Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమి కుట్రల కారణంగా ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య తలెత్తిన వివాదం విచారకరమైన యుద్ధానికి దారి తీసి బుధవారం నాటికి ఏడవ రోజులో ప్రవేశించింది. రష్యా సైనిక పాటవం ముందు ఉక్రెయిన్‌ నిలిచే అవకాశం లేదని, త్వరగానే పతనం అవుతుందన్న అంచనాలు తప్పాయి. ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తున్నారు. వస్తున్న వార్తలను బట్టి సామాన్య జన నష్టం జరగకుండా చూసేందుకు రష్యన్‌ దళాలు కేవలం నిర్దేశిత సైనిక కేంద్రాల మీదనే కేంద్రీకరించటం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నాటో అందచేసిన ఆధునిక ఆయుధాలు కూడా ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతిఘటన శక్తిని పెంచాయి. ఉక్రెయిన్‌ దళాల ప్రతిఘటన ఊహించలేదని పశ్చిమ దేశాల సంస్ధలు వార్తలు ఇచ్చాయి. బైలోరస్‌ మధ్యవర్తిత్వంలో జరిగిన బేషరతు చర్చలు ఎలాంటి ఫలితం తేలకుండానే సోమవారం ముగిశాయి.భద్రతా కారణాల రీత్యా ఈ చర్చలు సరిగ్గా ఎక్కడ జరిగాయన్నది అధికారికంగా ప్రకటించలేదు. బెలారస్‌-ఉక్రెయిన్‌ సరిహద్దులో ” మత్స్యకారుడి గుడిసె ”లో అని గుప్తనామం చెప్పారు. ఈ చర్చలు సరిహద్దులో తమవైపే జరపాలని పట్టుబడిన ఉక్రెయిన్‌ మెట్టుదిగి బెలారస్‌ వైపుకే తన ప్రతినిధులను పంపింది. రెండవ దఫా సంప్రదింపులు బెలోరస్‌- పోలాండ్‌ సరిహద్దులో జరపాలని నిర్ణయించారు. వీటి ఫలితం గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఈ రెండు దేశాల వివాదంతో ఇప్పటికే చమురు ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్ధలకు అంతరాయం, పరస్పర ఆంక్షల కారణంగా ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు, పర్యవసానాలను ప్రపంచం చవి చూస్తోంది. మంగళవారం నాడు జరిగిన దాడుల్లో ఉక్రెయిన్‌లో రెండవ పెద్ద పట్టణమైన ఖర్‌కివ్‌ నగరంలో కర్ణాటకకు చెందిన విద్యార్ధి నవీన్‌ శేఖరప్ప మరణించటం తీవ్ర విచారకరం.


శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇరు పక్షాలూ సంయమనం, కాల్పులకు విరామం పాటించటం సాధారణంగా జరుగుతుంది. ఇక్కడ అటువంటి అవకాశాలు కనిపించలేదు. చర్చలు చర్చలే, దాడులు దాడులే అని రష్యా చెప్పటం కొంత మందికి విపరీతంగా అనిపించవచ్చు. ఉక్రెయిన్ను రెచ్చగొట్టి ముందుకు తోసిన పశ్చిమ దేశాలు ప్య్రత్యక్షంగా దాడులకు దిగలేదు తప్ప రష్యాను దెబ్బతీసేందుకు భద్రతా మండలిని సాధనంగా చేసుకొని ప్రచారదాడి, ప్రతిరోజూ కొత్త ఆంక్షలు, చర్యలను ప్రకటిస్తూనే పరోక్షదాడులను పెంచుతున్నాయి. ఇదంతా ఉక్రెయినుకు మద్దతుగానే అన్నది తెలిసిందే. ఈ నేపధ్యంలోనే తన అణుదళాలను సిద్దంగా ఉండాలని పుతిన్‌ ఆదేశించాడు, చర్చల సమయంలో దాడులను ఆపేది లేదని కూడా ప్రకటించాడు. ఇవన్నీ వత్తిడిని పెంచే ఎత్తుగడలే.


