Tags

, , , , , , , ,

నాడు సావర్కర్‌కు ఎత్తుగడ బొంకు – నేడు నరేంద్రమోడీకి దేశ హితం సాకు !



ఎం కోటేశ్వరరావు


పొరుగుదేశమైన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం పతనపు అంచుల్లో ఉంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటాను తప్ప రాజీనామా చేసేది లేదని ఇమ్రాన్‌ చెప్పాడు. ఆదివారం నాడు ఓటింగ్‌ జరిగేలోపల ఏమైనా జరగవచ్చు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఇమ్రాన్‌ పదవి పోవటం ఖాయంగా కనిపిస్తోంది.2018 జూలై 25న జరిగిన ఎన్నికల్లో 31.82శాతం ఓట్లతో 342 స్ధానాలున్న జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో 149 స్ధానాలతో ఇమ్రాన్‌ఖాన్‌ నాయకత్వంలోని పాకిస్తాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌(పిటిఐ) పెద్ద పక్షంగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 172 స్దానాలు అవసరం కాగా ఏడు చిన్న పార్టీలు, ఒక స్వతంత్రుడి మద్దతుతో 176 ఓట్లతో ఇమ్రాన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. వాటిలో కొన్ని పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవటంతో మద్దతు ప్రస్తుతం 164కు పడిపోయింది. స్వంత పార్టీవారే కొందరు తిరుగుబాటును ప్రకటించటంతో ఓటింగ్‌ సమయానికి ఇంకా తగ్గవచ్చు. గడువు ప్రకారం తదుపరి ఎన్నికలు 2023 అక్టోబరు 12లోగా జరగాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటే ఆగస్టునాటికి ఎన్నికలు జరుపుతానని ఇమ్రాన్‌ ప్రతిపక్షాలకు సందేశం పంపాడు. ఓటింగ్‌ జరిగేలోగా పార్లమెంటును రద్దు చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేము.


ఇమ్రాన్‌ఖాన్‌పై ఆకస్మికంగా ఈ తిరుగుబాటు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్న. ఎప్పటి నుంచో ఆర్ధికరంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన వైఫల్యాలు లేవు.పోనీ కొత్త ప్రభుత్వం వస్తే తెల్లవారేసరికి పరిష్కారం అవుతాయా అంటే కావు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమదేశాలు కుట్ర చేస్తున్నాయంటూ ఇమ్రాన్‌ ఒక లేఖను మంత్రులకు చూపాడు. దాన్నే ఒక బహిరంగసభలో కూడా ప్రదర్శించారు. కుట్రచేస్తున్న దేశం అమెరికా అని చెప్పి వెంటనే కాదు నోరు జారింది ఒక పశ్చిమ దేశం అని సవరించుకున్నాడు. జనానికి, ప్రపంచానికి వెళ్లాల్సిన సందేశాన్ని పంపి ఎత్తుగడగా నోరు జారిందని చెప్పాడన్నది వేరే చెప్పనవసరం లేదు. అంతకు ముందే మీడియాకు లీకు చేయటం అమెరికా ఖండించటం వంటి పరిణామాలు జరిగాయి.


సోవియట్‌ పతనం తరువాత మన దేశం క్రమంగా అమెరికా వైపు మొగ్గుచూపటం ప్రారంభమైంది. భారత ఉపఖండంలో భారత్‌ ఎంత కీలక స్ధానంలో ఉందో పాకిస్తాన్‌ కూడా వ్యూహాత్మకంగా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. అందుకే రెండు దేశాలను చెరోచంకన ఎక్కించుకొని తన పబ్బంగడుపుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. మారుతున్న పరిణామాల నేపధ్యంలో అది దానికి సాధ్యం కావటంలేదు. రష్యా, చైనాలవైపు ఇటీవలి కాలంలో పాక్‌ మొగ్గుదల ఉంది. ఇంతకాలం దాగుడుమూతలాడినా ఉక్రెయిన్‌-రష్యా వివాదం ఒక స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాల్సిన అగత్యాన్ని ముందుకు తెచ్చింది. జోబైడెన్‌ అధికారం స్వీకరించిన తరువాత ఇంతవరకు ఇమ్రాన్‌తో మాటల్లేవు. వివాదం ముదురుతుండగా ఇమ్రాన్‌ ఖాన్‌ రష్యా పర్యటన జరిపి తాము పుతిన్‌వైపే ఉన్నట్లు చెప్పటం, ఐరాసలో తటస్ధ వైఖరి తీసుకోవటం వంటి పరిణామాలు అమెరికా అగ్రరాజ్య దురహంకారాన్ని రెచ్చగొట్టాయి. దాంతో తనకు వెన్నతో పెట్టి విద్యను ప్రయోగించి తనతో చేతులు కలపని వారికి ఏ గతి పడుతుందో చూడండనే సందేశాన్ని మిగతా దేశాలకు ఇస్తోంది. అదే పాక్‌ పరిణామాలకు కారణం. పది సంవత్సరాల క్రితం ఉక్రెయిన్‌ పాలకులు రష్యావైపు మొగ్గినపుడు అక్కడ సిఐఏతో కుట్రలు చేయించి ప్రభుత్వాన్ని కూలదోశారు. అనేక దేశాల్లో ఇదే జరిగింది. పాక్‌ మాదిరి మన దేశం, చైనాతో ఒకే గేమ్‌ ఆడాలంటే కుదరదు. అందుకే వేర్వేరు ఆటలు ఆడుతోంది.


