Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నూరు పూవులు పూయనీయండి – వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్న స్ఫూర్తితో ఎవరు ఏమైనా చెప్పవచ్చు, రాయవచ్చు. దానిలో భాగంగానే ఎవరైనా వాటితో విబేధించవచ్చు కూడా. తొలుత ప్రముఖ రచయిత్రిగా తెలుగునాట పేరు తెచ్చుకున్న రంగనాయకమ్మ తరువాత మార్క్సిస్టు సిద్దాంతవేత్తగా కూడా మారారు. మార్క్సిజం- లెనినిజం లేదా దానికి మావోయిజాన్ని తోడు చేసి వాటి మీద వ్యాఖ్యానాలు చేసేందుకు ఎవరికీ మేథోసంపత్తి హక్కులేమీ లేవు, కనుక ప్రతివారికీ అవకాశం ఉంది, అనేక మంది రాస్తున్నారు. అలాంటి వారిలో రంగనాయకమ్మ ఒకరు. ‘ మహా రష్యన్‌ దురహంకారం ‘ అనే శీర్షికతో మార్చి రెండవ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన అంశాలలో కొన్నింటి గురించి చూద్దాం. బోల్షివిక్‌ పార్టీ సారధిగా, తొలి సోషలిస్టు విప్లవానికి నేతృత్వం వహించి అనేక అంశాలపై మార్క్సిజాన్ని మరింతగా పరిపుష్టం చేసిన కారణంగానే లెనిన్‌కు చరిత్రలో ఒక ప్రత్యేక స్ధానం ఉంది. అదెంతటి మహత్తరమైనదంటే తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజంగా ప్రతి కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శనంగా చేసుకొనేంతగా అన్నది స్పష్టం.


రంగనాయకమ్మగారు ప్రస్తావించిన జాతుల సమస్య మీద ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ జరగనన్ని చర్చలు, వాదోపవాదాలు అక్కడి భౌతిక పరిస్ధితుల కారణంగా విప్లవానికి ముందు తరువాత రష్యన్‌ పార్టీలో జరిగాయి. లెనిన్‌ ప్రతిపాదించిన వాటితో తీవ్రంగా విబేధించిన వారున్నారు, లెనిన్‌ విబేధించినవీ రాజీపడినవీ ఉన్నాయి. ఆ చర్చ జోలికి పోదలచలేదు. బోల్షివిక్‌ పార్టీ ఒక ప్రజాస్వామిక సంస్ధ. మెజారిటీ నిర్ణయాన్ని మైనారిటీ కూడా అంగీకరించి అమలు జరపాలనే కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రాలతో పని చేసింది. అందువలన పార్టీలో లెనిన్‌ప్రతిపాదించినా, స్టాలిన్‌ ప్రతిపాదించినా తప్పయినా ఒప్పయినా చర్చల తరువాత ఆమోదం పొందిన వాటినే అమలు చేశారు. అందువలన వాటిని వ్యక్తులకు ఆపాదించటం తగనిపని.ఉమ్మడి óాకమ్యూనిస్టు పార్టీ సైద్దాంతిక విబేధాలతో చీలిన తరువాత తెలుగునాట రెండు పార్టీలను కొందరు సుందరయ్య పార్టీ, రాజేశ్వరరావు పార్టీ అని పిలవటాన్ని ఆమె గుర్తుకు తెచ్చారు. ” లెనిన్‌ వ్యతిరేకించిన జాతుల విధానమే స్టాలిన్‌ ఆధిపత్యంలో కొనసాగింది ” అని చెప్పటం అలాంటిదే. బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైనపుడు రష్యాలో అనేక మైనారిటీ జాతులు ఉన్నాయి. తొలి శ్రామిక రాజ్యం పేరు ” రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌ఎస్‌ఆర్‌) ”. తరువాత 1924లో వివిధ రిపబ్లిక్‌ల మధ్య ఒప్పందం జరిగి ”యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(యుఎస్‌ఎస్‌ఆర్‌)గా పేరు మార్చారు.


