ఎం కోటేశ్వరరావు
” మన దేశానికి ముందు ఇంధన భద్రత ముఖ్యం, ఎక్కడైనా చౌకగా చమురు దొరికితే అక్కడ ఎందుకు కొనకూడదు ? రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం, పెద్ద మొత్తంలో ఇప్పటికే వచ్చింది, మొత్తంగా దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటాం ” అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నిజమే కదా ! అభ్యంతర పెడుతున్నది ఎవరు? అమెరికా ! దాన్ని ఒక్కమాట అనలేకపోవటం దేశ ప్రయోజనాలకోసమేనా అన్నది ప్రశ్న. 2021ఏడాది మొత్తంగా మన దేశం రష్యానుంచి కొనుగోలు చేసిన చమురు 16 మిలియన్ల పీపాలు, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తం 13మి.పీపాలు. ఇది పెద్ద పెరుగుదలే ఐనా మన దిగుమతుల మొత్తంలో రెండుశాతం లోపే అన్నది గమనించాలి.
ఉక్రెయిన్-రష్యా వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున మనం కూడా ధరలు పెంచకతప్పటం లేదని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు నమ్మబలుకుతున్నారు ఇది పూర్తిగా నిజమా ? నవంబరు నాలుగు నుంచి 137 రోజుల పాటు వినియోగదారుల చమురు ధరలను కేంద్ర ప్రభుత్వం( ప్రభుత్వరంగ సంస్ధల ద్వారా) స్ధంభింప చేసింది. మార్చినెల 21వ తేదీ నుంచి పెంపుదలకు శ్రీకారం చుట్టారు. గతంలో మనకు చెప్పిందేమిటి ? అంతర్జాతీయంగా ఎంత ధర పెరిగితే అంత మొత్తాన్ని జనాల నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత మేరకు రోజూ ఉదయాన్నే తగ్గిస్తామని, ఇది విధాన నిర్ణయం అన్నారు. మరి అది 137 రోజుల పాటు ఎందుకు అమల్లో లేదు.ఐదు రాష్ట్రాల ఎన్నికలకోసమే అని ప్రతిపక్షాలు అంటే కాదన్నారు తప్ప కారణం చెప్పలేదు. గట్టిగా అడిగితే దేశభక్తులతో గొడవెందుకని సర్దుకుపోదాం రండి అన్నట్లుగా జనం ఉన్నారు. చిత్రం ఏమిటంటే మార్చి 21 నుంచి మన దేశంలో చమురు ధరలు పెరుగుతుంటే అంతర్జాతీయంగా తగ్గుతున్నాయి. దీని భావమేమి గోమాతా !
మార్చినెల తొమ్మిదవ తేదీన మనం కొనుగోలు చేసే పీపా చమురు ధర 128.24 డాలర్లు. అది తరువాత క్రమంగా తగ్గుతూ ఏప్రిల్ ఒకటవ తేదీన 103.02 డాలర్లు(కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ ) ఉన్నట్లు నాలుగవ తేదీన ప్రకటించింది. మరి ఈలెక్కన పెంపుదల-తగ్గించటం ఉంటే జనాలకు ధరలు తగ్గాలి. మార్చి 22వ తేదీ ధరను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ అది 113.41 డాలర్లే, దాని ప్రకారం చూసినా తగ్గాల్సింది పోయి ” తగ్గేదేలే ” అన్నట్లుగా పెంచుతున్నారు. ఎందుకని ? ప్రజా ప్రయోజనాల కోసమే అనుకుందామా ? లక్షల కోట్లు ప్రజల కోసం కుమ్మరించామని ఒక నోటితో చెబుతారు, వాటితో పోలిస్తే 137 రోజులో చమురు సంస్ధలకు వచ్చినట్లు చెప్పిన నష్టమెంత కేవలం 19వేల కోట్ల రూపాయలు. ఇంత చిన్న మొత్తాన్ని భరించలేని దుస్ధితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా ?
