Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు, వద్దే వద్దు ! దానిలో ముందుగా బాధితులుగా మారేది మహిళలు, పిల్లలే అన్నది ప్రపంచ అనుభవం. సామ్రాజ్యవాదులు తమ లబ్దికోసం యుద్దాలను రుద్దుతున్నారు. అమెరికా, ఐరోపా నాటో కూటమి రగిలించిన వివాదం కారణంగా జరుగుతున్నదే ఫిబ్రవరి 24న ఉక్రెయిను మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య. దశాబ్దాల తరబడి పశ్చిమ దేశాలు అనుసరించిన విస్తరణ వాదం చివరకు తన ముంగిట్లో ముప్పుకు దారితీస్తున్నదనే భయాన్ని రష్యా పదే పదే వెల్లడించినా ఐరాస పట్టించుకోలేదు. దుష్టవిధానాల కారణంగా ప్రారంభమైన దాడులను ఎందరు మరణించినా సరే, అతివల మాన మర్యాదలు మంట కలిసినా, పిల్లల జీవితాలు నాశనమైనా తగ్గేదేలే అన్నట్లుగా అమెరికా, కొన్ని పశ్చిమ దేశాలు మరింతగా ఎగదోస్తున్నాయి. ఫలితంగా ఏప్రిల్‌ 16వ తేదీ నాటికి 49లక్షల మంది ఇరుగు పొరుగు దేశాలకు కాందిశీకులుగా ఉక్రెయిన్‌ పౌరులు వలస వెళ్లారు. దేశంలో 71లక్షల మంది చెల్లాచెదురయ్యారు. కొన్ని అంచనాల ప్రకారం మరొక కోటీ ఇరవైలక్షల మంది ఎటూ పోలేని స్ధితిలో ఉన్నారని వార్తలు. మొత్తం జనాభా నాలుగున్నర కోట్ల మంది అంటే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. అయినా సరే నాటో కూటమి చేతిలో కీలుబొమ్మగా మారిన జెలెనెస్కీలో ఎలాంటి మార్పు లేదు. దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ముప్పు తమవైపు నుంచి ఉండదని రష్యా పదే పదే చెబుతున్నా నాటో దేశాలు ఇచ్చే ఆయుధాలను చూసుకొని మరింతగా పరిస్ధితిని దిగజార్చుతున్నాడు.


రష్యా దాడులతో విదేశాలకు కాందిశీకులుగా వెళ్లినవారిలో పిల్లలు, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు.వారికి బాంబులు, బుల్లెట్లు,క్షిపణుల ముప్పు లేదు. ఆశ్రయం ఇచ్చిన వారి చేతుల్లో మరొక ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నారు. ఆడపిచ్చితో తపించేవారు, దేహాలతో వ్యాపారం చేసే తార్పుడుగాళ్ల వలలకు చిక్కుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మృతకళేబరాల కోసం వాలే రాబందుల మాదిరి కాందిశీక మహిళల కోసం సాయం చేసే స్వచ్చంద సేవకులు, ఇతర ముసుగులో పోర్నోగ్రాఫర్స్‌(బూతువ్యాపారులు) వాలిపోతున్నారు. కాందిశీకులకు భాష కూడా పెద్ద సమస్యగా మారి వేటగాండ్ల వలలో చిక్కుకుంటున్నారు. తీవ్ర గర్హనీయ అంశం ఏమంటే ఒంటరిగా ఉండే పురుషుల ఇండ్లకు శరణార్ధులైన మహిళలు, పిల్లలను బ్రిటన్‌ ప్రభుత్వం పంపుతున్నదని, ఇది వారిని లైంగికంగా దోపిడీ చేసేందుకు దోహదం చేస్తుందని సాక్షాత్తూ ఐరాస కాందిశీకుల కమిషనర్‌ తప్పుపట్టారంటే వారెంత నిస్సహాయ స్ధితిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇది ఒక్క బ్రిటన్‌కే పరిమితం కాదు. అనేక మంది తాము ఎక్కడ ఎలాంటి వారి చేతుల్లో ఇరుక్కున్నామో వెల్లడిస్తున్న గాధలు పత్రికల్లో వస్తున్నాయి.


