Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


క్రికెట్‌లో కీలకమైన చివరి ఓవర్‌, బంతి మాదిరి తన ప్రభుత్వాన్ని కాపాడు కొనేందుకు మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా శ్రమించినా రాజకీయ క్రీడలో ఓడిపోయాడు. ఏప్రిల్‌ తొమ్మిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల తరువాత అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ప్రతిపక్షం నెగ్గింది. పదకొండవ తేదీన నూతన ప్రధాని ఎన్నిక ఓటింగ్‌కు ముందే పాకిస్తాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌ (పిటిఐ) సభ్యులందరూ పార్లమెంట్‌ నుంచి వాకౌట్‌ చేశారు. సామూహికంగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్‌ చరిత్రలో తొలిసారిగా అవిశ్వాస తీర్మానంతో ఒక సర్కార్‌ పతనమైంది. గత ఏడాది నవంబరు 28న ప్రారంభమైన ఉత్కంఠకు ఏప్రిల్‌ తొమ్మిదిన తెరపడింది. మరుసటి రోజు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా కొత్త సర్కార్‌ ఏర్పడింది. రాజ్యాంగ సంక్షోభం ముగిసినా రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. తదుపరి ఎన్నికలు 2023 ఆగస్టు 13- అక్టోబరు 12 మధ్య జరగాల్సి ఉంది. అప్పటి వరకు ప్రతిపక్షం లేకుండా పార్లమెంట్‌ నడుస్తుందా ? కొత్త ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. ముస్లింలీగ్‌ నేత షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా, ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పిటిఐ సభ్యుడు షా మహమ్మద్‌ ఖురేషీ కూడా నామినేషన్‌ వేసినప్పటికీ ఆ పార్టీ సభ్యులు రాజీనామా చేయటంతో షెహబాజ్‌ షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.


జాతీయ అసెంబ్లీలోని 342 మందికి గాను పిటిఐకి 155 మంది సభ్యులుండగా వారిలో 135 మంది రాజీనామా చేశారు. తిరస్కరించిన 20 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వ పతనం మీద దేశ ప్రజల్లో మిశ్రమ స్పందన వెల్లడైనట్లు ఒక సర్వే వెల్లడించింది. సంతోషం వెలిబుచ్చిన వారు 57శాతం, ఆగ్రహించిన వారు 43శాతం ఉన్నట్లు గాలప్‌ పేర్కొన్నది.జనం ఆగ్రహిస్తున్నారని గ్రహించే పిటిఐ సభ్యులు రాజీనామాలకు సిద్దపడినట్లు వార్తలు వచ్చాయి. రాజీనామా లేఖను ఉపసభాపతి ఖాశింకు అందచేశామని ఆమోదించవచ్చని పిటిఐ నేతలు చెప్పారు గానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశీ కుట్ర లేఖపై పార్లమెంటరీ కమిటీ విచారణను తాము అంగీకరించటం లేదని, సుప్రీం కోర్టు విచారణ జరపాలని పిటిఐ డిమాండ్‌ చేసింది.


