Tags

, ,


ఎం కోటేశ్వరరావు


యువత దేశభక్తి, నవ ప్రవర్తకులుగా ముందుకు సాగాలని కష్టాలు వచ్చినపుడు తప్పుదారి పట్టటం, బెదిరిపోరాదని చైనా అధినేత షీ జింపింగ్‌ మేనెల పదిన పిలుపు నిచ్చారు. చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ (సివైఎల్‌సి) శతవార్షికోత్సవం బీజింగ్‌లోని గ్రేట్‌హాల్లో ఘనంగా జరిగింది. ఆ సభలో జింపింగ్‌ పాల్గొని సందేశమిచ్చారు.చరిత్రను పరిశీలించినా, వాస్తవాన్ని చూసినా చైనా యువజనోద్యమంలో కమ్యూనిస్టు యూత్‌ లీగ్‌ ముందున్నదని, దేశం కోసం స్వార్దరహితంగా పని చేసి ముందుకు తీసుకుపోవాలని కోరారు. ప్రతి దేశానికి, ప్రపంచానికి యువతదే భవిష్యత్‌ అని తన కుటుంబం అనిగాక మానవాళి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.


మొదటి ప్రపంచ యుద్దం తరువాత కుదిరిన వర్సెయిల్స్‌ ఒప్పందంలో భాగంగా జర్మనీ ఆక్రమణలో ఉన్న తూర్పు చైనాలోని షాండోంగ్‌ ప్రాంతాన్ని జపాన్‌కు అప్పగించారు. ఈ ఒప్పందంపై చైనా పాలకుల లొంగుబాటును నిరసిస్తూ ప్రారంభమైన జాతీయోద్యమం నూతన చైనా ఆవిష్కరణకు నాంది పలికింది. 1919 మే నాలుగున పెద్ద ఎత్తున విద్యార్దులు బీజింగ్‌లోని తియనన్‌మెన్‌ మైదానంలో ప్రదర్శన జరిపారు. దీన్ని మే ఉద్యమంగా పిలిచారు. అప్పటికే జాతీయవాదులుగా ఉన్న వారు లొంగుబాటును నిరసిస్తూ కొత్త బాటలో పోరు సల్పేందుకు కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.ఆ ఉద్యమంలో పాల్గొన్నవారే చైనా యువజనోద్యమాన్ని ప్రారంభించారు. మే నాలుగు ఉద్యమం 1911 విప్లవం కంటే ఒక అడుగు ముందుకు వేసిందని,కమ్యూనిస్టు విప్లవంలో అది ఒక దశ అని దాని ప్రాముఖ్యత గురించి మావో చెప్పారు.1920లో ప్రారంభమైన చైనా సోషలిస్టు యూత్‌లీగ్‌ స్ధాపక కార్యదర్శి యు షీసాంగ్‌ 1922వరకు కొనసాగారు. బీజింగ్‌లో మొగ్గతొడిగిన ఈ సంస్ధను దేశమంతటా విస్తరిస్తూ 1921 జూలైలో అధికారికంగా ప్రకటించారు. తరువాత 1922లో తొలిమహాసభ మే 5-10 తేదీలలో జరిగింది. తరువాత కాలంలో మే ఐదవ తేదీని చైనా యువజన దినంగా ప్రకటించారు. తరువాత 1925లో జరిగిన మూడవ మహాసభలో సంస్ధ పేరును కమ్యూనిస్టు యూత్‌లీగ్‌గా మార్చారు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత దేశంలో తలెత్తిన పరిస్ధితి, రాజకీయాల నేపధ్యంలో చైనీస్‌ న్యూ డెమోక్రసీ యూత్‌లీగ్‌గా కొత్త పేరు పెట్టారు. 1957 మే నెలలో తిరిగి కమ్యూనిస్టు యూత్‌లీగ్‌గా మార్చారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో హు యావోబాంగ్‌, హు జింటావో కమ్యూనిస్టు పార్టీ అధినేతలుగా, దేశాధ్యక్షులుగా పని చేశారు. గడచిన వంద సంవత్సరాల్లో ఇప్పటి వరకు మొత్తం 17 మంది జాతీయ కార్యదర్శులుగా పని చేశారు. వారిలో హు యావోబాంగ్‌ సుదీర్ఘకాలం 1953 నుంచి 1978వరకు ఉన్నారు. ఈ కాలంలోనే 1968 నుంచి 78వరకు సాంస్కృతిక విప్లవం పేరుతో తీసుకున్న వైఖరి కారణంగా సంస్ధ కార్యకలాపాలను రద్దు చేశారు. 1964 తరువాత మహాసభలు జరగలేదు. 1978 నుంచి తిరిగి క్రమంగా సభలు జరుపుతున్నారు. ప్రస్తుతం 2018లో ఎన్నికైన హి జంకే కార్యదర్మిగా ఉన్నారు.


