ఎం కోటేశ్వరరావు
రంగనాయకమ్మ గారి మహా రష్యన్ దురహం కారం అనే విశ్లేషణపై స్పందించిన నాకు ఆమె ఆత్మానందాన్ని ఆపాదించారు. దానికి పారమార్ధిక పదకోశంలో చెప్పిన ఒక వ్యాఖ్యానం లేదా భాష్యం ప్రకారం కలిమి,బలిమి మరెందులోనూ తనకు మించిన వారు లేరని సంబరపడటం. అలాంటి అంబర సంబరం నాకు లేదుగానీ పురోగామి వాదిగా ఉన్నా అనే సంతృప్తి పక్కాగా ఉంది. మార్క్స్కంటే మార్క్సిజాన్ని ఎక్కువగా ఔపోసనపట్టినట్లు భావిస్తూ అలాంటి స్ధితిలో రంగనాయకమ్మ గారు ఉన్నారేమో అన్న సందేహం కలుగుతోంది. ఆ స్పందనకు ప్రతిస్పందనగా కొన్ని అంశాలను పాఠకుల ముందుంచుతున్నాను. (ఆంధ్రజ్యోతిలో మార్చి రెండవ తేదీన రంగనాయకమ్మ గారి విశ్లేషణకు నా స్పందన మార్చి12న ప్రచురితం కాగా ఏప్రిల్20న రంగనాయకమ్మ గారి ప్రతిస్పందన ప్రచురితమైంది)
1. లెనిన్ నాయకత్వంలో వున్న పార్టీ ప్రభుత్వం ” రష్యన్ రిపబ్లిక్ ” అని నామకరణం చేసిందని నేను రాయలేదు.’రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్’ అనే రాశాను. ‘ఫెడరేటివ్’ అనే పదాన్ని వదలివేయ లేదు. తదుపరి పేరాలో దాన్ని పునశ్చరణ చేసిన సందర్భంలో పొట్టిగా రష్యన్ రిపబ్లిక్ అని రాశాను.(చైనా అసలు పేరు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కానీ వాడుకలో చైనా అంటున్నాం తప్ప ప్రతిసారీ మొత్తం పేరును వాడటం లేదు, పీపుల్స్ రిపబ్లిక్ రిపబ్లిక్‌ను విస్మరించారు అంటే ఎలా, అలాంటిదే ఇది) ఆ పేరును అంతకు ముందు ప్రభుత్వ నేతగా ఉన్న కెరెన్స్కీ పెట్టారని రంగనాయకమ్మగారు రాశారు. కెరెన్స్కీ సర్కార్ పెట్టిన పేరు ” రష్యన్ డెమోక్రటిక్ ఫెడరల్ రిపబ్లిక్ ” అని తెలుసుకుంటే చాలు. లెనిన్ అధికారానికి వచ్చిన 1917 నవంబరు ఏడు నుంచి 1918 జనవరి 18న రాజ్యాంగ సభ ‘రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్’ అని పేరు మారుస్తూ డిక్రీ జారీ చేసే వరకు కెరెన్స్కీ పెట్టిన పాత పేరు కొనసాగింది. కెరెన్స్కీ-లెనిన్ ప్రభుత్వం పెట్టిన రెండు పేర్లలోనూ మధ్యలో పదాలు మారినప్పటికీ ” రష్యన్ ” అనే పదంతోనే ప్రారంభమైంది కనుక లెనిన్ కూడా రష్యన్ మహాదురహంకారానికి గురైనట్లు భావించాలా అని ప్రశ్నించాను తప్ప లెనిన్ గురైనట్లు నేను చెప్పలేదు. ” రష్యన్ ” పదం లేకుండా తరువాత 1924లో వివిధ రిపబ్లిక్ల మధ్య ఒప్పందం జరిగి ”యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్(యుఎస్ఎస్ఆర్)గా పేరు మార్చారు. స్టాలిన్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో ఉన్నవారిని ఏ విధంగానూ సంతుష్టీకరించలేము.యుఎస్ఎస్ఆర్లో ఉన్నది ఫెడరల్ ప్రభుత్వం తప్ప రంగనాయకమ్మగారు పేర్కొన్నట్లుగా రష్యాలోని కేంద్ర ప్రభుత్వం కాదు. అధికార కేంద్రం(రాజధాని) మాస్కోలో ఉన్నంత మాత్రాన అది రష్యన్ కేంద్ర ప్రభుత్వం కాదు.
