Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ తరువాత వంతు తైవాన్‌దే అంటూ అంతర్జాతీయ మీడియా మరోసారి కథనాలను వండి వడ్డిస్తోంది. గతంలో హాంకాంగ్‌ వేర్పాటువాదులపై చైనా చర్య తీసుకోగానే ఇంకేముంది తరువాత వంతు తైవాన్‌దే అంటూ ఇలాంటి ఊహాగానాలే రాసింది. ఒకవైపు తన కనుసన్నల్లో పని చేసే మీడియా ఇలాంటి కథనాలను రాయిస్తూ మరోవైపు చైనాను రెచ్చ గొట్టేందుకు తైవాన్‌ జలసంధిలో శనివారం నాడు అమెరికా తన యుద్ధ నౌక రాల్ఫ్‌ జాన్సన్ను నడిపింది. అంతర్జాతీయ జలాల్లో నౌకలను నడిపే హక్కు తమకుందని అమెరికా చెప్పటంతో పాటు తైవాన్‌కు మద్దతుగా తామున్నామనే సందేశాన్నివ్వటం దీనిలో ఉంది. ఈ నౌక మామూలుగానే అటువచ్చినట్లు కనిపిస్తున్నా చెడు సంకేతాలను ఇచ్చిందని చైనా నిపుణులు చెప్పారు. ఈ నౌకను అనుసరిస్తూ ఒక అమెరికా నిఘావిమానం కూడా చక్కర్లు కొట్టింది. చైనా వైపు నుంచి ఉన్న కదలికలు, చర్యలను కనిపెట్టటమే దాని లక్ష్యం. డిసెంబరు, జనవరి మాసాల్లో కూడా అమెరికా నౌకలు ఇదే మాదిరి రాకపోకలు సాగించాయి. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్ల చేతిలో పరాభవం తరువాత తాము ఒకేసారి రెండు రంగాల్లో సత్తా చూపగలమని ప్రపంచానికి చాటేందుకు అమెరికా పూనుకుంది.దానిలో భాగంగానే ఉక్రెయినుకు ఆయుధాలు ఇచ్చింది. ఇటు చైనాను రెచ్చగొట్టేందుకు ఇలాంటి కవ్వింపు చర్యలు, తప్పుడు ప్రచారానికి పూనుకుంది.ఐరోపాలో ఆరవ, ఐరోపా కమాండ్‌ నౌకాదళాలను దించితే చైనాను బెదరించేందుకు ఇండో-పసిఫిక్‌ సముద్రంలో సప్తమ నౌకాదళాన్ని మోహరించింది.


ఆఫ్ఘనిస్తాన్‌లో పరాభవంతో అమెరికా బలహీనత ఏమిటో ప్రపంచానికి స్పష్టమైంది. ఇప్పుడు కొండంత రాగం తీసి కీచుమన్నట్లు ఉక్రెయిన్లో వ్యవహరించిన తీరు దాని డొల్లతనాన్ని(దీని అర్ధం అమెరికా పూర్తిగా బలహీనపడింది అని కాదు) వెల్లడించింది. దాని దగ్గర ఎన్ని అణ్వాయుధాలు, ఆధునిక జెట్‌, యుద్ద విమానాలు, క్షిపణులు ఉన్నా తమను నమ్ముకున్న వారిని నట్టేట ముంచి తన ప్రయోజనం తాను చూసుకుంటుందని స్వయంగా నిరూపించుకుంది. మరొక దేశం చేతులు కాల్చుకోకుండా ఒక గుణపాఠం నేర్పింది. తాను ఆడించినట్లు ఐరోపా ధనిక దేశాలు ఆడవన్న వాస్తవాన్ని ప్రపంచం చూసింది. ఉక్రెయిన్‌ యుద్దం ముగిసిన తరువాత చైనా, రష్యా మరింతగా అమెరికా, దాని మిత్రపక్షాల మీద వత్తిడి పెంచుతాయి.దాని కూటములు బీటలు వారతాయని, రాజగురుత్వం పలుచనవుతుందనే విశ్లేషణలు ఇప్పటికే వెలువడ్డాయి.


ఇక తదుపరి వంతు తైవాన్‌దే అనే ప్రచారం ప్రారంభమైంది. ఉక్రెయిన్‌ ఉదంతాన్ని చూసిన తరువాత తైవాన్ను విలీనం చేసుకొనేందుకు చైనా గనుక బలప్రయోగానికి పాల్పడితే ఇక్కడికి కూడా అమెరికా తన దళాలను పంపదా అంటూ ఊహాగానాలు రాస్తున్నారు. ఇది విలీనాన్ని మరింత క్లిష్టతరం గావించే ఎత్తుగడలో భాగం. అసలు ఉక్రెయిన్‌ సమస్యకు, తైవాన్‌, హాంకాంగ్‌లకు సంబంధమే లేదు. చైనా గురించి రాస్తున్న పశ్చిమ దేశాల మీడియా కాశ్మీరు గురించి ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? అది తైవాన్‌ కంటే ముందే తలెత్తింది. ఈ దశలో నరేంద్రమోడీ సర్కార్‌ను చర్చలోకి లాగితే అమెరికా, పశ్చిమ దేశాలకే నష్టం కనుకనే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆక్రమిత కాశ్మీరును స్వాధీనం చేసుకుంటామని, అవసరమైతే మిలిటరీ చర్యకు పూనుకుంటామని కూడా బిజెపి పదే పదే చెప్పింది. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ఇతరులు కూడా కాశ్మీరు గురించి మాట్లాడటం అంటే ఆక్రమిత కాశ్మీరు స్వాధీనం గురించే అని చెప్పారు. ఆక్రమిత కాశ్మీరు మన దేశ అంతర్భాగమే అన్నది నిస్సందేహం.