నిజానికి ఇది పాక్షిక అంచనాగానే భావించాలి. ఇది వచ్చిన నష్టం, కంపెనీలకు రావాల్సిన లాభాలు కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఈ కారణంగానే నిలిపివేసిన మొత్తాన్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మనం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర నవంబరు నెలలో 80.64డాలర్లు, డిసెంబరులో 73.30, జనవరిలో 84.67, ఫిబ్రవరిలో 94.07, మార్చినెలలో 112.87 డాలర్లుంది. తొలుత ఈ మొత్తాన్ని లెక్కించి వచ్చిన లోటును వసూలు చేస్తారు, అందుకే అంతర్జాతీయ మార్కెట్లో మార్పులతో నిమిత్తం లేకుండా వరుసగా పెంచుతున్నారు. పైసా వసూలు మొత్తం జరిగిన తరువాత పెరుగుదలను బట్టి వడ్డింపు ఉంటుంది.
ప్రస్తుత ధరల(మార్చిచివరి వారం) ప్రకారం చమురు కంపెనీలు లీటరుకు రు.15 తక్కువ ధరకు విక్రయిస్తున్నాయని, ఈ మేరకు ధరలు పెంచవచ్చన్నది ఒక అంచనా. ఏప్రిల్ 5వ తేదీ పెంపుతో లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రు.104.61 ఉంది, అంటే ఇప్పటికే రు.9.20 పెరిగింది. దీపావళి కానుక పేరుతో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయల సెస్ తగ్గించింది. గోళ్లూడగొట్టి వసూలు చేస్తున్న దానిలో ఆ మేరకు తగ్గింపు మంచిదే కదా అనుకున్నాం. ఇప్పుడు పెంచిన ధరలతో అది కూడా హరించుకుపోయింది. ఒక లీటరు మీద ఒక రూపాయి సెస్ తగ్గిస్తే కేంద్రానికి ఏటా పదిహేనువేల కోట్ల ఆదాయలోటని అంచనా.దీన్నే జనం వైపు నుంచి చూస్తే ఒక రూపాయి పెంచితే అంతే మొత్తం భారం అవుతుంది. నరేంద్రమోడీ సర్కార్ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్ర ప్రభుత్వానికి చమురు మీద ఎక్సైజ్ డ్యూటీ లేదా సెస్ ఖాతా కింద వచ్చిన రాబడి 2014-15లో రు.99,068 కోట్లు కాగా 2020-21లో వచ్చిన మొత్తం రు.4,19,884 కోట్లు.
ఇంధన ధరలు బాగా తగ్గినపుడు ఆ మేరకు వినియోగదారులకు తగ్గకుండా మన్మోహన్ సింగ్ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే దాన్ని పెంచారు. తాజా తగ్గింపునకు ముందు రూ.32.98, 31.83 చొప్పున ఉంది.పెట్రోలుపై లీటరుకు ఐదు, డీజిలుపై పది రూపాయల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ పెంచిన పన్ను, మరోసారి చమురు ధరల పెంపుదల ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. అందువలన అది జరిగి జన జీవితాలు అతలాకుతలం కాకుండా ఉండాలంటే ఇంధనం మీద పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలందరూ మొత్తుకుంటున్నారు. కేంద్ర పాలకులు దాని గురించి మాట్లాడటం లేదు. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించవచ్చు కదా అని ఎవరైనా సన్నాయి నొక్కులు నొక్కవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారీగా పన్ను పెంచినపుడు బిజెపి అధికారంలో ఉన్న చోట్లతో సహా ఏ రాష్ట్రం కూడా ఈ రీతిలో పన్ను పెంచలేదు. ఒకటీ అరా రాష్ట్రాలు రూపాయో,రెండో ఇంకాస్త ఎక్కువో సెస్‌లు మాత్రమే పెంచాయి. కేంద్రం మాత్రం పన్నుల పెంపుదలతో పాటు అంతకు ముందు ఇస్తున్న రాయితీలను కూడా ఎత్తివేసి ఎంత పెరిగితే అంత మొత్తాన్ని వినియాగదారుల నుంచి వసూలు చేస్తున్నది. అందువలన కేంద్రం ముందుగా తాను పెంచిన వాటిని పూర్తిగా తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించమనటం సమంజసం. లేదా చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి. ఆ మేరకు రాష్ట్రాలకు తగ్గిన రాబడిని కేంద్రం భరిస్తే అదొకదారి. ఇప్పటికే పరిమిత ఆదాయ వనరులున్న రాష్ట్రాలను తగ్గించమనటం సబబు కాదు.