కమ్యూనిస్టు యూత్‌లీగ్‌లో ప్రస్తుతం ఎనిమిది కోట్ల మందికి పైగా సభ్యులున్నారు.పద్నాలుగు సంవత్సరాలలోపు వారిని సంఘటితం చేసే బాధ్యతలను కూడా ఈ సంస్ధే నిర్వహిస్తున్నది. అనేక దేశాలలో యువత మాదిరి చైనాలో ఎందుకు యువతరం ఉద్యమాలు నిర్వహించటం లేదంటూ పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు వాపోతుంటారు. తామే తుమ్మి తామే తథాస్తు అనుకున్నట్లుగా చైనా గురించి ప్రత్యేకించి సంస్కరణలు అమలు చేస్తున్న 1978 నుంచి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు చైనా కుప్పకూలిపోతుందని జోశ్యాలు చెప్పిన వారందరూ బొక్కబోర్లా పడ్డారు.1989లో తియనన్‌మెన్‌ మైదానంలో కొందరు తప్పుదారి పట్టిన విద్యార్దులు చేపట్టిన ఆందోళనను తూర్పు ఐరోపా దేశాల్లో మాదిరి వినియోగించుకొనేందుకు పశ్చిమ దేశాలు చూసినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం విద్యార్దులతో సహనంగా వ్యవహరించి ముగింపు పలికింది. పశ్చిమ దేశాల కుట్రలను వమ్ముచేసింది.


ప్రతి సమాజంలో కొందరు అసంతృప్తవాదులు, భిన్న అభిప్రాయాలు, అవలక్షణాలు కలిగిన వారు ఉన్నట్లుగానే చైనాలో కూడా ఉండటం సహజం. వారికి తగిన అవకాశాలు కల్పిస్తే పక్కదారి పట్టరు, ఉద్యమాలతో పని ఉండదు. చైనా కొత్తతరంలో తలెత్తిన పశ్చిమ దేశాల క్షీణ సంస్కృతి విస్తరించకుండా అక్కడి సమాజం, ప్రభుత్వం చూస్తున్నది. మొత్తం మీద సంస్కరణల ఫలితాలను అనుభవిస్తున్న యువత సహకారం, భాగస్వామ్యం కారణంగానే అమెరికా, ఇతర దేశాలు అనేక ఆటంకాలను కలిగిస్తున్నప్పటికీ చైనా ముందుకు పోతోందన్నది స్పష్టం. పెట్టుబడిదారీ విధానం విఫలమైందని అమెరికా, ఇతర ఐరోపా ధనికదేశాల్లో యువత భావించటం రోజుకు రోజుకూ పెరగటం చూస్తున్నాం. పెరుగుతున్న ఆర్ధిక అసమానతల గురించి ఆ విధానాల సమర్ధకులే చెబుతున్నారు. చైనాలో కూడా అలాంటి అసమానతలు ఉన్నప్పటికీ తమ ముందు తరాల వారితో పోల్చి చూసినా, ఇతర దేశాలను చూసినా తమకు మెరుగైన అవకాశాలను చైనా ప్రభుత్వం కల్పిస్తున్నట్లు అక్కడి యువత భావిస్తోంది. ఒక సమాజం పురోగమిస్తోంది అని చెప్పేందుకు కొన్ని అంశాలను గీటురాళ్ళుగా తీసుకోవటం తెలిసిందే. ప్రస్తుతం చైనా సగటు ఆయుర్దాయం 77.3 సంవత్సరాలు. అమెరికాను అధిగమించింది. ఏడున్నరదశాబ్దాల క్రితం అది 43 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఒక నాడు పిల్లలను కనవద్దంటూ ఆంక్షలు పెట్టిన చైనా ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఎత్తివేసి కనమని ప్రోత్సహిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటా జననాల రేటు తగ్గటం తెలిసిందే.