రష్యాను ఖండించేందుకు తమతో గొంతుకలపాలన్న పశ్చిమ దేశాల మీద మార్చి ఆరవ తేదీన ఒక బహిరంగసభలో ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ మా గురించి ఏమనుకుంటున్నారు, మీరు చెప్పింది చేసేందుకు మీ బానిసలమా అని ప్రశ్నించాడు. మన దేశాన్ని అమెరికా బెదిరించినా, వణుకుతన్నదని ఎద్దేవా చేసినా ప్రధాని నరేంద్రమోడీ స్పందించలేదు. భారతీయ సంతతికి చెందిన అధికారి చేతనే మన దేశాన్ని బెదిరించటం తాజా ఉదంతం. చైనా గనుక వాస్తవాధీన రేఖను అతిక్రమించితే రష్యా సాయపడదని, ఎందుకంటే వారి మధ్య హద్దులు లేని భాగస్వామ్యం ఉందని అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు దలీప్‌ సింగ్‌ మన దేశాన్ని బెదిరించాడు. రష్యా మీద తాము విధించిన ఆంక్షలను ఎవరైనా అతిక్రమించినట్లైతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. అమెరికా, ఇతర దేశాలు అంతర్జాతీయంగా ఆంక్షలు విధించిన ఇంధనం, ఇతర వస్తువులను రష్యా నుంచి ఎక్కువగా భారత్‌ దిగుమతి చేసుకోవటాన్ని తాము కోరుకోవటం లేదన్నాడు.” స్నేహ స్ఫూర్తితో మా ఆంక్షల తీరుతెన్నుల గురించి వివరించేందుకు, ఉభయుల ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు (భారత్‌) మాతో కలసి చెప్పాల్సిన ప్రాధాన్యతను స్పష్టం చేసేందుకు నేను ఇక్కడకు వచ్చాను. అవును ఆంక్షలకు తూట్లు పొడిచినా లేదా వమ్ము చేసినా అలాంటి దేశాలు పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నా, ఆంక్షలకు ప్రత్నామ్నాయంగా చెల్లింపుల కోసం భారత్‌-రష్యా చేస్తున్న యత్నాలను కూడా గమనిస్తున్నామని ” అన్నాడు.


అంతేనా ! ” స్నేహితులు పరిమితులను విధించరాదు. డాలరు ప్రాతిపదికగా ఉన్న ద్రవ్య వ్యవస్ధను బేఖాతరు చేసి రూబుల్‌ను ముందుకు తెచ్చేందుకు చేస్తున్న మంత్రాంగాలు చేయవద్దు, మేము అన్ని దేశాలను ప్రత్యేకించి మా మిత్రదేశాలు, భాగస్వాములను చాలా సునిశితంగా పరిశీలిస్తున్నాం. చైనాతో సంబంధాల్లో రష్యా ఒక చిన్న భాగస్వామిగా మారబోతోంది. చైనా పైచేయి సాధిస్తుంది. అది భారత్‌కు అంతమంచిది కాదు.చైనా గనుక వాస్తవాధీన రేఖను మరోసారి అతిక్రమించితే భారత రక్షణకు రష్యా ముందుకు వస్తుందని ఎవరైనా అనుకుంటారని నేను భావించటం లేదు.” అన్నాడు.