2. ఒక దేశం మరొక దేశ ప్రభుత్వంతో కుదుర్చుకొనే ఒప్పందాలమీద దేశాధినేతల సంతకాలు, తరువాత వాటిని పార్లమెంటు ఆమోదించటాలు, పార్టీల విధాన రూపకల్పన పద్దతికి ఉన్న తేడా గురించి రంగనాయకమ్మగారికి తెలియదనుకోలేం. ప్రభుత్వ ఒప్పందాలను సులభతరంగా పాఠకులు అర్ధం చేసుకొనేందుకు అధినేతలు ఒప్పందాలు చేసుకున్నారని ఒక జర్నలిస్టుగా అనేక సార్లు స్వయంగా రాశాను. ఒక విధానాన్ని స్టాలిన్‌కు ఆపాదించి తాను చేసిన దాడిని సమర్ధించుకొనేందుకు నేను చేసిన ప్రస్తావనను ఉటంకిస్తూ నేను కూడా వ్యక్తులకు ఆపాదించినట్లు ఆమె చిత్రించారు. ఒప్పందాలపై సంతకాలు సాంకేతికంగా ప్రభుత్వాల తరఫు దేశాధిపతులు లేదా మంత్రులు కూడా చేస్తారు.ఒక పార్టీ లేదా ప్రభుత్వం ఆమోదించే,అనుసరించే విధానం అన్నది సమిష్టి నిర్ణయం. ఆమోదించిన తరువాత వాటి మీద లెనిన్, స్టాలిన్ లేదా ఒక వేళ రంగనాయకమ్మగారే ఏదైనా పార్టీ నేతగా ఉంటే ఆమె సంతకాలు, గెజెట్ నోటిఫికేషన్లు అవసరం లేదు. ప్రభుత్వాల ఒప్పందాలను లిఖించేది అధికారులు. పార్టీల విధాన రూపకల్పన పరిధి, అంశాలను కమిటీలు ఆవెెూదించిన తరువాత ముసాయిదా రాతపనిని ఒకరికో, ఒక బృందానికో అప్పగిస్తారు, వారు దాన్ని ప్రతిపాదిస్తారు, లేదా వివాదం తలెత్తినపుడు కొంత మంది కలసి ప్రత్నామ్నాయ ప్రతిపాదనలు చేస్తారు. వాటికి ఆమోదం లేదా తిరస్కారం తరువాత అది వ్యక్తులది కాదు ఉమ్మడి అభిప్రాయం మాత్రమే. లెనినిజం, స్టాలినిజం,మరొకయిజం అన్నది మార్క్సు-ఎంగెల్స్‌ల తరువాత సంభవించిన నూతన పరిణామాలు లేదా రంగనాయకమ్మగారి వంటి వారు ముందుకు తెచ్చిన భాష్యాల్లోని వక్రీకరణలను తిప్పికొట్టేందుకు లెనిన్ ఇచ్చిన వివరణలు మార్క్కిస్టు సిద్దాంతాన్ని పరిపుష్టం చేశాయి, వాటిని దాదాపుగా కమ్యూనిస్టులందరూ అంగీకరించారు గనుక తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజం అని పిలిచారు. స్టాలిన్ కూడా కొన్ని అంశాలకు వివరణ ఇచ్చినప్పటికీ వాటిని స్వీకరించినా దాన్ని స్టాలినిజంగా ఎవరూ పరిగణించటం లేదు. అలాగే మావో వివరణలు ఆమోదించిన వారు మార్క్సిజం-లెనినిజాలకు మావో ఆలోచనా విధానమనో, మావో ఇజమనో పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోని వారు కూడా చైనా పరిస్ధితులకు మావో అన్వయించిన సూత్రీకరణలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక రంగనాయకమ్మగారి భాష్యాలను ఆమోదించిన వారు మార్క్సు-లెనిన్ సరసన ఆమె ఇజాన్ని కూడా చేర్చి విప్లవాలను తేవచ్చేమో ? ఇంతకీ ఆమె ఇజాన్ని ఆమోదించే లేదా అమలు చేసే పార్టీ ఏదైనా ఉందా ? నిజంగా తెలుసుకొనేందుకే !
3) 1953లో స్టాలిన్ మరణం తర్వాత అధికారానికి వచ్చిన కశ్చెవ్ స్టాలిన్ మీద చేసిన దాడి గురించి చెప్పనవసరం లేదు. అదే పెద్ద మనిషి, బ్రెజ్నెవ్ కూడా స్టాలిన్ విధానాన్నే కొనసాగించాడని అందుకే ఇతర జాతుల వారు విడిపోవాలనే డిమాండ్‌ను ముందుకు తేలేదని రంగనాయకమ్మగారు చెప్పారు. అలాంటపుడు ఆమె దాడి ఒక్క స్టాలిన్ మీదనే ఎందుకు కేంద్రీకరించినట్లు ?