రెండు దేశాల మధ్య చర్చలు ఎన్నిసార్లు జరిగినా కీలక సమస్యపై అంగీకారం కుదిరితేనే సంధి తప్ప మరొకమార్గం లేదు.ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి ఆ ముసుగులో రష్యా సరిహద్దుల్లో తిష్టవేయాలన్న అమెరికా ఎత్తుగడను పక్కన పెట్టేందుకు సిద్దం కావటం లేదు. అందువలన భౌతికంగా దాడి ఉక్రెయిన్‌ మీద జరుపుతున్నప్పటికీ అసలు లక్ష్యం నాటో కూటమి, దాని పెద్ద అమెరికా అన్నది స్పష్టం. నాటోలో చేరకుండా తటస్ధదేశంగా ఉంటామని ఉక్రెయిన్‌ హామీ ఇవ్వాలని రష్యా పట్టుపడుతోంది. ఒకవైపు తమను ముందుకు తోసి నట్టేట ముంచారని ఉక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీ చెబుతూనే ఇంకా దింపుడు కల్లం ఆశమాదిరి పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యాను దారికి తెస్తాయనే భ్రమలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయ మీరు మా వైపు ఉన్నారో లేదో రుజువు చేయాలంటూ ఐరోపాయునియన్ను మంగళవారం నాడు డిమాండ్‌ చేశాడు. రష్యాను ఖండిస్తూ భద్రతా మండలిలో పెట్టిన తీర్మానాలు వీగిపోతాయని తెలుసు. ఐనా ప్రచారదాడిలో భాగంగా ఆ తతంగం నడిపించిన తరువాత కొనసాగింపుగా ఇప్పుడు సోమవారం నుంచి ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు తెరతీశారు. దాని మీద ఓటింగ్‌ జరగనుంది. దాని ఫలితం ఏమైనప్పటికీ నిబంధనల ప్రకారం దాన్నెవరూ అమలు జరపాల్సిన అవసరం లేదు. గతంలో యుగోస్లావియాపై భద్రతా మండలి అనుమతి లేకుండానే నాటో దళాలు 78 రోజుల పాటు దాడులు చేశాయి. దాన్ని మూడు ముక్కలు చేసి బోస్నియా, హెర్జ్‌గోవినా, సెర్బియాగా విడతీసి ప్రత్యేక రాజ్యాలుగా గుర్తించాయి. అల్బేనియా నుంచి కొసావోను విడగొట్టి గుర్తింపునిచ్చాయి. ఇప్పుడు అవే నాటో దేశాలు ఉక్రెయిన్లో స్వాతంత్య్రం కోరుకుంటున్న డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లను రష్యాగుర్తిస్తే ఇంకేముంది చట్టబద్దతకు ముప్పు వాటిల్లిందంటూ గుండెలు బాదుకుంటున్నాయి. చైనా అంతర్భాగాలైన తైవాన్‌, హాంకాంగ్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలన్న కుట్రను బలపరుస్తున్నాయి.


ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదన్న ప్రధాన డిమాండ్‌తో పాటు రష్యా మరికొన్ని అంశాలను కూడా ముందుకు తెచ్చింది. 2015మిన్‌స్క్‌ ఒప్పందాన్ని అమలు జరపాలని అది డిమాండ్‌ చేస్తోంది. డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లను స్వయంపాలిత ప్రాంతాలుగా ఉక్రెయిన్‌ గుర్తించాలని, ఆ ప్రాంతాల నుంచి మిలిటరీ సామగ్రిని తొలగించాలన్న వాటితో పాటు పన్నెండు అంశాలున్నాయి. దాన్ని ఉక్రెయిన్‌ ఉల్లంఘించింది. ఆ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన నాటోలోని జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు కూడా పట్టించుకోకుండా చోద్యం చూశాయి. ఇప్పుడు ఆ రిపబ్లిక్‌లను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించటంతో అవి కూడా గగ్గోలు పెడుతున్నాయి. రష్యా ముందుకు తెచ్చిన అంశాలను అంగీకరించేందుకు ఉక్రెయిన్‌ సిద్దంగా