ఎం కోటేశ్వరరావు
మంగళవారం నాడు (మే 31వ తేదీ) అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్రెంట్ రకం ధర మరోసారి 124 డాలర్లు దాటింది. 2020-21లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 44.82 డాలర్లు కాగా 2021-22లో అది 79.18 డాలర్లకు పెరిగింది.వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103 డాలర్లుంది. మే నెలలో 108.61డాలర్లకు పెరిగింది. మన్మోహన్ సింగ్ పాలనా కాలంలో ఒక లీటరు పెట్రోలు, ఒక లీటరు డీజిలు కొనుగోలు చేస్తే జనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన పన్ను రు.9.48, రు.3.56 మొత్తం రు.13.04. నరేంద్రమోడీ అధికారానికి వచ్చి జనాలకు మంచి చేసేందుకు గాను దాన్ని రు.32.98, రు.31.83 మొత్తం రు.64.81కు పెంచారు. బిజెపికి చెడు రోజులు రాకుండా చూసుకొనేందుకు దీనిలో కేంద్ర ప్రభుత్వం 2021లో ఒకసారి, 2022లో తగ్గించిన మొత్తం రు.29. అంటే నిఖరంగా ” మంచిరోజుల కోసం ” ఇంకా రు.35.81 పిండుతూనే ఉన్నారు. నరేంద్రమోడీ ఏలుబడి మీద ఇంకా భ్రమలున్నవారికి, భజన చేస్తున్నవారికీ ఈ వివరణ కాస్త చిరాకు తెప్పించటం సహజమే. ఎందుకంటే శ్రీలంక పరిణామాలను గుర్తు చేస్తాయి మరి. గతంలో 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింపచేసిన మోడీ సర్కార్ ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి మరోసారి ధరల సవరణ నిలిపివేసింది. దీనివలన తమకు పెట్రోలు మీద లీటరుకు రు.13, డీజిలుకు రు.24 నష్టం వస్తోందని ప్రైవేటు కంపెనీలు చెబుతున్నాయి. గతంలో వచ్చిన నష్టాన్ని ధరలు పెంచి పూడ్చారు. ఇప్పుడు మరోసారి కొంత కాలం తరువాత అదేపని చేస్తారు. జనాలకు ఒరిగేదేమీ ఉండదు. మార్చినెల 21 వరకు 137 రోజుల పాటు స్థిరంగా ఉంచి ఢిల్లీలో లీటరు పెట్రోలు రు.95.41 ధరను ఏప్రిల్ ఆరు నాటికి రు.105.41కి, డీజిలు ధరను రు.86.67 నుంచి రు.96.67కు పెంచారు. అంతకు ముందు రెండింటి మీద కేంద్రం రు.15 పన్ను తగ్గించి, మార్చి-ఏప్రిల్ నెలల్లో రు.20 ధర పెంచింది. ఇటీవల రు.14 తగ్గించారు, తరువాత ఎంత పెంచుతారో వేచి చూడాల్సిందే.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. వాటిలో అమెరికా చమురు రాజకీయం కూడా ప్రధానమైనదే. ఆంక్షలు, అలకలు ఏదో ఒక కారణంతో ఐరోపా దేశాలు రష్యానుంచి ముడిచమురు కొనుగోలును తగ్గించేందుకు పూనుకున్నాయి. ఇదే సమయంలో చైనా, భారత్ రికార్డు స్థాయిలో దిగుమతులు పెంచాయని ఇంధన విశ్లేషణ సంస్థ కెప్లర్ పేర్కొన్నది. మే నెలలో సముద్రాల మీద ప్రయాణంలో లేదా లంగరు వేసి ఉన్న ఓడల్లో 79 మిలియన్ల పీపాల రష్యా చమురు ఉంది. ఫిబ్రవరి నెలలో 27మిలియన్ల పీపాలుంది.ఉక్రెయిన్ సంక్షోభానికి ముందు రష్యా ప్రధానంగా ఐరోపాకే చమురు ఎగుమతి చేసేది. పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేసేది లేదంటూ చైనా, మన దేశం ఇప్పుడు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. మార్చినెలలో మన దేశానికి చమురు సరఫరా చేసిన దేశాలలో రష్యా పదవ స్థానంలో ఉండగా ఏప్రిల్లో నాలుగవ స్థానానికి చేరిందని చమురు టాంకర్ల సమాచారం వెల్లడించినట్లు రాయిటర్స్ పేర్కొన్నది. ఈ కారణంగానే ఆ దిగుమతులను నిలిపివేయాలంటూ మరోసారి మన మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా పూనుకుంది.ఆసియాలోని కొందర్ని రాజకీయవైఖరి కంటే ఆర్ధిక అంశాలే కొనుగోలుకు పురికొల్పినట్లు సింగపూర్‌లోని కెప్లర్ సీనియర్ విశ్లేషకుడు జేన్ షీ అన్నారు. గతంలో ఒకశాతంగా ఉన్న మన రష్యా దిగుమతులు ఇప్పుడు ఆరుశాతానికి చేరినట్లు, మార్చి నెలలో రోజుకు 66వేల పీపాల దిగుమతి మరుసటి నెలలో 2,77,000కు పెరిగినట్లు, మే నెలలో అది 4,87,500కు పెరుగుతుందని రాయిటర్స్ వార్త వెల్లడించింది. ఆఫ్రికా నుంచి మనదేశం చేసుకుంటున్న దిగుమతులు 14.5 నుంచి ఆరుశాతానికి తగ్గాయి, అమెరికా నుంచి మూడుశాతం తగ్గాయి.