4. సోవియట్ యూనియన్ నించీ విడిపోయాక ఉక్రెయిన్‌లో రాజకీయ అనిశ్చితి ఉంది. వివిధ పార్టీల, ప్రభుత్వాల నేతలు అమెరికా లేదా రష్యా ప్రభావంలో ఉన్నప్పటికీ ఇతర దేశాలతో సాధారణ దౌత్య సంబంధాలు పెట్టుకున్నారు తప్ప ఏ కూటమిలోనూ చేరలేదు అని మరోసారి చెబుతున్నాను. తాము నాటోలో చేరాలనుకుంటున్నట్లు బుఖారెస్ట్ 2008 నాటో సభకు ఉక్రెయిన్, జార్జియా దరఖాస్తు చేశాయి. అమెరికా అంగీకరించగా ఐరోపా దేశాలు కొన్ని కాదన్నాయి, కానీ రాజీగా నిర్ధిష్ట గడువును పేర్కొనకుండా ఈ దేశాలు నాటో సభó్యదేశాలు అవుతాయి అని ప్రకటన చేశారు. తాజా సంక్షోభానికి ఆ విధంగా నాటో కూటమి నాంది పలికింది. తరువాత 2010 ఉక్రెయిన్ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు విక్టర్ ఎన్‌కోవిచ్ వెంటనే సెవాస్తపూల్ రేవు కౌలు గడువును 2042వరకు పెంచుతూ రష్యాతో ఒప్పందం చేసుకున్నాడు. అదే పెద్ద మనిషి తరువాత పశ్చిమ దేశాల వత్తిడితో ఐరోపా యూనియన్ కూటమితో ఒప్పందానికి 2013 ఏప్రిల్‌లో సుముఖత తెలిపాడు. వెంటనే రష్యా రంగంలోకి దిగటంతో సంతకాలు చేసేందుకు కొద్ది రోజుల ముందు ఆ ఒప్పందాన్ని తిరస్కరిస్తున్నట్లు ఒక ప్రకటన చేశాడు. ఎవరు వత్తిడి చేస్తే అటు మొగ్గాడు.చివరకు పశ్చిమ దేశాలు నిరసనలను ఎగదోయటంతో దేశం విడిచి వెళ్లాడు. వాస్తవం ఇది కాగా ” అతనికి ముందు 1991 నించీ 2012 వరకూ వున్న వాళ్ళూ, అతని తర్వాత వాళ్ళూ అమెరికా కూటమికి అనుకూలురూ అన్నమాట! ” అంటూ రంగనాయకమ్మగారు చెప్పారు. రాజుగారి చిన్న భార్య అందగత్తె అంటే పెద్దామె అనాకారి అన్నట్లుగా ఉంది.
5) ” రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్ యూనియన్ వుంది అని వ్యాసకర్త సమర్ధన. అసలు అక్కడ, అప్పుడు వున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం. ఇంకా సరిగా చెప్పాలంటే, పార్టీ పెట్టుబడిదారీ విధానం. ఉత్పత్తి సాధనాలు వ్యక్తుల స్వంత ఆస్తిగా లేనంత మాత్రాన, అది సోషలిజం కాదు. ” అన్నారు. అంటే సోవియట్ యూనియన్ను సోషలిస్టు దేశంగా గుర్తించలేదు. తత్వం తలకెక్కింది రోకలిని తలకు చుట్టమనటం తప్ప మరొకటి కాదు. సోషలిస్టు వ్యవస్దలో ప్రభుత్వం కార్మికవర్గ ఆధిపత్యంలో ఉంటుంది. అంటే ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో ఉన్నట్లు ? ఫలితాలను ఎవరు అనుభవిస్తారు ?
6) ” కొన్ని దేశాలు అమెరికా పెత్తనానికీ, దుర్మార్గానికీ బలయ్యాయనీ రష్యాకి అలాంటి దుర్మార్గ చరిత్ర లేదనీ వ్యాసకర్త కితాబు. మరి, 1956లో హంగరీ మీదకీ, 1968లో చెకొస్లవేకియా మీదకీ, 1979లో అఫ్గనిస్తాన్ మీదకీ యుద్ధ టాంకుల్ని పంపింది, రష్యాయా, అమెరికాయా? ” అని ప్రశ్నవేశారు. మొదటి రెండు ఉదంతాల్లో సోషలిస్టు వ్యవస్ధకు అమెరికా సిఐఏ కుట్రలతో ముప్పు తలపెట్టినపుడు వాటి రక్షణకు అక్కడి ప్రభుత్వాల కోరిక మేరకు సోవియట్ జోక్యం చేసుకుంది, ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష శక్తుల ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా చేసిన కుట్రను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వ కోరిక మేరకే అడుగు పెట్టింది. దానిలో ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉన్న ఉక్రెయిన్ కూడా భాగస్వామే. అంతర్జాతీయ కర్తవ్యంగా ఆపని చేసినందుకు సోషలిస్టు అభిమానులందరూ హర్షించారు. రంగనాయకమ్మ వంటి వారు పురోగామివాదులుగా చెప్పుకుంటూ శత్రువులతో గొంతు కలిపి ఖండించారు. సోషలిస్టు శత్రువులకూ-మిత్రులుగా చెప్పుకున్నవారికీ భలే కలిసింది. సోషలిజం, కమ్యూనిజం అంటే గిట్టదు అని సూటిగా వ్యతిరేకించే వారిని అర్దం చేసుకోగలం. వారి గురించి పురోగామి శక్తులకు స్పష్టత ఉంటుంది. కానీ మార్క్సిస్టు ముసుగులో ఉండి దాడి చేసే వారు ” కుహనా మిత్ర శత్రువులు ” తప్ప మరొకటి కాదు. అసలు శత్రువుల కంటే వీరు చేసే నష్టం ఎక్కువ. వారు సృష్టించిన గందరగోళంలో పడిన పురోగామి వాదులు ఎటూ తేల్చుకోలేక పడక కుర్చీలకు తప్ప దేనికీ పనికి రారు. అంతిమంగా వారు పాలకవర్గాలకు మేలు చేస్తున్నారు తప్ప కార్మికవర్గానికి కాదు.
