Tags

, , ,ఎం కోటేశ్వరరావు


2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 11వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంకెల గారడీ షరా మామూలే. భారీగా కొండంత రాగం తీసి చడీ చప్పుడు లేకుండా కోత పెట్టటం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది. ప్రభుత్వ ఆర్ధిక స్ధితి గురించి ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నా తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు పోవాలని గట్టిగా శపధం పూనినట్లుగా ఉంది. కొత్త అప్పులు పుట్టే అవకాశాలు మూసుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అలా తీసుకోవాలంటే షరతులకు అంగీకరించాలి. దానిలో భాగమే చెత్త పన్ను. మున్సిపల్‌ ఎన్నికల తరువాత అలాంటి భారాలు వేస్తారని వామపక్షాలు హెచ్చరించినా జనం కూడా తగ్గేదేలే అన్నట్లుగా వైసిపికి ఓట్లు వేశారు. బండి గుర్రానికి గడ్డి ఆశచూపి పరుగెత్తించినట్లు కేంద్రం తాను ప్రకటించిన లేదా ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేస్తే అప్పులకు సడలింపులు ఇస్తామని ప్రకటించింది. ఆమేరకు దాదాపు ఇరవై లక్షల రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించింది తెలిసిందే.
ఇక బడ్జెట్‌ పత్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడు దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 257509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55508.46 కోట్లు. 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2022 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.390670.19 కోట్లు, జిఎస్‌డిపిలో 32.51శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం 2021 డిసెంబరు 31నాటికి రు.117503.12 కోట్లకు పెరిగింది. 2022-23లో అప్పుల మొత్తాన్ని రు.439394.35 కోట్లు, 32.79 శాతం జిఎస్‌డిపిలో ఉంటుందని పేర్కొన్నారు. దీనికి హామీల రుణం అదనం. చంద్రబాబు ఏలుబడిలో అన్ని రకాల రుణాలు మూడు లక్షల కోట్లకు పైబడితే జగనన్న దాన్ని వచ్చే ఏడాది చివరికి ఐదున్నర లక్షల కోట్లకు పైగా పెంచనున్నారు. ఇది అంచనాలకు మించిన వృద్ధి.


ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల ఉంటుంది. దీన్నే ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు.దీని తీరుతెన్నులను చూద్దాం. అప్పులకు సంబంధించి నిర్ణీత లక్ష్యాన్ని చేరేందుకు చూపే శ్రద్ద ఇతర వాటి మీద ఉండటం లేదు.పెట్టుబడివ్యయ పద్దు కింద గత ఏడాదిలో ప్రతిపాదించిన రు. 31,198 కోట్లను 18,529 కోట్లకు సవరించినట్లు చూపారు. అంతకు ముందు ఏడాది కూడా రు.29,300 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది రు.18,974 కోట్లే. వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఇలాంటి కోతల కారణంగానే బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రకటించినపుడు గొప్పగా చెప్పి కోతలు వేస్తున్నారు.


బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం 2021- 22లో మొత్తం రు.2,29,779 కోట్లు ఖర్చు ఉంటుంది. దీన్ని ఇప్పుడు రు. 2,08,106.57 కోట్లుగా సవరించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ను రు.2,56,256.56 కోట్లుగా చూపారు. ద్రవ్యలోటు రు.48,724.11 కోట్లుగా చూపారు. ఈ మొత్తాన్ని ఎలా పూడుస్తారో తెలియదు. కేటాయింపులకు కోతలు పెట్టాలి, లేదా జనం మీద భారాలు మోపాలి. ఉదాహరణకు 2020-21లో కూడా ఖర్చు రు.2,24,789 కోట్లుగా చూపి చివరకు రు.1,85,468కి సవరించారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సర అన్ని రకాల రాబడి రు.1,54,272.70 కోట్లుగా సవరించారు, వచ్చే ఏడాది ఈ మొత్తం రు.1,91,225.11కోట్లని చెప్పారు. దీనికి రు.64,816 కోట్ల మేరకు అప్పులు తెచ్చి బడ్జెట్‌ను అమలు చేస్తామన్నారు.ఈ అప్పులో రు.21,805 కోట్లు పాత వాటిని తీర్చేందుకే పోతుంది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగు నీటి వనరుల వృద్ధి వలన రైతాంగ ఆదాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. జగన్‌ అధికారానికి రాక ముందు మూడు సంవత్సరాల్లో పెట్టుబడి ఖర్చు రు.31,624 కోట్లు ఖర్చు చేస్తే ఈ మూడేండ్లలో ఆ మొత్తం రు.15,193 (2021-22 సవరించిన అంచనాతో) మాత్రమే ఖర్చు చేశారు. గతేడాది నీటి పారుదల రంగానికి రు.11,586 కోట్లు ప్రతిపాదించి దాన్ని రు.6,832 కోట్లకు కోత పెట్టారు. వచ్చే ఏడాది అసలు ప్రతిపాదనే రు.9,810 కోట్లుగా పేర్కొన్నారు. పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా లేదా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని భారీగా పెంచాల్సింది పోయి ఇలా చేయటం ఏమిటి ?