ఐరోపా దేశాల బూతు వెబ్‌సైట్లలో ఇప్పుడు ఉక్రెయిన్‌ పేరు పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది.మహిళల దేహాలు మగతనపుదాడుల కేంద్రాలుగా మారుతున్నాయి.” మేము ఉక్రెయిన్‌పై బాంబులు వేశాము, అమ్మాయిలను అనుభవించాము.యుద్దానికి వెళ్లే ముందు రష్యన్‌ బాలికను అనుభవించిన ఉక్రెయిన్‌ సైనికుడు. ఉక్రెయిన్‌ యుద్దంలో శృంగారం ” వంటి అంశాలు బూతుసైట్లలో దర్శనమిస్తున్నాయి. ఇంకా ఇంతకంటే దారుణమైన భాష వాడుతున్నారు. ” ఉక్రెయిన్లో యుద్దం బూతుకు ప్రతిరూపంగా మారింది ” అని ఒక విశ్లేషణకు ఇచ్చిన శీర్షిక. ఇదంతా ఎక్కడో కాదు మానవహక్కుల గురించి నిత్యం కబుర్లు చెబుతూ నాగరికులం అని తమకు తామే కితాబునిచ్చుకుంటున్న ఐరోపాలో జరుగుతోంది. ప్రపంచంలో మానవహక్కుల పరిరక్షకులం తామే అని ఫోజు పెట్టే అమెరికా, ఐరోపా దేశాలకు ఈ దారుణాలు పెద్దగా పట్టినట్లు లేదు. ప్రతి మానవ విపత్తులోనూ సర్వం కోల్పోయినపుడు ఇలాంటి లైంగిక దాడులు లేదా దోపిడీకి మహిళలు గురికావటం, లాభాల కోసం ఉపయోగించుకోవటం సర్వసాధారణంగా మారింది.


” రుమేనియా సరిహద్దులో మాటువేసిన పురుషులు ఆకర్షణీయ వాగ్దానాలతో లోబరుచుకుంటున్నారు. మీ సెల్‌ఫోన్లకు చార్జిచేసుకోండి, మీరు ఏదైనా కారు ఎక్కితే వాటి నంబర్లు నమోదు చేసుకోండి అని హంగరీ అధికారులు చెబుతున్నారు. పాసుపోర్టులు తమకు స్వాధీనం చేస్తే ఆశ్రయం కల్పిస్తామని, డబ్బిస్తామని కొందరు చెబుతున్నారు” అని ఐరోపా కౌన్సిల్‌ అనే మానవహక్కుల సంస్ధ తన నివేదికలో పేర్కొన్న కొన్ని అంశాలివి. తీరా ఆశ్రయం కల్పించిన వారి ఇండ్లకు వెళ్లిన తరువాత వారి నిజస్వరూపాలు వెల్లడి కావటంతో అనేక మంది తప్పించుకొని తిరిగి సరిహద్దులకు చేరి కొత్తగా వస్తున్న కాందిశీకులను హెచ్చరిస్తున్నారు. పదిహేనులక్షల మంది పిల్లలు పెద్దవారి తోడు లేకుండా సరిహద్దులు దాటి వచ్చారని వారికి ముప్పు ఉందని యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.మానవ వ్యాపారులు వారిని ఐరోపా దేశాలకే కాదు, వెలుపలకు కూడా తరలించవచ్చని, ఇలాంటి వారితో జరిపే బూతు వ్యాపార విలువ ఏటా వంద బిలియన్‌ డాలర్లని అంచనా. అవయవవ్యాపారుల సంగతి సరేసరి. ఉక్రెయిన్‌ ఆర్ధిక దుస్ధితి కారణంగా మహిళలు చాలా కాలం నుంచి దోపిడీకి గురవుతున్నారు. అద్దెగర్భాలతో పిల్లల్ని కనటం ఇక్కడ చట్టబద్దం కావటంతో ఆ విధంగా కూడా వారు బాధితులే. కరోనా కారణంగా పరిస్ధితులు దిగజారటంతో యుద్ధానికి ముందే అనేక మంది ఉక్రెయిన్‌ మహిళలు విదేశాల్లో ఉపాధిపేరుతో మానవ వ్యాపారుల(తార్పుడు) వలలో చిక్కుకున్నారు. ఇది మరొక విపత్తు. తాజాగా పోలెండ్‌, తదితర దేశాల్లో అలాంటి వారి వలనుంచి తప్పించుకున్నవారి ఉదంతాలు కూడా ఉన్నాయి.


