస్తే 120 డాలర్లు కావచ్చు. ఏడాదికి ప్రస్తుతం 25లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జిని రష్యా నుంచి మన గెయిల్‌ దిగుమతి చేసుకుంటున్నది. ప్రస్తుతం రష్యా చమురు కంపెనీల్లో మన దేశం నుంచి 13.63 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. అమెరికా, ఐరోపా ఆంక్షలు మనకూ వర్తింప చేస్తే మన సర్కార్‌ వాటికి లొంగిపోతే వాటి పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్న. గతంలో క్షిపణి వ్యవస్దలను కొనుగోలు చేయరాదన్న అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా కొనుగోలు చేశాము. ఇదే ఇరాన్‌ చమురు అంశంలో మోడీ సర్కార్‌ లొంగిపోయి కొనుగోలు నిలిపివేసింది.


ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరంలో మన చమురు డిమాండ్‌ 214.5 మిలియన్‌ టన్నులని అంచనా. ఇది గతేడాది కంటే 5.5శాతం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం పంచదార, ఆహారధాన్యాలు, ఇతరంగా బయో ఇంధనాన్ని భారీగా తయారు చేసి దిగుమతుల భారాన్ని తగ్గించాలని చూస్తున్నది. ధరలు పెరిగితే దాని వలన కలిగే ఆదా కూడా హరించుకుపోతుంది.2022-23లో మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర 70-75 డాలర్ల మధ్య ఉండవచ్చని ఆర్ధిక సర్వే అంచనా వేసింది. జోశ్యాలు చెబుతున్నట్లు వంద లేదా 90 డాలర్లు ఉన్నా మన బడ్జెట్‌ అంకెలన్నీ మారిపోతాయి, లేదా జనం మీద భారాలు పెరుగుతాయి. మన దేశం నుంచి ఐరోపాకు ఎగుమతులు చేసే కంపెనీల వాటాల ధరలు స్వల్పంగా తగ్గటాన్ని బట్టి ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మన టీ ఎగుమతుల్లో 18శాతం రష్యాకే జరుగుతున్నాయి.


ప్రస్తుతం రష్యా సోషలిస్టు దేశం కాదు, పెట్టుబడిదారీ విధానానికి మారింది. ఇటీవలి కాలంలో రాజకీయంగా మనం అమెరికాకు దగ్గర లేదా జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు చూపుతున్న తహ తహ గతంలో ఎన్నడూ లేదు. ముందే చెప్పుకున్నట్లు ఇరాన్‌, వెనెజులా చమురు కొనుగోలు అంశంలో అమెరికా వత్తిడికి లొంగిన మోడీ సర్కార్‌ ఎస్‌-400 క్షిపణి వ్యవస్దలపై ఆంక్షలను ఖాతరు చేయలేదు. గతంలో సోవియట్‌ కాలంలో, తరువాత రష్యా ఆయుధాలే మనకు ఆలంబన. ఇప్పుడు వాటిని పూర్తిగా మాని అమెరికా నుంచి కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నప్పటికీ ఆచరణాత్మక సమస్యలు అడ్డుపడుతున్నాయి. అమెరికా తనకు పనికిరాని, ఇతర దేశాలకూ అమ్మే వాటినే మనకూ విక్రయిస్తోంది. ఎస్‌-400 వంటి క్షిపణి వ్యవస్దలు అమెరికా దగ్గర లేక కాదు, ఇవ్వటం ఇష్టం లేకనే. రష్యన్‌ ఆయుధ ఎగుమతుల్లో మనం 23శాతం దిగుమతి చేసుకుంటున్నాం. వాటిలో కొత్తవాటితో పాటు పాతవాటికి విడిభాగాలూ ఉన్నాయి. రెండు దేశాల సంబంధాలు కేవలం అమ్మకందారు-కొనుగోలు దారు మాదిరిగాక బ్రహ్మౌస్‌ వంటి ఖండాంతర క్షిపణులను రెండు దేశాలూ కలసి తయారు చేస్తున్నాయి. గతంలో మన ఇస్రోకు క్రయోజెనిక్‌ ఇంజన్ల సాంకేతిక పరిజ్ఞానం అందచేసినట్లుగానే ఇప్పుడు ఐదవ తరం ఫైటర్‌ విమానాల రూపకల్పన, వృద్ది, బహుముఖ కార్యకలాపాలకు పనికి వచ్చే విమానాల మీద కూడా రెండు దేశాలూ పని చేస్తున్నాయి. ఇటువంటి ప్రాజెక్టులు అమెరికాతో లేవు. ఐనా దేశభక్తులం అని నామాలు పెట్టుకున్న కొందరు అమెరికాతో అంటకాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే అమెరికా వైపు మనసు లాగుతున్నా రష్యా వైపు మాట్లాడకపోయినా తటస్ధత పాటిస్తున్నది మన దేశం. ఈ వైఖరిని వచ్చే రోజుల్లో అమెరికా తప్పు పట్టినా ఆశ్చర్యం లేదు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలపాలన్న ఎత్తుగడ కారణంగానే అమెరికా కాస్త తగ్గి వ్యవహరిస్తున్నది.


ప్రపంచీకరణతో ప్రపంచం ఒక గ్రామంగా మారిందని చెప్పుకుంటున్నాము. ఒక ప్రాంతంలో తలెత్తే తీవ్ర సమస్యలు మొత్తం గ్రామాన్ని ఏదో విధంగా ప్రభావితం చేయకుండా ఎలా ఉంటాయి. వసుధైక కుటుంబం అని అందరూ చెబుతున్నా ఎవరి రాజకీయాలు వారు చేయటం, స్వప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న రోజులివి. ఐరోపాలో తలెత్తిన ఉద్రిక్తతలు ప్రతిదేశాన్ని ఉలిక్కిపడేట్లు చేశాయి. వీటి ప్రభావాలు చమురు ధర వంటి తక్షణ పర్యవసానాలకు దారితీస్తే పరోక్షంగా ఏ రంగం మీద ఎంత ప్రభావం పడేది పరిస్ధితిని బట్టి మారుతుంది. వాటి తీవ్రతను వెంటనే బేరీజు వేయటం కష్టం. ఉక్రెయిన్‌ – రష్యా ఉద్రిక్తతలు ఎలా పరిష్కారమైనప్పటికీ చమురు ధరలు మన సామాన్యజనాల నడ్డి విరవటం ఖాయం. ఆర్‌టిసి, రైల్వే వంటి ప్రజారవాణా వ్యవస్దలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే డీజిలు ధరలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆ మేరకు భారం ప్రయాణీకుల మీద మోపటం ఖాయం.