Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా సాగెనుగా అంటూ సాగుతున్న భారత – అమెరికా ప్రేమ నౌకను ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ఒక్క కుదుపు కుదిపింది.ప్రేమ జంట తాత్కాలికంగా వేరు పడింది. జన్మజన్మలకు ఒక్కటిగా ఉందామంటూ చేసుకున్న బాసలను మర్చి పోయి నాతో కలసి రష్యాను ఖండిస్తూ యుగళగీతం పాడేందుకు నిరాకరిస్తావా అంటూ అమెరికా గుర్రుగా ఉంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల్లేవుగానీ తడిక రాయబారాలు కొనసాగుతున్నాయి.వత్తిడికి తట్టుకోలేక నరేంద్రమోడీ సర్కార్‌ తిరిగి ప్రేమ నౌక ఎక్కుతుందా, మరేమైనా చేస్తుందా ? అసలెందుకు భాగస్వాముల మధ్య ఈ పరిస్ధితి వచ్చిందన్నది ప్రపంచంలో చర్చ జరుగుతోంది. మధ్యలో కొందరు చైనాను లాగుతున్నారు? వారి ఎత్తుగడ ఏమిటి ? ఇలాంటి ప్రశ్నలెన్నింటినో ఉక్రెయిన్‌ – రష్యా వివాదం ముందుకు తెచ్చింది. మరోమాటలో చెప్పాలంటే మన విదేశాంగ విధానం గురించి సరైన దారీ తెన్నూ గురించి తేల్చుకోవాల్సిన అగత్యాన్ని వెల్లడిస్తోంది.


ఈ వివాదంలో మన దేశం ప్రకటించిన తటస్ధ వైఖరి గురించి అంతర్గతంగా రష్యా ఏమనుకుంటోందో ఇంకా తెలియదు, తన వ్యతిరేకులతో చేతులు కలపకపోవటం ఒక రకంగా మేలే అని భావిస్తున్నట్లు దాని సానుకూల స్పందన వెల్లడించింది. మరోవైపు అమెరికా పట్టలేని ఆగ్రహంతో ఉన్నా తన పధకాల్లో మన అవసరాలను గమనంలో ఉంచుకొని తమాయించుకుంటూ బయపడకుండా ఉంది. దాని అధినేత, నరేంద్రమోడీతో పెద్దన్న బైడెన్‌ ఇంతవరకు మాట్లాడలేదు. యుద్ధానికి ముందే కొన్ని నెలల పాటు తమతో గొంతు కలపాలని ఒప్పించేందుకు తమ నేతలు తీవ్ర కసరత్తు చేసినట్లు, యుద్దం ప్రారంభమైన తరువాత మరింతగా ప్రయత్నాలున్నట్లు అధికారయంత్రాంగం చెప్పింది.


పలు వైఫల్యాల కారణంగా ప్రపంచంలో పరువు పోగొట్టుకుంటున్నది అమెరికా. శత్రుదేశాలుగా పరిగణిస్తున్నవాటి మీద మరింతగా దూకుడు పెంచటం ద్వారా నష్టనివారణ, తన మిత్రదేశాల్లో విశ్వాసం పెంపొందించేందుకు దుస్సాహసాలకు పాల్పడుతోంది. గత రెండు దశాబ్దాలుగా భారత్‌ను తన కౌగిట్లోకి తీసుకొనేందుకు పావులు కదిపింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత కొంత మేరకు సఫలీకృతమైంది.చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని ముందుకు నెట్టే ఎత్తుగడతో ఒక ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు 2007లోనే చతుష్టయ(క్వాడ్‌) కూటమికి రూపకల్పన చేసినా అది ముందుకు సాగలేదు. మన దేశం చేతులు కాల్చుకొనేందుకు సిద్దం కాకపోవటం ఒక ప్రధాన కారణం.కానీ 2017లో దానికి నరేంద్రమోడీ సిద్దపడటంతో అది అమల్లోకి వచ్చింది. లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ ఉదంత రూపంలో దాని పర్యవసానాలను చూశాము.


