Tags
2022 BRICS Summit, BJP, BRICS, China-India Relations, Indo-China trade, Narendra Modi Failures, RSS, Ukraine-Russia crisis
ఎం కోటేశ్వరరావు
మేకిన్ ఇండియా(భారత్‌లో తయారీ) అంటే చైనా నుంచి కొనుగోలు, బిజెపి అంటే బీజింగ్(చైనా రాజధాని నగరం పేరు) జనతా పార్టీ. జుమ్లా ఫర్ ఇండియా(భారత్‌కు మాటలు) జాబ్స్ ఫర్ చైనా (చైనాకు ఉద్యోగాలు) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటు చర్చలో ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే. రాహుల్ గాంధీ విసిరిన చెణుకులివి. ఎందుకీ పరిస్థితి అంటే నరేంద్రమోడీ సర్కార్ ఆచరణే అన్నది స్పష్టం. గతంలో కాంగ్రెస్ మీద బిజెపి విసిరిన వాటికి ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారికి తప్పదివి. రెండు పార్టీలు అనుసరించే ఆర్ధిక విధానాలు ఒకటే గనుక దొందూ దొందే !!
చైనా విదేశంగ మంత్రి వాంగ్ ఇ మార్చి నెలాఖరులో ఢిల్లీ పర్యటన జరిపారు.ఈ ఏడాది సెప్టెంబరులో బీజింగ్‌లో జరిగే బ్రిక్స్(బ్రెజిల్,రష్యా,ఇండియా,చైనా, దక్షిణ ఆఫ్రికా) కూటమి పద్నాలుగవ సమావేశాలు, బ్రిక్స్ 15వ వార్షికోత్సవం కూడా జరపనున్నారు. లడఖ్ సరిహద్దులోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా తన సేనలను ఉపసంహరించుకోని పక్షంలో తాను ఈ సమావేశాలకు వచ్చేది లేదని ప్రధాని నరేంద్రమోడీ ముందస్తు సందేశాలను పంపుతున్న పూర్వరంగంలో వాంగ్ పర్యటన జరిగింది. ప్రధాని ఉత్తర ప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార హడావుడిలో ఉన్నందున వాంగ్‌తో భేటీ కుదరలేదని చెప్పారు. సరిహద్దు సంగతి తేలకుండా తాను బీజింగ్ వచ్చేది లేదని స్పష్టం చేయటమే దీని అంతరార్దం అని విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదం, సైనిక బలగాల ఉపసంహరణ, గతంలో కుదిరిన ఒప్పందాల అమలు వంటి అంశాలపై రెండుదేశాల మధ్య ఇప్పటి వరకు 15దఫాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
బ్రిక్స్ శిఖరాగ్ర సభ భారత్-చైనాలకే పరిమితం కాదు. ఏ సంవత్సరం ఆ కూటమికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుందో ఆ దేశంలో సభలు జరుపుతారు. ఈ సమావేశాలకు హాజరు కావటానికి సరిహద్దు వివాదానికి ముడి పెట్టటం ఏమిటన్నది ప్రశ్న. పోనీ చైనాతో లావాదేవీల్లో అన్ని అంశాల్లో ఇలాగే ముడిపెట్టి అడుగు ముందుకు వేయనని నరేంద్రమోడీ చెబుతున్నారా ? లేదే ! 2020 గాల్వన్ ఉదంతం తరువాత చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సంఘపరివార్‌కు చెందిన వారు, వారి ప్రభావానికి లోనైన మీడియా, ఇతరులు కూడా పెద్ద హడావుడి, దేశభక్తి ప్రదర్శనలు చేశారు. చైనా యాప్‌లను నిషేధించారు, దీపావళికి చైనా టపాసులు వద్దన్నారు. చిత్రం ఏమిటంటే అలాంటి వారిని వెర్రి వెంగళప్పలను చేస్తూ ఆ ఏడాదితో పోల్చితే 2021లో చైనా నుంచి దిగుమతులను అనుమతించటంలో మోడీ సర్కార్ కొత్త రికార్డు నెలకొల్పింది.126 బిలియన్ డాలర్ల మేర దిగుమతి-ఎగుమతి లావాదేవీలు జరిగాయి. ఈ సంవత్సరం తొలి మూడు మాసాల్లో గత రికార్డులను బద్దలు కొట్టే దిశలో 31.9 బి.డాలర్ల లావాదేవీలు జరిగాయి. పోనీ మన దేశ ఎగుమతులు ఎక్కువగా ఉన్నందున చూసీ చూడనట్లు ఉన్నారని అనుకుందామా ? ఉభయ దేశాల మధ్య 2021లో 125.66 బి.డాలర్ల వాణిజ్యం జరిగితే చైనా నుంచి అంతకు ముందేడాదితో పోలిస్తే 46.2 శాతం దిగుమతులు పెరిగి 97.52 బి.డాలర్లకు చేరింది. మన ఎగుమతులు 34.2శాతం పెరిగి 28.14 బి.డాలర్ల మేరకు జరిగాయి.