పాకిస్ధాన్‌ – భారత్‌ మధ్య కాశ్మీరు అనే స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసి భారత్‌, చైనాలను దెబ్బతీసే కుట్రకు అమెరికా, బ్రిటన్‌ తెరతీశాయి. అందుకే కాశ్మీరును ఆక్రమించుకొనేందుకు దేశవిభజన తరువాత పాకిస్తాన్ను పురికొల్పాయి. దానిలో భాగంగానే కాశ్మీరు ఒక స్వతంత్రదేశం కనుకనే దాన్ని తమలో విలీనం చేసుకోలేదని ఆజాద్‌ కాశ్మీర్‌ (స్వతంత్ర కాశ్మీరు) అని పాక్‌చేత చెప్పించటమే కాదు, పాకిస్తాన్‌లో విలీనం చేయకుండా దాని పర్యవేక్షణలో ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉంచారు. అందుకే పాక్‌ పార్లమెంటులో కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యకల్పించలేదు. అమెరికా, ఇతర ఐరోపా దేశాలు తమ దుష్టపధకంలో భాగంగా కాశ్మీరును భారత ఆక్రమిత ప్రాంతమని వర్ణిస్తాయి. ఇటీవల అమెరికా మనతో మిత్రత్వం నెరపుతోంది కనుక చిల్లికాదు తూటు అన్నట్లు భారత పాలిత అని చెబుతున్నాయి తప్ప మన అంతర్భాగంగా ఇప్పటికీ గుర్తించటం లేదు. దానికి ప్రతిగా మన దేశం కాశ్మీరు మన అంతర్భాగమని ప్రకటించింది. ఆక్రమిత కాశ్మీరు కూడా ఎప్పటికైనా విలీనం కావాల్సిందేనని, ఆ ప్రాంతానికి కాశ్మీరు అసెంబ్లీలో కొన్ని స్దానాలను కూడా కేటాయించింది. ఆక్రమిత్‌ కాశ్మీరును వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్‌ విఫలమైందని, తాము అధికారానికి అధికారానికి వస్తే ఆ పని చేసి చూపుతామని బిజెపి చెప్పిన అంశం తెలిసిందే.


ఉక్రెయిన్‌ మాదిరి తైవాన్‌ గురించి ఇటీవలి కాలంలో ఎక్కడైనా చర్చ జరిగిందా ? రష్యా మాదిరి చైనా తన మిలిటరీని మోహరించిందా అంటే లేదు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 16న రష్యా దురాక్రమణకు పాల్పడనున్నదని అమెరికా చెప్పింది. అలాంటి గడువులను తైవాన్‌ అంశంలో చెప్పలేదు. మరి అమెరికన్‌ మీడియా తదుపరి తైవానే అంటూ ప్రచారం ఎందుకు మొదలు పెట్టినట్లు ? చైనాను రెచ్చగొట్టటం, ప్రపంచదృష్టిని మరల్చటం తప్ప మరొకటి కనిపించటం లేదు.