ఇప్పుడు ఉక్రెయిన్‌ – రష్యా పరిణామాలను ఆసరా చేసుకొని అమెరికా, మన దేశంలోని దాని మద్దతుదారులు మరోసారి చైనాను ఒక బూచిగా చూపేందుకు పూనుకున్నారు.ఆసియాలో ఆధిపత్యానికి చైనా పూనుకున్నదనే అమెరికా ప్రచారాన్ని మరో రూపంలో ముందుకు తెస్తున్నారు. రష్యా మనకు తరతరాలుగా మిలిటరీ సాయం అందిస్తున్నది. దాన్ని వదులుకుంటే మన జుట్టు అమెరికా వాడి చేతికి చిక్కుతుందనే భయమూ, వారి పాతబడిన ఆయుధాలు కొనుగోలు చేయటం కంటే రష్యా గతంలో ఇచ్చిన వాటిని నవీకరించుకోవటం మెరుగు అనే అభిప్రాయమూ ఉంది. రష్యాను చూపి కొత్త వాటిని ఇస్తారా లేదా అని అమెరికాతో బేరమాడేందుకూ కావచ్చు, ఇలా అనేక అంశాలున్నాయి. మనం కావాలన్న క్షిపణి రక్షణ వ్యవస్ధలను ఇచ్చేందుకు అమెరికా సిద్దం కాదు. రష్యా గతంలో ఇస్రోకు క్రయోజనిక్‌ ఇంజన్లు, వాటి పరిజ్ఞానం అందచేసింది. మనతో కలసి బ్రహ్మౌస్‌ అనే ఆధునిక క్షిపణులు, బహుళ ప్రయోజనాలకు అవసరమైన విమానాల రూపకల్పన, ఎకె రకం తుపాకుల తయారీ వంటి అంశాల్లో భాగస్వామిగా ఉంది. అమెరికా మబ్బుల్లో నీళ్లు చూసి రష్యా ముంతలోని నీళ్లు పారబోసుకుంటే జరిగేదేమిటో మనకు తెలుసు. అందుకే అమెరికా బెదిరించినా ఎస్‌-400 అనే రష్యా క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేశాము. ఇన్ని కారణాలతో ఉక్రెయిన్‌ కోసం రష్యాను కాదని అమెరికా చంకనెక్కి దాని పాటపాడేందుకు మనం సిద్దం కాలేదు.


ఈ విషయాలు చెప్పుకొనేందుకు మన పాలక ప్రభువులు, మీడియాకు భయం, ఎందుకంటే అమెరికా ఆగ్రహం మరింత పెరుగుతుందేమోననే దడ. దాన్ని కప్పి పుచ్చి చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే రష్యా అవసరం కనుక తటస్ధంగా ఉండి దాన్ని దగ్గర చేసుకొనేందుకు పూనుకున్నామని చెప్పేవారు తయారయ్యారు. అమెరికన్లు ఇప్పుడు పుతిన్‌ బూచిని చూపి మనలను వారి చంకనెక్కమంటున్నారు. దక్షిణాసియా వ్యవహారాల అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి డోనాల్డ్‌ లు తమ ఎంపీలతో మాట్లాడుతూ అమెరికా-భారత్‌ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ప్రతి రోజూ పని చేస్తున్నామని, పుతిన్‌కు అడ్డుకట్టవేయకపోతే చైనా మరింత రెచ్చిపోతుందని, ఉక్రెయిన్‌లో జరుగుతున్నదానితో చైనా ప్రవర్తన ప్రభావితం అవుతుందని, అది భారత్‌కు అర్ధంకావాలి. ” అన్నాడు.ఇప్పటి వరకు ఐరాసలో మన దేశం నాలుగు సార్లు తటస్ధంగా ఉంది.


ఒక స్పష్టమైన వైఖరి (అంటే తమబాటలో నడిచే) తీసుకోవాలని అమెరికా కోరుతోంది. కొద్ది నెలలుగా మన మీద బుజ్జగింపులు, వత్తిడికి దిగిన అమెరికన్లు ఇప్పుడు బెదిరింపులకూ పాల్పడ్డారు. ” ఇప్పుడు రష్యాకు మరింతదూరంగా భారత్‌ జరగాల్సిన తరుణం ఆసన్నమైంది.లేనట్లయితే తమ ” కాట్సా ” చట్టం (తమ ప్రయోజనాలకు భంగం కలిగితే ఏ దేశం మీదనైనా ఆంక్షలు విధించవచ్చని అమెరికా రూపొందించుకున్న స్వంత చట్టం ) కింద గతంలో ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరించుకొనే అంశాన్ని బైడెన్‌ పరిశీలిస్తారని ” డోనాల్డ్‌ లు బెదిరించాడు.ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి 543 కోట్ల డాలర్ల ఎస్‌-400 క్షిపణి వ్యవస్ధల కొనుగోలుకు 2018లో ఒప్పందం చేసుకున్నాము. అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మన మీద ” కాట్సా” తో వేటు వేస్తానని బెదిరించినా వెనక్కు తగ్గాడు. తరువాత అదే ట్రంప్‌ను అమెరికా వెళ్లి మన నరేంద్రమోడీ కౌగిలింతలతో ముంచెత్తి ట్రంప్‌ మరోసారి అధికారంలోకి రావాలని ఒక సభలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆ మినహాయింపు గురించి జోబైడెన్‌ బెదిరిస్తున్నాడు.