ఇక ఈ ఏడాది జనవరి-మార్చి మాసాల్లో 31.96 బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా మన దిగుమతులు 27.1 బి.డాలర్లు, ఎగుమతులు 4.87 బి.డాలర్లుగా ఉన్నాయి. మన దిగుమతులు 28.3 శాతం పెరగ్గా ఎగుమతులు 26.1శాతం తగ్గాయి. మన ఇనుపఖనిజం ఎగుమతులు పడిపోవటమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఈ మూడు నెలల కాలంలో చైనాకు మనం 22బిలియన్ డాలర్లు సమర్పించుకున్నాం. చైనా నుంచి దిగుమతులు పెరగటం అన్నది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. మోడీ సర్కార్ దీన్ని ఏ విధంగా చిత్రించ చూస్తున్నదో పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం వెల్లడిస్తున్నది. డిజిసిఐ సమాచారం మేరకు 2006-07 నుంచి 2013-14 నాటికి చైనా నుంచి దిగుమతులు 17.47 నుంచి 51.03 బిలియన్ డాలర్లకు 192శాతం పెరిగిందని, తమ హయాంలో 2014-15 నుంచి 2020-21 వరకు 60.41 నుంచి 65.21 బి.డాలర్లకు అంటే ఎనిమిదిశాతం పెరిగిందని వాణిజ్యశాఖ మంత్రి లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు. గత రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను నరేంద్రమోడీ సర్కార్ ఇప్పటికే సాధించింది, తన రికార్డును తానే ఈ ఏడాది కూడా అధిగమించినా ఆశ్చర్యం లేదు. ఒక వైపు వ్యాపారులు, పారిశ్రామికవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ తాను ప్రోత్సహించిన చైనా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు ఇలాంటి అంకెల జిమ్మిక్కులకు మోడీ సర్కార్ పూనుకుందన్నది స్పష్టం.
మన పరిశ్రమలు కరోనా ముందు స్దాయికి చేరితే చైనా నుంచి దిగుమతులు ఇంకా పెరుగుతాయని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే మరిన్ని మన డాలర్లతో చైనాను పటిష్టపరచటమే మరి. ఒక వైపు చైనాను కట్టడి చేయాలని చూస్తున్న అమెరికాతో మన దేశం చేతులు కలుపుతూ మరోవైపు చైనా ఆర్ధిక వ్యవస్దను మరింతగా బలోపేతం చేసే విధంగా మనం దిగుమతులు ఎందుకు చేసుకుంటున్నట్లు ? ఇక్కడ సరిహద్దు వివాదం, అక్కడ మోహరించిన మిలిటరీ గుర్తుకు రాదా అన్నది మోడీ మద్దతుదారులు తమను తాము ప్రశ్నించుకోవాలి. లేదూ వ్యాపారం వ్యాపారమే, దానికి సరిహద్దు వివాదాన్ని ముడిపెట్టకూడదు అని చెబుతారా ? అదే సూత్రం బ్రిక్స్ సమావేశంలో పాల్గొనటానికి ఎందుకు వర్తించదు. మన దేశంతో భూ సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై గాల్వన్ ఉదంతం తరువాత కేంద్రం ఆంక్షలు విధించింది, అది చైనా గురించే అన్నది చెప్పనవసరం లేదు. ఇక్కడ వాణిజ్య తర్కం వర్తించదా ? దాని పెట్టుబడులు వద్దు దిగుమతులు అంత ముద్దా ? 2018లో సిఐఐ భాగస్వామ్యంతో నిర్వహించిన ఒక సర్వే చైనాలో పెట్టుబడులు పెట్టిన 54 భారత కంపెనీల అభిప్రాయాలను వెల్లడించింది. గాల్వన్ ఉదంతం తరువాత ఆ ” దేశభక్త పెట్టుబడిదారు ”లెవరూ మన ప్రధానిని ఆదర్శంగా తీసుకొని నిరసనగా అక్కడి నుంచి కంపెనీలను ఎత్తివేసిన దాఖలా ఒక్కటీ కనపడదు.మన దేశం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే చైనాకు వచ్చే నష్టమేమీ లేదు. మన ఎగుమతులు లేకపోతే గడవని స్ధితీ లేదు. మన పరిశ్రమలు, మన వ్యవసాయ వస్తువుల ఎగుమతులే దెబ్బతింటాయి. మన దేశంతో పెద్ద మొత్తంలో వాణిజ్యమిగులు ఉంది కనుక వారికి అవసరం లేకున్నా కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్నారు.చైనా వినియోగ మార్కెట్ విలువ ఆరులక్షల కోట్ల డాలర్లు. అందువలన చెరువు మీద అలిగితే….. అన్నట్లుగా చైనా మీద అలిగిన వారికే నష్టం.
చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, వివిధ దేశాల వస్తువులకు పెద్ద మార్కెట్ కూడా అని గమనించాలి. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాను ఒక దేశంగా గుర్తించేందుకు రెండుదశాబ్దాల పాటు 1970దశకం వరకు నిరాకరించిన అమెరికా చివరకు దానితో కాళ్లబేరానికి వచ్చి ఐరాసలో గుర్తింపు, ప్రపంచ వాణిజ్య సంస్దలో ప్రవేశానికి అంగీకరించింది. దానితో పోలిస్తే ఎక్కడో ఉన్న మనం తాయత్తు కట్టుకొని బస్తీమే సవాల్ అంటూ బరిలోకి దిగే స్ధితిలో ఉన్నామా ? 1962లో సరిహద్దు వివాదంలో మన దేశం-చైనా యుద్దానికి దిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలకు ఆ ఉదంతం అడ్డంకి కాలేదు. తమ సర్కారు మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం ఇచ్చినప్పటికీ మన దేశ పర్యటనకు వచ్చేందుకు చైనా నేతలు దాన్నొక సాకుగా ఎన్నడూ చూపలేదు. ఇప్పుడు బ్రిక్స్ సమావేశానికి హాజరుకావటానికి మిలిటరీ మోహరింపు గురించి ఎందుకు పట్టుబడుతున్నట్లు ? అలా చేయకపోతే చైనా వ్యతిరేక ఉన్మాదం ఎక్కిన వారు ఇప్పుడు మోడీకి పడుతున్న నీరాజనాల స్ధానంలో మరొకటి చేస్తారు.
గాల్వన్ ఉదంతాలు చూసినపుడు మన సోషల్ మీడియాలో కొందరు స్పందించిన తీరు చూస్తే మన దిగుమతులు కారణంగానే చైనా బతుకుతున్నదని, వాటిని ఆపివేస్తే మన కాళ్ల దగ్గరకు వస్తుందని నిజంగానే నమ్మినవారు లేకపోలేదు. ఆ ఉదంతానికి కారకులు మీరంటే మీరని పరస్పరం విమర్శలు చేసుకున్నాం. ఉదంతం జరిగింది వాస్తవాధీన రేఖ ఆవల చైనా ఆధీన ప్రాంతంలో అన్నది తెలిసిందే. చైనా మన భూభాగాలను ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరస్పర అవిశ్వాసంతో రెండు వైపులా మిలిటరీ సమీకరణలు జరిగాయి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవటం సహజం. ఎవరెన్ని చెప్పినా మిలిటరీని ఉపసంహరణ వెంటనే జరగదు. ఆర్ధికంగా ఎంతో బలంగా ఉన్న చైనాకు పెద్ద ఇబ్బందులేమీ ఉండవు కనుక మరికొంత కాలం కానసాగించినా వారికి నష్టం ఉండదు. కొద్ది వారాలు తక్కువగా రెండు సంవత్సరాలు కావస్తున్నది. మనం ఆ ఖర్చును తట్టుకోగలమా అన్నదే కీలకం. ఆ ఉదంతాల తరువాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ తొలిసారిగా మన దేశానికి వచ్చాడు. మనం పిలిస్తే వచ్చాడా, లేదా తనంతటతానే వచ్చాడా అన్నది వేరే అంశం.
ఉక్రెయిన్ వివాదం తరువాత అనేక దేశాల ప్రముఖులు మన దేశం వచ్చారు. వారందరినీ మనం ఆహ్వానించలేదు, ఎవరైనా వస్తామంటే వద్దని అనలేము.చైనా మంత్రి రాక గురించి ముందుగానే వార్తలు వచ్చినా చివరి క్షణం వరకు నిర్ధారణ కాలేదు. ఎందుకని ? చైనా మంత్రి రాకను స్వాగతిస్తే అమెరికాకు, ఇతర పశ్చిమ దేశాలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో లేదా అపార్ధం చేసుకుంటాయనే మల్లగుల్లాలు కావచ్చు, చివరి క్షణంలో అనుమతించాము. వచ్చిన విదేశీ ప్రముఖులందరూ తాజా ప్రపంచ పరిణామాలపై మన వైఖరిని తెలుసుకొనేందుకు, తమ అవగాహన లేదా వైఖరి గురించి మనకు వివరణ ఇవ్వటానికి, పనిలో పనిగా చరిత్రలో మీ స్ధానం ఎక్కడ ఉంటుందో ఆలోచించుకోండని అమెరికా మాదిరి బెదిరించటానికి అన్నది స్పష్టం. మరి చైనా మంత్రి మంత్రి వచ్చి ఏమి చేశారని ఎవరైనా సందేహించవచ్చు. నీ అమ్మ మొగుడున్నాడా అని పశ్చిమ దేశాలు అడిగితే బాబూ మీ నాన్న ఉన్నాడా అని చైనా అడిగింది. అదే తేడా ! మన దేశానికి ఎందుకీ ప్రాధాన్యత ఏర్పడిందంటే ప్రపంచ రాజకీయాలే కారణం. తమ ఎడమ చేతి చిటికెన వేలు పట్టుకొని తమ వెంట వస్తుందని, రష్యాను తిట్టేందుకు గొంతు కలుపుతుందని ఆశించిన వారి కోరిక నెరవేరలేదు. అనేక ఉదంతాల్లో అమెరికాను నమ్ముకున్న దేశాలు నట్టేట మునిగాయి. అమెరికాతో చేతులు కలిపితే ఎన్నో దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న రష్యాను పోగొట్టుకుంటే మనకు మిగిలే మిత్రులెవరూ ఉండరు. ఇప్పటికే అనేక మందిని పోగొట్టుకున్నాం. అందుకే లాభనష్టాల బేరీజు వేసుకుంటూ అందరినీ సంతుష్టీకరించేందుకు కసరత్తు చేస్తున్నాం. అది కుదిరేనా ? అందుకే మన మీద అనేక దేశాల వత్తిడి, పర్యటనలు.
