Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలోని 80దేశాల్లో 40వేల వరకు కాఫీ దుకాణాలున్న అమెరికా కంపెనీ స్టార్‌బక్స్‌. అమెరికాలో పదిహేనువేలకుపైగా షాపులున్నాయి. కరడుగట్టిన యాజమాన్య ఆటంకాలను అధిగమించి వాటిలో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కార్మికులు ముందుకు రావటం ఒక పెద్ద పరిణామంగా చెబుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కార్మిక సంఘ ఉద్యమాలు తగ్గిపోతున్న నేపధ్యంలో స్టార్‌బక్స్‌ కార్మిక సంఘం ఏర్పాటు ఒక ఆశారేఖగా ఉంది. అమెజాన్‌ కంపెనీ కార్మిక సంఘానికి ఇక్కడి సంఘానికి ఎలాంటి సంబంధాలు గానీ అనుబంధాలుగానీ లేవు. రెండు చోట్లా సంఘాలను గుర్తించాలనే దరఖాస్తులు కార్మికశాఖకు అందచేశారు.2021 ఆగస్టులో బఫెలో, న్యూయార్క్‌లోని మూడు స్టార్‌బక్స్‌ దుకాణాల్లో కార్మిక సంఘాన్ని గుర్తించాలంటూ దరఖాస్తు చేశారు.డిసెంబరు తొమ్మిదవ తేదీన బఫెలోని దుకాణంలో జరిగిన ఎన్నికల్లో సంఘం తొలిసారిగా గుర్తింపు పొందింది. గత ఎనిమిది నెలల్లో 250 దుకాణాల నుంచి అలాంటి దరఖాస్తులు కార్మికశాఖకు వెళ్లాయి. ఇప్పటి వరకు 40 చోట్ల గుర్తింపు లభించింది. ఈ పరిణామం పెద్ద ఎత్తున అనేక వసతి, ఆహార, పానీయ సంస్ధల్లోని సిబ్బందిని కార్మిక సంఘాల వైపు ఆకర్షిస్తున్నది.అమెరికాలో కొత్త వరవడికి నాంది పలికిందంటే అతిశయోక్తి కాదు. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కార్మికులను బాగా దెబ్బతీసింది. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఇది కూడా కార్మికులను ఆలోచింప చేస్తున్నది.


అమెరికాలోని అమెజాన్‌ కంపెనీ కార్మిక సంఘంలో చేరాలా వద్దా అన్న ఎన్నికల్లో 28 ఏండ్ల కంపెనీ చరిత్రలో ఒక చోట విజయం, రెండు చోట్ల ఎదురు దెబ్బలు.మరో బహుళజాతి కంపెనీ స్టార్‌బక్స్‌లో పలు దుకాణాల్లో కార్మిక సంఘాల్లో చేరిక. ఈ రెండు పరిణామాలూ ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. ఇరవై ఎనిమిది సంవత్సరాల అమెజాన్‌ కంపెనీ తన సిబ్బందిని ఏ కార్మికసంఘంలోనూ చేరకుండా అడ్డుకుంటున్నది. కొద్ది వారాల క్రితం అమెజాన్‌ కార్మిక సంఘం(ఏఎల్‌య)లో చేరాలా వద్దా అనే అంశంపై కార్మికశాఖ జరిపిన ఎన్నికల్లో న్యూయార్క్‌లోని ఒక గోదాములో సంఘం పట్ల మొగ్గుచూపారు. ఇది ప్రపంచవ్యాపితంగా సంచలనం కలిగించింది. అలబామాలో మరో కార్మిక సంఘంలో చేరిక గురించి జరిపిన ఓటింగ్‌లో మెజారిటీ వద్దని తీర్పు చెప్పారు. ఒక చోట తన పన్నాగాలు పారకపోవటాన్ని యాజమాన్యం జీర్ణించుకోలేకపోతున్నది. ఆ ఎన్నిక చెల్లదంటూ వివాద పిటీషన్‌ దాఖలు చేసింది. అది విచారణకు రానుండగా న్యూయార్క్‌లోని రెండవ గోదాములో ఏప్రిల్‌ చివరి వారంలో జరిగిన ఓటింగ్‌లో కార్మిక సంఘం వద్దని మెజారిటీ సిబ్బంది ఓటు చేశారు. స్టాటన్‌ ఐలాండ్‌లోని ఎల్‌డిజె5 గోదాములో 618 మంది సంఘానికి వ్యతిరేకంగా 380 మంది అనుకూలంగా ఓటు చేశారు. సిబ్బందిలో 61శాతం మంది పాల్గన్నారు.