దలీప్‌ సింగ్‌ మాటలు దౌత్య సాంప్రదాయాలకు లేదా ఇద్దరు స్నేహితుల సంబంధాలకూ విరుద్దమని ఐరాసలో భారత మాజీ రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ఖండించారు. ఒక ట్వీట్‌తో పాటు ఇండియా టుడే టీవీతో కూడా మాట్లాడారు.” అమెరికా వంటి ఒక మిత్రదేశం ఇలాంటి మొరటు దౌత్యాన్ని ప్రదర్శిస్తుందని ఊహించలేదు. ప్రపంచం నేడు శాంతిగా లేదు, నిజానికి ముక్కలు కాబోతున్నది. ఇటువంటి స్ధితిలో ప్రతివారు తమ స్ధానాన్ని గరిష్టంగా పటిష్టపరచుకొనేందుకు పూనుకోవటం సహజం.ఉక్రెయిన్లో మిలిటరీ వివాదాలతో పాటు ఒక విధంగా అసాధారణ రీతిలో ఆయుధీకరణ వంటి వాటికి కూడా పూనుకుంటున్నారు.అసాధారణ రీతిలో ఒక జి20దేశం మీద ఆంక్షలు విధించారు. పరస్పర ఆధారితమైన ప్రపంచం మీద దీని ప్రభావాలు తప్పకుండా ఉంటాయి. ఒక ఆయుధంగా ఆంక్షలు విధించటం ఇదే తొలిసారి కాదు. అంతర్జాతీయచట్టం ముందు అవి నిలిచేవి కాదని ఈ కుర్రవాడికి(దలీప్‌ సింగ్‌) ఎవరో ఒకరు చెప్పాలి.తమ ప్రయోజనాల కోసం కొన్ని దేశాలు వీటిని ఉపయోస్తాయి. అమెరికా చేస్తున్నదాన్నే కొన్ని ఐరోపా దేశాలూ చేస్తున్నాయి. సంబంధం లేని భారత్‌ వంటి దేశాలకు అవి ఆందోళన కలిగిస్తాయి, దూరంగా ఉన్నా మనం ప్రభావితులం అవుతున్నాము. ఇలాంటి వాటి గురించి మనకు వివరించేందుకు అమెరికా ఒక రాయబారిని పంపటం బానే ఉంది. అయితే సదరు దలీప్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం, అవి దౌత్య సంప్రదాయాలు, స్నేహ సంబంధాలకు విరుద్దం. దౌత్యంలో, భారత్‌ వంటి దేశాలతో వ్యవహరించేటపుడు కాస్త లౌక్యంగా ఉండాలని ఆ కుర్రవాడికి చెబుతున్నాను. ఇది జులం తప్ప దౌత్యపరిభాష కాదు.” అని అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. సంక్షోభ సమయాల్లో దేశాల ప్రభుత్వాలు తమ పౌరులకు ఏది మంచిదనే చూస్తాయి, ఐరోపా దేశాలు రష్యానుంచి ఇంధన కొనుగోలు చేస్తూనే ఉన్నాయని ఏ దేశం పేరూ ప్రస్తావించకుండా మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించారు. ఇతరత్రా ఎలాంటి స్పందన లేదు.


అమెరికా బెదిరింపులు, మన దేశ అధికారిక స్పందన తీరు తెన్నులు చూస్తే జాతీయ వాదుల జాడ ఎక్కడా కనిపించటం లేదు, ఆత్మగౌరవం ఆచూకీ కనిపించటం లేదు. ఎవరి ఛాతీ పొంగటం లేదు. ఎందుకీ పరిస్ధితి ? దీన్ని చూస్తే విడి సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన ప్రేమ (లొంగుబాటు ) లేఖలు గుర్తుకు వస్తున్నాయి. అవి బయపడిన తరువాత అప్పటి వరకు వీరుడు శూరుడు అంటూ పొగిడిన వారు సమర్ధించుకోలేక జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు ఒక ఎత్తుగడగా లేఖలు రాసినట్లు కొందరు టీకా తాత్పర్యం చెప్పారు. పోనీ అదే నిజమైతే తరువాత ఎక్కడా పాల్గొన్నదాఖలాలు లేవెందుకంటే నోట మాటలేదు. మన సర్కార్‌ను అమెరికా, దాని మిత్రదేశాలు బెదిరిస్తుంటే ఇప్పుడు నరేంద్రమోడీ మౌనం దాలుస్తున్నారు. ఏమిటంటే ప్రజల కోసం మౌనం తప్ప చేతకాక కాదని భక్తులు సమర్ధిస్తున్నారు.గతంలో కూడా అమెరికా చేసిన అవమానాన్ని నరేంద్రమోడీ భరించారు. పోనీ దానివలన మన జనానికి కలిగిన మేలు ఏమిటో ఎవరైనా చెప్పగలరా ? మలేరియా చికిత్సకు మనం తయారు చేసే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు కరోనా చికిత్సకు పనికి వస్తాయని కొందరు చెప్పారు. అది నిర్దారణ కాలేదు, వాటిని తమకు సరఫరా చేయకపోతే ప్రతికూల చర్యలు తీసుకుంటామని డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశాన్ని బెదిరించగానే నిషేధాన్ని సడలించిన నరేంద్రమోడీ తీరుతెన్నులను చూశాము.అదే అమెరికా మనకు కావాల్సిన కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడిపదార్దాలు, పరికరాల ఎగుమతులపై నిషేధం విధించినపుడు మౌనం దాల్చటం తప్ప చేసిందేమీ లేదు. కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసు వేసింది. ఇలాంటి అనేక ఉదంతాలను చెప్పవచ్చు.అమెరికా, బెదిరింపులకు దిగుతున్న ఇతర దేశాలపై ఎదురుదాడికి దిగమని ఎవరూ చెప్పటం లేదు, కనీస నిరసన తెలపాల్సిన అవసరం లేదా ? ఆత్మగౌరవ ఆచూకీ లేదని, మన అపర జాతీయవాదుల జాడ ఎక్కడా కనిపించటం లేదంటే కాదని ఎవరైనా చెప్పగలరా !