Tags

, ,


ఎం కోటేశ్వరరావు
సంతోషం అంటే ఏమిటి అంటే ప్రపంచంలో ఒక నిర్ణీత నిర్వచనం లేదా నిర్దిష్ట అర్ధం లేని పదాల్లో ఒకటి. చిత్రం ఏమిటంటే ప్రతివారూ సంతోషాన్ని కోరుకుంటారు. అదానీ రోజుకు రు.1002 కోట్లు సంపాదిస్తున్నదాన్ని రెట్టింపు చేసుకోవటం సంతోషాన్ని కలిగిస్తుంది. నిత్యం ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడే అభాగ్యులకు ఆరోజు పని దొరికి వచ్చిన సొమ్ముతో పెళ్లాంబిడ్డల కడుపునింపితే ఎనలేని సంతోషం. ఇహలోకంలో నీతులు, రీతులు చెబుతూ స్వర్గంలో అవేవీ లేకుండా మనతాత, ముత్తాతలు, తండ్రులకు సేవలందించిన రంభ ఊర్వశి, మేనకలతో సౌఖ్యం పొందాలని ఉవ్విళ్లూరే వారికి కలిగే సంతోషం గురించి చెప్పేదేముంది. ఒకరికి మోదం అనుకున్నది మరొకరికి ఖేదం కలిగిస్తుంది. ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్య, అంతకు ముందు కొన్ని సంవత్సరాలుగా కొన్ని దేశాల మీద జరుగుతున్న పెత్తందారీ దేశాల దాడులు ఆగిపోతే అక్కడి జనాలకే కాదు, ప్రపంచవ్యాపితంగా సంతోషమే. కానీ జనాలు సంతోషంగా ఉంటే తాము తయారు చేస్తున్న మారణాయుధాలకు మార్కెట్‌ ఉండదని వాటిని తయారు చేస్తూ నిత్యం ఎక్కడో ఒక చోట తంపులు పెట్టే అమెరికా,బ్రిటన్‌ వంటి బడాదేశాల కార్పొరేట్‌లకు సంతోషం కరవు. రక్తం తాగే ఇలాంటి వారిని వదలివేస్తే మిగతా జనాలకు సంతోషమే సగము బలము అన్నది తిరుగులేని సత్యం. దాన్ని కొలిచే సాధనాలేవీ లేవు. సంతోషంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరి వాంఛ.దాన్ని గనుక ప్రాధమిక రాజ్యాంగహక్కుగా చేసి ఉంటేనా !


ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆమోదించిన వాటిని ఏమేరకు అమలు చేస్తున్నారో కొలిచేందుకు రూపొందిస్తున్నదే ప్రపంచ సంతోష సూచిక. ప్రతి ఏటా ప్రచురించే దీని వివరాల మేరకు 2022 సూచికలో 146 దేశాలకు గాను మనం 136వ స్ధానంలో ఉన్నాము. గతేడాది కంటే 0.236 పాయింట్లు పెంచుకొని 139 నుంచి 136కు ఎగబాకాము. ఇది నిజంగా మోడీ భక్తులు పండగచేసుకొనే అంశమే. ఆగండి అప్పుడే రంగులు చల్లుకోవద్దు.2013లో 111వ స్ధానంలో ఉన్నది, 2015లో 117కు తరువాత 2020లో 144వ స్ధానానికి దిగజారింది. తిరిగి పూర్వపు స్ధానానికి ఎప్పుడు చేరుకుంటామో, జనాలకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చెప్పి మరీ పండగ చేసుకోవాలి. నూటపదకొండులో ఉన్నపుడే మన్మోహన్‌ సింగ్‌ పాలనను జనం భరించలేకపోయారు. తరువాత దిగజారినా మోడీకి మరొక అవకాశం ఇచ్చి చూద్దామని జనం భావించారు, భరిస్తున్నారు. గొర్రె కసాయిని నమ్ముతుందని ఎందుకు మన పెద్దలు అనుభవసారంగా చెప్పారో ఆలోచిద్దాం.