అంతేకాదు భారత అధికారులను మందలించాలని, ఐరాసలో పదే పదే చర్చలు జరపాలని కోరటం, తటస్ధ వైఖరి అవలంభించటం అంటే రష్యా శిబిరంలో ఉన్నట్లే అన్న ముద్రవేయాలని అమెరికా తన దౌత్యసిబ్బందికి పదునైన పదజాలంతో వర్తమానం పంపింది. దాన్ని కావాలనే లీకు చేసింది. రష్యాకంటే భారత్‌ మనకు దగ్గరగా ఉన్నందున ఇలాంటి పని చేస్తే తీరా అది వ్యతిరేక ఫలితాలనిస్తుందేమో అన్న భయం కొందరిలో పట్టుకుందని వార్తలు వచ్చాయి. ఈ సమస్యకారణంగా చైనాపై భారత్‌-అమెరికా వ్యూహాత్మక ఐక్యతకు భంగం కలిగించకూడదని, అమెరికా ప్రయోజనాల రీత్యా భారత్‌తో సంబంధాలు కొనసాగించటం ముఖ్యమని చెబుతున్నవారు కూడా ఉన్నారు. మన దేశం ఇప్పుడు ఉక్రెయిన్‌ అంశంలో తటస్ధంగా ఉన్నట్లే భారత్‌-చైనా వివాదంలో బహిరంగంగా, నిర్ణయాత్మకంగా చైనా వైపు రష్యా ఉండకుండా చూసుకోవాలన్నది కొందరి సలహా.


ఇస్లామాబాద్‌లోని 22 మంది విదేశీ రాయబారులు ఒక బహిరంగ సంయుక్త లేఖను విడుదల చేశారు. రష్యా చర్యను ఐరాసలో ఖండించాలని వారు పాకిస్తాన్ను కోరారు. దీని మీద ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మండిపడ్డాడు. మీరు చెప్పినట్లు చేసేందుకు మేమేమైనా బానిసలం అనుకుంటున్నారా, మా గురించి ఏమనుకుంటున్నారు ? ఇలాంటి లేఖను మీరు భారత్‌కు రాశారా అంటూ ఐరోపా దేశాల రాయబారులపై ధ్వజమెత్తాడు. తమకు అమెరికా, రష్యా, చైనా, ఐరోపా అందరూ కావాల్సినవారే, స్నేహితులే, ఏ శిబిరంలోనూ మేము ఉండం అన్నాడు. మన దేశానికి లేఖ రాసిందీ లేనిదీ బహిరంగం కాలేదు గాని ఢిల్లీలోని విదేశీ దౌత్యవేత్తలు కొందరు ఉక్రెయినుకు మద్దతుగా ఒక సమావేశం నిర్వహించారు. దాని మీద మన దేశం ఎలాంటి అభ్యంతరమూ వెల్లడించలేదు.


ఉక్రెయినుపై భారత్‌ అనుసరిస్తున్న గడసాము వైఖరి సంతృప్తికరంగా లేదని, ఆ దేశం నిశిత పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఇది అమెరికా అంతరంగంగా చెప్పవచ్చు.ఇదీ బెదిరింపే. ఒక వేళ అమెరికా వత్తిడి ఫలించినా, భారత్‌ రాజీపడటం కష్టమని, కొన్ని స్వల్పమార్పులు మాత్రమే ఉండవచ్చని, బహిరంగంగా రష్యాను విమర్శించలేకపోవచ్చని చైనా నిపుణులు చెప్పారు. అమెరికా తన అవసరాలకు అనుగుణంగా చదరంగంలోని పావుల్లా దేశాలను వాడుకోవాలని చూస్తోందన్నది అనేక దేశాలు గుర్తిస్తున్నాయి. మెక్సికో, టర్కీ తాము రష్యాపై ఎలాంటి ఆర్ధిక ఆంక్షలను అమలు జరపబోమని ప్రకటించగా బ్రెజిల్‌, పనామా, అర్జెంటీనా, బలీవియా వంటివి ఖండించేందుకు తిరస్కరించాయి.