7) ”ఉక్రెయిన్ మీద రష్యా దురాక్రమణని సమర్ధించడానికి, వ్యాసకర్త ఒక కొత్త సూత్రాన్ని తయారు చేశారు. ‘అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు’ అని ” అవును, అది మన కళ్ల ముందున్న ఒక వాస్తవం.శాశ్వతంగా అలాగే ఉంటాయని నేను చెప్పలేదు. పెట్టుబడిదారీ దేశాల స్వభావం గురించి మార్క్సూ- ఎంగెల్సులు చెప్పిన మాట నిజం. అది సాధారణ సూత్రీకరణ. పారిశ్రామిక విప్లవం తరువాత మార్కెట్ల ఆక్రమణకు వాటి మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగానే యుద్దాలు జరిగాయి. తరువాత పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించిన దేశాలన్నీ మార్కెట్ల కోసం చూసినా దురాక్రమణదారులుగా మారలేదు. వలసలు అంతరించాయి. దాన్ని గుర్తించకపోతే మొరటుతనం అవుతుంది తప్ప మార్క్సిజం లెనినిజం కాదు. సోషలిస్టు చైనా మీద అమెరికా కుట్రలు చేస్తోంది. దాన్ని ఎదుర్కొనేందుకు ఎవరు తోడ్పడితే వారి సహకారం తీసుకోవాలి. దానిలో భాగమే రష్యా-చైనా మైత్రి. అది శాశ్వతం అని ఎవరైనా చెప్పారా ? అమెరికాను దెబ్బ తీసేందుకు చైనా, మరొక సోషలిస్టు దేశం గానీ అవకాశం వచ్చినపుడు అంతర్జాతీయ పరిణామాల్లో జోక్యం చేసుకోకపోతే శత్రువలలో చిక్కినట్లే ! అసలు ఇంతకూ రంగనాయకమ్మగారు చైనాను సోషలిస్టు దేశంగా గుర్తిస్తున్నారా లేక అది కూడా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్నది అనే వారితో యుగళ గీతం పాడుతున్నారా ?
8) దురాక్రమణ యుద్ధానికి నాజూకైన పేరే ‘ప్రత్యేక సైనిక చర్య’ అని రంగనాయకమ్మగారు అంటున్నారు. ఎవరు దేన్ని ముట్టుకుంటే దాన్ని అలా వర్ణిస్తారు అన్న అంధ వికలాంగులు- ఏనుగు కథ తెలిసిందే. దీని కంటే కళ్లుండీ చూడలేక మార్క్సిస్టు కబుర్లు చెబుతున్నవారు తమ వక్రీకరణలకు నాజూకైన పేర్లు పెట్టటమే పెద్ద నష్టం కలిగిస్తోంది. రష్యా తన లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెప్పింది. ప్రజాస్వామ్యకబుర్లు చెప్పలేదు. ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యఖూనీ జరిగిందనా లేదు. నాటో చేరాలనే ప్రతిపాదనను వదులు కుంటే అక్కడి ప్రభుత్వాన్ని గుర్తిస్తానని, ప్రాదేశిక సమగ్రతకు హామీ ఇస్తానని చెప్పింది.
9)” అమెరికా, రష్యా, రెండూ పెట్టుబడిదారీ దేశాలే అని ఒక పక్కన ఒప్పుకుంటూ, అమెరికాకు వ్యతిరేకంగా రష్యాని బలపరచాలని సలహా ఇస్తున్నారు వ్యాసకర్త” అన్నారు రంగనాయకమ్మగారు. మార్క్సిజంలో ఔపోసన పట్టటానికి ఇంకేమీ మిగిలినట్లు లేదు కనుక ఆమె చరిత్రను ఒక పట్టుపట్టాలి. చైనా విప్లవ చరిత్రలో జపాన్ సామ్రాజ్యవాదుల మీద పోరాడేందుకు అప్పటి వరకు తమను అణిచివేస్తున్నచాంగ్‌కై షేక్‌తోనే కమ్యూనిస్టులు చేతులు కలిపారు.” ఇద్దరు బందిపోటు ముఠాలున్నప్పుడు, ఆ ఇద్దరికీ వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. అంతేగానీ, ‘ఈ బందిపోటుది న్యాయం, ఆ బందిపోటుది కుట్ర’ అని ఏదో ఒక పక్షాన నిలబడడం అంటే, రెండు దేశాల ప్రజలకూ ద్రోహం చెయ్యడమే.” అని చెప్పిన రంగనాయకమ్మగారి సూత్రీకరణలో చైనా పరిణామాన్ని ఎలా ఇముడ్చుతారు ? మావో నాయకత్వంలో అక్కడి పార్టీ ప్రజలకు ద్రోహం చేసిందని చెబుతారా, ఏమో !