జనం ఆశించిన సంతోషానికి కారణమైన నరేంద్రమోడీ అచ్చేదిన్‌ నినాదం అసలు కథ తెలుసా ? నరేంద్రమోడీ, బిజెపి 2014 ఎన్నికలకు ముందు ఓం శ్రీరామతో పాటు అచ్చేదిన్‌ అనే నినాదాన్ని కూడా తారకమంత్రంగా జపిÄంచారు. తరువాత ఎక్కడా మాట్లాడటం లేదు. నినాదాలను కాపీ కొట్టటంలో నరేంద్రమోడీ పెద్ద మాస్టర్‌. కొందరికిది ఆగ్రహం కల్పించినా నిజం నిజమే కదా ! కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్వయంగా ఈ సంగతి చెప్పినట్లు 2016 సెప్టెంబరు 20 తేదీ టైమ్స్‌ఆఫ్‌ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. 2012 జనవరి ఎనిమిదిన జైపూర్‌లో జరిగిన ప్రవాస భారతీయ దినం సభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడారు. అంతకు ముందు తలెత్తిన ప్రపంచ మాంద్యం నుంచి భారత్‌ తప్పించుకున్నప్పటికీ తరువాత తలెత్తిన ఇబ్బందులను అధిగమిస్తామని ఎన్‌ఆర్‌ఐలకు భరోసా ఇచ్చారు. దేశంలో తలెత్తిన ద్రవ్యోల్బణం తమ ప్రభుత్వ ప్రతిష్టకు ఎలా మచ్చతెచ్చిందో చెబుతూ ఆరు సంవత్సరాల తరువాత ద్రవ్యోల్బణం తొలిసారిగా తిరోగమనంలో ఉందంటూ అబ్‌ అచ్చేదిన్‌ ఆనేవాలే హై ( ఇప్పుడు మంచి రోజులు రానున్నాయి) అన్నారు. వెంటనే నరేంద్రమోడీ ఆ మాటలను తనవిగా చేసుకొని మరుసటి రోజే దాడికి దిగారు. అదే సభలో జనవరి తొమ్మిదిన గుజరాత్‌ సిఎంగా మాట్లాడారు. ఆ సభలో ఉక్కు పరిశ్రమ దిగ్గజం ఎల్‌న్‌ మిట్టల్‌ కూడా ఉన్నారు. మిట్టల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు లండన్‌లో తినే టమాటాలు, బెండకాయలు కూడా గుజరాత్‌లో పండించినవే అని అతిశయోక్తులను చెప్పారు. తరువాత 2014 ఎన్నికల ప్రచారంలో అచ్చేదిన్‌ నినాదాన్ని ముందుకు తెచ్చారు. మన్మోహన్‌ సింగ్‌ రెండు సంవత్సరాలకు ముందు చెప్పిందాన్ని ప్రస్తావిస్తూ ” హా మైనే భీ కహతా హుం కి అబ్‌ జల్దీ హై అచ్చేదిన్‌ ఆనే వాలే హై ” ( అవును నేను కూడా చెబుతున్నా ఇప్పుడు త్వరగా మంచి రోజులు రానున్నాయి) అని చెప్పారు. ఇప్పుడు ఆ నినాదమే తమ గొంతుల్లో పచ్చివెలక్కాయ మాదిరి ఇరుక్కుపోయిందని గడ్కరీ అన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి రాశారు. మంచి రోజులు రావని తెలిసీ జనాలు చప్పట్లు కొడుతున్నారని ఇచ్చిన నినాదాన్ని అవసరం తీరింతరువాత పక్కన పెట్టేశారు. ఓట్ల కోసం కొత్త నినాదాలు, మనోభావాలను ముందుకు తెచ్చే కొత్త అవకాశాల కోసం చూస్తున్నారు.


ఇక సంతోష సూచికల గురించి చూద్దాం. వరుసగా గత ఐదు సంవత్సరాల పాటు ఫిన్లండ్‌ సంతోష సూచికలో మొదటి స్ధానంలో వచ్చింది. మన దేశం చివరి పది స్దానాల్లో నిలిచింది. మనం ప్రతిదానికీ ఇరుగుపొరుగు దేశాలతో పోల్చుకుంటూ మన గొప్పలను చెప్పుకుంటున్నాము. సంతోష సూచికల్లో 2012 నుంచి(2014మినహా) 2022 వరకు తొమ్మిది సంవత్సరాల సగటు 128.8 కాగా కనిష్టం 111, గరిష్టం 144 ఉంది. ఇదే చైనా సగటు 85.6 కాగా కనిష్ట-గరిష్టాలు 2015-2022 ఎనిమిది సంవత్సరాలలో 79-94గా ఉన్నాయి. ఇక బ్రిక్స్‌, మన ఇరుగుపొరుగుదేశాల సంతోష సూచికలు ఇలా ఉన్నాయి.