నవరత్నాలు లేకపోతే జగన్‌ రత్నాలు పేరు ఏది పెట్టినా పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను తప్పు పట్టటం లేదు. అదే పేదలు కార్పొరేట్‌ ఆసుపత్రుల పాలైనపుడు ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పధకాల సొమ్ము మొత్తం, ఇంకా అప్పులు చేసినదీ వాటి యజమానులకు సమర్పించుకుంటున్నారు. ఆ స్ధితిలో వైద్య, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ ఖర్చును గణనీయం పెంచాలి. కానీ ఈ బడ్జెట్‌లో గతేడాది చేసిన ఖర్చు కంటే తగ్గించారు. సవరించిన అంచనా ప్రకారం రు.12,972 కోట్లనుంచి రు.11,974 కోట్లకు కుదించారు. షెడ్యూలు కులాలు, తరగతులు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గతేడాది ప్రతిపాదించిన రు.27,401 కోట్లను రు.25,349కు కుదించారు. ఈ ఏడాది మాత్రం దాన్ని ఏకంగా రు.45,411 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని చూస్తే అంకెల గారడీ లేదా మధ్యంతర ఎన్నికల ప్రచార అస్త్రమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


రోడ్ల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో తెలిసిందే. గతేడాది రోడ్లు, వంతెనలకు పెట్టుబడి ఖర్చు రు.2,792 కోట్లుగా చూపి దాన్ని రు.927 కోట్లకు కుదించారు. ఇప్పుడు రు.2,713 కోట్లు ఖర్చు చేస్తామని నమ్మబలుకుతున్నారు.మొత్తం ఆర్ధిక సేవల పెట్టుబడి ఖర్చు రు.18,319 కోట్లుగా ప్రకటించి ఆచరణలో రు.9,859 కు కోత పెట్టి ఈ ఏడాది రు.17,412 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. ఏ శాఖను చూసినా ఇదే తీరు. నోరున్నదని చెప్పుకొనే ఉద్యోగులకు తాను ప్రకటించిన 27తాత్కాలిక భృతిలో కూడా కోత పెట్టి పిఆర్‌సిని బలవంతంగా రుద్దిన సర్కార్‌ ఇక నోరు లేని లేదా ఉన్నా నోరెత్తలేని జనాలకు సంబంధించిన, అభివృద్ధి పనులకు కోత పెట్టటంలో ఆశ్చర్యం ఏముంది ?


కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. ఇవన్నీ పరిస్ధితులు సాధారణంగా ఉంటే, కానీ కరోనా కారణంగా ఇచ్చిన మినహాయింపులు, ఇతర అంశాల కారణంగా అది అమలు జరుగుతుందని చెప్పలేము. ఐదు సంవత్సరాల కాలంలో పరిమితులను తొలి నాలుగు సంవత్సరాలలో వినియోగించుకోనట్లైతే ఐదవ ఏడాది అదనపు రుణాలు తీసుకోవచ్చు. ఈ లోగా విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రతిపాదించిన షరతులను అమలు జరిపితే తొలి నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా జిఎస్‌డిపిలో 0.5 శాతం చొప్పున అదనంగా అప్పులు తీసుకోవచ్చు.2021-25 మధ్య విద్యుత్‌ నిర్వహణ నష్టాలు తగ్గించాలి.ఆదాయ తేడాను కుదించాలి. వినియోగదారులకు నేరుగా సబ్సిడీని అందించటం ద్వారా సబ్సిడీ మొత్తాలను తగ్గించాలి. ఆదాయాన్ని సబ్సిడీ రేట్లను తగ్గించాలి. ఇవన్నీ ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు దారి సుగమం చేయటమే.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు.2018-19నాటికి అది రు.9,33,402 కోట్లకు పెరిగింది కనుక రుణం 28వేల కోట్లు తీసుకోవచ్చు. అలాగే 2020-21లో రు.10,19,146 కోట్లుగా సవరించినందున రుణం 34వేల కోట్ల వరకు తీసుకోవచ్చు. 2021-22లో ముందస్తు అంచనా ప్రకారం అది రు. 12,01,736 కోట్లుగా ఉన్నట్లు ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు. అందువలన ఆ మేరకు రుణపరిమితి పెరుగుతుంది. ఆత్మనిర్భర పధకం కింద రెండు శాతం అదనంగా తీసుకొనేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆర్ధిక సంఘం ఆంక్షలకు మించి ద్రవ్యలోటు ఉంది. 2020-21లో ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 4.78శాతంగా ప్రతిపాదిస్తే అది 5.38శాతానికి చేరింది. కేంద్రం కరోనా కారణంగా సడలించిన రుణ పరిమితి ఐదుశాతానికి మించి ఇది ఉంది. ఐదుశాతానికి కూడా కేంద్రం షరతులు విధించింది. నాలుగుశాతం వరకు ఎలాంటి షరతులు లేవు, ఒకశాతానికి నాలుగు ఉన్నాయి. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు ఒకటి, సులభతర వాణిజ్యం, స్ధానిక సంస్దలలో పన్నుల పెంపు, విద్యుత్‌ పంపిణీ సంస్కరణ. మొదటి మూడింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో అదనంగా 9,090 కోట్లు అదనంగా అప్పు చేసేందుకు అవకాశం వచ్చింది. విద్యుత్‌ సంస్కరణలో భాగంగా మీటర్లు పెట్టేందుకు నిర్ణయించిన అంశం తెలిసిందే. అది జరిగిన తరువాత వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లించాలి. మిగిలిన షరతుల ప్రకారం సబ్సిడీలో కోత వంటి వాటికి పూనుకుంటే వంటగాస్‌ మాదిరి క్రమంగా తగ్గించి వేసి నామమాత్రంగా సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. పెట్రోలు, డీజిలు ధరల మాదిరి ఖర్చు పెరిగినపుడల్లా చార్జీలను పెంచవచ్చు.


అసలేమీ ఇవ్వని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. జనాలకు కావలసినన్ని చేపలను తొలుత సరఫరా చేసినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది, వారి బతుకు వారు బతుకుతారు. సంక్షేమ పధకాలూ అంతే ! రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంప ముంచినా ఆశ్చర్యంలేదు.జనం వైఫల్యాలను గుర్తించక, అసంతృప్తి పెరగముందే ఏదో ఒక సాకుతో ముందస్తు ఎన్నికలకు పోయినా పోవచ్చు !