గతంలో కొంత మంది మన దేశంలో పాలకవర్గంగా ఉన్న పెట్టుబడిదారులను దళారీలుగా వర్ణించారు. ఇప్పటికీ వారి వారసులు మనకు కనిపిస్తారు.మన కార్పొరేట్లు దళారీలు కాదు, పశ్చిమ దేశాల్లో మాదిరే స్వదేశంలో బలమైన కార్పొరేట్లుగా, వీలైతే ప్రపంచ కార్పొరేట్లుగా ఎదిగేందుకు పోటీపడేస్ధితిలో ఉన్నారు. అమెజాన్-రిలయన్స్ వివాదం, మన కార్పొరేట్ సంస్ధలు విదేశాలకు విస్తరించటం దాన్నే సూచిస్తున్నది. మన తటస్ధ వైఖరి గురించి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మన మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేస్తుంటే విశ్వగురుపీఠాన్ని మనకు మనమే ఇచ్చుకుని మౌనంగా ఉన్నాం.మన మీద జరుగుతున్న దాడికి సంజాయిషీ లేదా పరోక్ష సమాధానాలే తప్ప ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే తీరు ఎక్కడా కనపడదు. తనకు వ్యక్తిగతం అంటూ ఏదీ లేదని ఏం చేసినా దేశానికే అని నరేంద్రమోడీ చెప్పారు.వివాదాలకు- క్రీడలకు ముడిపెట్టటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాల సంస్కారం. మనం కూడా వాటి బాటలోనే నడిచాం. శీతాకాల బీజింగ్ ఒలింపిక్స్‌లో గాల్వన్‌లోయ దాడుల్లో పొల్గొన్న చైనా సైనికుడు ఒలింపిక్ జ్యోతి ప్రదర్శనలో పాల్గొంటున్నాడన్న కారణం చూపి వాటిని మన దేశం బహిష్కరించింది. చివరకు మన దూరదర్శన్ ఆ క్రీడలను చూపకుండా మూసుకుంది. మరి అదే చైనా పాల్గొనే ఇతర వేదికలకు మన దేశం దూరంగా ఉంటుందా ? గాల్వన్ ఉదంతాలకు బాధ్యులైన చైనా మిలిటరీ ప్రతినిధులతో మన వారు ఇప్పటికి 15సార్లు చర్చలు జరిపారు. ఎందుకు జరిపినట్లు ? లడఖ్‌లో మిలిటరీని ఉపసంహరించకపోతే బీజింగ్ బ్రిక్స్ సమావేశాలకు రానంటూ మంకు పట్టుపట్టం కొందరికి సంతోషంగానే ఉండవచ్చు, అది పైన చెప్పుకున్న మిగతా అంశాల్లో కూడా ఉంటే అదొక తీరు.బ్రిక్స్ ఒక అంతర్జాతీయవేదిక, దానికి వెళ్లకుండా మంకుపట్టుపడితే మిగతా దేశాల దృష్టిలో మన దేశం పలుచన కాదా ? రెచ్చిపోయి ఎగుమతి, దిగుమతి లావాదేవీలు జరపటానికి లేని బెట్టు దీనికి ఎందుకు అనుకోవా ? చైనాతో సఖ్యత కోరుకొనే వారిని దేశద్రోహులుగా చిత్రించటాన్ని చూస్తున్నాం. అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే వారు, అక్కడ పెట్టుబడులు పెట్టేవారు దేశద్రోహులా ? ఏమి తర్కరరా బాబూ ఇది !