Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


రష్యా -ఉక్రెయిన్‌ పోరుకు స్వస్తి పలికేలా ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరినట్లు బుధవారం నాడు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. దీని మేరకు నాటోలో చేరాలనే ఆకాంక్షలకు స్వస్తి పలికినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించాలి.దాని సాయుధ దళాలను పరిమితం చేసుకోవాలి. దీనికి అంగీకరిస్తే రష్యా సైనిక చర్యనిలిపివేస్తుంది. దీనికి ముందు ఉక్రెయిన్‌ తటస్ధ దేశంగా ఉండాలని ప్రతిపాదించినట్లు వచ్చిన వార్తలకు అనుగుణంగానే ఈ పరిణామం ఉంది.అయితే సంభావ్యమైన ( సంభవించగల) ఒప్పందాల వివరాలను వెల్లడించటం తొందరపాటవుతుందని రష్యా ప్రతినిధి దిమిత్రి సెకోవ్‌ చెప్పాడు. మరోవైపున దాడులను నిలిపివేయాలని బుధవారం నాడు అంతర్జాతీయ న్యాయ స్ధానం రష్యాను కోరింది. ఇదిలా ఉండగా రష్యాకు లొంగిపోతున్నట్లు జెలెనెస్కీ ఒక ప్రకటన చేసినట్లు ఉక్రెయిన్‌ 24 అనే టీవీ ఛానల్‌ ప్రసారం చేసింది. వెంటనే జెలెనెస్కీ ఒక ప్రకటన చేస్తూ తానలాంటి ప్రకటన చేయ లేదని ఖండించాడు. తమ నెట్‌వర్క్‌ను హాక్‌ చేసి తప్పుడు వార్తను చొప్పించారని తరువాత ఆ ఛానల్‌ వివరణ ఇచ్చింది. రష్యా దాడులను తీవ్రతరం చేసిన నేపధ్యంలో అనేక కుహనా వార్తలు వస్తున్నాయి.


చర్చలు చర్చలే – దాడులు దాడులే – రెండునోళ్లతో మాట్లాడుతున్న జెలెనెస్కీ. రష్యా ప్రతిపాదనలు వాస్తవికంగా ఉన్నాయంటాడు ఒకనోటితో. మరోవైపు తమ తరఫున యుద్దం చేయాలని పశ్చిమ దేశాలకు వినతుల మీద వినతులు. ఎవరి ఎత్తుగడలు వారివే, 30లక్షల మంది నిర్వాసితులుగా మారినా, ఇంకా ఎందరు ఉక్రెయిన్‌ వదలిపోయినా దుష్ట రాజకీయాల నుంచి వెనక్కు తగ్గేదేలే అంటున్నారు పశ్చిమ దేశాల మానవతామూర్తులు.అగ్గిని మరింతగా ఎగదోసేందుకు పూనుకున్నారు. ప్రపంచ ఆర్ధిక రంగం అతలాకుతలం అవుతుందని ఐఎంఎఫ్‌ ఆందోళన. ఇదీ మార్చి 16 నాటికి ఉన్న పరిస్ధితి. వివాదం ఎప్పుడు సమసిపోతుందో తెలియదు. రక్తపోటు అదుపులోకి రాకపోతే పరిస్ధితి ఎలా ఉంటుందో ప్రపంచ చమురు మార్కెట్‌లో ధరలు ఎందుకు ఒక రోజు విపరీతంగా పైకి ఎగబాకుతున్నాయో,ఎందుకు మరోరోజు పడిపోతున్నాయో తెలీటం లేదు.మన వంటి చమురు దిగుమతి దేశాలకు నిదురపట్టటం లేదు.నవంబరు నాలుగు నుంచి స్ధంభింపచేసిన చమురు ధరల కళ్లెం విప్పితే ఏమౌతుందో లేకపోతే ఎంత బండపడుతుందో అన్న ఆందోళన కేంద్ర ప్రభుత్వానికి పట్టుకుంది. ఉక్రెయిన్‌ తటస్ధ దేశంగా ఉండేట్లు ఒప్పందం కుదరవచ్చని వార్తలు, పశ్చిమదేశాలు దాన్ని పడనిస్తాయా అన్న సందేహాలు సరేసరి !


ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల తీరు రాజీకుదిరేందుకు కొంత ఆశాభావాన్ని కలిగించాయని రష్యా విదేశాంగ మంత్రి లావరోవ్‌ చెప్పాడు.ఆస్ట్రియా, స్వీడన్‌ మాదిరి తటస్ధ దేశంగా ఉక్రెయిన్‌ ఉండవచ్చని, మిలిటరీని కూడా కలిగి ఉండవచ్చని రష్యా ప్రతిపాదించింది. అదే జరిగితే ఆ ప్రాంత దేశాలకు లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. రష్యా ప్రతిపాదించినట్లుగాక తమకు అంతర్జాతీశక్తుల హామీ కావాలని ఉక్రెయిన్‌ చెప్పింది. తాము నేరుగా రష్యాతో పోరులో ఉన్నాం గనుక తమ పద్దతిలోనే పరిష్కారం ఉండాలని అంటోంది. బాధ్యత కలిగిన దేశాలతో కూడిన కొత్త కూటమి శాంతికోసం పని చేయాలని జెలెనెస్కీ బుధవారం నాడు అమెరికా పార్లమెంట్‌ను ఉద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో కోరాడు. ఐరోపా దేశాలు చాలా కాలంగా రష్యా ముప్పు గురించి పట్టించుకోలేదన్నాడు. మరిన్ని ఆంక్షలను విధించాలని కోరాడు. మేమూ మీలాంటి వారిమే, మా ప్రాణాలను రక్షించాలని కోరటం చాలా ఇబ్బందిగా ఉందన్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో పెరల్‌ హార్బర్‌ మీద దాడి, 2011లో న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడిని ఉటంకిస్తూ తాము మూడువారాలుగా అలాంటి దాడులను అనుభవిస్తున్నాం అన్నాడు. అంతకు ముందు రోజు కెనడా పార్లమెంటునుద్దేశించి కూడా జెలెనెస్కీ మాట్లాడాడు.


పోలాండ్‌, చెక్‌, స్లోవేనియా దేశాల ప్రధానులు కీవ్‌ను సందర్శించి జెలెనెస్కీతో చర్చలు జరిపి మద్దతు ప్రకటించి వెళ్లారు. ఇలాగే ఇతర దేశాల నేతలు కూడా వచ్చి రష్యా మీద వత్తిడి తేవాలని జెలెనెస్కీ కోరాడు. ప్రస్తుత దశలో తమ అధ్యక్షుడు మక్రాన్‌ కీవ్‌ పర్యటన జరిపే ఆలోచనేదీ లేదని ఫ్రెంచి ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించాడు.ప్రచారదాడిలో భాగంగా తూర్పు ఐరోపాలో మిలిటరీ సన్నద్దంగా ఉండాలని నాటో కమాండర్లను కోరినట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌ తరువాత ఇతర దేశాల మీద కూడా రష్యా దాడులు జరపనుందని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగిన సన్నద్దత గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఇబ్బంది కనుక ఇలాంటి ప్రచార విన్యాసాలు జరుపుతున్నట్లు చెప్పవచ్చు.


రష్యా గనుక అడ్డం తిరిగి విదేశాల నుంచి తీసుకున్న అప్పులను మేము ఇచ్చేది లేదని ప్రకటిస్తే ఏమిటన్న బెంగ ఇప్పుడు రుణాలు ఇచ్చిన వారికి పట్టుకుంది. బుధవారం నాటికి వడ్డీ కింద 11.7కోట్ల డాలర్లను చెల్లించాల్సి ఉంది. తమపై విధించిన ఆంక్షల కారణంగా డాలర్లలో కాకుండా తమ కరెన్సీ రూబుళ్లలో చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని పుతిన్‌ ప్రకటించాడు. ప్రభుత్వమే అప్పులను చెల్లించేది లేదని ప్రకటిస్తే అక్కడి కంపెనీలు కూడా అదే బాటపడతాయనే భయం పట్టుకుంది. ప్రస్తుతం పుతిన్‌ సర్కార్‌ జారీ చేసిన బాండ్లను మార్కెట్లో అమ్ముకోవచ్చు గానీ మన కరెన్సీలో చెప్పాలంటే రూపాయికి ఇరవై పైసలు కూడా అప్పులిచ్చిన వారికి వచ్చే అవకాశాలు లేవు. అందువలన ఆంక్షలు ఎత్తివేసి తమను ఆదుకోవాలని రుణాలిచ్చిన వారు పశ్చిమదేశాల మీద వత్తిడి తేవచ్చు. గతేడాది వెల్లడించిన సమాచారం ప్రకారం రష్యా అంతర్గత రుణాలు జిడిపిలో కేవలం 13శాతమే ఉన్నాయి. విదేశీరుణం 150 బిలియన్‌ డాలర్లు కాగా దానిలో ప్రభుత్వం తీసుకున్నది కేవలం 45 బి.డాలర్లే, మిగతాదంతా కంపెనీలు తీసుకున్నది. రష్యా వద్ద 630బి.డాలర్ల నిల్వలున్నాయి.కనుక చెల్లింపులకు ఇబ్బంది లేదు. ఆంక్షలే అడ్డుపడుతున్నాయి.


