Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో సైనిక చర్య మొదలై నెల రోజులు దాటింది. అది ఉక్రెయిన్‌ పౌరులకు ప్రత్యక్షంగా నరకం చూపుతోంది. మూడున్నర మిలియన్ల మంది ఇరుగు పొరుగుదేశాలకు వెళ్లారు, దాదాపు కోటి మంది కొలువులు, నెలవులు తప్పినట్లు వార్తలు. మరోవైపు ప్రపంచ వ్యాపితంగా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నాటో కూటమి దేశాల్లోని వారు బావుకున్నదేమీ లేదు. అయినప్పటికీ వివాదాన్ని ఇంకా కొనసాగించాలని అమెరికా కూటమి చూస్తోంది. మే నెల తొమ్మిదవ తేదీ రెండవ ప్రపంచయుద్ధంలో జర్మనీపై విజయం సాధించిన రోజని అందువలన అప్పటిలోగా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని రష్యా నేతలు ఆదేశించినట్లు ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతినిధులు చెప్పారు. అంటే అప్పటి వరకు పశ్చిమ దేశాలు ఈ వివాదాన్ని మరింతగా ఎగదోస్తూనే ఉంటాయా? ఉక్రెయిన్‌, ఇతర దేశాల పౌరులను యాతనలకు గురి చేస్తాయా ?


వాస్తవాల పత్రం పేరుతో మార్చి 16వ తేదీన అమెరికా ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు శాంతిని కోరుకుంటున్నట్లు, నిత్యం మానవహక్కుల గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్న అమెరికా కూటమిలోని 30దేశాలు అగ్నికి ఆజ్యం పోస్తూ మంటలను ఎగదోస్తున్నాయి. జో బైడెన్‌ తాజాగా ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయంతో బైడెన్‌ గత పనిహేను నెలల కాలంలో ఉక్రెయినుకు ఇచ్చినది రెండువందల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఇదంతా అమెరికా యుద్ద పరిశ్రమల వారికి కట్టబెట్టిన మొత్తమే. మూడో దేశం ద్వారా సరఫరా చేసిన వాటితో సహా ఏఏ ఆయుధాలు, ఎంత మందుగుండు సరఫరా చేసిందీ దానిలో ఉన్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. లాభం లేకుండా పశ్చిమ దేశాలు భారీసాయం చేస్తే వాటికి వచ్చేదేముంటుంది ?
చైనా, పాకిస్తాన్లను బూచిగా చూపి మన దేశంతో ఆయుధాలకు ఎలా ఖర్చు పెట్టిస్తున్నదో తద్వారా అమెరికా ఎంతగా లాభపడుతున్నదో తెలిసిందే. ఇప్పుడు రష్యాను బూచిగా చూపుతూ నాటో దేశాలన్నింటితో తమ తమ ఆయుధాలను కొనిపిస్తున్నది. ఉక్రెయిను ఒక్కదానికే 350 కోట్లతో సహా తూర్పు ఐరోపా దేశాలకు 650 కోట్ల డాలర్లను ఆయుధాల కోసం బైడెన్‌ బడ్జెట్‌ కేటాయించాడు. ఐదుసార్లు ఇప్పటి వరకు ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. ఒప్పందం కుదిరితే, శాంతి నెలకొంటే ఈ బడ్జెట్‌ నిధులు అవసరం ఉండదు కనుక కనీసం వాటిని ఖర్చు చేసేంత వరకైనా వివాదం-దాడులు కొనసాగాలని అమెరికా కోరుకుంటున్నది. ఉక్రెయిన్నుంచి తరువాత ఆ మొత్తాన్ని ఏదో ఒక రూపంలో వసూలు చేస్తుంది, ఈలోగా తానే ఆయుధాలు కొని కార్పొరేట్ల ఆకలి తీరుస్తుంది.టాంకులను ధ్వంసం చేసే 2,600 జావెలిన్‌(ఈటె) క్షిపణులను ఉక్రెయిన్‌ మిలిటరీకి అమెరికా సరఫరా చేసింది. వాటిని తయారు చేసేది లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియన్‌ అనే కంపెనీలు. పెద్ద అలలు వచ్చినపుడు నౌకలన్నీపైకి లేస్తాయి అన్నట్లుగా ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు పోటీ పడుతున్నాయి. మిలిటరీ మాజీ అధికారులే సలహాదారులు, మధ్యవర్తులుగా ఉంటారు.యుద్దాలు లేకపోతే ఈ కంపెనీలన్నీ మూతపడతాయి కదా !