జారు కాలంలో మైనారిటీ జాతులను అణచివేసింది నిజం, అందుకే విప్లవం సంభవించక ముందే సోషలిస్టు దేశంలో జాతుల సమస్య పరిష్కారం గురించి పార్టీలో చర్చ జరిగింది. ఐనప్పటికీ రష్యన్‌ రిపబ్లిక్‌ అని నామకరణం చేసింది లెనిన్‌ నాయకత్వంలో ఉన్న పార్టీ, ప్రభుత్వమే కదా పెట్టింది. దాని అర్ధం మహా రష్యన్‌ దురహంకారానికి లెనిన్‌ లోనైనట్లా ? రిపబ్లిక్‌లకు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్న లెనిన్‌ వైఖరిని కొందరు ఆమోదించకపోయినా మెజారిటీ అంగీకరించారు.1917 నవంబరు ఏడున రష్యన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ ఏర్పడితే, స్వయం నిర్ణయాధికార అవకాశాన్ని వినియోగించుకొని అంతకు ముందు స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ఫిన్లండ్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంటే లెనిన్‌ ఆమోదించాల్సి వచ్చింది. దీని మీద భిన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయి, తరువాత కూడా అలాంటి అవకాశం కల్పించినా మరొకటేదీ విడిపోలేదు. స్టాలిన్‌ కాలం నుంచి అనుసరించిన ఆధిపత్య విధానాలు 1991లో వేరుపడి పోవటానికి ఒక ముఖ్యకారణం అని రంగనాయకమ్మ చేసిన సూత్రీకరణకు స్టాలిన్‌ పట్ల గుడ్డి వ్యతిరేకత తప్ప తర్కబద్దత కనిపించదు. అమెరికా ఇతర శక్తుల కుట్రలను గుర్తించేందుకు నిరాకరించటమే. ఆమెతో సహా కొందరు చెప్పే స్టాలిన్‌ ఆధిపత్యానికి తలొగ్గి రిపబ్లిక్కులు విధిలేక కలసి ఉన్నాయనుకుందాం, స్టాలిన్‌ 1953లో మరణించిన తరువాత ఎక్కడి నుంచీ స్వయం నిర్ణయాధికార కాంక్ష లేదా డిమాండ్‌ ఎందుకు తలెత్తలేదు. రిపబ్లిక్కులకు అసమాన అధికారాలు ఉంటే మన దేశంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల సమస్య మాదిరి అక్కడ కూడా తలెత్తి ఉండేవి.లెనిన్‌ వ్యతిరేకించిన లేదా స్టాలిన్‌ అమలు పరచిన విధానాలు అనే పదప్రయోగాలు కూడా తప్పే. అవేవీ ఏకపక్షమైనవి కాదు, తప్పయినా ఒప్పయినా పార్టీ తీసుకున్న వైఖరిని అమలు చేశారు. తప్పనుకుంటే గుణపాఠాలు తీసుకోవచ్చు, అభిప్రాయాలు వెల్లడించవచ్చు. రంగనాయకమ్మకు ఆ స్వేచ్చ ఉంది. ఆమె ఆలోచనా బడిలొ చదువుకుంటున్నవారికి, అనుసరిస్తున్నవారికి అవే తిరుగులేనివిగా అనిపించవచ్చు, ఇతరులు విబేధించవచ్చు.