10) ”వ్యాసకర్త… అమెరికా, పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఆ సోషలిస్టు దేశాలు ఎక్కడున్నాయో చెపితే బాగుండేది. చైనాలో మావో గ్రూపూ, చౌ ఎన్ లై గ్రూపూ, లిన్ పియావో గ్రూపూ అంటూ 3 పెద్ద గ్రూపుల మధ్య కమ్యూనిస్టు పార్టీలోనే వర్గ పోరాటం లాంటిది జరుగుతూ వుండేది. దాని ఫలితంగానే, అప్పటికి ఎన్నో ఏళ్ళుగా సంబంధం లేని అమెరికాతో చైనా సంబంధాలు మొదలైనాయి.” అని రంగనాయకమ్మగారు చెప్పారు. విస్సన్న చెప్పిందే వేదం – నేను చెప్పిందే అసలు సిసలు మార్క్సిజం అని ఆమె అనుకుంటున్నట్లున్నారు. చైనాతో సహా ఇతర సోషలిస్టు దేశాలను గుర్తించటం లేదు. చైనా కమ్యూనిస్టు పార్టీలో సైద్దాంతిక, విధానాల అమలు మీద అంతర్గత చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. దాన్ని ” వర్గపోరాటం ” అని ఏ మార్క్సిస్టు అవగాహన ప్రకారం వర్ణించినట్లు ? అందుకే పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు రంగనాయకమ్మగారు జాగ్రత్తలు తీసుకోవాలి అని నా తొలి స్పందనలో మనవి చేశాను. మరోసారి అదే చేస్తున్నాను.
కుహనా మిత్రులెవరో ప్రజలకెప్పుడో తెలుసు!
ఎం కోటేశ్వరరావు గారు(రష్యా గురించి) ఇలా అమాయకంగా అడుగుతున్నారు: ‘సోషలిస్టు దేశంలో ప్రభుత్వం కార్మికవర్గ ఆధిపత్యంలో ఉంటుంది. అంటే ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో ఉన్నట్టు? ఫలితాలు ఎవరు అనుభవిస్తారు?’,అని. ఇది అమాయకత్వమా? తెలివి తక్కువ తనమా? ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం ఖాయం! పై మాటలను పేపర్ల మీద రాసుకుంటే అదే వాస్తవంగా జరుగుతున్నట్టు కాదు. వాస్తవంగా ఏమి జరిగింది, అనేది కావాలి. రష్యాలో ఏనాడూ ప్రభుత్వం, కార్మిక వర్గ ఆధిపత్యం లో లేదు. ఉత్పత్తి సాధనాలు కార్మిక వర్గం చేతిలో లేవు. కాబట్టి ఫలితాలు కార్మికులకు చెందలేదు. ఇదే నిజమైన చరిత్ర. ఈ వాస్తవ చరిత్రను అర్థం చేసుకోలేకపోతే చేయగలిగిందేమీ లేదు. పార్టీ పెట్టుబడిదారీ విధానమే రాజ్యమేలింది, అది విచ్ఛిన్నం అయ్యేదాకా!USSR అంటే,అది నిజంగానే సోషలిస్ట్ రిపబ్లిక్ గా తలకెక్కించుకున్న ఎం కోటేశ్వరరావు గారు ఏ రోలును తలకు చుట్టుకుంటారో మరి? తత్వం తలకెక్కితే రోలును తలకుచుట్టుకునే వైద్యం తెలుసు వారికి!
★ఎం కోటేశ్వరరావు గారు రష్యాను సమర్ధించే పనిలో భాగంగా మరో అమాయకత్వాన్ని ప్రదర్శించారు: ‘పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించిన దేశాలన్నీ మార్కెట్ల కోసం చూసినా, దురాక్రమణ దారుల గా మారలేదు’,అనేది.ఆ రకంగా రష్యా మంచి దేశమే అని వారి కొత్త వ్యాఖ్యానం!
‘దురాక్రమణ చేయడానికి తగిన పరిస్థితులు ఆయా దేశాలకు లేవు కాబట్టే, అవి దురాక్రమణకు దిగలేదు’ అనాలి, నిజంగానైతే.దురాక్రమణ పర్యవసానాన్ని అంచనా వేసుకునే అవి దురాక్రమణకు దిగి ఉండక పోవచ్చు అనుకోవాలి. అంతేగాని దురాక్రమణకు దిగలేదు కాబట్టి, అలాంటి దేశాలు మంచివే అనే అర్ధాన్ని స్ఫురించే విధంగా చెప్పారు కోటేశ్వరరావు గారు.ఇది చాలా తప్పు.మూలంలో, పెట్టుబడి దారీ దేశాలన్నీ ఒకటే!