1950కి ముందు చైనాలో పరిస్ధితి దారుణంగా ఉండేది. కమ్యూనిస్టులు 1949లో అధికారానికి వచ్చినా దాదాపు పది సంవత్సరాల పాటు అంతర్గత, బాహ్యశత్రువులు సృష్టించిన సమస్యలు ప్రభుత్వాన్ని ఊపిరి సలుపుకోనివ్వలేదు. తరువాత సాంస్కృతిక విప్లవం పేరుతో చేపట్టిన చర్యలతో యువత తీవ్రంగా ప్రభావితమైంది.1978లో సంస్కరణలకు తెరలేపిన తరువాత పదేండ్లపాటు ఆశించిన మేరకు అవి ఫలితాలను ఇవ్వకపోవటం,ఇతర అంశాల మీద యువతలో తలెత్తిన అసంతృప్తికి ప్రతిబింబమే పశ్చిమ దేశాలు చిత్రించినంత తీవ్రంగాకున్నా తియనన్‌మెన్‌ పరిణామాలు. తరువాత కాలంలో అభివృద్ధి ఊపందుకుంది.1989లో జిడిపి తలసరి సగటు ఐఎంఎఫ్‌ సిబ్బంది లెక్కల ప్రకారం 406 డాలర్లుండగా అది 2021నాటికి 11,891డాలర్లకు చేరింది.2026 నాటికి 17,493 డాలర్లకు పెరగవచ్చని అంచనా వేసింది.ఈ దశాబ్ది చివరికి అమెరికా జిడిపి మొత్తాన్ని అధిగమించనుందన్న అంచనాల గురించి తెలిసిందే. ఈ పరిణామాలు, పరిస్ధితి యువతను సానుకూలంగా ప్రభావితం చేసేవే.


తలసరి జిడిపిలో అమెరికా ఎంతో ముందున్నదని తెలిసిందే. ఆ స్ధాయికి చేరేందుకు చైనా ఇంకా కష్టపడాల్సి ఉంది. ఆదాయ అంతరాలున్నట్లు వారే స్వయంగా చెబుతున్నారు. అదే సమయంలో అవకాశాలను ఏ విధంగా కల్పిస్తున్నారో చూద్దాం.2000 సంవత్సరంలో పుట్టిన పిల్లలకు వస్తున్న అవకాశాలు వారి తలిదండ్రులకు రాలేదు. అమెరికాలో ఇదే సంవత్సరంలో పుట్టిన పిల్లలకు ఉన్నత విద్య అవకాశాలు 57శాతం మందికి ఉండగా చైనాలో 54శాతం. రెండు దేశాలను పోలిస్తే చైనాలో ఈ శాతం పెరుగుతుండగా అమెరికాలో పదేండ్లనాటికి ఇప్పటికి పదిశాతం తగ్గింది. అమెరికా విశ్వవిద్యాలయంలో ఏడాదికి ఫీజు 64వేల డాలర్లుండగా చైనాలో రెండువేల డాలర్లు మాత్రమే. పశ్చిమ దేశాలతో పోలిస్తే చైనాలో స్ధిరమైన ఉపాధి రేటు ఎక్కువగా ఉంది. చైనా పిల్లలకు చిన్నతనం నుంచే కమ్యూనిస్టు పార్టీ బుద్దిశుద్ధి చేసి తన చెప్పుచేతల్లో ఉంచుకుంటుందని పశ్చిమ దేశాల వారు ఆరోపిస్తుంటారు. పాలకులు ఎవరుంటే ఆ భావజాలాన్ని కలిగించటం అన్ని చోట్లా జరుగుతున్నదే. చైనా ప్రభుత్వం, పార్టీ కూడా సామాజిక బాధ్యతను గుర్తు చేయకుండా దాని లక్ష్యమైన సోషలిస్టు సమాజాన్ని నిర్మించటం ఎలా సాధ్యం అవుతుంది? గ్రామాల్లో ఉన్న పరిస్ధితిని తెలుసుకొనేందుకు, దారిద్య్రనిర్మూలన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్వచ్చందగా అనేక మంది ఇప్పటికీ గ్రామాలకు వెళుతున్నారు. మన దేశంలో కాలేజీల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ పధకంలో భాగంగా విదార్ధులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్న సంగతి తెలిసిందే. అది సక్రమంగా జరగటం లేదు, అమల్లో చిత్తశుద్ది లేదనేది వేరే అంశం. మన దేశంలో ఈ స్వాతంత్య్రం మాకేమిచ్చిందని ప్రశ్నించే యువతరం గురించి తెలిసిందే. స్వాతంత్య్రం తరువాత దాని లక్ష్యాలను పాలకులు విస్మరించిన పర్యవసానమే ఇది. చైనాలో దీనికి భిన్నం తమ, తమ తలిదండ్రుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పోరాటాలను పిల్లలకు చెబుతున్నారు. పోరాట కేంద్ర స్ధానాలుగా ఉన్న ఏనాన్‌ తదితర ప్రాంతాలను ఏటా కోట్ల మంది సందర్శించి గతాన్ని గుర్తుకు తెచ్చుకొని స్ఫూర్తి పొందుతున్నారు.


కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన 1950 దశకాల్లో చైనా యువత తాము కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల్లో మాదిరి ఉండాలని కలలు కన్నది, దానిలో తప్పేముంది? తన పౌరులను విదేశాలకు వెళ్లకుండా కంచెలు ఏర్పాటు చేస్తారని చైనా మీద ఆరోపణలు చేసే వారి గురించి తెలిసిందే. అదే వాస్తవమైతే ఏటా పదిహేను కోట్ల మంది విదేశాల్లో ఎలా పర్యటిస్తున్నారు? వారికి అవసరమైన ఆదాయం లేకపోతే అలా తిరగ్గలరా ? అలాగే చైనా నుంచి ఏటా ఏడు లక్షల మంది విద్యార్దులు విదేశాలకు వెళుతున్నారు. మన దేశం నుంచి ఏటా ఎందరు వైద్య విద్య కోసం వెళుతున్నారో చూస్తున్నాము. ఇది పరస్పరం పరిస్ధితి ఎక్కడ ఎలా ఉందో తెలుసుకొనేందుకు తోడ్పడదా ? పోల్చుకోరా ? అడ్డుగోడలు ఎక్కడ ఉన్నట్లు ? అమెరికాలో రోజుకు 120 మంది మాదకద్రవ్యాలు లేదా మద్యం తాగి మరణిస్తున్నారు, రోజుకు తుపాకి తూటాలకు 106 మంది మరణిస్తుండగా 210 మంది గాయపడుతున్నారు. ఈ స్ధితిని తమ దేశంలో ఉన్న పరిస్ధితిని చైనా యువత పోల్చుకోదా ? తమ పరిస్ధితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా మెరుగుపరచుకోవాలంటే సోషలిస్టు విధానం తప్ప దిగజారే పెట్టుబడిదారీ విధానం కాదని అర్ధం చేసుకోదా ? తమ తాతలు, తండ్రులు ఎలాంటి దారిద్య్రం అనుభవించారో తామెలా ఉన్నారో ప్రత్యక్షంగా చూస్తున్నారు గనుకనే కమ్యూపార్టీ పట్ల అచంచల విశ్వాసంతో ఉన్నారు. 2019లో ఏడు లక్షల మంది విద్యార్ధులు విదేశాలకు వెళ్లగా 5,80,000 మంది తిరిగి వచ్చారు. తమ దేశంలో పెరుగుతున్న అవకాశాలతో పాటు దేశానికి తోడ్పడాలన్న ఆకాంక్షకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. పరిశోధన అభివృద్ధికి గాను చైనా తన జిడిపిలో రెండున్నశాతం ఖర్చు చేస్తున్నది. ఈ కారణంగానే గత నాలుగు దశాబ్దాల కాలంలో అది ఎన్నో రంగాల్లో అద్బుతాలను సృష్టిస్తున్నది.శ్రమశక్తిని ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయటే కాదు, ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చైనా యువత దూసుకుపోతున్నది. ఒకప్పుడు నీలిమందు భాయిలని ఎద్దేవా చేసిన ప్రపంచం ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసి నివ్వెరపోతున్నది. యువతలో ఉత్సాహం, దీక్ష, పట్టుదల లేకుండా ఇది జరిగేదేనా !