ఇక ” ఉక్రెయిన్‌ ముందుగా దాడి చేయనపుడు రష్యాకు ఆత్మరక్షణ ప్రశ్న ఏమిటి ” అని రంగనాయకమ్మ అడుగుతున్నారు. ఇది అమాయకత్వమో లేక కొందరి టీకా తాత్పర్యాల ప్రభావమో తెలియదు. అసలు రష్యా ఆ మాట ఎక్కడ చెప్పింది ? చెప్పలేదు, కనుక ఇతరులు చెప్పినదాన్ని ప్రమాణంగా తీసుకోవటం ఏమిటి ? ” ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత….అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీతో సంబంధాలు పెట్టుకుంది ” అన్నారు. ఇది వాస్తవ విరుద్దం. ఒక స్వతంత్ర దేశంగా ప్రతిదేశంతో దౌత్య సంబంధాలు పెట్టుకోవటం వేరు, ఒక దేశం లేదా కూటమికి వ్యతిరేకంగా మరో కూటమి వైపు మొగ్గి ఇతర సంబంధాలు పెట్టుకోవటం వేరు. 2013లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ ఎన్‌కోవిచ్‌ ఒక ప్రకటన చేశాడు. ఐరోపా యూనియన్‌తో ఆర్ధిక అనుసంధాన ఒప్పందానికి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు. తొలుత ఆర్ధికం పేరుతో సంబంధాలు, తరువాత నాటోలో చేర్చుకోవాలని తద్వారా రష్యా ముంగిటకు తమ సేనలను చేర్చాలన్నది అమెరికా పధకం. దానికి ఎదురుదెబ్బ తగలటంతో సిఐఏ రంగంలోకి దిగి ప్రతిపక్ష పార్టీలతో ప్రదర్శనలు చేయించి తిరుగుబాటును రెచ్చగొట్టింది. ఎనుకోవిచ్‌ రష్యాలో తలదాచుకున్నాడు. తరువాత ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. అసలు సమస్య ఇక్కడినుంచే ప్రారంభం కాగా స్వతంత్రదేశంగా ఏర్పడిన వెంటనే అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకున్నదని రాయటం వక్రీకరణ కాదా ?


” రెండవ ప్రపంచ యుద్దం తరువాత నుంచీ ప్రపంచం మీద పెత్తనం చేసే విషయంలో అమెరికాకి రష్యా ప్రధాన పోటీదారు.అందుకే అమెరికా, రష్యాలను అగ్రరాజ్యాలు అంటారు ఇతర దేశాల వారు. అసలు అనవలసింది రెండూ పెద్ద బందిపోటు ముఠాలు అని….” ఇది రంగనాయకమ్మ వంటి సీనియర్‌ కలం నుంచి వెలువడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రాధమిక అంశాలను కూడా విస్మరిస్తే అమెకు ఉన్న పేరును బట్టి చదువరులు నిజమే అని భావించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకొనే అవకాశం ఉంది.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ ఉంది. దానిలో రష్యాతో సహా 15 రిపబ్లిక్కులున్నాయి.1991 వరకు అదే కొనసాగింది. సోవియట్‌ ప్రపంచ పెత్తనం కోసం చూసిందని అమెరికా కూటమి, దాన్ని అనుసరించే వారు చేసిన ప్రచారాన్ని రంగనాయకమ్మ కూడా వంటపట్టించుకున్నారా ? మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తరువాత అంతకు ముందు చేసిన తన రచనల్లో కొన్ని పదాలను సవరించారు. కానీ సోవియట్‌ గురించి పూర్వపు వైఖరితోనే ఉన్నట్లున్నారు. లేకపోతే అమెరికాతో అంటగట్టి రెండూ ఒకటే అనటం ఏమిటి ? అమెరికా పెత్తనానికి, దుర్మార్గాలకు బలైన కొరియా, వియత్నాం, ఇరాక్‌, లిబియా, సిరియా వంటి ఉదంతాలున్నాయి. వీటిలో ఏ ఒక్కదేశమైనా అమెరికాను ఆహ్వానించిందా, ఏకపక్ష దాడులకు గురయ్యాయా ?అటువంటి చరిత్ర సోవియట్‌ లేదా దాని తరువాత రష్యాకు గానీ ఉందా ? ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ ఎందుకు జోక్యం చేసుకుందో రంగనాయకమ్మకు తెలీదనుకోవాలా లేక అమెరికా దాడులకు దీనికి తేడా లేదని అనుకుంటున్నారా ? ఆఫ్ఘన్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా చేసిన కుట్రల్లో భాగంగా తాలిబాన్లను తయారు చేసి ఉసిగొల్పారు. వారి నుంచి రక్షణకు ఆ ప్రభుత్వం సోవియట్‌ సాయం కోరింది.


శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు యుద్దం పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి అని ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ చెప్పిన అంశాలు ఆ దృక్పధాన్ని ప్రతిబింబించలేదు. రష్యా పెట్టుబడిదారీ దేశమే, అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు. గత మూడు దశాబ్దాల్లో రష్యాకు అలాంటి చరిత్ర లేదు. అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్లో ప్రత్యేక సైనిక చర్యకు పూనుకుంది. ప్రపంచాధిపత్యం కోసం పూనుకున్న అమెరికా కుట్రలను ఎదిరించేందుకు ఒక పెట్టుబడిదారీ దేశంగా రష్యా లేదా మరొకటి ముందుకు వస్తే శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు ఎదిరించిన వారిని బలపరచాలి. మొదటి ప్రపంచ యుద్దంలో జర్మనీతో లెనిన్‌ బ్రెస్ట్‌-లిటోవస్క్‌ సంధి కుదుర్చుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో స్టాలిన్‌ ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోంది. కనుక దాన్ని ఎదుర్కొనేవారిని బలపరచాలి. వర్తమాన ఉదంతంలో ఐరాసలో చైనా తటస్ధ వైఖరిని తీసుకుంది. అదే సమయంలో పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు, గోధుమల వంటి వాటిని దిగుమతి చేసుకుంటోంది. రంగనాయకమ్మగారు వర్ణించినట్లు ” ఒక బందిపోటు ”ను చైనా సమర్ధిస్తున్నట్లుగా అనుకోవాలా, అమెరికాతో పోరాడేశక్తికి తోడ్పాటు ఇస్తున్నట్లుగా భావించాలా ? ఆమె కళ్లతో చూస్తే అమెరికా బందిపోట్లతో 50 సంవత్సరాల క్రితం సోషలిస్టు చైనా ఒప్పందం చేసుకుంది.దానిలో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించింది. దాని వలన చైనా శ్రామికులకు మేలు జరిగినట్లా కీడు జరిగిందా ? దీనికి ఏ భాష్యం చెబుతారు. అదే విధంగా రష్యాతోనూ ఒప్పందాలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. దీని అర్ధం రెండు పెద్ద బందిపోటు దేశాలతో చైనా చేతులు కలిపినట్లా ?


తన ప్రధాన పోటీదారైన అమెరికా అడుగుజాడల్లోనే నడుస్తోందనే కారణంతోనే ఉక్రెయిన్‌ మీద రష్యా దురాక్రమణకు పాల్పడిందని రంగనాయకమ్మ చెప్పారు. తన వర్గం ఏదో మరచిపోయి ఒక ఫ్యాక్టరీ కార్మికుడు, వ్యవసాయ కార్మికుడు తమ యజమానులవైపు కొమ్ముకాస్తే పర్యవసానాలను అనుభవించకతప్పదు. అదే ఇక్కడా వర్తిస్తుంది. ఐరోపాలో ఉక్రెయిను కంటే అనేక చిన్న దేశాలు అదే పని చేస్తున్నాయి, మరి వాటి మీద ఎందుకు దాడికి దిగలేదు ? యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల గురించి ప్రస్తావించారు, అవి జరిగే కారణాలు వేరు, అవన్నీ విముక్తి మార్గ బాటలో ఉన్నట్లు భావిస్తున్నారా ? గతంలో అమెరికా, అనేక ఐరోపా దేశాల్లో ఇంతకంటే పెద్ద ఎత్తున జరిగాయి. వాటికీ విముక్తికీ ముడిపెట్టటం ఏమిటి ?


ఇక శ్రామికవర్గ చైతన్యం గురించి, ఐరాస గురించి చెప్పిందానితో విబేధించాల్సిందేమీ లేదు.తాను శ్రామికవర్గ పక్షపాతినని ఆమె పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు. అందుకు అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. అయితే, పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు మార్క్సిజాన్ని ఔపోసన పట్టినట్లు కనిపించే రంగనాయకమ్మగారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమె రచనలను అనుసరించేవారు తర్కబద్దంగా ఆలోచించి సరైనవో కాదో నిర్ధారించుకోవాలి.