తైవాన్‌, హాంకాంగ్‌, మకావో దీవులు చైనాలో అంతర్భాగాలు అన్నది ఐరాసతో పాటు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలన్నీ అంగీకరించినదే. తైవాన్‌కు ఐరాస గుర్తింపులేదు. అక్కడి జనాలకు ఆమోదమైనపుడు చైనాలో విలీనం జరగాలని అమెరికా చెబుతున్నది. అదే సమయంలో స్వాతంత్య్రం కావాలంటూ కొందరితో నాటకం ఆడిస్తూ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నది, జెట్‌ విమానాలతో సహా అన్ని రకాల ఆయుధాలను అందిస్తున్నది.బ్రిటన్‌ కౌలు గడువు తీరగానే 1997లో హంకాంగ్‌ , పోర్చుగీసు కౌలు గడువు తీరగానే మకావూ దీవులు1999లో చైనా ఆధీనంలోకి వచ్చాయి. ఈ రెండు ప్రాంతాల్లోని వ్యవస్ధలను 50 సంవత్సరాల పాటు కొనసాగనిస్తామని చైనా ఒప్పందం చేసుకుంది. అందువల్లనే అవి ప్రత్యేక పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక 1949లో కమ్యూనిస్టులు దీర్ఘకాల సాయుధ పోరాటం తరువాత చైనాలో అధికారానికి వచ్చినపుడు అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ మొత్తం నాటి మిలిటరీ, ఆయుధాలన్నింటినీ తైవాన్‌ దీవికి తరలించి అక్కడ తిష్టవేశాడు. దాన్ని కాపాడేందుకు అప్పుడే అమెరికా, బ్రిటన్‌ అన్ని రకాల సాయం అందించి పటిష్టపరిచాయి. మిగతా దేశంలో అధికారాన్ని సుస్దిరం చేసుకున్న తరువాత తైవాన్‌ సంగతి చూద్దాంలెమ్మని కమ్యూనిస్టులు కేంద్రీకరించారు. అదే సమయంలో అమెరికా ఎత్తుగడలో భాగంగా అప్పటికే భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనాకు అసలైన ప్రతినిధిగా ఐరాసలో చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వాన్నే గుర్తించి తైవాన్‌ కేంద్రంగా ఉన్న పాలకులు నియమించిన అధికారులనే అనుమతించారు.1970దశకం వరకు అదే కొనసాగింది. తరువాత అమెరికా-కమ్యూనిస్టు చైనా మధ్యకుదిరిన ఒప్పందం మేరకు అసలైనా చైనాగా ప్రధాన భూభాగాన్ని గుర్తించారు. అంతకు ముందు ఒకే చైనా ఉంది కనుక తరువాత కూడా తైవాన్‌తో సహా అంతా ఒకే చైనా అని కూడా గుర్తించాల్సి వచ్చింది. అప్పటి నుంచి తైవాన్ను బలవంతంగా చైనాలో విలీనం చేయకూడదనే కొత్త పల్లవి అందుకున్నారు.హాంకాంగ్‌ అంశానికి వస్తే 99 సంవత్సరాల పాటు బ్రిటన్‌ ఏలుబడిలో ఉన్న అక్కడ అసలు ఎన్నికలే లేవు, ఎవరూ స్వాతంత్య్ర అంశాన్నే ఎత్తలేదు. చైనా ఆధీనంలోకి వచ్చిన తరువాతనే తొలిసారి ఎన్నికలు జరిగాయి.అమెరికా ఇతర దేశాలు రెచ్చగొట్టి వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టాయి.


చైనా సంస్కరణలు, ఆర్ధికాభివృద్ది మీద కేంద్రీకరించింది.ముందే చెప్పుకున్నట్లు హాంకాంగ్‌, మకావూల్లో ఐదు దశాబ్దాల పాటు అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్దలను కొనసాగించేందుకు అంగీకరించినందున ఆ గడువు నాటికి వాటితో పాటు తైవాన్ను కూడా విలీనం చేసుకోవాలన్నది చైనా ఆలోచన. అందుకే అక్కడ కూడా అనుమతిస్తున్నది. నిజానికి తైవాన్ను స్వాధీనం చేసుకోవటం చైనాకు పెద్ద సమస్యకాదు. అది శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నది కనుకనే సహనంతో ఉంది. పశ్చిమ దేశాలు దాని స్వాతంత్య్రం గురించి మాట్లాడినపుడల్లా తన అధికారాన్ని గుర్తు చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నది. అందువలన పశ్చిమ దేశాలు అధికారికంగా మాట్లాడే వీలు లేదు, మాట్లాడితే చైనాతో సంబంధాలు దెబ్బతింటాయి. దాని బదులు మీడియా ద్వారా కథనాలు వెల్లడిస్తుంటాయి. ఉక్రెయిన్‌ పరిణామాలు జరిగినా జరగకున్నా చైనాలో తైవాన్‌ విలీనం అనేది ముందే రాసిపెట్టి ఉంది. అది ఎప్పుడు ఎలా అన్నది చూడాల్సి ఉంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి రష్యా ముంగిట ఆ ముసుగులో తన సైన్యాన్ని, ఆయుధాలను మోహరించి మెడమీద కత్తిలా మారాలన్న అమెరికా దురాలోచన అక్కడి తాజా పరిణామాలకు మూలం. అదే మాదిరి తైవాన్ను, హాంకాంగ్‌ను స్వతంత్ర రాజ్యాలుగా చేసి చైనాకు రెండు వైపులా ఎసరు పెట్టాలన్నది అమెరికా, జపాన్‌ తదితర దేశాల దుష్టాలోచన. దాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ చైనా అంగీకరించదు, సాగనివ్వదు. ఎవరికీ ఎలాంటి భ్రమలు, ఈ అంశాల మీద తప్పుడు అంచనాలకు లోనుకాకూడదని చైనా పదే పదే హెచ్చరిస్తోంది. అమెరికా, జపాన్‌, ఇతర దేశాలను హెచ్చరించేందుకు చైనా కూడా శనివారం నాడు తైవాన్‌ జలసంధికి వైపు జలాంతర్గాములను దెబ్బతీసే విమానాలు, ఇతర విమానాలను చైనా పంపింది.