రష్యా ఇప్పుడు సోషలిస్టు దేశమూ కాదు, పుతిన్‌ కమ్యూనిస్టూ కాడు. సోవియట్‌ విడిపోయిన తరువాత రష్యా అనేక సమస్యలను ఎదుర్కొన్నది, ఆర్ధికంగా బలహీనపడింది. ఇదే అమెరికా, ఇతర ధనిక దేశాలు తమ జి7 బృందాన్ని విస్తరించి రష్యాను కలుపుకొని జి8గా వ్యవహరించిన రోజులు ఉన్నాయి. అది ఆర్ధికంగా బలపడటం ప్రారంభం కావటం, నాటో విస్తరణ పేరుతో దాని ముంగిటకు తన సైన్యాలు, ఆయుధాలను తరలించాలని ఎప్పుడైతే చూసిందో అప్పటి నుంచి రెండు దేశాలు దూరం కావటం, జి8 నుంచి రష్యాను తొలగించటం తెలిసిందే. ఇదే సమయంలో ఆర్ధికంగా ఎదుగుతున్న చైనాను చూసి కూడా అమెరికాకు దడపట్టుకుంది. ఈ రెండు దేశాలను దెబ్బతీయాలని ఒకేసారి పావులు కదుపుతోంది. వీటికి వ్యతిరేకంగా మన దేశాన్ని, జపాన్‌, ఆస్ట్రేలియాలను ముగ్గులోకి దించేందుకు పూనుకుంది. అందువలన రష్యా పెట్టుబడిదారీ దేశమైనా, చైనా సోషలిస్టు వ్యవస్ధ కలదైనా ఉమ్మడి శత్రువుగా అమెరికా కూటమి ముందుకు వస్తున్నందున ఇప్పుడున్న బలాబలాల్లో రెండూ కలిసి ఎదుర్కోవాల్సిన అగత్యాన్ని గుర్తించి ముందుకు పోతున్నాయి. ఇది శాశ్వతమా అంటే చెప్పలేము. రెండవ ప్రపంచ యుద్దంలో సోవియట్‌ నేత స్టాలిన్‌ నాజీ హిట్లర్‌తో ఒప్పందం చేసుకున్నాడు, అదిశాశ్వతంగా ఉండదని ఇద్దరికీ తెలుసు. రష్యా గత మూడుదశాబ్దాలుగా తన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఇంతవరకు ఏ దేశాన్నీ ఆక్రమించేందుకు పూనుకున్న ఉదంతాలు లేవు. సిరియా వంటి చోట్ల అమెరికా కూటమికి వ్యతిరేకంగా ఉంది. రష్యా-చైనాల మధ్య 4,209 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వివాదాల్లేకపోతే అంత పొడవున సాధారణ మిలిటరీ కార్యకలాపాతో సరిపెట్టుకోవచ్చు. అదే ఉద్రిక్తతలు ఉంటే పెద్ద మొత్తంలో వనరులు ఖర్చు. ఆ మొత్తాన్ని ఇప్పుడు చైనా అభివృద్ది కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు.భవిష్యత్‌లో సమస్యవస్తే అప్పుడు ఎలాగూ తప్పదు.


ఈ వివాదంలో మన దేశం తీసుకుంటున్న వైఖరి గురించి ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు వివరించలేదు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరాసలో తటస్ధతను ప్రకటించటాన్ని ప్రతిపక్ష పార్టీలేవీ విమర్శించలేదు. ఆపరేషన్‌ గంగ మీద వచ్చిన విమర్శలకు విదేశాంగ విధానానికి సంబంధం లేదు.స్వతంత్ర వైఖరిని తీసుకోవాల్సిన తరుణం వచ్చింది. చైనా, పాకిస్తాన్‌లను బూచిగా చూపి అమెరికా వత్తిళ్లకు లొంగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.