రష్యాదాడులను సాకుగా చూపి లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ తయారు చేసే ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లు 35 కొనుగోలు చేయాలని జర్మనీ నిర్ణయించింది. నాటో దేశాలన్నీ ఇదే బాటలో ఉండటంతో ఆయుధకంపెనీల వాటాల ధరలు ఈ ఏడాది ఇప్పటికే గణనీయంగా పెరుగుతున్నాయి. ఐరోపా, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల కారణంగా తమ పంట పండుతున్నదని సిఇఓలు నిస్సిగ్గుగా చెబుతున్నారు. అనేక దేశాలు గతంలో కొనుగోలు చేసినవి ఉపయోగించకపోవటం లేదా పాతపడటంతో పనికిరానివిగా పక్కన పడేసి కొత్తవి కొంటున్నాయి. ఫ్రాన్స్‌,బ్రిటన్‌ వంటి దేశాల్లో కూడా ఆయుధకంపెనీలున్నా సింహభాగం అమెరికన్లకే పోతోంది. అందుకే నేషనల్‌ డిఫెన్స్‌ ఇండిస్టియల్‌ అసోసియెషన్‌ జనవరిలోనే అమెరికా పార్లమెంట్‌ సభ్యుల మీద వత్తిడి చేసింది.” రక్షణ ఖర్చు పద్దుల ఆమోదంలో వైఫల్యం ” ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ, తూర్పు ఆసియా, దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలకు ప్రతిచర్యలు తీసుకోవటంలో, సమర్దత, తీవ్రంగా పరిగణించకపోవటం ముప్పును సూచిస్తున్నదని ” పేర్కొన్నది.ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ రాజీకి సంసిద్దను ప్రకటించినా బైడెన్‌, ఇతర దేశాలు పడనీయకుండా సంక్షోభాన్ని కొనసాగించేందుకు పూనుకోవటం వెనుక ఎవరి వత్తిడి, లబ్ది ఉందో అరటితొక్క వలచి పండు పెట్టినట్లుగా చెప్పాల్సిన పని లేదేమో ! ఒక్క ఆయుధకంపెనీలేనా లబ్ది పొందుతున్నది ?


గత నెల రోజుల్లో అమెరికా ఇంధన కంపెనీల విలువ పదిశాతం పెరిగింది. ఆ మొత్తం 239 బిలియన్‌ డాలర్లని అంచనా. ఈ కాలంలో బ్రెంట్‌ రకం ముడిచమురు ధరలు 32శాతం పెరిగాయి. దానితో బాటే ఇతర రకాల ధరలూ పెరిగి కార్పొరేట్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక కంపెనీ యజమాని ప్రపంచంలోని ఐదువందల మంది ధనికుల జాబితాలో చేరాడు. హరోల్డ్‌ హామ్‌ అనే కాంటినెంటల్‌ రిసోర్సెస్‌ కంపెనీ కుబేరుడి ఆస్తి విలువ 19.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికి కంపెనీ వాటాల ధరలు పెరిగి మూడు నెలలు కూడా గడవక ముందే 5.75బి.డాలర్లు(41.2శాతం) పెరిగింది. దీంతో బ్లూమ్‌బెర్గ్‌ ధనవంతుల జాబితాలో అతని స్దానం 84నుంచి 37కు పెరిగింది. జెఫ్రీ హిల్డెబ్రాండ్‌ సంపద విలువ ఇదే కాలంలో 6.63 బి.డాలర్లు (101శాతం) పెరిగి 13.2 బి.డాలర్లకు చేరింది. అందరి సంపదల్లో ఇలాంటి పెరుగుదల లేకున్నా మొత్తం మీద ఇంథన కంపెనీలన్నీ లబ్దిపొందాయి.


మన దేశంలో చమురు కంపెనీలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. రిలయన్స్‌, బిపి వంటి కొన్ని కంపెనీలు రంగంలో ఉన్నా పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదు. ముడి చమురు ధరలు పెరిగినదానికి అనుగుణంగా ప్రభుత్వ కంపెనీలు నవంబరు నాలుగు నుంచి మార్చి 21వరకు ధరలను పెంచకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి లబ్దికి స్ధంభింప చేసిన సంగతి తెలిసిందే. దీంతో అపరదేశ భక్తులలైన అంబానీలు తమ బంకులను మూసివేశారు. వారికోసం, ప్రభుత్వ కంపెనీల నష్టాలు తగ్గించేందుకు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారికి డీజిలు ధరలను లీటరుకు రు. 25 వరకు పెంచిన సంగతి తెలిసిందే. దీని వెనుక మరొక ఎత్తుగడ కూడా ఉంది. ఆ మేరకు సాధారణ వినియోగదారులను కూడా భరించేందుకు మానసికంగా సిద్దం చేయటమే అది. కొత్త పద్దతులను కనుగొనటంలో బిజెపి సర్కార్‌ తీరు అనితరసాధ్యం. ఇప్పుడు ప్రతి రోజూ వడ్డించటం ప్రారంభించారు.జనం కూడా కిక్కురు మనకుండా ఇంకా దేశభక్తి మత్తులోనే ఉన్నందున కొనుగోలు చేస్తున్నారు. ఇహలోకంలో పరమ దరిద్రాన్ని అనుభవించి పుణ్యం చేసుకుంటే పరలోకంలో స్వర్గం ప్రాపిస్తుందని నమ్మే మనకు చమురు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల, ఇబ్బందులు పెట్టే ప్రభుత్వ విధానాలు ఒక లెక్కా ! ఏ జన్మలోనో చేసుకున్న పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం, మోడీ మాత్రం ఏం చేస్తారు, మనం వస్తువులను కొనకుండా ఉంటే పోయె, అంత ధరలకు కొనాలని మనల్నేమైనా వత్తిడి చేశారా అనే వేదాంతాన్ని జనం వల్లిస్తున్నారు.