స్టేటెన్‌ ఐలాండ్‌లోని జెఎఫ్‌కె8 అనే అమెజాన్‌ గోదాములో ఎన్నిక తీర్పును వమ్ముచేసేందుకు సంఘాన్ని గుర్తించకుండా అడ్డుకొనేందుకు యాజమాన్యం రంగంలోకి దిగింది. నేతలు కార్మికులను బలవంత పెట్టి అనుకూలంగా ఓట్లు వేయించారని యాజమాన్యం చేసిన ఫిర్యాదును జాతీయ కార్మిక సంబంధాల బోర్డు విచారణకు స్వీకరించింది. బ్రూక్లిన్‌లోని కార్మిక కార్యాలయం కార్మిక సంఘానికి మద్దతు ఇచ్చే విధంగా ఉందని అందువలన వేరే చోటుకు విచారణను మార్చాలని కోరగా ఫోనిక్స్‌ కేంద్రానికి బదిలీ చేశారు. సదరు కేంద్ర డైరెక్టర్‌ మాట్లాడుతూ అమెజాన్‌ కంపెనీ సమర్పించిన ఆధారాలను చూస్తే ఓటింగ్‌ చెల్లకపోవచ్చని చెప్పటం గమనించాల్సిన అంశం. జెఎఫ్‌కె8 గోదాము సిబ్బంది 58శాతం మంది పోలింగ్‌లో పాల్గనగా వారిలో 55శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.అమెజాన్‌ ఫిర్యాదుపై మే 23వ తేదీ నుంచి విచారణ ప్రారంభమౌతుంది. తమ సిబ్బంది వైఖరి ఏమిటో వినాలని తాము కోరుతున్నామని, ఎన్నికల్లో అలాంటి అవకాశం రాలేదని గోదాములోని సిబ్బందిలో మూడోవంతు మాత్రమే కార్మిక సంఘానికి ఓటు వేశారని అమెజాన్‌ వాదిస్తోంది. ఎక్కువ మంది పాల్గనకుండా లేబర్‌ బోర్డు అడ్డుకుందని, కార్మిక నేతలు గంజాయి పంచినట్లు ఆరోపించింది. కార్మిక సంఘం వీటిని తీవ్రంగా ఖండించింది. ఇక్కడ ఓటింగ్‌ తక్కువగా ఉందికనుక తాము అంగీకరించేది లేదని చెబుతున్న కంపెనీ అలబామాలో తక్కువ మంది పాల్గని కార్మిక సంఘం వద్దని వేసిన ఓట్లను ఎలా పరిగణనలోకి తీసుకున్నదని ప్రశ్నించింది. నిజానికి రెండు చోట్లా కంపెనీ కార్మికులను బెదిరించినట్లు తెలిపింది. అమెజాన్‌ దాఖలు చేసిన కేసులో తీర్పు ఎలా వస్తుందో చెప్పలేము.


కార్మిక సంఘనేతలకు ఇది ఆశాభంగం కలిగించవచ్చునేమో గానీ అమెజాన్‌ కంపెనీ తీరు తెన్నులు తెలిసిన వారికి ఆశ్చర్యం కలిగించలేదు.ఈ ఎన్నిక అమెజాన్‌ కార్మిక సంఘం(ఎఎల్‌యు) కంటే యాజమాన్యానికి, పరోక్షంగా అమెరికన్‌ కార్పొరేట్లన్నింటికీ ప్రతిష్టాత్మకంగా మారిందంటే అతిశయోక్తి కాదు. అందుకే రెండవ గోదాములో వారాల తరబడి సిబ్బందిని అనేక రకాలుగా బెదిరించి వత్తిళ్లకు గురిచేసింది. అనేక మంది రోజుకు కొన్ని గంటలు మాత్రమే పని చేసే పాక్షిక సిబ్బంది కావటం, గంటకు 30 డాలర్ల వేతనాన్ని తమకు ఇస్తారా లేదా అన్న అనుమానాల వంటివి, ఈ మాత్రం పని ఇక్కడగాకపోతే మరోచోట దొరకదా, మనమెందుకు ఈ వివాదంలో తలదూర్చటం అనే భావం కూడా కొందరిని సంఘానికి దూరంగా ఓటువేసేందుకు దోహదం చేసింది.యాజమాన్యనిరంకుశ వైఖరి తెలిసినప్పటికీ గత నెలలో వందకు పైగా అమెజాన్‌ దుకాణాల్లోని కార్మికులు సంఘంలో చేరటం గురించి ఎఎల్‌యు నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇది యాజమాన్యాన్ని కలవపరుస్తున్న అంశమిది. అందుకే న్యూయార్కులోని రెండవ గోదాము మీద కేంద్రీకరించి కార్మికులను బెదిరించి తన పంతాన్ని నెగ్గించుకుంది. ఓడిపోయిన చోటనే కాదు అన్ని చోట్లా కార్మికులను సంఘటిత పరచేందుకు పూనుకుంటామని ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని నేతలు ప్రకటించారు.