★ ఒక దేశం నాటో లో చేరితే ఏం జరుగుతుంది? నాటో కి సంబంధించిన సైనికులనూ, దాని యుద్ధ సామాగ్రినీ, అవసరమైనప్పుడు ఆ దేశములో ఉండనిచ్చే అవకాశం దొరుకుతుంది. దాంతో దగ్గరలోని శత్రుదేశం(అది పెట్టుబడిదారీ దేశమైనా సరే) పై తేలికగా యుద్ధం చేయగలుగుతుంది. అయ్యే ఖర్చును నాటో సభ్యదేశాలు భరించవలసి ఉంటుంది.
అలా కాకుండా, ఉక్రెయిన్ కి అమెరికాకు జరిగే ఒప్పందాల్లో నాటో తో సంబంధం లేకుండానే అమెరికా,దాని సైనికులనూ, దానియుద్ధ సామాగ్రినీ ఉక్రెయిన్ భూభాగంలో ఉండనిచ్చే విధంగా ఉంటే, అప్పుడు రష్యా ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగేది కాదా? యుద్ధం చేయదా?ఉక్రెయిన్ నాటోలో చేరడం వల్లనే రష్యా యుద్ధానికి దిగింది కాబట్టి, ‘తప్పంతా ఉక్రెయిన్ దే రష్యాది కాద’ని వాదించే ముసుగు మార్క్సిస్టులు అప్పుడు ఏం సమాధానం చెబుతారు? కాకపోతే ఖర్చంతా అమెరికానే భరించవలసి వచ్చేది. ఇక్కడ ఉక్రెయిన్ నాటో లో చేరడం ప్రధానమైన విషయం కాదు. అమెరికన్ సైన్యాన్నీ, దాని యుద్ధ సామాగ్రినీ ఉక్రెయిన్ భూభాగంలోకి అనుమతిస్తే, రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేసి తీరుతుంది. ఉక్రెయిన్ భూభాగాన్ని అమెరికా ఉపయోగించుకోవడం అనేది, నాటో తో సంబంధం ఉంటూనా, ఉండకుండానా అనేది కాదు ప్రశ్న.
రష్యా ని గుప్పెట్లోకి తెచ్చుకోవటం అమెరికా వ్యూహం.అయితే దాన్ని నాటో తో చేయిస్తే అమెరికా వంతుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు రష్యా నాటో ని బూచిగా చూపెడుతూ యుద్ధం చేస్తున్నది గనక ,రేపు అమెరికా నాటో తో సంబంధం లేకుండానే సైన్యాన్ని అక్కడికి పంపితే అప్పుడు మాత్రం రష్యా అభ్యంతరం చెప్పదా?యుద్దానికి దిగదా? దిగి తీరుతుంది.
ఉక్రెయిన్ నాటో కూటమి లో చేరడం వల్లనే దాని పై యుద్ధం చేయవలసి వస్తుందని చెబుతున్నా రష్యా ను చూసి, అది సోషలిస్టు అనుకూల రష్యా అనుకునే మార్క్సిస్టులని ఏమనుకోవాలి? ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడాన్ని, రష్యా వ్యతిరేకించిదానికి గల కారణం, దానికి కమ్యూనిజం పై గల సానుకూల దృష్టితో కాదు. పెట్టుబడిదారి యుద్ధంలో తలొగ్గక తప్పని పరిస్థితి ఎదురవుతుందని! కమ్యూనిజం వ్యాపిని నిరోధించడానికి ఏర్పడిన నాటో లో, ఉక్రెయిన్ చేరడాన్ని వ్యతిరేకిస్తున్న రష్యాని చూసి, దానిలో పూర్వపు యు.ఎస్.ఎస్.ఆర్ ని చూసుకొని ,రష్యా చర్యలను మెచ్చుకుంటే అంతకంటే వెర్రి వెంగళప్ప తనం మరొకటి ఉంటుందా?అలా కాకుండా రష్యాయుద్ద వైఖరిని ఎలా సమర్ధించగలరు?
గందరగోళం లో ఉన్నది ఎం కోటేశ్వరరావు గారే, అని వారు గుర్తించాల్సి ఉంది. ఇలాంటి వాళ్ళు తప్పుడు అవగాహనలను ఏర్పరుచుకోవడానికి తప్ప దేనికీ పనికి రారు. అయితే వీరి రాతల వల్ల కార్మిక వర్గానికి కీడు జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే, కార్మికవర్గం ఈ ముసుగు రాతల్ని ఏనాడో దూరంగా పెట్టింది గనుక.