రష్యాపై తాను విధించిన ఆంక్షలను అందరూ అనుసరించేట్లు చూడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించిన మేరకు మన దేశం మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా సహాయ మంత్రి ఎలిజబెత్ రోజెన్‌బర్గ్ ఢిల్లీ, ముంబాయి నగరాలకు రానున్నారు. రష్యామీద ఆంక్షలను మరింత కఠినతరంగావించనున్నారనే వార్తల నేపధ్యంలో అమెరికా వత్తిడి పెంచుతోంది. ఆసియా కొనుగోళ్లను అడ్డుకుంటే తప్ప ఆంక్షల వలన ఫలితం ఉండదని ఇప్పటికే తేలింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఇప్పటికీ ఆసియా ఓడలద్వారా ఎగుమతులు 50శాతం పెరిగాయి. జనవరిలో రోజుకు 15లక్షల పీపాలు పంపితే ఇప్పుడు 23లక్షలకు చేరింది. మొత్తం మీద ఫిబ్రవరి 24కు ముందు స్ధాయికి ఎగుమతులు చేరుకుంటున్నట్లు చెబుతున్నారు.
అంతర్జాతీయ చమురు మార్కెట్లో వచ్చిన మార్పులు, తాజా పరిణామాలు ఇప్పుడు అమెరికాకు లాభదాయకంగా మారాయి. చమురు ధరలను డాలర్లలో నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర కరెన్సీలతో కొనుగోలు చేయాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చూసినపుడు డాలరు విలువ ఎక్కువగా ఉంటే చమురు ధర తక్కువగానూ చమురు ధర పెరిగితే డాలరు విలువ తక్కువగానూ ఉండేది. అమెరికా గతంలో చమురును దిగుమతి చేసుకొనేది ఇప్పుడు షేల్ చమురు ఉత్పత్తితో ఎగుమతిదారుగా మారింది. ప్రపంచ ఉత్పత్తి దేశాల్లో ఒకటో స్ధానంలో ఉంది. గతంలో చమురు దిగుమతి చేసుకున్నపుడు ధర ఎక్కువగా ఉంటే ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు తానే ఎగుమతి చేస్తున్నందున ధర ఎక్కువగా ఉంటే ఆర్ధికంగా పెద్ద లబ్దిపొందుతోంది. చమురు ఉత్పత్తి మొత్తం ప్రయివేటు రంగంలోనే ఉన్నందున వారికి ఎంత ధర పెరిగితే అంతగా లాభాలు వస్తాయి. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఎగదోయటం ద్వారా రష్యాను దెబ్బతీసి ఐరోపా చమురు మార్కెట్‌ను తాను ఆక్రమించాలని చూస్తోంది. అది కొంత మేరకు ఇప్పటికే ఫలించింది. ఇటీవల ప్రపంచంలో చమురు ధరతో పాటు అమెరికా డాలరు విలువా పెరుగుతోంది. అమెరికా సరకులు కొనుగోలు చేయాలంటే దిగుమతి చేసుకొనే దేశాలకు భారం పెరుగుతుంది. కనుక నిత్యం ఎక్కడో ఒకచోట ఉద్రిక్తతలను రాజేసి ఆయుధాలను అమ్ముకొని లబ్దిపొందుతున్నది. అవి లేకపోతే దాని వాణిజ్యలోటు ఇంకా పెరుగుతుంది. చైనా, ఇతర దేశాల నుంచి తక్కువ ధరలకు ఇతర సరకులను దిగుమతి చేసుకొని వాటి ద్వారా కూడా లబ్ది పొందుతున్నది. ఇదే సమయంలో ఖరీదైన తన వస్తువులను అంటగట్టేందుకు బెదిరింపులకు దిగుతోంది. అమెరికా చెలగాటం మన వంటి దేశాల జనాలకు ప్రాణసంకటం కలిగిస్తోంది.