జాతీయ అసెంబ్లీలోని 342 మందికి గాను 174 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అంతకు ముందు ఇమ్రాన్‌ఖాన్‌పై తిరుగుబాటును ప్రకటించిన పిటిఐ పార్టీ సభ్యులు ఓటింగ్‌ సమయంలో అధికాపక్షం వైపే కూర్చున్నారు. సాధారణ మెజారిటీకి అవసరమైన 172కు గాను అదనంగా మరో రెండు ఓట్లు మాత్రమే ప్రతిపక్షాలకు వచ్చాయి. అధికారపక్ష సభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించారు. గతేడాది నవంబరు 28న పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీనేత ఖుర్షీద్‌ ఖాన్‌ ఒక ప్రకటన చేస్తూ ఇమ్రాన్‌ ఖానున్న పదవీచ్యుతుడ్ని చేసేందుకు ప్రతిపక్షాలకు మెజారిటీ ఉందని చెప్పాడు. డిసెంబరు 24న పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌(ఎన్‌) నేత అయాజ్‌ సాదిక్‌ కూడా అదే చెప్పాడు. ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ లేదని జనవరి 11న అదే పార్టీ నేత ఖ్వాజా అసిఫ్‌ ప్రకటించాడు. ఇమ్రాన్‌ ఖాన్ను ఇంటికి పంపేందుకు తాము సెనేట్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని పీపుల్స్‌ పార్టీ నేత బిలావల్‌ భుట్టో జరదారీ ప్రకటించాడు.అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్దమని జనవరి 21న అయాజ్‌ సాదిక్‌ చెప్పాడు. ఫిబ్రవరి ఏడున ముస్లింలీగ్‌-పీపుల్స్‌ పార్టీ అధికారికంగానే దీని గురించి చర్చించాయి. పదకొండున ప్రతిపక్షాల తరఫున అవిశ్వాస తీర్మానం గురించి పిడిఎం పార్టీ నేత మౌలానా ఫజులుర్‌ రహ్మాన్‌ ప్రకటించాడు. మార్చి ఎనిమిదిన పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. మార్చి 12న అధికార పిటిఐ పార్టీ అసంతృప్త నేత అలీమ్‌ ఖాన్‌ లండన్‌లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో చర్చించాడు. విదేశీ నిధులతో జరిగిన కుట్ర తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెనుక ఉందని మార్చి 27న ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక బహిరంగ సభలో చెప్పాడు. మరుసటి రోజు ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం నోటీస్‌ ఇచ్చింది. ముప్పై ఒకటవ తేదీన దాన్ని చర్చకు తీసుకొని ఏప్రిల్‌ 3కు పార్లమెంటును వాయిదా వేశారు. ఆ రోజు డిప్యూటీ స్పీకర్‌ తీర్మానం చెల్లదని తిరస్కరించాడు. వెంటనే సభ రద్దు, అధ్యక్షుడి ఆమోద ముద్ర, సుమోటోగా సుప్రీం కోర్టు స్వీకరణ వెంటవెంటనే జరిగాయి.ఏడవ తేదీన స్పీకర్‌ చర్య, సభ రద్దు చెల్లదంటూ పునరుద్దరించిన సుప్రీం కోర్టు తొమ్మిదవ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరపాలని ఆదేశించింది. విదేశీ ప్రభుత్వ ఏర్పాటును తాను సహించబోనని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆమేరకు ఓటింగ్‌ జరిగి నెగ్గటంతో ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కార్‌ పతనమైంది.


ఏప్రిల్‌ తొమ్మిది-పదవ తేదీ పార్లమెంట్‌ సమావేశంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన సమావేశంలో అడుగడుగునా ప్రభుత్వ ప్రతిపక్షాలు కత్తులు దూశాయి. అర్దరాత్రి పన్నెండు గంటలకు కొద్ది నిమిషాల ముందు పాలకపక్షం ఎన్నుకున్న స్పీకర్‌ అసాద్‌ ఖ్వైజర్‌ రాజీనామా చేశాడు,ప్రతిపక్ష సభ్యుడు అయాజ్‌ సాదిక్‌కు సభాధ్యక్ష బాధ్యతను అప్పగించాడు. సాదిక్‌ వెంటనే ఓటింగ్‌ జరిపాడు.ప్రతిపక్షాలకు చెందిన 174 మంది అనుకూలంగా ఓట్లు వేశారు. ప్రతికూలంగా ఎవరూ వేయలేదు.