★ నవ్వాలో ఏడ్వాలో అర్థంకాని విధంగా మరొక మాట అన్నారు ఎం కోటేశ్వరరావు గారు:
‘అసలు ఇంతకూ రంగనాయకమ్మ గారు చైనాను సోషలిస్టు దేశంగా గుర్తిస్తున్నారా లేక అది కూడా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్నది అనే వారితో యుగళగీతం పడుతున్నారా?’అని. ఎం కోటేశ్వరరావు గారి జ్ఞాన శూన్యాన్ని చూసి పడి పడి నవ్వే సందర్భం ఇది. సిద్ధాంత జ్ఞానం అంతగా లేకపోయినా, చాలామంది,చైనాను, ‘కమ్యూనిజం ముసుగేసుకున్న పెట్టుబడిదారీ దేశం’ అని అనడం నేను చాలాసార్లు విన్నాను. వాళ్ళకున్న పాటి అవగాహన కూడా లేకపోయే! ఎం కోటేశ్వరరావు గారు ఇకనుండైనా కనీసం చరిత్రనూ, రాజకీయాలనూ అవపోసన పడితే మంచిది.
★ క్రుశ్చేవ్, బ్రెజ్నవ్ ఇంకా మిగిలిన వాళ్లూ కొనసాగించింది, స్టాలిన్ అనుసరించిన విధానాన్నే. ఈ చెత్త కంతటికీ మూలపురుషుడు అతడే గనక, విమర్శించుకోవలసింది స్టాలిన్ నే.దానర్థం మిగిలిన వాళ్ళు మంచి వాళ్ళని కాదు.వాళ్ళూ అంతకు తగ్గ బొంతలే.
★ “వర్గ స్పృహ లేకుండా యజమానులకి కొమ్ముకాసే కార్మికుడి స్థాయిలో ” రంగనాయకమ్మ గారు ఉన్నట్టు అడ్డగోలు మాటలు విసిరి ఎం కోటేశ్వరరావు గారు పొందినది ఆత్మానందమేగా? పైగా “పురోగమివాదిగా ఉన్నా అనే సంతృప్తి పక్కాగా ఉందని” బడాయిగా చెప్పుకుని పొందింది కూడా ఆత్మానందమేగా ?
★ మార్క్స్కంటే మార్క్సిజాన్ని ఎక్కువగా ఔపోసనపట్టినట్లు భావిస్తూ అలాంటి స్ధితిలో రంగనాయకమ్మ గారు ఉన్నారేమో అన్న సందేహం కలుగుతోంది. ఆధారం చూపకుండా సందేహం కలుగుతుందంటే , ఎం కోటేశ్వరరావు గారు ఎలాంటి స్థితిలో ఉన్నారో అన్న సందేహం కలుగుతుంది.
★ లెనిన్ నాయకత్వంలో వున్న పార్టీ ప్రభుత్వం ” రష్యన్ రిపబ్లిక్ ” అని నామకరణం చేసిందని నేను రాయలేదు.’రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్’ అనే రాశాను. ‘ఫెడరేటివ్’ అనే పదాన్ని వదలివేయ లేదు. తదుపరి పేరాలో దాన్ని పునశ్చరణ చేసిన సందర్భంలో పొట్టిగా రష్యన్ రిపబ్లిక్ అని రాశాను-అని అన్నారు ఎం కోటేశ్వరరావు గారు.కానీ ఇది పెద్ద బుకాయింపు. వారి వ్యక్తిగత fb లో ఎక్కడన్నా రాసుకున్నారేమో, ఆంధ్ర జ్యోతిలో వచ్చిన దానిలో ఆలా లేదు. తియ్యండి ఆంధ్ర జ్యోతి మార్చి 12 వ తేదీ ది .
★’చైనా అసలు పేరు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కానీ వాడుకలో చైనా అంటున్నాం తప్ప ప్రతిసారీ మొత్తం పేరును వాడటం లేదు, పీపుల్స్ రిపబ్లిక్ రిపబ్లిక్‌ను విస్మరించారు అంటే ఎలా, అలాంటిదే ఇది’-అని అన్నారు ఎం కోటేశ్వరరావు గారు. కానీ అలాంటిది కాదు ఈ సందర్భం. ఫలానా పేరుని పెట్టింది ఫలానా వ్యక్తి నాయకత్వం లో వున్న ప్రభుత్వం అని మీరు వాదించిన సందర్భం ఇది.
ఇక చైనా గురించీ, మావో గురించీ, చాంగ్ కై షేక్ గురించీ రంగనాయకమ్మ గారికి ఏం తెలుసో, ఎంత తెలుసో ‘చైనాలో ఏం జరుగుతోంది?’ పుస్తకం చదివిన వాళ్లందరికీ తెలుసు. వారు చరిత్రను సరిగ్గానే అర్థం చేసుకున్నారు. చైనాను ఇంకా సోషలిస్టు దేశంగా చెప్పడం అనేది ఎంతో వెనుకబాటుతనాన్ని సూచిస్తున్నది. దశాబ్దాల కాలం నాటి వెనుకబాటుతనం అది! మెదడు పరిశీలనా జ్ఞానాన్ని దశాబ్దాల కిందటే
కోల్పోయిందని అర్థం. దానికి మందు ఆత్మవిమర్శ ఒక్కటే! ఇది ఎం కోటేశ్వరరావు గారు చేపడితే మంచిది.