గతంలో చమురు సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు అమెరికా కేంద్రంగా ఉండేవి. ఇప్పుడు అమెరికా ఎత్తుగడ కారణంగా ఐరోపా సంక్షోభ కేంద్రంగా మారింది. ఇప్పుడున్న స్థితిని బట్టి రానున్న రోజుల్లో బొగ్గు, చమురు, గాస్ ధరలు ఇంకా పెరుగుతాయని, సరఫరా కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీని వలన అమెరికా కంటే ప్రపంచ ఆర్ధికవృద్ది ఎక్కువగా దెబ్బతింటుందని భావిస్తున్నారు. మరోవైపు డాలరు విలువ పెరుగుతుందని కూడా జోశ్యం చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ నిధుల నిల్వలను పెంచినపుడల్లా వడ్డీరేటు పెరుగుతుంది. డాలరును సురక్షితమైనదిగా భావిస్తున్నందున మిగతా కరెన్సీల కంటే డాలర్ల వైపే మొగ్గుచూపుతారు. మదుపుదార్లు అంతకు ముందు ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా అమెరికాలో వడ్డీ రేటు పెరుగుతుందని భావించగానే వాటిని అమెరికాకు తరలిస్తారు. అది అమెరికాకు లబ్ది చేకూరుస్తుంది. తనకు విదేశీ పెట్టుబడులు అవసరమైనపుడు కూడా వడ్డీ రేట్లను పెంచుతుంది. విదేశీ మదుపుదార్లు మన మార్కెట్ నుంచి తప్పుకుంటున్న కారణంగా రూపాయి విలువ పతనమైంది. దాన్ని నిలబెట్టేందుకు రిజర్వుబాంకు నానా కష్టాలు పడుతోంది. రూపాయి విలువ తగ్గితే ఎగుమతులు పెరుగుతాయి, చమురుతో సహా దిగుమతుల ధరలు పెరుగుతాయి.2021 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో మన వాణిజ్యలోటు 12.75బిలియన్ డాలర్లు, అది 2022 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో 87.79బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో అది వంద బిలియన్ డాలర్లకు పెరగవచ్చని అంచనా. రూపాయి విలువ పతనం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పుడున్నదానికంటే మరింతగా పడిపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. 2020-21లో మన చమురు దిగుమతి బిల్లు 62.2 బిలియన్ డాలర్లు కాగా 2021-22లో అది 119.2 బి.డాలర్లకు చేరింది.
ఇటీవల ఎడిపి(రిసర్చ్ ఇనిస్టిట్యూట్స్ పీపుల్ ఎట్ వర్క్ 2022 అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం జీవన వ్యయం పెరుగుతున్న కారణంగా తమ వేతనాలను పెంచాలని తమ యజమానుల మీద వత్తిడి తెచ్చేందుకు 86శాతం మంది భారతీయ కార్మికులు సిద్దం అవుతున్నారని తేలింది. ఈ సంస్థ 17దేశాల్లో సర్వే చేసింది. ప్రపంచ వ్యాపితంగా వేతన పెంపుదలను కోరుతున్న వారు సగటున 76శాతం కాగా భారత్‌లో అది 86శాతం ఉంది.బిజెపి వారు పదే పదే చెబుతున్న ”80” శాతంలో ఉన్నవారు వీరిలో కూడా అదే దామాషాలో ఉంటారని, వారికి వేరే వెండి పళ్లాల్లో వడ్డించరని చెప్పనవసరం లేదు. కరోనా మహమ్మారి ముగిసిన తరువాత వేతనాలు పెంచుతారనే భావనలో ఉన్నారని ఎడిపి భారత విభాగం ఎండి రాహుల్ గోయల్ చెప్పారు.యజమానులు పట్టించుకోకపోతే కార్మికుల ఆగ్రహం ప్రభుత్వాల మీదకు మళ్లుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఏదో ఒక పేరుతో ఎలాంటి వేతనం లేకుండా అదనపు గంటలు పని చేయించుకోవటం పెరిగింది. 2020లో మన దేశంలో వారానికి సగటున 7.3 గంటలు పని చేస్తే 2021లో అది 8.5గంటలకు పెరిగింది. ప్రపంచ సగటు 9.2 గంటలు. ఈ దోపిడీకి ధరల పెరుగుదల తోడైతే బతుకు దుర్భరమే. ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్న కారణాల్లో చమురు ధర ఒకటి. అందువలన నరేంద్రమోడీ అచ్చేదిన్ ఏలుబడిలో ఉన్నామనే భ్రమలతో బతుకుతున్నవారు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కొసమెరుపు ఏమంటే రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలను మరింతగా పెంచాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించిన నేపధ్యంలో చమురు ధరలు 130 డాలర్లకు పెరగవచ్చని ఆ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.