ఏప్రిల్ మూడుతో ముగిసిన వారంలో అంతర్జాతీయ చమురు ధరలు పదమూడుశాతం తగ్గాయి. ఒక వారంలో ఇంత పెద్ద మొత్తంలో గత రెండు సంవత్సరాల్లో జరగలేదు. ఈ తగ్గుదలకు కారణం సౌదీ అరేబియా – ఎమెన్‌లోని హౌతీ(షియా) తెగ తిరుగుబాటుదార్లతో కుదిరిన ఒప్పందం మేరకు చమురు సరఫరాలకు ఆటంకం తొలగటం ఒక కారణంగానూ, అమెరికా తన వ్యూహాత్మక నిల్వల నుంచి ఒక మిలియన్ పీపాల విడుదలకు బైడెన్ ప్రకటన దోహదం చేసిందని వార్తలు వచ్చాయి. ఈ పరిణామం జరిగినపుడు బ్రెంట్ రకం ధర 103.38డాలర్లుంటే ఏప్రిల్ ఐదున ఇది 109 డాలర్లుగా ఉంది అందువలన చమురు ధరల పెరుగుదలాపతనానికి ఏకైక కారణం ఏదీ కనిపించటం లేదు. ఎవరైనా ఉక్రెయిన్ – రష్యా వివాదాన్ని సాకుగా చూపితే కుదరదు.
రష్యా నుంచి చమురు కొనుగోలు వద్దని మన దేశాన్ని అమెరికా వత్తిడి చేస్తోంది. దాన్ని తెరవెనుక నుంచి చూస్తే తమ నుంచి ఇంకా ఎక్కువ మొత్తం కొనుగోలు చేసి తమ కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలన్న వత్తిడి కనిపిస్తుంది. రాయిటర్స్ వార్తా సంస్ద పేర్కొన్న సమాచారం ప్రకారం జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో అమెరికా నుంచి మన దేశం కొనుగోలు చేసే చమురు 48శాతం పెరిగింది. దీంతో మన దేశం దిగుమతి చేసుకొనే చమురువాటా అమెరికా నుంచి 14శాతానికి చేరింది. దశాబ్దాల తరబడి మనతో సత్సంబంధాలు కలిగి ఉన్న పశ్చిమాసియా దేశాల నుంచి చమురు కొనుగోలు తగ్గించి అమెరికా వైపు నరేంద్రమోడీ సర్కార్ మొగ్గటానికి రాజకీయ కారణాలు, అమెరికా చమురు కంపెనీల ప్రభావం ప్రధాన కారణం. మన దిగుమల్లో ఇరాక్ ప్రధమ స్ధానంలో ఉండగా ఇప్పటివరకు రెండవదిగా ఉన్న సౌదీ అరేబియాను ఇప్పుడు అమెరికా వెనక్కు నెట్టేసింది. గతంలో చమురు దిగుమతి దేశంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అందువలన అక్కడి కార్పొరేట్లకు మార్కెట్‌ను సంపాదించేందుకు వైట్‌హౌస్‌లో పాలకులు ఎవరున్నా ఒకేదెబ్బతో అనేక దేశాలను తమ ఖాతాదారులుగా మార్చుకొనేందుకు పూనుకున్నారు.