LikeLiked by 1 person
కాళిదాసు కవిత్వానికి స్వంతపైత్యం జోడిస్తే ఎలా ?
రంగనాయకమ్మగారి విశ్లేషణ, భాష్యం గురించి నేను లేవనెత్తిన అంశాల మీద ప్రీతమ్ గారు స్పందించారు. దాన్ని మొత్తంగా చూస్తే ఊహాజనితమైన ప్రశ్నలు వేసుకొని విసిరిన అడ్డుసవాళ్లుగా కనిపించాయి. రష్యా అని సాధారణంగా పిలిచే యుఎస్ఎస్ఆర్ సోషలిస్టు దేశం అని ప్రపంచంలోని పురోగామివాదులందరూ పరిగణించటమే కాదు ఆరాధించారు. దాన్ని సోషలిస్టు దేశం కాదనే వారు రోకలి తలకు చుట్టుకున్నవారు తప్ప మరొకరు కాదు గనుక వారిని ఆ స్ధితి నుంచి వెలుపలికి తీసుకురావటం కారల్ మార్క్స్ బతికి వచ్చినా జరిగేది కాదు. ఆ వ్యవస్ధలో లోపాలున్నాయని చెబితే అర్ధం చేసుకోవచ్చు. దాని ఉనికినే గుర్తించని వారితో చర్చ టైమ్ వృధా. పూర్వపు సోవియట్ వేరు, విచ్చిన్నం తరువాత ఏర్పడిన దేశాలు వేరు. వాటిలో ఏ ఒక్కటీ సోషలిస్టు వ్యవస్ధను కలిగి లేవు. నేను ఎక్కడా రష్యా ” మంచితనం ” గురించి చెప్పలేదు. నేను అమాయకంగా అడిగిందీ లేదు. నేను చెప్పని వాటిని నాకు అంటగట్టటాన్ని కాళిదాసు కవిత్వానికి పైత్యం జోడించటం తప్ప వేరు కాదు.
ఉక్రెయిన్-అమెరికా సంబంధాల గురించి కొన్ని ఊహాగానాలు రాసి వాటికి సమాధానం చెప్పమంటే భౌతికవాదం-రంగనాయకమ్మగారి మార్క్సిజం కలిగించిన అవగాహన ఇదా అన్న అనుమానం కలుగుతోంది. మొత్తానికి ఆమె రచనలు చదివి వెంగళప్పలుగా మారిన వారిని చూస్తే జాలేస్తోంది. ఊహాగానాల మీద చర్చకు దిగే అమాయకుడిని కాదు. ప్రీతమ్ గారి చర్చ అంతా దాదాపు ఇలాగే సాగింది. రష్యా సోషలిస్టు అనుకూల లేదా వ్యతిరేక దేశమని నేనెక్కడ చెప్పాను. అమెరికాను ఎదుర్కొనే క్రమంలో ఎవరి అవసరం వారు పరస్పరం చైనా-రష్యాలు మైత్రితో ఉన్నాయి.అది శాశ్వతం అని ఎవరైనా చెప్పారా ? అని కూడా నేను ప్రశ్నించాను. రష్యాలో పూర్వపు యు.ఎస్.ఎస్.ఆర్ ని చూసుకొని ,రష్యా చర్యలను మెచ్చుకుంటే అంతకంటే వెర్రి వెంగళప్ప తనం మరొకటి ఉంటుందా? అని ప్రీతమ్ గారు ప్రశ్నించటాన్ని చూస్తే ఎమితిని సెపితివి కపితము అన్న తెనాలి రామలింగడి చురక గుర్తుకు వచ్చింది.
” సిద్ధాంత జ్ఞానం అంతగా లేకపోయినా, చాలామంది,చైనాను, ‘కమ్యూనిజం ముసుగేసుకున్న పెట్టుబడిదారీ దేశం’ అని అనడం నేను చాలాసార్లు విన్నాను. వాళ్ళకున్న పాటి అవగాహన కూడా లేకపోయే! ” అన్నారు ప్రీతమ్. ఆహా నేను కూడా చాలా మంది చైనాను సోషలిస్టు దేశంగా చెప్పటం చాలా సార్లు విన్నాను. మరి వాళ్లకున్న అవగాహన కూడా మీకు మీ మఠాధిపతికి కూడా లేకపోయే! అంటున్నాను. ఇలాంటి కబుర్లతో కాలక్షేపం చేసేందుకు, పుస్తకాలు రాసుకొని అమ్ముకొనేందుకు బానే ఉంటుంది.
పూర్వపు యు.ఎస్.ఎస్.ఆర్, వర్తమాన చైనాను సోషలిస్టు దేశాలుగా గుర్తించని వారితో చర్చించి మెప్పించాలనే వృధా ప్రయత్నం నేను చేయను. తివిరి ఇసుమున తైలంబు, కుందేటి కొమ్ము సాధించవచ్చు, ప్రపంచంలో ఎక్కడా సోషలిజం లేదనే వారిని రంజింప చేయలేను.
LikeLiked by 1 person