పదవిలో ఉండగా తన ప్రభుత్వ పతనానికి అమెరికా, భారత్‌, ఇజ్రాయల్‌ ప్రతిపక్షాలతో కలసి కుట్రపన్నిట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ విమర్శించాడు.దక్షిణాసియా వ్యవహారాల సహాయ మంత్రి డోనాల్డ్‌ లు తన ప్రభుత్వాన్ని బెదిరిస్తూ పంపిన లేఖ అంటూ బహిరంగసభలో ప్రదర్శించాడు. మన దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించాడు, విదేశీ వత్తిళ్లకు భారత్‌ లొంగలేదని చెప్పాడు. మహమ్మదాలీ జిన్నా తరువాత తాను తప్ప పాక్‌ పాలకులుగా ఉన్నవారందరూ సిఐఏ ఏజంట్లు లేదా భారత్‌, ఇజ్రాయల్‌కు అమ్ముడు పోయిన బాపతేనని కూడా చెప్పాడు. స్వతంత్ర విదేశాంగ విధానం అవలంభించాలని పదే పదే చెప్పిన ఇమ్రాన్‌ ఖాన్‌ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల సారాన్ని చూస్తే రానున్న రోజుల్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా, గడువు ప్రకారమే జరిగినా విదేశాంగ విధాన ఆత్మగౌరవ అంశంతో జనం ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పవచ్చు. ఇది ప్రధాన ప్రత్యర్ధి పార్టీలను ఇరుకున పెట్టే అవకాశం ఉంది. భారత్‌ను తన అక్కున చేర్చుకొనే ఎత్తుగడలో భాగంగా అమెరికా తమ భుజాల మీద నుంచి తుపాకులు పేల్చిందని, ఇప్పుడు అది దగ్గర కాగానే తమను పట్టించుకోవటం లేదనే అభిప్రాయం పాకిస్తాన్‌ జనంలో రోజు రోజుకూ పెరుగుతున్నట్లు ఒక అభిప్రాయం.2018 జనవరి ఒకటిన నాటి అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్‌లో గత పదిహేను సంవత్సరాల్లో పాకిస్తాన్‌కు ఇచ్చిన 33 బిలియన్‌ డాలర్లకు ప్రతిగా అమెరికాకు దక్కింది అబద్దాలు, వంచన తప్ప మరొకటి కాదన్నాడు. పాకిస్తాన్‌లో ఏముంటాయంటే మూడు ”ఏ” లు (అల్లా, ఆర్మీ, అమెరికా) ఉంటాయని గతంలో కొందరు ఎద్దేవా చేశారు.
అగ్రరాజ్యమేదీ భారత్‌ను శాసించలేదని, ఆత్మగౌరవాన్ని అక్కడి నుంచి నేర్చుకోవాలని ఖాన్‌ అన్నాడు. అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందు దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాప్రయోజనాలు తమకు ముఖ్యమంటూ భారత్‌ తీసుకున్న వైఖరిని ఏ దేశమూ నిరోధించలేకపోయిందన్నాడు.” రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఐరోపా దౌత్యవేత్తలు పాకిస్తాన్‌ మీద వత్తిడి చేస్తున్నారు కానీ భారత్‌ విషయంలో వారా ధైర్యం చేయలేరు.మరొక దేశం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేను, మన విదేశాంగ విధానం సర్వసత్తాకమైనదిగా ఉండాలి. నా రష్యా పర్యటన పట్ల అమెరికా సంతోషంగా లేదు. మనది ఒక మిత్ర దేశంగా ఉన్నప్పటికీ నాలుగు వందల డ్రోన్‌ దాడులు చేసింది. నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసింది. ఇమ్రాన్‌ఖాన్ను పదవీచ్యుతుడిని చేసిన తరువాతే పాకిస్తాన్ను అమెరికా క్షమిస్తుందని ఒక అమెరికా ప్రతినిధి చెప్పాడు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని నేను అంగీకరించను. న్యాయవ్యవస్ధను నేను గౌరవిస్తాను, కానీ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆశాభంగం చెందాను. విదేశీ కుట్ర సాక్ష్యాన్ని కనీసం చూసి ఉండాల్సింది, ఆరోపణలపై విచారణకు ఆదేశించి ఉండాల్సింది. పాకిస్తాన్ను విదేశాలు ఒక తుడుచుకొని పారవేసే కాగితపు ముక్కలా ఉపయోగించకూడదు. ” అన్నాడు.


దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది, కానీ విదేశీ కుట్రలతో ప్రభుత్వమార్పిడికి వ్యతిరేకంగా మరోసారి స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమైందని, దేశ ప్రజాస్వామ్యం,సార్వభౌమత్వాన్ని ఎల్లవేళలా ప్రజలే కాపాడుకుంటారు” అని పేర్కొన్నాడు. రాజీనామా చేసిన 135 మంది పిటిఐ సభ్యుల లేఖలను ఆమోదిస్తే ఆ స్ధానాలన్నింటికీ ఉప ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అది మరొక ఎన్నికల పోరాటంగా మారుతుంది. ఇది కొత్త ప్రభుత్వం మీద, పార్టీల మీద వత్తిడిని పెంచుతుంది. ఎన్నికలు జరిగే వరకు రాజకీయ మధనానికి దారి తీస్తుంది. ఉప ఎన్నికల్లో తిరిగి పిటిఐ అభ్యర్ధులు నెగ్గితే తదుపరి జరిగే ఎన్నికల మీద మరింత వత్తిడిని పెంచుతుంది. లేదా దానికి అవకాశం ఇవ్వకుండా, దేశంలో మరింతగా అమెరికా వ్యతిరేకత పెరగక ముందే ముందస్తు ఎన్నికలకు పోవటమా అన్నది కొత్త కూటమి ముందున్న ప్రశ్న.