మార్చినెలలో స్వీడెన్‌ పోలీసులు 38 మంది పురుషులను వ్యభిచార నేరం కింద అరెస్టు చేశారు. వారిలో 31 మందితో ఉన్న మహిళలు ఉక్రెయినుకు చెందిన వారే, ఇటీవల వచ్చిన వారు అని పోలీసులు వెల్లడించారు. రవాణా, ఆశ్రయం వంటి ఇంటర్నెట్‌లో ప్రకటనలతో సంఘటితంగా లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిను కాందిశీకులు 40కిపైగా దేశాలకు వలస వెళ్లినట్లు ఇప్పటి వరకు వివరాలు చెబుతున్నాయి.ఐరాస పేర్కొన్న 49లక్షల మందిలో ఒక్క పోలెండులోనే 27,63,786 మంది ఉన్నారు. మూడు లక్షలకు పైబడి రుమేనియా,హంగరీ, మాల్డోవా, స్లోవేకియా, జర్మనీ ఉన్నాయి. ఉక్రెయిన్లోని డాన్‌బాస్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ మిలిటరీ, కిరాయి నయానాజీలు జరుపుతున్నదాడులు, అత్యాచారాల నుంచి తప్పించుకొనేందుకు 4,84,725 మంది రష్యాకు కాందిశీకులుగా వెళ్లారని కూడా ఐరాస తెలిపింది. ఈప్రాంతం నుంచి జనాలు వెళ్లిపోవాలని ఉక్రెయిను ప్రభుత్వమే ఆదేశించింది.
ప్రభుత్వం రూపొందించిన పధకం ప్రకారం బ్రిటన్‌లోని కుటుంబాలు, ఒంటరి పురుషులు ఉక్రెయిన్‌ మహిళలకు తమ రూముల్లో లేదా ఇతరంగా ఆశ్రయం కల్పిస్తామని ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి. వారికి ప్రభుత్వం కాందిశీక మహిళలను కేటాయించి పంపుతుంది. ఈ కార్యక్రమం తార్పుడు గాళ్లకు చెకుముకి రాయి వంటిదని ఒక స్వచ్చంద సంస్ద తూర్పారబట్టింది. వేలాది మంది బ్రిటన్‌ పురుషులు వివిధ వెబ్‌సైట్లలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తమతో శృంగారంలో పాల్గొంటేనే ఆశ్రయం కొనసాగుతుందని తేల్చి చెప్పటంతో వారి కారుణ్యం వెనుక ఉన్న వలేమిటో అర్ధమైంది. నిజానికి ఇది ఒక్క బ్రిటన్‌కే పరిమితం కాదు అనేక దేశాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. ఉచితంగా జర్మనీ లేదా పోలెండ్‌ తీసుకుపోతామంటూ ముందుకు వచ్చిన వారెందరో లైంగికదోపిడీ గాళ్లని తేలింది. తమ ఆశ్రయం పొందాలన్నా, తాము చూపిన ఉపాధిలో చేరాలన్నా తమను లేదా తాము పంపేవారిని గాని లైంగికంగా తృప్తి పరచాలనే షరతులను ముందుకు తెస్తున్నారు.


