Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గురువారం నాడు మరో మెట్టు ఎక్కాయి. ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం పీపా ధర 116.94 డాలర్లను తాకింది. వ్యూహాత్మక నిల్వల నుంచి 60మిలియన్ల పీపాల చమురును మార్కెట్లోకి విడుదల చేయాలని అంతర్జాతీ ఇంధన సంస్ధ(ఐఇఏ) మంత్రుల సమావేశం ప్రకటించిన తరువాత కూడా మార్కెట్లో ధరలు పెరిగాయి. ఈ మొత్తంలో తాము 30మిలియన్ల పీపాలు విడుదల చేస్తామని అమెరికా పేర్కొన్నది. అరవై మిలియన్ల పీపాలు ఐఇఏలోని 31 దేశాల నిల్వల్లో నాలుగుశాతం. ఈ దేశాల్లో 1.5బిలియన్ల పీపాలు ఉంటే ఒక్క అమెరికాలోనే 600మి. పీపాలుంది. మార్కెట్‌ ఇబ్బందుల్లో పడిన ప్రతికూల సందేశాన్ని సందేశాన్ని ఈ నిర్ణయం పంపిందని, అరవై మిలియన్లన్నది చమురు పీపాలో ఒకబొట్టు వంటిదని, ప్రపంచంలో ఒక రోజుకు అవసరమైన 100మి. పీపాల గిరాకీ కంటే తక్కువంటూ ఇది చమురు ధరలపై ప్రభావం ఎలా చూపుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆంక్షల కారణంగా మార్కెట్లోకి రష్యానుంచి రోజుకు ఏడు మిలియన్‌ పీపాల సరఫరా నిలిచిపోనుంది. ఆంక్షలున్నప్పటికీ తమ కొనుగోళ్లు కొనసాగుతూనే ఉంటాయని చైనా ప్రకటించింది. గోధుమల దిగుమతులపై గతంలో ఉన్న పరిమితులను కూడా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.


ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో నిమిత్తం లేకుండానే అమెరికాలో నాలుగుదశాబ్దాల రికార్డు స్ధాయిలో 7.5శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇప్పుడు చమురు ధరల పెరుగుదల తోడైంది. కొందరి అంచనా ప్రకారం 125 డాలర్లకు పెరిగితే అమెరికా ఏకంగా మాంద్యంలోకి దిగజారుతుంది. ఐరోపా దేశాలకు చమురు, గాస్‌ అవసరం కనుక రష్యా నుంచి వాటి ఎగుమతులపై ఆంక్షలను మినహాయించారు, లేనట్లయితే ఐరోపాలో మరోరకం సంక్షోభం తలెత్తి ఉండేది.ఐరోపా దేశాలు మరిన్ని ఆంక్షలను విధించినట్లయితే తనకు మరింత నష్టమైనా రష్యా చమురు, గాస్‌ నిలిపివేత అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. ఈ కారణంగానే స్విఫ్ట్‌( అంతర్జాతీయ బాంకు లావాదేవీల వ్యవస్ధ) నుంచి ఏడు రష్యన్‌ బాంకులకు ఆంక్షల నుంచి పశ్చిమ దేశాలు మినహాయింపునిచ్చాయి. ఉక్రెయిన్‌ వివాదం వలన ఇంధన ధరలు పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారితీసి అమెరికా ఆర్ధిక పురోగతి, పౌరుల ఖర్చు తగ్గేందుకు దారి తీస్తుందని రిచ్‌మండ్‌ ఫెడరల్‌ రిజర్వు అధ్యక్షుడు టామ్‌ బార్కింగ్‌ హెచ్చరించాడు.ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ సగటున చమురు ధరలు వంద డాలర్లు ఉంటే అమెరికా ఆర్ధిక రంగం ఆరునెలల పాటు నిభాయించుకోగలదని, 125 డాలర్లకు పెరిగితే నిరుద్యోగం పెరుగుతుందని, వృద్ధి ఆగుతుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జో బైడెన్‌ సైతం ఉక్రెయిన్‌ వివాదానికి అమెరికన్లు మూల్యం చెల్లించాల్సి రావచ్చని చెప్పిన అంశం తెలిసిందే.ఐరోపాలో గాస్‌ ధరలు 60శాతం పెరిగాయి. చలికాలంలో మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. రష్యాకు వెసులుబాటు కల్పించేందుకు ఇరు దేశాల మధ్య తమ కరెన్సీలో చెల్లింపులకు చైనా ఏర్పాట్లు చేసింది.ఈ అనుభవం భవిష్యత్‌లో అంతర్జాతీయ మార్పిడి కరెన్సీగా డాలర్‌ను పక్కకు నెట్టేందుకు కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం డాలర్‌ చెల్లింపులు 40శాతం ఉండగా చైనా కరెన్సీ రెన్‌మిన్‌బీ(యువాన్‌) రెండుశాతం జరుగుతున్నాయి.