పాకిస్తాన్‌లో అధికారం ప్రధానంగా మిలిటరీ కనుసన్నలలో నడవటం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు సహకరించినట్లు భావించిన మిలిటరీ ఇప్పుడు వైరంతో ఉందని వార్తలు. కొత్త ప్రభుత్వం పట్ల ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పటికీ పాక్‌ మిలిటరీ మీద అమెరికా ప్రభావం తీవ్రంగా ఉందన్నది స్పష్టం. ఇటీవలి కాలంలో అమెరికన్లు మన దేశానికి పెద్ద పీటవేస్తుండటంతో జనంలో అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. భారత్‌ తన ఒళ్లోవాలుతున్నందున మన దేశాన్ని సంతుష్టీకరించేందుకు, చైనాకు వ్యతిరేకంగా మనలను నిలబెట్టే ఎత్తుగడకు ప్రాధాన్యత ఇస్తున్నందున పాకిస్తాన్‌తో గతం మాదిరి అమెరికా ఉండటం లేదు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న స్ధితిలో ఆదుకొనేందుకు ముందుకు రావటం లేదు. దీంతో రష్యా,చైనాల వైపు పాకిస్తాన్‌ మొగ్గుతున్నది. బహిరంగంగా అమెరికా వ్యతిరేక వైఖరిని తీసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌పై అమెరికా కక్షగట్టి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వివిధ శక్తులను ఏకం చేయవచ్చుగానీ దాని విదేశాంగ విధానంలో మార్పులను అమెరికా రుద్దగలదా అన్నది ప్రశ్న. గతం మాదిరి తిరిగి ఇస్లామాబాద్‌ను తన కౌగిలిలోకి అమెరికా తెచ్చుకోదలచుకుంటే, అందుకు పాక్‌ సమ్మతిస్తే పాక్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందుతున్న నరేంద్రమోడీ పరిస్ధితి ఏమిటి అన్నది ప్రశ్న. ఒకే వరలో పాక్‌-భారత్‌ అనే కత్తులను ఇమడ్చాలని అమెరికా చూస్తున్నది. కాశ్మీరు సమస్య కొనసాగినంతకాలం అది కుదరదు.


తనను నమ్ముకున్న దేశాలను అమెరికా నట్టేట ముంచుతుందని గతంలో అనేక మంది హెచ్చరించినా జనాలు పట్టించుకోలేదు. ఆప్ఘనిస్తాన్లో అమెరికాకు ఎదురైన పరాజయం, దానికంటే ఉక్రెయిన్ను ముందుకు తోసి చేతులెత్తేసిన తీరుతో మన దేశంలో అమెరికా భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.చైనా బూచిని చూపినా జనం నమ్మే స్ధితి లేదు. ఐరోపాలో నాటో కూటమి పేరుతో తిష్టవేసిన తన సైన్యాలను రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయినుకు పంపటానికి కొన్ని గంటలు చాలు, అయినా అమెరికా లేదా ఇతర ఐరోపా దేశాలేవీ ఆపని చేయలేదు. పెద్ద మొత్తంలో ఆయుధాలు పంపుతున్నాయి. కొంత మంది చెబుతున్నట్లుగా(ఈ రచయిత కాదు) చైనా-భారత్‌ మధ్య యుద్దమే గనుక జరిగితే చతుష్టయ కూటమిలోని అమెరికా లేదా జపాన్‌, ఆస్ట్రేలియా తమ మిలిటరీని మన సరిహద్దులకు పంపుతాయా ? అది సాధ్యమేనా ! కాస్త బుర్రతో ఆలోచించేవారికి కాదని స్పష్టంగా తెలుసు. నేటి భారత్‌ 1962నాటి భారత్‌ కాదని మన నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో చైనా 1962 నాటి మాదిరే ఉందని అనుకుంటున్నారా ? మనం ఇతర దేశాల దగ్గర ఆయుధాలు కొని పోరుకు దిగాలి. అదే చైనా ఇతర దేశాలకు ఆయుధ ఎగుమతులు చేసే స్ధితిలో ఉందని మరచిపోరాదు. ఆర్ధికంగా అమెరికానే సవాలు చేస్తోంది. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌తో సహా భారత ఉపఖండంలోని దేశాలన్నీ చైనాకు దగ్గరగా ఉన్నాయి. అందువలన చైనాతో ఉన్న వివాదాలను పరిష్కరించుకొనేందుకు పూనుకోవాలే తప్ప అమెరికా ఇచ్చిన తాయత్తులు కట్టుకొని బస్తీమే సవాల్‌ అని రంగంలోకి దిగితే జరిగే ఏం జరుగుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.పాక్‌ మిలిటరీతో తమ సంబంధాలు కొనసాగుతాయని అమెరికా మిలిటరీ బుధవారం నాడు ప్రకటించింది.అధికారానిన స్వీకరించి రెండు రోజులు గడిచినా ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మంత్రివర్గాన్ని ప్రకటించలేదు.భారత్‌ గనుక కాశ్మీరుకు 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తే మనమేం చేయాల్సి ఉంటుందని ప్రధానిగా తన తొలి ప్రసంగంలో షెహబాజ్‌ ప్రశ్నించాడు.