మన కంటే ఎక్కువ మొత్తం దిగుమతి చేసుకొనే చైనాకు అమెరికాతో ఉన్న వైరం కారణంగా అది దిగుమతి చేసుకోవటం లేదు. మన దేశం ఇప్పటికే అమెరికా వలలో పడింది. మధ్యప్రాచ్య లేదా పశ్చిమాసియా నుంచి మన దిగుమతుల్లో 52.7శాతం ఉండగా ఆఫ్రికా నుంచి 15, అమెరికా నుంచి 14శాతం ఉంది. వీటితో పోల్చుకుంటే రష్యానుంచి దిగుమతి చేసుకుంటున్నది 1-2శాతం మధ్యలో ఉంది. దీన్ని కూడా నిలిపివేయాలని మన నరేంద్రమోడీని అమెరికా ఆదేశిస్తున్నది. మన దేశ ఎగుమతుల్లో నాలుగో వంతు శుద్ది చేసిన చమురు లేదా చమురు ఉత్పత్తులు ఉన్నాయి. అందువలన చమురు శుద్ది కంపెనీలు రష్యానుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటే ఎగుమతులకు దాన్ని వినియోగిస్తే ఆ కంపెనీలకు లాభం. ఐరోపా దేశాలు రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను నిలిపివేస్తే ఐరోపా మార్కెట్లో పాగావేసేందుకు అమెరికా పూనుకుందన్నది స్పష్టం. ప్రపంచంలో చైనా తరువాత రెండో పెద్ద దిగుమతిదారుగా ఉన్న మన మార్కెట్‌ను కూడా కబళించేందుకు పూనుకుంది. బహుశా ఆ ఎత్తుగడతో కూడా రష్యాను మన నుంచి వేరే చేసేందుకు పూనుకున్నట్లు భావించవచ్చు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల పాటలకు(ఆంక్షలకు) అనుగుణంగా ఇప్పటికే మనదేశంతో నరేంద్రమోడీ డాన్స్ చేయిస్తున్నారు. దాన్లో óభాగంగానే ఇరాన్, వెనెజుల నుంచి చమురు కొనుగోళ్లను ఆపివేశారు. గతంలో వెనెజులా నుంచి మన అవసరాల్లో 12శాతం, ఇరాన్ నుంచి ఆరుశాతం దిగుమతి చేసుకున్న ఉదంతాలున్నాయి.ఇలా లొంగిపోయిన కారణంగానే ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు వద్దనే ధైర్యం అమెరికాకు వచ్చింది.
మరో వైపు అదే అమెరికా చేస్తున్నదేమిటి ? రాయిటర్స్ మార్చి ఎనిమిదవతేదీ వార్తా కథనం ప్రకారం అమెరికా 2021లో రోజుకు 6,72,000 పీపాల ముడి చమురు లేదా చమురు ఉత్పత్తులను రికార్డు స్దాయిలో రష్యానుంచి దిగుమతి చేసుకుంది. దీనిలో 1,99,000 పీపాల చమురు ఉంది. అమెరికా గల్ఫ్ తీరంలో వచ్చిన భారీ తుపాన్ల కారణంగా దిగుమతులను ఎక్కువగా చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆంక్షలతో నిమిత్తం లేకుండానే రోజుకు 57వేల పీపాలకు కొనుగోళ్లను తగ్గించి, తిరిగి లక్ష పీపాలకు పెంచినట్లు వార్తలు.ఈ నెల 22లోగా లావాదేవీలను నిలిపివేయాలని అమెరికా ఆర్ధికశాఖ కోరింది. మనం వెంటనే కొనుగోలు నిలిపివేయాలని చెబుతున్న పశ్చిమ దేశాల్లో ఒకటైన బ్రిటన్ తాను మాత్రం ఈ ఏడాది చివరి నాటికి దశలవారీగా రష్యా దిగుమతులను నిలిపివేస్తుందట.
తాజాగా అమెరికా తమ నుంచి కొనుగోళ్ల మొత్తాన్ని 43శాతం పెంచినట్లు రష్యా భద్రతామండలి ఉప కార్యదర్శి మిఖాయిల్ పొపోవ్ ఏప్రిల్ మూడున చెప్పాడు. రోజుకు లక్ష పీపాలు దిగుమతి చేసుకుంటున్నట్లు, అత్యవసర వస్తువుల కింద మినరల్ ఎరువులను దిగుమతి కూడా చేసుకోవచ్చని అమెరికా కంపెనీలకు అనుమతిచ్చినట్లు తెలిపాడు. అమెరికా వద్ద చమురు పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ అక్కడి చమురుశుద్ది సంస్ధలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ముడిచమురుతో లాభాలు ఎక్కువగా వస్తున్నందున దిగుమతి చేసుకొని దాన్ని ఇతర దేశాలకు అధిక ధరలకు అమ్ముకొని లబ్ది పొందుతున్నాయి. అందుకే 2014 నుంచి అమెరికా సర్కార్ రష్యా మీద అనేక ఆంక్షలను విధించినప్పటికీ చమురు జోలికి పోలేదు. బైడెన్ ప్రకటించినట్లు నిజంగానే అమెరికా పూర్తి నిషేధం అమల్లోకి వస్తే అక్కడి కార్పొరేట్ శక్తులు అంగీకరిస్తాయా ? తమ మార్కెట్‌ను అమెరికాకు అప్పగిస్తే వచ్చే పర్యవసానాలను ఐరోపా దేశాలు ఆలోచించుకోవా ? చూద్దాం !