ఉక్రెయిన్‌ మిలిటరీ లేదా నయా నాజీలకు ఆయుధాల అందచేతలో అమెరికా,బ్రిటన్‌ ముందున్నాయి. బ్రిటన్‌ పాలకుల మరొక దుర్మార్గం ఏమంటే వివిధ దేశాల కాందిశీకులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించకుండా ఖర్చును తగ్గించుకొనేందుకు తూర్పు ఆఫ్రికాలోని ర్వాండా దేశానికి పంపుతున్నది.ఈ చర్యను ఐరాస కాందిశీకుల కమిషనర్‌ ఖండించినా బ్రిటన్‌ ఖాతరు చేయటం లేదు, అక్రమంగా ఇంగ్లీషు ఛానల్‌ దాటుతూ ప్రమాదాలపాలు కాకుండా నిరుత్సాహపరిచేందుకు ఇలా చేస్తున్నామని కుంటిసాకులు చెబుతున్నది. ఉక్రెయిన్‌ కాందిశీకులకూ దీన్నే అమలు జరుపుతున్నారు. తమ ఆర్ధిక వ్యవస్ధకు తోడ్పడని వారు ఎవరైనా బ్రిటన్‌ వస్తే వారిని వదిలించుకోవటం ఒక విధానంగా పెట్టుకున్నది. కొన్ని ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌ కాందిశీకులను చౌకగా పని చేసే శ్రామికులుగా వినియోగిస్తూ గతంలో ఉన్నవారిని తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.


లండన్‌ టైమ్స్‌ పత్రిక విలేకరి ఒకామె కాందిశీకుల దురవస్తలను తెలుసుకొనేందుకు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి వచ్చిన 22 ఏండ్ల నటలయ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. కొద్ది నిమిషాల్లోనే కుప్పలు తెప్పలుగా శృంగార సందేశాలు పంపుతూ బ్రిటన్‌ పురుషులు స్పందించారు. నా దగ్గర పెద్ద పరుపు ఉంది, ఇద్దరం ఇబ్బంది లేకుండా నిద్రించవచ్చని, నేను సాయం చేస్తా ప్రతిగా నీవు కూడా ఏదో చేయాలి, నీకు వివాహం కాకపోతే నేను చేసుకుంటా,నిన్ను మంచిగా చూసుకుంటా వంటి సందేశాలు వచ్చాయి. ఆమెకు రెండు రోజుల్లో వచ్చిన 75 ప్రయివేటు సందేశాలు పంపిన వారిలో 41 మంది ఒంటరి పురుషులే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడపోతలో నేర చరితులను నిరోధించటం సాధ్యం అవుతుంది తప్ప శృంగార వలవిసిరే వేటగాళ్లు దొరకరు. ఆ వలకు చిక్కిన వారి పరిస్ధితి ఏమిటి ?


ఏప్రిల్‌ 20 నాటికి రష్యా సైనిక చర్య ప్రారంభమై 57వ రోజుకు చేరుకుంది. తన యుద్ద నౌకను ముంచి వేసిన తరువాత రష్యాదాడులను ముమ్మరంగావించింది. కీలకమైన రేవు పట్టణం మరియుపూల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత తూర్పు ఉక్రెయిను మీద దాడి మరింత సులభం అవుతుంది. డాన్‌బాస్‌ ప్రాంతంలో స్ధానికంగా ఉన్న తన మద్దతుదారులతో కలసి పెద్ద ఎత్తునదాడులకు దిగనున్నట్లు తాజావార్తలు వెల్లడించాయి. రష్యా నౌకను ముంచామని, సైనికులకు నష్టం కలిగించామని ఉక్రెయిన్‌ పాలకులు ఆనందం వెల్లడించటం ఆయుధాలు అందిస్తున్న పశ్చిమ దేశాలకు ఆనందం, తృప్తి కలగవచ్చునేమో గానీ తన పౌరులకు, ఆర్ధికరంగానికి జరుగుతున్న నష్టం గురించి జెలెనెస్కీ, ఇతర విధాన నిర్ణేతలకు పట్టినట్లు లేదు.