రష్యాకు వర్తింప చేస్తున్న అత్యంత సానుకూల హౌదా రాయితీని ఎత్తివేస్తున్నట్లు జపాన్‌ ప్రకటించింది.మరోవైపు మరిన్ని ఆంక్షలను అమలు జరిపేందుకు జి7 దేశాలు సమావేశం కానున్నాయని వార్తలు వచ్చాయి. తాము నాటోలో చేరటం లేదనే అంశాన్ని గుర్తించండి మహా ప్రభో అని జెలెనెస్కీ నాటోదేశాలకు స్పష్టంచేశాడు. బ్రిటన్‌ ప్రతినిధి వర్గంతో మాట్లాడుతూ ” ఉక్రెయిన్‌ నాటో సభ్యురాలు కాదు. దానికోసం ద్వారాలు తెరిచి ఉన్నట్లు చాలా సంవత్సరాలుగా మేం వింటున్నాం, ఇదే సమయంలో మేం చేరకూడదని కూడా విన్నాం. ఇది ఒక వాస్తవం దీన్ని గుర్తించాల్సి ఉంది. మా జనం దీన్ని అర్ధం చేసుకోవటం ప్రారంభించారు, స్వశక్తితో నిలబడాలనుకుంటున్నారు, అలాగే మాకు సాయం చేస్తున్నవారు కూడా గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అన్నాడు.నాటోలో ఉక్రెయిన్‌ చేరకూడదని, తమ భద్రతకు తలపెడుతున్న ముప్పును కూడా గమనించాలని రష్యా ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న అంశాన్ని పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిణామాలన్నది తెలిసిందే.


ఉక్రెయిన్‌పై రష్యాదాడి కారణంగా దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధలో మౌలిక మార్పులు వస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) పేర్కొన్నది. పౌరుల ఇబ్బందులు, నిర్వాసితులు కావటంతో పాటు ఆహార, ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతుందని, జనాల కొనుగోలుశక్తి పడిపోతుందని, ప్రపంచ వాణిజ్య, సరఫరా వ్యవస్ధలు దెబ్బతింటాయని కూడా చెప్పింది. మదుపుదార్లలో అనిశ్చిత పరిస్ధితి ఏర్పడటంతో పాటు ఆస్తుల విలువలు పడిపోతాయని, వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని కూడా చెప్పింది. ఉక్రెయిన్‌ గగనతలంపై ఆంక్షలు విధించకుండానే నాటో కూటమి వేరే విధంగా ఆయుధాలతో ఎంతో తోడ్పడవచ్చని నాటోలో అమెరికా మాజీ రాయబారి కర్ట్‌వాల్కర్‌ చెప్పాడు. నల్లసముద్రం మీద నుంచి రష్యా వదులుతున్న క్షిపణులను, టాంకులను కూల్చివేసేందుకు అవసరమైన సాయం అందించవచ్చన్నాడు.


యుద్దం ముగిసే సూచనలు కనిపించకపోవటంతో ఐరోపా దేశాల్లో అనేక చోట్ల జనం ఆహార పదార్దాలను పెద్ద ఎత్తున కొనుగోలు నిల్వచేసుకుంటున్నారు. స్లీపింగ్‌ బాగ్స్‌, పాలపొడి, డబ్బాల్లో నిల్వ ఉండే ఆహారం, బాటరీలు, టార్చిలైట్లు, ప్లాస్టిక్‌ డబ్బాల వంటివి ఒక్కసారిగా ఆరురెట్లమేరకు అమ్మకాలు పెరిగాయి. రేడియోల అమ్మకాలు కూడా ఇరవైశాతం పెరిగాయి. వీటిలో నిర్వాసితులుగా వచ్చిన వారు కొనుగోలు చేసినవి కూడా ఉన్నాయి. రష్యా మీద విధించిన ఆంక్షల కారణంగా తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు 26 బిలియన్‌ యురోలు అవసరమౌతాయని ఫ్రెంచి ఆర్ధిక మంత్రి ప్రకటించాడు. రష్యా, బెలారస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న పొటాష్‌ ఎరువులకు మన దేశంలో కొరత ఏర్పడే అవకాశం ఉందని వార్తలు. రష్యా నుంచి గోధుమల ఎగుమతులకు ఆటంకం ఏర్పడటంతో మన దేశ గోధుమల ఎగుమతికి అవకాశాలున్నట్లు రాయిటర్‌ పేర్కొన్నది.

.