2022-23 ఆర్ధిక సంవత్సరంలో ముడి చమురు పీపా ధర 70-75 డాలర్ల మధ్య ఉంటుందనే అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. మార్చి నెలాఖరుతో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంపై పెరిగిన చమురు ధరలు ప్రభావం చూపటం ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పెట్రోలు, డీజిలుపై సెస్‌లను ఐదు, పది చొప్పున తగ్గించటంతో పాటు నవంబరు నాలుగవ తేదీ నుంచి వాటి ధరలను స్ధంభింప చేశారు.ఈ నెల ఏడవ తేదీన చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత నుంచి చమురు ధరలు పెరగటం ఖాయం. రానున్న రోజుల్లో జిడిపి వృద్ధి తగ్గటంతో పాటు ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎంకి పెళ్లి సుబ్చి చావుకు వచ్చిందన్నట్లుగా ఉక్రెయిన్‌ – రష్యా వివాదంతో మనకు ప్రమేయం లేనప్పటికీ దాని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తోంది. మన దిగుమతుల బిల్లు తడిచి మోపెడు అవుతోంది.దీంతో మన కరెంటు ఖాతాలోటు పెరుగుతోంది. ముడిచమురు, ఎరువులు, ఖాద్య, ఖనిజతైలాలు, ఇతర దిగుమతుల ధరలు పెరుగుతున్నాయి. దిగుమతుల బిల్లు 2022లో 600బి. డాలర్లు దాటవచ్చని అంచనా. తక్షణం ద్రవ్యోల్బణం, దానితో పాటు వచ్చే ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం జరగవచ్చు. ఒక పీపా ధర ఐదు డాలర్లు పెరిగితే మన కరెంటు ఖాతాలోటు 6.6బి.డాలర్లు పెరుగుతుంది. ముడి చమురు ధర 105 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నప్పటి అంచనాల ప్రకారం మార్చి ఎనిమిది తరువాత చమురు కంపెనీలు పెట్రోలు, డీజిలు ధరలను పది రూపాయల వరకు పెంచవచ్చని అంచనా. ఇప్పుడు 117 డాలర్ల వరకు తాకింది. ఇది ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది. మన ఎగుమతుల మీద కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ఏడాది తొలి ఆరునెలల పాటు చమురు ధరలు వంద డాలర్లకు ఎగువనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తంగా దేశ ప్రగతి నిస్తేజంగా ఉంటుందని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ విశ్లేషకులు చెప్పారు.


జాతీయ గణాంకాల సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) 2021-22లో వృద్ధి రేటు అంతకు ముందు సంవత్సరంలోని 7.3శాతం తిరోగమనాన్ని అధిగమించి 9.2శాతం పురోగమనం ఉంటుందని అంచనా వేసింది. తాజాగా తొమ్మిది నెలల తరువాత దాన్ని8.9శాతానికి తగ్గించింది. తొలి మూడు మాసాల్లో 20.3 శాతంవృద్ధి కాస్తా రెండవ త్రైమాసికంలో 8.4శాతానికి తగ్గింది.తదుపరి మూడు నెలల్లో 5.4శాతంగా ఉందని అంచనా వేశారు. చమురు ధరల పెరుగుదల గణనీయంగా ఉన్న జనవరి-మార్చి నెలల గణాంకాలు వెల్లడైతే స్పష్టమైన అంచనాలు తెలుస్తాయి. ఈ వృద్ధి కూడా గతేడాది తగ్గిన దాని ప్రాతిపదికన చెబుతున్న లెక్క కనుక వాస్తవ వృద్ధి రేటు అంత ఉండదు. అందుకే గతంలో ఉన్న జిడిపి స్దాయికి చేరాలంటే దీర్ఘకాలం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తక్కువగా ఉంచినప్పటికీ వృద్ది రేటు ఆందోళనకరంగా ఉంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగేట్లయితే వడ్డీ రేట్లు పెరుగుతాయి, అది మరొక సమస్యకు దారి తీస్తుంది.


వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ప్రాతిపదికన ద్రవ్యోల్బణం ఆరుశాతం వరకు మనం భరించగలమని రిజర్వుబాంకు అన్నది. అంటే ఆ మేరకు ధరలు పెరుగుతాయని సిద్దంకమ్మని జనానికి చెప్పింది.డిసెంబరులో 5.59శాతం ఉన్నది జనవరిలో 6.01శాతానికి పెరిగింది. ఇదే తరుణంలో టోకు ధరల ద్రవ్యోల్బణం దాదాపు 13శాతంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక కూడా పదినెలల కనిష్టానికి పడిపోయింది. మన దేశంలో ప్రయివేటు వినియోగం 55శాతం ఉంది. ఇది కరోనాకు ముందున్న స్దాయికంటే తక్కువే. కరోనా మహమ్మారి జనాల పొదుపు మొత్తాలను, గణనీయంగా వేతనాలను హరించివేసినందున వినియోగం బలహీనంగా ఉంది. పులిమీద పుట్రలా దీనికి ఉక్రెయిన్‌ వివాదం మరింత ముప్పు తెచ్చింది. జనంపై పెరిగే భారాల గురించి ఏం చేద్దామన్న అంశాన్ని చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ పూనుకున్నారని గానీ, సమీక్షలు జరిపినట్లుగా ఎక్కడా వార్తలు లేవు. చేతులు కాలిన తరువాత ఆకలు పట్టుకున్నట్లు ఆపరేషన్‌ గంగ పేరుతో ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన మన విద్యార్దుల గురించి ఎక్కడలేని శ్రద్ద చూపుతున్నట్లు సమావేశాల మీద సమావేశాలు జరుపుతున్నట్లు ప్రకటిస్తున్నారు, మంచిదే, ఇవాళా రేపట్లో అది కూడా పూర్తి అవుతుంది. తరువాతనైనా జనం గురించి పట్టించుకుంటారా ?చమురు ధరలు తగ్గితే ఆ మేరకు జనానికి ఉపశమనం కలిగించకుండా వందల రెట్లు పన్ను, సెస్‌లు పెంచి ఖజానా నింపుకొనేందుకు చూపిన వేగం ఇప్పుడు చమురు ధరలు పెరుగుతుంటే భారం తగ్గించేందుకు కనపరచరేం ?