కార్మికులు సంఘాల్లో చేరటం తగ్గిపోతుండగా ఈ పరిణామం పునరుజ్జీవన చిగురు వంటిదని చెప్పవచ్చు. అమెరికాలో 1983లో 20శాతం మంది కార్మికులు సంఘాల్లో చేరగా ఇప్పుడు వారు 11శాతానికి తగ్గారు, 1940, 50దశకాల్లో 30శాతం వరకు ఉన్నట్లు పాత సమాచారం తెలుపుతోంది. అమెజాన్‌, స్టార్‌బక్స్‌, ఆపిల్‌ వంటి కంపెనీల్లో సంఘాల స్ధాపన అనేకమందిని ఆలోచింప చేస్తున్నది. దేశంలో 28.8 కోట్ల మంది కార్మికులుండగా వారిలో ఒక్కశాతం మంది సంఘాల్లో చేరినా 30లక్షల మంది పెరుగుతారు. కొన్ని చోట్ల చేరేందుకు సిద్దంగా ఉన్నా సంఘాలు లేవు. మరికొన్ని చోట్ల సంఘాలకు అనుకూలత లేదు. మొత్తంగా చూసినపుడు సంఘటితం కావటానికి అనువైన వాతావరణంఇప్పుడు ఉంది. ఇదే సమయంలో యజమానులు కూడా సంఘాలను లేకుండా చేసేందుకు తీవ్రంగా చూస్తున్నారు.


1936 గాలప్‌ సర్వేలో కార్మిక సంఘాలు ఉండాలా వద్దా అన్న ప్రశ్నకు 72శాతం మంది కావాలని చెప్పారు. 2021సెప్టెంబరులో అదే సంస్ధ అడిగిన అదే ప్రశ్నకు 68శాతం మంది కావాలని అన్నారు.1953, 57లో గరిష్టంగా 75శాతం మంది ఉన్నారు. ఈ అంకెలను చూసినపుడు పెద్ద మార్పులు లేవని చెప్పవచ్చు. మరోసారి కార్మిక సంఘాల ఏర్పాటు, వాటిలో చేరే వారు పెరిగేందుకు అనువైన పరిస్ధితి అమెరికాలో ఉందన్నది స్పష్టం. సంఘాల్లో కార్మికులు చేరకపోవటం దేశానికి మంచి కంటే చెడు చేస్తున్నదని అమెరికన్లు నమ్ముతున్నట్లు ఇటీవలి పూ సర్వే వెల్లడించింది. కార్మిక సంఘాలలో చేరాలా వద్దా అన్న అంశంలో రాజకీయ అనుబంధాలు కూడా పని చేస్తున్నాయి.2019 నుంచి 2021వరకు సర్వేల సమాచారాన్ని విశ్లేషించినపుడు 56శాతం మంది కార్మిక సంఘాల సభ్యులు డెమోక్రటిక్‌ పార్టీ అభిమానులు కాగా 39శాతం మంది రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదార్లున్నారు. సంఘటిత పరచే హక్కును రక్షించేందుకు ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టగా గతేడాది పార్లమెంటు దిగువ సభ ఆమోదించగా ఎగువ సభ సెనెట్‌ దాన్ని అడ్డుకుంది.


అమెజాన్‌లో కార్మిక సంఘం ఏర్పాటు జాతీయంగా ఒక విస్తృత ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని డెమొక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీశాండర్స్‌ వర్ణించాడు. కార్పొరేట్ల పేరాశకు కార్మికులు అశక్తులుగా అలసిపోయారని చెప్పాడు. ఇటీవల అమెజాన్‌ కార్మిక సంఘనేతలతో మాట్లాడుతూ అమెజాన్‌ కంపెనీలో కుర్రకారు ఇంతటి విజయం సాధించారంటే మేమూ అదే మాదిరి మేమూ చేయగలం అని అనేక మంది చెప్పారని అన్నాడు. రాజ్యాంగ హక్కైన కార్మిక సంఘ ఏర్పాటును అడ్డుకొనేందుకు కోట్లాది డాలర్లను ఖర్చు చేయటానికి బదులు సమస్యల గురించి దానితో చర్చించేందుకు అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ సిద్దం కావాలని డిమాండ్‌ చేశాడు.కార్మిక సంఘాలను లేకుండా చేయాలని చూస్తున్న అమెజాన్‌ కంపెనీ చట్టవిరుద్దమైన చర్యలను విరమించేంత వరకు సదరు కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు శాండర్స్‌ లేఖ రాశాడు. కార్మిక సంఘాల వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని రాతపూర్వకంగా రాసి ఇచ్చిన కంపెనీలకే ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు జరపాలని గుర్తు చేశాడు.


కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు అవసరమైన నివారణ ఏర్పాట్లు తగినన్ని చేయాలంటూ జెఎఫ్‌కె8 గోదాములో కార్మికులను సమీకరించి ఆందోళన చేసినందుకు 2020లో క్రిస్టియన్‌ స్మాల్‌ అనే కార్మికుడిని కంపెనీ తొలగించింది. అతని చొరవతో ఏర్పడిన కార్మిక సంఘాన్ని అదే గోదాములో కార్మికులు గుర్తించారు. వెబ్‌సైట్‌లో సలహాలు, సమాచారాన్ని అందుబాటులో ఉంచటం కాకుండా ముఖాముఖీ కార్మికులతో సమావేశం కావటం ద్వారానే సంఘాల అవసరం ఏమిటో బాగా వివరించగలమని స్మాల్‌ చెప్పాడు. అవసరమైతే పదే పదే చర్చలు జరపాలన్నాడు. అమెజాన్‌లో విజయం తరువాత మరో పెద్ద కంపెనీ స్టార్‌బక్స్‌లో అనేక చోట్ల కార్మిక సంఘానికి మద్దతుగా కార్మికులు ఓటువేశారు. దాంతో ఆ సంస్ద కూడా ఈ పరిణామాన్ని అడ్డుకొనేందుకు పూనుకుంది. గంటకు ప్రస్తుతం ఇస్తున్న 18 డాలర్లను 30 డాలర్లకు పెంచాలని, పని మధ్యలో భోజన, ఇతర విరామాలకు వేతనం ఇవ్వాలని కార్మిక సంఘం కోరుతోంది.గంటకు ఇన్ని వస్తువులను విధిగా చేరవేయాలనే చెల్లింపు పద్దతి రద్దుకావాలని కోరుతున్నారు.ఈ నిబంధన కారణంగా జరుగుతున్న ప్రమాదాలు ఇతర చోట్లతో పోలిస్తే అమెజాన్‌లో ఎక్కువగా ఉన్నాయి.


అమెరికాలోని కాలేజీ విద్యావంతులైన కార్మికులు గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఊహించినదానికి భిన్నంగా జీవితాలున్నాయి. గత తరాలు దిగువ నుంచి మధ్యతరగతిగా మారినట్లు తాము మారటం, ఆరంకెల ఆదాయానికి చేరటం ఎంతో కష్టమని వారు భావిస్తున్నారు. కార్మికోద్యమం పెరిగేందుకు ఈ పరిస్దితి దోహదం చేస్తోంది.1990దశకంలో కాలేజీ డిగ్రీలు ఉన్నవారు కార్మిక సంఘాలకు 55శాతం మంది మద్దతు ఇస్తే ఇప్పుడు వారి సంఖ్య 70శాతానికి పెరిగింది, తాజాగా డిగ్రీలు పొందిన వారిలో ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
భౌతిక పరిస్ధితులను బట్టే కార్మికవర్గ ఆలోచనలు ఉంటాయి. ఇటీవల పెద్ద ఎత్తున ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి అంతకంటే మెరుగైనదాని కోసం చూసిన ధోరణి వెల్లడైంది. ఇది ఒకరకమైన కార్మిక నిరసనకు ప్రతీకగా భావిస్తున్నారు. ఈ తీరును చూసిన కార్పొరేట్‌లు సిబ్బందిని నిలుపుకొనేందుకు మెరుగైన వేతనాలు, పని పరిస్దితులను కల్పించాల్సి అవసరాన్ని గుర్తించాల్సి వచ్చింది. లేనట్లయితే కార్మిక సంఘాల ఏర్పాటు, పోరాటాలకు అనువైన పరిస్ధితికి దారి తీస్తుందనే ఆందోళన వెల్లడైంది. పెద్ద వారితో పోల్చితే యువత కార్మిక సంఘాలపట్ల సానుకూల వైఖరితో ఉంది. ఇతరులతో పోల్చితే ఆఫ్రో-అమెరికన్లు, పురుషులతో చూస్తే మహిళలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నారు. బాగా తక్కువ లేదా ఎక్కువ ఆదాయాలు వస్తున్నవారి కంటే మధ్యస్ధంగా ఉన్నవారు సంఘాల పట్ల ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇది అక్కడి కార్మికోద్యమం మరింతగా పెరగటానికి దోహదం చేయనుంది. అది ప్రపంచాన్ని ప్రభావితం చేయకుండా ఉంటుందా !