దేశం××××××× 2022 సూచిక
బ్రెజిల్‌××××××× 34
రష్యా ××××××× 74
ఇండియా ××××× 136
చైనా ××××××× 82
ద.ఆఫ్రికా ××××× 101
నేపాల్‌ ××××××× 85
బంగ్లాదేశ్‌ ××××× 99
పాకిస్తాన్‌×××××× 103
మయన్మార్‌××××× 123
శ్రీలంక ××××××× 126
ఆఫ్‌ఘనిస్తాన్‌××××× 146
వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా సంతోష సూచికల్లో ప్రతి ఏటా మార్పులు ఉంటాయి.తలసరి జిడిపి, ఆరోగ్య జీవితప్రమాణం, సామాజిక మద్దతు, జీవన విధాన ఎంపిక అవకాశం, ఉదారత, అవినీతి వంటి అంశాలను పరిగణనలోకీ తీసుకొని ఇచ్చే మార్కుల ఆధారంగా సూచిక నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాలలో కొత్త అంశాలను కూడా చేరుస్తారు. కొన్ని దేశాలను పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. అందువలన ప్రతి ఏడాదీ మార్కులు మారినా ఒక్కోసారి సూచికల్లో స్ధానం మారకపోవచ్చు. మన జనాల్లో ఉన్న ఒక అవాంఛనీయ వైఖరి ఏమంటే మన కంటే దిగువన ఉన్నవారిని ఎద్దేవా చేయటం, మనం మరికొందరి కంటే చాలా దిగువన ఉన్నామని మరచిపోవటం.


నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి ఎప్పటికప్పుడు కొత్త నినాదాలను ముందుకు తెచ్చి జనాన్ని ఆకర్షించటంలో, మభ్యపరచటంలో ఎంతో ముందుందనటం అతిశయోక్తి కాదు. చెప్పిన కథ చెప్పకుండా కొత్త కథలు చెబుతోంది. అచ్చేదిన్‌, గుజరాత్‌ నమూనా వృద్ది, నల్లధనం వెలికితీత, 2022 నాటికి నవభారతం, 2024నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి సాధన.2022 ఆగస్టు పదిహేను నాటికి లేదా ఏడాది ఆఖరుకు సాధిస్తామని చెప్పిన అంశాల గురించి చెప్పుకొని ఒక్కసారి సంతోషిద్దాం.
1.జిడిపి వృద్ది రేటు 9-10శాతంగా ఉంటుంది. పెట్టుబడుల రేటు 2022ా23 నాటికి 36శాతానికి పెంపుదల, పది నూతన కల్పనల జిల్లాల ఏర్పాటు.దాతలతో నైపుణ్యాల పెంపుదల, ఆరవ తరగతి నుంచి నైపుణ్య శిక్షణకు స్కూళ్లు. ప్రస్తుతం 5.4శాతంగా ఉన్న నైపుణ్య కార్మికులను కనీసం 15శాతానికి పెంచటం, మహిళాశ్రామిక శక్తి భాగస్వామ్యం 30శాతానికి పెంపు,ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇరవై నుంచి 30లక్షలు, పర్యాటక రంగంలో నాలుగు కోట్లు, ఉద్యోగాలు, గనుల రంగంలో 50లక్షల కొత్త ఉద్యోగాల కల్పన. 2. ప్రతి పౌరుడికి బాంకు ఖాతా, జీవిత, ప్రమాద బీమా, పెన్షన్‌, ఉద్యోగానంతర ప్రణాళికల సేవలు అందచేత,3.రైతుల ఆదాయాలు రెట్టింపు, పొలాలన్నింటికీ జలాల సరఫరా, పొలాల్లో వదలివేసిన గడ్డిని తగులబెట్టకుండా చూడటం, దేశంలో గాలికాలుష్యాన్ని సగానికి తగ్గించటం, ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం. 4. ప్రతి కుటుంబానికి గాస్‌ సిలిండర్‌, రైలు ప్రమాదాల్లో ఒక్కరు కూడా మరణించకుండా చూడటం, ముంబై-అహమ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు పరుగులు(ఇప్పుడు దీనికి ఒక తుది గడువు అంటూ లేదు గానీ 2023డిసెంబరుకు పూర్తి అని చెబుతున్నారు). కేరళలొ బిజెపి వేగంగా పరుగెత్తే కె రైల్‌ పధకాన్ని మాత్రం వద్దంటుంది. 5. ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, ఇళ్లలో మరుగుదొడ్లు, చేతులతో మలమూత్రాల ఎత్తివేత నివారణ, రోజంతా విద్యుత్‌ సరఫరా.6.2012-13లో ఉన్న 7.7శాతం పారిశ్రామిక ఉత్పాదకత రెట్టింపు.ప్రతిగ్రామానికి ఇంటర్నెట్‌, ప్రతివారూ దాన్ని ఉపయోగించేలా చర్యలు, ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, పోషకాహారలేమి నివారణ. ప్రస్తుతం 21శాతంగా ఉన్న అడవులను 33శాతానికి పెంపు, పదవ తరగతి పూర్తి గాకుండా ఏ ఒక్క విద్యార్దీ మధ్యలో బడి మానకుండా చూడటం. ఉన్నత విద్యలో 25శాతంగా ఉన్న చేరికలను 35శాతానికి పెంచటం 7. ఏడువందల జిల్లా కేంద్ర ఆసుపత్రులు వైద్య కేంద్రాలుగా వృద్ది. ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో ఆరోగ్యనిపుణులకు ప్రయివేటు పరిశ్రమలవారితో శిక్షణ, మెడికల్‌ టూరిస్టులను ఆకర్షించేందుకు ఇరవై స్వేచ్చా జోన్ల ఏర్పాటు., దేశంలో 11,082 మందికి ఒక అలోపతి వైద్యుడు ఉన్న స్ధితిని ప్రతి పద్నాలుగు వందల మందికి ఒకరుండేట్లు చూడటం.వెనుకబడిన ప్రాంతాల్లో వంద చోట్ల కొత్త విహార కేంద్రాల ఏర్పాటు. మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్యను 88 లక్షల నుంచి కోటీ 20లక్షలకు పెంచటం, స్వదేశీపర్యాటకుల సంఖ్యను 1,614 నుంచి 3,200 మిలియన్లకు పెంచటం.8. చమురు, గాస్‌ దిగుమతులను పదిశాతం తగ్గింపు(2022-2023).80 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధనాన్ని 175 గిగావాట్లకు పెంచటం. 9. 1.22లక్షల కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారులను రెండులక్షల కిలోమీటర్లకు పెంచటం. దశాబ్దాల తరబడి 2017 నాటికి పూర్తిగాకుండా ఉన్న ప్రాజెక్టుల పూర్తి. ఇలాంటి కబుర్లతో గతంలో కాంగ్రెస్‌ కాలక్షేపం చేసింది. ఇపుడు బిజెపి బిజెపి చేస్తున్నది.


ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న దేశమని త్వరలో చైనాను అధిగమిస్తామని చెబుతున్నవారి ఏలుబడిలో సంతోష సూచిక ఇలా తగులడుతోందేం అని ఎవరైనా ప్రశ్నించరా ? జిడిపి మొత్తం పెరగటం వేరు, జనాభా పెరుగుతున్నపుడు దానికి అనుగుణంగా తలసరి పెరగటం వేరు.2014లో జిడిపి తలసరి సగటు 1,574 డాలర్లు, 2020లో 1,901 డాలర్లు, ఇదే కాలంలో చైనాలో 7,679 నుంచి 10,500 డాలర్లకు పెరిగింది. ప్రపంచంలో మొత్తం జిడిపిలో చైనా రెండవ స్దానంలో ఉన్నా తలసరిలో ప్రపంచ సగటు కంటే తక్కువే, ఇక మన దేశం గురించి చెప్పుకోవాల్సిందేముంది. సంతోష సూచిక లెక్కింపులోకి తీసుకొనే జిడిపి తలసరి సగటు సూచికలో గత నాలుగు సంవత్సరాలుగా మనది 102-103 స్దానాల్లో , ఆరోగ్యజీవిత సూచికలో 104-107, సామాజిక మద్దతులో 141-145 స్ధానాల్లో ఉన్నపుడు జనాల్లో ఆనందం ఎక్కడ ఉంటుంది. నేపాల్‌ పేదరికంలో కూడా తన స్ధానాన్ని 48 స్ధానాలు ఎగువకు గణనీయంగా మెరుగుపరుచుకోగా మన దేశం 28 స్ధానాలు కోల్పోయింది.