అంతర్జాతీయ మార్కెట్లో మన దేశం కొనుగోలు చేసే ముడి చమురు ధర 2021నవంబరు నెల సగటు 81.51 డాలర్లు, మార్చి 24న 117.71 ఉంది. మార్చి 26వ తేదీన ఇది రాసిన సమయానికి ముడిచమురు బ్రెంట్‌ రకం ధర 120.65 డాలర్లు. మనం కొనుగోలు చేసేది దానికి ఒక డాలరు తక్కువగా ఉంటుంది. పీపా 81.51 డాలర్లు ఉన్నపుడు నిర్ణయించిన ధరల మీద ప్రతిరోజూ కొంత పెంచుతున్నారు. మొత్తం పాతిక రూపాయలా, ఇంకా ఎక్కువగా ఉంటుందా అన్నది చెప్పలేము. చమురు ధరల పెరుగుదల వృద్ది రేటును దెబ్బతీస్తుంది. నోట్ల ముమ్మరాన్ని(ద్రవ్యోల్బణం) పెంచుతుంది, అది ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దీన్నే స్టాగ్‌ఫ్లేషన్‌ అంటున్నారు. ఇది జనజీవితాలను అతలాకుతలం చేస్తుంది. జనాల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది, తద్వారా వృద్ధి రేటు మరింత పడిపోతుంది. అది వేతనాల మీద పడి కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఒకదాన్ని మరొకటి దెబ్బతీసే ఒక వలయం ఇది.

చమురుతో పాటు గృహావసరాలకు వాడే గాస్‌ ధరను రు.50 పెంచి వెయ్యిదాటించారు. ఇది 70శాతం గృహస్తులను ప్రభావితం చేస్తుంది. వీరిలో ఆమ్‌ ఆద్మీ నుంచి అంబానీల వరకు అందరూ ఉంటారు. సమస్య సామాన్యులకే స్వంత విమానాలను కలిగి ఉన్నవారికి ఏముంటుంది. సౌదీ ఆరామ్‌ కో కంపెనీ టన్ను గాస్‌ ధరను తాజాగా 729 నుంచి 769 డాలర్లకు పెంచింది. గతేడాది నవంబరులో ధర 376డాలర్లు మాత్రమే. అందువల్లనే అప్పటి నుంచి మన దేశంలో కూడా విపరీతంగా ధర పెరిగింది. గాస్‌ మీద ఇస్తున్న సబ్సిడీని రు.40కి తగ్గించి ఎంత పెరిగితే అంత వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. తాజాగా పెంచినప్పటికీ చమురు కంపెనీలకు ఒక్కో సిలిండరుకు ఇంకా రు.100-125 నష్టమే అని చెబుతున్నందున ఆ మేరకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి కోసం పెట్రోలు, డీజిలు ధరలను స్ధంభింప చేసిన కారణంగా 137 రోజుల్లో మూడు చమురు సంస్ధలకు వచ్చిన నష్టమే రు.19,000 కోట్లని అంచనా, వాటికి రావాల్సిన లాభాలను కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆ మొత్తాలను జనాల నుంచి వసూలు చేసేందుకు పూనుకున్నారు. ఎంత తెలివి ?


ధరల పెరుగుదలను ఆరుశాతంలోపుకు పరిమితం చేయాలన్నది రిజర్వుబాంకు లక్ష్యం. జనవరిలో 6.01గా ఉన్నది ఫిబ్రవరిలో 6.07శాతానికి పెరిగింది. ఫిబ్రవరితో ముగిసిన ఏడాదిలో పదకొండు నెలల పాటు రెండంకెలకు మించి టోకు ధరలు పెరిగి ఫిబ్రవరిలో 13.11శాతంగా నమోదైంది. కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా ద్రవ్యోల్బణం మదింపులోనే లోపం ఉందన్నది ఒకటైతే, వాటిని కూడా తొక్కి పెట్టి తక్కువగా చూపుతున్నారన్న విమర్శలున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో చెబుతారు. సంక్షోభానికి కారణంగా అమెరికా, నాటో కూటమి అనుసరించిన దేశాలే అన్నది అందరికీ తెలుసు. కానీ వారి వైఖరి తప్పని చెప్పటానికి మాత్రం నోరు రాదు. ఎందుకటా దేశ ప్రయోజనాల రీత్యా ఎవరినీ నొప్పించకూడదట. మరి ధరల పెరుగుదల సంగతేమిటి ? జన ప్రయోజనాలు ప్రభుత్వాలకు పట్టవా ? ఏమి రాజకీయం నడుస్తోందో మనం గమనిస్తున్నామా ?