ఉన్నప్పటికీ అమెరికా, నాటో కూటమి పడనిచ్చేట్లు కనిపించటం లేదు. అవి విధించిన ఆంక్షలు రష్యాకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తి జనంలో పుతిన్‌ మీద వ్యతిరేకతను రేకెత్తించాలన్న పధకం కూడా ఉందన్నది స్పష్టం. రష్యన్‌ ఆర్ధిక వ్యవస్ధను కుప్పకూల్చివేస్తామని ఫ్రాన్స్‌ ఆర్ధిక మంత్రి బ్రూనో లీ మారీ చెప్పాడు. రష్యామీద పూర్తి స్ధాయిలో ఆర్ధిక యుద్ధం చేయనున్నట్లు, ఆ మేరకు ఆర్ధిక రంగాన్ని దెబ్బతీస్తామని ఒక రేడియోలో మాట్లాడుతూ చెప్పాడు.ఈ అంశాలు పుతిన్‌కు తెలియనివేమీ కాదు కనుకనే ప్రతి ఆంక్షలు, తీవ్ర వత్తిడికి పూనుకున్నాడు. ఇప్పటికి ఐదు దఫాలుగా నాటోను విస్తరించి రష్యా ముంగిట తిష్టవేసేందుకు అమెరికా పూనుకుంది. ఈ వివాదానికి మూలం అదే అన్నది తెలిసిందే.రష్యా భద్రత అంశాన్ని విస్మరించి ఏకపక్షంగా ముందుకు సాగితే కుదరదని పుతిన్‌ పశ్చిమ దేశాలకు స్పష్టం చేశాడు. దానిలో భాగంగానే క్రిమియాను తమ అంతర్భాగంగా గుర్తించాలని, ఉక్రెయిన్లోని నయానాజీ మూకలను వదిలించుకోవాలని కూడా కోరుతున్నాడు.


పశ్చిమ దేశాల కవ్వింపు చర్యలు, సమీప దేశాల్లో ఆయుధమోహరింపును ఎదుర్కొనేందుకు రష్యాకూడా పావులు కదిపింది. దానిలో భాగంగానే బెలారస్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అవసరమైతే అణ్వాయుధాలు, క్షిపణులను మోహరించేందుకు, రష్యాదళాలను శాశ్వతంగా దేశంలో కొనసాగించేందుకు రాజ్యాంగబద్ద ఆమోదం పొందారు. రష్యా మీద ప్రకటించిన ఆంక్షలు అణుదాడి కంటే తక్కువేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే రూబుల్‌ విలువిలువ కుప్పకూలింది.ద్రవ్యోల్బణం పెరిగింది. జనం బాంకుల ముందు వరుసలు కట్టారు. ఇతర దేశాల నుంచి నగదు బదిలీకి వీల్లేకుండా కొన్ని రష్యన్‌ బాంకులను స్విఫ్ట్‌ నుంచి తొలగించారు.పుతిన్‌తో సహా అనేక మంది వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు విధించారు. విదేశాల్లో ఉన్నవారి ఆస్తుల విలువ 800 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఆంక్షల నుంచి గాస్‌, చమురు, ఎరువులు, గోధుమల వంటి వాటి లావాదేవీలకు చెల్లింపులను మినహాయించారు. ఇరాన్‌, వెనెజులా మీద ఇలాంటి ఆంక్షలనే అమెరికా విధించింది. క్యూబామీద దశాబ్దాలుగా ఇంతకంటే తీవ్ర అష్టదిగ్బంధనం గావించినప్పటికీ అవి తట్టుకొని నిలిచాయి. అందువలన తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ రష్యాకు తట్టుకొనే శక్తి ఉంది. ఐరోపాలో అమెరికా అణ్వాయుధాల మోహరింపు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యన్‌ విదేశాంగ మంత్రి లావరోవ్‌ మంగళవారం నాడు చెప్పాడు. ప్రస్తుత పరిస్ధితిలో నూతన ఆయుధపోటీ తగదని, నిరోధించాలని అన్నాడు.ఐరోపాలో స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల మోహరింపుపై మారటోరియం ప్రకటించాలని ప్రతిపాదించాడు. అమెరికా అణ్వాయుధాలు కొన్ని దేశాల్లో ఉన్నాయని ఇది అణ్వస్త్రవ్యాప్తి నిరోధ ఒప్పందానికి విరుద్దమని జెనీవాలో జరుగుతున్న నిరాయుధ సభలో వీడియో ద్వారా మాట్లాడుతూ లావరోవ్‌ చెప్పాడు.


తమ గడ్డమీద అణ్వాయుధాలను ఉంచేందుకు బెలారస్‌ తీర్మానించటాన్ని బట్టి పశ్చిమ దేశాల నుంచి వచ్చే ముప్పు కనిపిస్తున్నది. బహుశా అందుకే రష్యా అణుదళాలు సన్నద్దంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు చెప్పవచ్చు. అణ్వాయుధాల గురించి ముందుగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఫిబ్రవరి 24న ప్రస్తావించాడు. అణుదాడి గురించి పుతిన్‌ బెదిరిస్తున్నాడని బైడెన్‌ విలేకర్లతో చెప్పాడు. అదేమిటో వివరిస్తారా అని అడిగితే అతనేమనుకుంటున్నాడో తనకు తెలియదని సమాధానాన్ని దాటవేశాడు. పశ్చిమ దేశాలన్నీ ఐక్యంగా ఉంటాయా లేదా అని పుతిన్‌ పరీక్షించాలనుకుంటున్నాడని కూడా అన్నాడు. అణుదళాల సన్నద గురించి పుతిన్‌ చెప్పటాన్ని అణుదాడికి దిగుతాడని భావించనవసరం లేదు.


ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడినపుడల్లా అణ్వాయుధ అగ్రదేశాలు హెచ్చరికలు, కొత్త పరీక్షలు, అణు సామర్ధ్య క్షిపణుల పరీక్షలు చేయటం సాధారణంగా జరుగుతోంది తప్ప రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఎవరూ ప్రయోగించలేదు. గతంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు జరిపినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హడావుడి, తరువాత మౌనంగా ఉండటం తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్‌ వ్యవహారంలో పుతిన్‌ కూడా అదే ఎత్తుడను అనుసరించాడు. దాడికి రెండునెలల ముందు నుంచి అనేక విధాలుగా తమ దేశ భద్రతకు హామీ గురించి ఐరాసకు, నాటో దేశాలకు మొరపెట్టుకున్నా పట్టించుకున్నవారు లేకపోగా మరింతగా రెచ్చగొట్టిన అంశం తెలిసిందే.ఉక్రెయిన్‌ అణుశక్తి దేశం కాదు. కేవలం బెదిరింపు, వత్తిడికి మాత్రమే పరిమితం అని విశ్లేషకులు చెఋన్నారు. ఐతే ప్రస్తుతం జరుగుతున్న ప్రచార యుద్దంలో ఏ దేశం ఎటువంటి వైఖరి తీసుకుంటుందో ఎలాంటి తెగింపులకు పాల్పడుతుందో చెప్పలేము. ఉక్రెయిన్‌కు నాటో తీర్ధం ఇవ్వనంత మాత్రాన గత మూడు దశాబ్దాలుగా ఆదేశానికి వచ్చిన ముప్పేమీ లేదు. అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఎప్పుడైతే తన అనుకూల శక్తులను గద్దెనెక్కించి రష్యాను కవ్విస్తోందో అప్పటి నుంచే అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు పశ్చిమ దేశాలు అనుసరించే వైఖరిపైనే అనేక అంశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రతిదేశం తన రక్షణను తాను చూసుకోవాల్సిన పరిస్ధితిని అమెరికా, నాటో కూటమి కల్పించింది. అందువలన ఇప్పుడు ఎక్కడా మనకు శాంతిదూతలు కనపడరు.పశ్చిమదేశాల తీరు తెన్నులను చూస్తుంటే మరోసారి ఐరోపా ఆయుధ మోహరింపు కేంద్రంగా మారే అవకాశాలు లేకపోలేదు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒక వైపు రష్యా మరోవైపు ఉంటాయి. తగులుతున్న ఎదురుదెబ్బలు, దెబ్బకుదెబ్బ తీస్తామని చేస్తామని హెచ్చరికల కారణంగానే అమెరికా అదుపులో ఉంటోంది.